ప్రశ్న: సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? సూక్ష్మ శరీరంతో ప్రయాణం వంటివి సాధ్యమేనా?

ఈ రోజుల్లో సూక్ష్మ శరీర యాత్రల గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి ఇక్కడ పడుకుని ఇక్కడికీ, అక్కడికీ ఎగిరిపోతున్నట్లు ఊహించుకుంటే, అది సూక్ష్మ శరీర యాత్ర కాదు. అది కేవలం భ్రాంతి మాత్రమే. దురదృష్టవశాత్తు రకరకాల మనుషులు దీనిని చేయడానికి ప్రయత్నించడం వల్ల ఇలాంటివి నవ్వుల పాలవుతున్నాయి.

మనస్సు అనేది శరీరంలోని ఒక భాగంగా కాదు, అది శరీరమంతటా ఉంది.

శరీరంలో ఐదు కోశాలు లేదా పొరలు ఉంటాయి. మొదటిది అన్నమయకోశం. మనం భౌతిక శరీరమంటున్నది ఒక అన్నపురాశి మాత్రమే. రెండవది మనోమయ కోశం. ఇది మానసిక శరీరం. ఈ రోజుల్లో వైద్యులు మానసిక సంబంధమైన రోగాల గురించి మాట్లాడుతున్నారు. మీకు మానసికమైన తీవ్ర ఒత్తిడి కలిగితే, మీకు కడుపులో పుండు ఏర్పడవచ్చు. మీ మనస్సులో  ఏదైనా జరిగితే దాని పర్యావసానం శరీరంలో జరగవచ్చు. మనస్సు అనేది శరీరంలోని ఒక భాగంగా కాదు, అది శరీరమంతటా ఉంది. శరీరంలోని అణువణువుకూ దాని సొంత మేధస్సు ఉంటుంది. అంటే మానసిక శరీరమన్నది ఒకటున్నదన్నమాట. అదే మనోమయకోశం.

ప్రస్తుతం మీకు మీ అనుభవంలో ఉన్నవి మీ శరీరం, మీ మనస్సు, మీ మనోభావాలు. ఈ మూడూ నడవడానికి వాటి వెనుక శక్తి ఉండాలి. అది లేకుండా అవి అలా నడవలేవు. ఉదాహరణకు ధ్వనిని విస్తరింపజేసేది మైక్రోఫోన్. మీకు మైక్రోఫోన్ గురించి ఏ మాత్రం తెలియకపోయినప్పటికీ, అది పనిచేయడం వెనుక ఒక శక్తి ఉందని మీరు గుర్తించగలరు. శరీరంలోని మూడో పొర ప్రాణమయకోశం. నాలుగవది విజ్ఞానమయకోశం, ఐదవది ఆనందమయకోశం. యోగాలో శరీరానికి సంబంధించిన ప్రతిదాన్నీ భౌతిక పదార్థంగానే గుర్తిస్తాం. చివరి రెండూ భౌతికం కాకపోయినా, వాటిని మేం ‘శరీర’ మనే అంటాం ఎందుకంటే యోగా అన్నది ఒక తత్వం కాదు, ఒక విధానం.

సూక్ష్మ శరీర యాత్ర

సూక్ష్మ శరీర యాత్ర అంటే అన్నమయ, మనోమయ, ప్రాణమయ, ఆనందమయ కోశాలను అలాగే ఉంచి విజ్ఞానమయ కోశాన్ని విహరించేలా చేయడం, అంటే మీ శారీరక కార్యకలాపాలను ఈ  లోకంలో కొనసాగించవచ్చు. ఎందుకంటే మీ భౌతిక, మానసిక, శక్తి శరీరాలు యథాతథంగా ఉంటాయి కాబట్టి. ఇదొ విధమైన నైపుణ్యం. శారీరిక, మానసిక, శక్తి శరీరాలు భౌతికమైనవి. ఆనందమయ కోశం పూర్తిగా భౌతికతను అధిగమించినది. విజ్ఞానమయ కోశం ఒక తాత్కాలిక శక్తి. అది భౌతికం కాని, అభౌతికం కాని కాదు. అది మీలో మీరు గాఢతతో ఉండి నిర్దిష్ట స్థాయి సాధన చేస్తే తప్ప మీరీ విజ్ఞానమయ కోశాన్ని స్పృశించలేరు. ఉరికే అలా మానసికంగా ఆలోచన చేయడం ద్వారా అందులోకి వెళ్లలేరు.

ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉంటే తప్ప దాన్ని కేవలం వినోదం కోసం ప్రయత్నించకూడదు.

దానికోసం గొప్ప సాధన చేయవలసి ఉంటుంది.అయితే అటువంటివి సాధ్యమేనా? సాధ్యమే, కాని అది వినోదం కోరుకునేవారికి కాదు. దానికి మరింత సాధన కావాలి. అయితే దాని ప్రాధాన్యతేమిటి? ఎవరైనా మిమ్మల్ని తుపాకీతో కాల్చివేస్తే మీరెట్లాగూ శరీరం లేకుండానే ప్రయాణం చేయవలసి ఉంటుంది. దానికి సమయం ఎలాగూ వస్తుంది. దానికిప్పుడు తొందరెందుకు? ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉంటే తప్ప దాన్ని కేవలం వినోదం కోసం ప్రయత్నించకూడదు. ఎందుకంటే వీటిమీద అధికారం సంపాదించడానికి ఎంతో శ్రమించాలి, అయినా దీనివల్ల చివరికి మీరు సాధించేదేమిటి? దానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యమేమీ లేదు.భారతదేశంలో  ప్రాథమికంగా దీనిమీద కేంద్రీకరించే కొన్ని శాఖలున్నాయి - దీన్ని పరకాయ ప్రవేశం అంటారు. కొన్ని యోగ శాఖలు పూర్తిగా సూక్ష్మ శరీర యాత్ర వంటి వాటిపైనే కేంద్రీకరిస్తాయి. కాని ఇటువంటి మార్మికత ప్రస్తుతం చాలాచోట్ల అదృశ్యమైపోయింది. అక్కడేమీ మిగల్లేదు. నేడు ప్రతి వీథి చివరా కనిపిస్తున్న సూక్ష్మ శరీర యాత్రలు కేవలం భ్రాంతి మాత్రమే.

ప్రేమాశీస్సులతో,
సద్గురు