అంతా వెనక వదిలేసేస్తే, అంతర్గతంగా ఎంతో ఆర్జించవచ్చు- ఒక సూఫీ కథ

సూఫీ సాధువు ఇబ్రహీం కథ సద్గురు వివరిస్తున్నారు. రాజవైభవంతో, రాజ చిహ్నాలన్నిటితో ఆడంబరాల మధ్యన వెలిగిపోయే ఇబ్రహీంకూ భిక్ష పాత్ర చేతపుచ్చుకొని తిరిగే ఒక ముస్లిం సాధువుకూ మధ్య జరిగిన సంఘటన.
To Leave Everything Behind and Gain Everything Within – A Sufi Story
 

ఇబ్రహీం గొప్ప సూఫీ సాధువు. ఈయన ఒకప్పుడు రాజుగా ఉండేవాడు.  ఒక సారి ఇబ్రహీం పెద్ద పరివారాన్నీ వందలాది ఒంటెలనీ వెంటపెట్టుకొని మక్కా యాత్రకు బయలుదేరాడు. మధ్యలో ఎడారుల్లో మజిలీలు చేసేటప్పుడు కూడా ఆయన అతి  వైభవంగా ఉండేవాడు. ఆయన గుడారాలు చాలా విలాసవంతంగా ఉండేవి. గుడారాలు కట్టేందుకు కొయ్య మేకులు బదులు, బంగారపు మేకులు వాడేవారు. బంగారపు కుచ్చులు తగిలించేందుకు వీలైన అన్ని చోట్లా బంగారపు కుచ్చులు తగిలించే వారు. రాజు గారి వేషధారణ కూడా గూడా చాలా విలాసవంతంగా ఉండేది..  

మార్గంలో ఒక చోట ఆయనకు ఒక సూఫీ సంచార భిక్షువు తారస పడ్డాడు. రాజు గారి ఆడంబరమంతా చూసి,  'ఈయనకు అసలు ఆధ్యాత్మికత ఎక్కడ ఉంది!' అనుకొన్నాడు భిక్షువు.  అందుకే, తనకు ఇబ్రహీంను కలిసే అవకాశం వచ్చినప్పుడు  'ఇంత  ఆడంబరమూ, ఈ బంగారు మేకులూ ఇలా పట్టుకొని పాకులాడుతున్నారు, ఇక మీరు సూఫీ ఎలా అవుతారు?' అని వెటకారం కూడా చేశాడు. ఇబ్రహీం ఊరికే తల పంకించి, భిక్షువును కొంతసేపు విశ్రాంతి తీసుకొమ్మని పంపాడు.

 

ఆ రాత్రి వాళ్ళిద్దరూ మళ్ళీ కలిశారు.  'రేపు పొద్దునే లేచి, మనిద్దరమే కలిసి కాలినడకన మక్కా వెళ్లిపోదాం' అన్నాడు ఇబ్రహీమ్. 'అంతకంటేనా! ఎలాగూ నేనూ మక్కాకే గదా వెళుతున్నాను' అన్నాడు భిక్షువు. వాళ్ళిద్దరూ మర్నాడు ఉదయం పెందలాడే లేచి, కలిసి యాత్రకు బయలుదేరారు. ఎడారిలో కొన్ని గంటలు నడిచిన తరవాత, భిక్షువుకు అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది, తను తన భిక్ష పాత్ర రాత్రి పడుకొన్న చోటనే వదిలేసి వచ్చేశానని. 'నేను నా భిక్ష పాత్ర తెచ్చుకోవటం మరిచిపోయాను. ఇప్పుడే వెనక్కు వెళ్ళి తెచ్చేసుకొంటాను' అని ఇబ్రహీంతో అని భిక్షువు వెనక్కు తిరిగాడు.

ఇబ్రహీం అతని వైపు చూశాడు. 'నేను నా ఒంటెలనూ, నా బంగారు గుడారాల మేకులనూ, నాకున్న భౌతిక సంపద సర్వస్వాన్నీ వదిలేసి వచ్చేశాను. వెనక్కి తిరిగి చూడకుండా నీతో నడుస్తున్నాను. నువ్వు కేవలం ఓ భిక్ష పాత్ర కోసం వెనక్కు వెళుతున్నావు. ఒక విషయం తెలుసుకో. నా గుడారాల బంగారు మేకులు ఇసుకలో నాటుకొని పోయాయి గానీ అవి నా హృదయాన్ని స్పృశించలేదు. అవి ఇనుముతో చేసినా, బంగారంతో చేసినా నాకు ఒకటే. అందుకే బంగారంతో చేయించాను. నువ్వో? నువ్వు నీ భిక్ష పాత్రనే వదలి రాలేకుండా ఉన్నావు! పవిత్రాతి పవిత్రమైన మక్కా యాత్ర చేస్తూ, మధ్య దోవలో ఓ బిచ్చపు గిన్నె కోసం వెనక్కి వెళతానంటున్నావు! నేనయితే నాతో ఓ భిక్షపాత్ర కూడా తెచ్చుకోలేదు!' అని, తన మార్గంలో తన నడక సాగించాడు.

అంతర్గతంగా అసలు మీరేమిటి అన్న దానికీ, మీకు ఉన్నదేమిటీ, లేని దేమిటీ, మీరు ఏం తింటున్నారు, ఏం కట్టుకుంటున్నారు, ఎలా జీవిస్తున్నారు అన్న బాహ్య విషయాలకు సంబంధం లేదు. బాహ్యంగా మీరు ఎలా కావాలనుకుంటే అలా జీవించచ్చు. కానీ, అంతర్గతంగా మిమ్మల్ని మీరు ఎలా ఉంచుకొంటున్నారు అన్నది మరింత  ముఖ్యం. లేకపోతే మీరు అన్ని విషయాలూ పోగుచేసుకొని మూట కట్టి పెట్టుకొంటారు గానీ, మీకంటూ ఏమీ ఉండదు.

ఆది మానవుడి కాలం నుంచి మనిషి వస్తువులు మూట కడుతూనే ఉన్నాడు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీరు మెరిసే గోలీ కాయలూ, రంగురాళ్లూ మూటకట్టి దాచుకొనే వాళ్ళు. అప్పటికీ ఇప్పటికీ మీలో పెద్ద మార్పేమీ లేదు. కాకపోతే, ఇప్పుడు మీరు దాచుకొనే రంగురాళ్ళ ఖరీదు ఎక్కువ. చిన్నప్పుడు అలాంటి రాళ్ళు ఊరికే అలా సముద్ర తీరంలో నడుస్తూ ఏరుకోగలిగేవాళ్లు. ఇప్పుడు అలాంటి వాటినే దుకాణాలకు వెళ్ళి బోలెడంత డబ్బు పోసి కొనుక్కోవాలి. కానీ మౌలికమైన మార్పేమీ లేదు. ఇప్పటికీ మూటకట్టుకొని దాచుకొంటూనే ఉన్నారు.

జీవితం మీరు పోగుజేసుకొనే వస్తువులలో ఉండదు.

మీరు పోగు చేసుకొనేవన్నీ అనుబంధాలూ, కుటుంబమూ, ఆస్తిపాస్తులూ, పాండిత్యాలూ, ఆలోచనలూ, మీవిగా మీరు భావించే అన్ని రకాల ఇతరవిషయాలూ - మీ జీవితానికి అలంకారాలుగా తగిలించుకొనే అదనపు సరుకులే. కానీ, మనుషులు ఈ అదనపు విషయాలు పోగు చేసుకోవటంలో మునిగిపోయి, వాటితో లగ్నమైపోయి, తాదాత్మ్యతలో పడిపోవటం చేత, వాళ్ళ అసలు జీవితాన్ని అనుభవించలేకపోతున్నారు.

జీవితం మీరు పోగుజేసుకొనే వస్తువులలో ఉండదు. ఏవేవో తెచ్చుకొని పెట్టుకొంటే జీవితానికి మరింత పరిపూర్ణత వస్తుంది అనే భావంతో, ఆ పరిపూర్ణత సాధించటం కోసం మీరు అవీ ఇవీ పోగుజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగోలా మీ జీవితం శూన్యం కాకుండా చూసుకోవాలని మీ ఆశ. కానీ, జీవితం అలా శూన్యంగా ఉన్న సందర్భాలలోనే, మీకు జీవితంలో కలిగిన అందమైన అనుభవాలన్నీ కలిగాయి. అలా జీవితం శూన్యంగా ఉన్న సందర్భాలలోనే మీరు ప్రేమనూ, శాంతినీ, ఆనందాన్నీ పొందగలిగారు. కానీ మీ మనసుకూ, మీ తర్కానికి అనిపించేది మాత్రం మీకు శూన్యతతో పనిలేదని.

నా మటుకు నాకు, సమయంలో ఎక్కువ భాగం మనసులో ఒక్క ఆలోచన కూడా ఉండదు. నేను శూన్యంగా ఉంటాను. నేను చేసే పనులకు అవసరమైనంత తప్ప, అంతకు మించి ఒక్క మాట మాట్లాడను. నేను ఎంత శూన్య మనస్కుడిగా ఉంటానంటే,  కొంత ప్రయత్నపూర్వకంగా తప్ప, ఆలోచనలూ రావు, మాటలూ రావు. ఊరికే కూర్చుని ఉన్నప్పుడూ, నాకు ఆలోచనలనేవే ఉండవూ, మాటలూ రావు. అలా, పూర్తిగా శూన్యంగా ఉండిపోతాను.

మీరు పూర్తి శూన్య స్థితిని చేరగలిగితే, ఈ జగత్తంతా మీలోనే ఇమిడిపోతుంది అని మీరు గమనించ గలుగుతారు. మీ మనసు నిండా ఏవేవో ఆలోచనలు నిండి ఉంటే, అప్పుడప్పుడు ఆ ఆలోచనలు ఈ జగత్తులో ఇమడటానికి ప్రయత్నిస్తాయి. అదే,  మీలో మీకు, మీది అనుకునేదేదీ లేకపోతే, మీరు కేవలం శూన్యమనస్కులుగా ఉండగలిగితే, ఈ జగత్తు అంతా మీలో సరిగ్గా ఇమిడిపోగలదు.

మీరు అలా పూర్తిగా, సంపూర్ణంగా శూన్యమనస్కులైతే, ఇక, ఊరికే, పోగుజేసుకోవాలన్న తపనతో పోగు జేయటం ఆగిపోతుంది.  ఉన్నదేదో హాయిగా అనుభవిస్తారు. లేనిదేదో, అది లేకపోవటాన్ని కూడా అలాగే అనుభవిస్తారు.