విషయ సూచిక పట్టి
1. ఆది శంకరుడు – ఓ అద్భుతం
2. ఆదిశంకరాచార్యుని అత్యద్భుతమైన గురువు
3. ఆదిశంకరులు మరియు బద్రీనాథ్ ఆలయం
4. ఆదిశంకరులు – తల్లి మరణం
5. ఆది శంకరులు - మరణించిన రాజు శరీరంలోకి పరకాయ ప్రవేశం
6. ఆదిశంకరులు – తన శిష్యులకు నేర్పిన గుణపాఠం
7. ఆదిశంకరుల మరణం
8. ఆదిశంకరులను మహానీయుడిగా చేసిందేమిటి?
9. మాయను గురించి ఆదిశంకరుల బోధనలు – సద్గురు ఇచ్చిన స్పష్టత
10. ఆది శంకరుల బోధలు – సృష్టి మరియు సృష్టికర్త రెండూ ఒకటే
11. నేటి ప్రపంచంలో ఆది శంకరుల ఔచిత్యం
12. ఆది శంకరుడు స్తోత్రాలు

ఆది శంకరుడు – ఓ అద్భుతం

Sadhguru:సద్గురు: ఆది శంకరులు ఒక గొప్ప మేధావి, భాషా శాస్త్ర ప్రవీణులు, అన్నిటికీ మించి, ఆధ్యాత్మిక తేజం భారతావనికి గర్వకారణం. అతి పిన్న వయసులోనే ఆయన ప్రదర్శించిన వివేచన, ప్రవీణత స్థాయి ఆయనను మానవాళికి ఒక వెలుగు దివ్వెను చేసింది.

ఆయన అనితరసాధ్యం కాని అసాధారణమైన పాండిత్యం కలవాడు. రెండేళ్ళ వయసున్నప్పుడే ఆయన సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడడం రాయడం చేయగలిగాడు. నాలుగేళ్ల వయసుకే, ఆయన వేద పఠనం చేశాడు, పన్నెండేళ్ళ వయసులో సన్యాసం స్వీకరించి ఇల్లు వదిలి వెళ్ళాడు. అంత చిన్న వయసులోనే శిష్యులను పొంది, ఆధ్యాత్మిక విజ్ఞాన పునఃస్థాపన కోసం దేశమంతటా సంచరించడం మొదలుపెట్టాడు.

ఆయనకు ముప్ఫై రెండేళ్ళ వయసులో, తన శరీరాన్ని వదిలిపెట్టాడు, కానీ ఆ ఇరవై ఏళ్లలో అంటే, పన్నెండేళ్ళ వయసు మొదలుకొని ముప్ఫై రెండేళ్ళ వయసు వరకు, ఉత్తరాది నుండి దక్షిణాదికి, తూర్పు నుండి పశ్చిమానికి, కేరళ నుండి సరాసరి బద్రీనాథ్,అక్కడి నుండి మళ్ళీ వెనక్కి, ఇలా ఆయన భారతదేశా నలుదిశల్లోనూ పలు మార్లు కలియదిరిగాడు. ఆయన జీవించి ఉన్న కొద్ది కాలంలోనే అంత ఎక్కువగా నడవాలంటే ఆయన కచ్చితంగా చాలా వడి వడిగా నడిచేవాడై ఉండాలి. మధ్య మధ్యలో ఆయన వేల పుటల సాహిత్యాన్ని కుడా రచించాడు.

ఆదిశంకరాచార్యుని అత్యద్భుతమైన గురువు

ఆదిశంకరులకు గౌడపాదులు మార్గనిర్దేశనం చేశారు. ఆయన మార్గదర్శకత్వంలో, శంకరులు చేపట్టిన అద్భుతమైన కృషికి బీజం పడింది. గౌడపాదులు కూడా చాలా వరకు మన సాంప్రదాయానికి చెందినవాడు. ఆయన ఒక అద్భుతమైన గురువు, కానీ ఆయన బోధనలు ఎక్కడా వ్రాయబడలేదు. అవి ఎక్కడా రచింపబడకుండా ఉండేలా ఆయన చూసుకున్నారు. ఆయన వేలమందికి బోధించి ఉండవచ్చు కానీ ఆయన, ఏ కోలాహలం లేకుండా, ఎటువంటి మతం కానీ, ఏదైనా గానీ ప్రారంభించకుండానే నిశ్శబ్దంగా దేశంలో ఆధ్యాత్మిక విజ్ఞాన పునఃస్థాపన చేసిన పదిహేను- ఇరవై మందిని తయారు చేశారు. ఎన్నో విధాలుగా, ఈశా చేస్తున్న కృషి వెనుక ఉద్దేశం కూడా అదే – ఒక కొత్త మతాన్ని ఏర్పరచడం గానీ, గ్రంథాన్ని రచించడం గానీ లేకుండా, జీవం - అది ఉండే విధానంగా, ఒక మనిషి అంతరంగపు బోధనగా, ఆధ్యాత్మిక విజ్ఞాన స్థాపన చేయడం.

ఆదిశంకరులు మరియు బద్రీనాథ్ ఆలయం

బద్రీనాథ్ ఆలయానికి చారిత్రిక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే, ఇక్కడి ఆలయం ఆదిశంకరులచే స్థాపించబడింది. ఆయన తన మనుషులను అక్కడ నియమించారు. ఈరోజుకీ ఆయన నియమించిన వారి తరువాతి తరాల వారు- సాంప్రదాయపరంగా వారిని నంబూద్రీలు అంటారు – వారు ఆలయ పూజారులుగా ఉంటారు. కాలడి నుండి బద్రీనాథ్ వరకు, కాలి నడక మార్గం మూడువేల కిలోమీటర్లు ఉంటుంది. ఆదిశంకరులు అంతటి దూరాలు కాలినడకన వెళ్ళేవారు.

ఆదిశంకరులు – తల్లి మరణం

ఆది శంకరులు ఉత్తరాదిన ఉన్నప్పుడు ఒకనాడు, ఆయన అంతర్దృష్టి ద్వారా తన తల్లికి మరణం సమీపించిందని తెలుసుకున్నారు. అంత్యకాలంలో తన వద్దే ఉంటానని, శంకరులు తన తల్లికి ప్రమాణం చేసిన తరువాత మాత్రమే, ఆమె శంకరులకు పన్నెండేళ్ళ వయసున్నప్పుడు సన్యాసం స్వీకరించేందుకు అనుమతినిచ్చింది. కాబట్టి, ఆయన తల్లి అనారోగ్యంతో ఉందని తెలుసుకున్నప్పుడు, కేవలం ఆమె చివరి క్షణాల్లో ఆమెతో ఉండేందుకు మాత్రమే ఆయన మళ్ళీ కేరళకు వచ్చాడు. ఆయన తన తల్లితో కొన్ని రోజులు గడిపాక, ఆమె మరణించింది, తిరిగి ఆయన ఉత్తరాదికి చేరుకున్నాడు. మీరు గనుక హిమాలాయాలకు వెళితే, అసలు ఎవరైనా ఇంత దూరం ఎలా నడవగలిగారా అని ఆశ్చర్యపోతారు. అది ఎంత ప్రయాసతో కూడినదో ఊహించుకోండి.

ఆది శంకరులు - మరణించిన రాజు శరీరంలోకి పరకాయ ప్రవేశం

ఆది శంకరులు ఒకాయనతో వాదానికి దిగి గెలిచారు. అప్పుడు ఆయన భార్య పై ఎత్తు వేసి, వాదంలో తాను కూడా భాగం అయ్యింది. ఆది శంకరులు ఒక నిర్దిష్ట స్థాయి తర్కంతో ఉంటారు – మీరు అటువంటి వారితో వాదానికి దిగకూడదు. కానీ, వాదంలో ఆమె కలుగజేసుకుని , “నువ్వు నా భర్తని ఓడించావు, కానీ ఆయన సంపూర్ణుడు కాదు. మేము ఒకే దానిలో చెరో సగం. కనుక నువ్వు తప్పకుండా నాతో వాదించాలి.” అన్నది. ఈ తర్కానికి ఎదురేముంది? కాబట్టి, వాద-ప్రతివాదాలు మొదలయ్యాయి. అప్పుడు ఆమె తాను ఓడిపోతున్నదని గ్రహించి, మానవ లైంగికతకు సంబంధించిన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది. శంకరులు, ఆయన ఏదైతే చెప్పాలో అది చెప్పాడు. అప్పుడు ఆమె మరింత లోతుగా వెళ్లి ఇలా అడిగింది, “అనుభవపూర్వకంగా నీకు ఏమి తెలుసు?” అని. ఆదిశంకరులు బ్రహ్మచారి. అది ఆయనను ఓడించడానికి వేసిన ఎత్తు అని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన , “నాకు ఒక నెల పాటు విరామం కావాలి. నెల తరువాత, ఎక్కడైతే ఆపామో, అక్కడి నుండి మొదలుపెడదాం” అన్నాడు.

అప్పుడు ఆయన ఒక గుహలోకి వెళ్లి, తన శిష్యులకు, “ఏం జరిగినా సరే, ఎవ్వరినీ ఈ గుహలోకి రానివ్వకండి. ఎందుకంటే నా శరీరాన్ని వదిలి పెట్టబోతున్నాను, అలాగే కొంతకాలం పాటు వేరొక శరీరాన్ని పొందే సంభావ్యత కోసం చూస్తున్నాను.” అని చెప్పాడు. ప్రాణశక్తులు, లేదా ప్రాణం, ఐదు పార్శ్వాలలో అభివ్యక్తమవుతుంది: ప్రాణ వాయువు, సమాన, అపాన, ఉదాన మరియు వ్యాన. ప్రాణ శక్తి యొక్క ఈ ఐదు అభివ్యక్తీకరణలూ వేరు వేరు విధులను నిర్వర్తిస్తాయి. ప్రాణ వాయువు శ్వాసకోశ క్రియ, ఆలోచనా విధానం, స్పర్శ జ్ఞానాదులను నిర్వహిస్తుంది. ఎవరైనా బతికున్నారో లేదా చనిపోయారో ఎలా పరీక్షిస్తారు? అతని శ్వాస ఆగిపోతే, చనిపోయాడు అంటారు. శ్వాస ఆగిపోయింది ఎందుకంటే, ప్రాణవాయువు బయటికి వెళ్ళడం మొదలౌతుంది. ప్రాణ వాయువు శరీరాన్ని విడవడానికి ఒకటి నుండి ఒకటిన్నర గంటల సమయం పడుతుంది.

అందుకే సాంప్రదాయంలో, శ్వాస ఆగిపోయిన తరువాత, మీరు దేహాన్ని తగులబెట్టే ముందు కనీసం ఒకటి నుండి ఒకటిన్నర గంటల పాటు వేచి ఉండాలని సూచించారు. ఎందుకంటే ఇతరత్రా అనేక రకాలుగా ఆయన ఇంకా బతికి ఉన్నట్టే. మనం ఒకటిన్నర గంటల పాటు వేచియున్నప్పుడు అతని ఆలోచన, శ్వాసకోశ ప్రక్రియ, స్పర్శ జ్ఞానం పోతాయి. శరీరం కాలేటప్పుడు ఏ అనుభూతీ ఉండదు. ఇప్పుడు ప్రాణం తాలూకు మిగిలిన భాగం ఇంకా అలాగే ఉంటుంది. వ్యాన – ఇది ప్రాణం యొక్క ఆఖరి పార్శ్వం, పన్నెండు నుండి పధ్నాలుగు రోజుల వరకూ ఉంటుంది. శరీర సంరక్షణ ఇంకా సమగ్రతల నిర్వహణ, చాలా వరకు వ్యవస్థలోని వ్యాన ప్రాణం పనిచేయడం వలనే జరుగుతుంది. ఆది శంకరులు తన శరీరాన్ని వదిలినప్పుడు, ఆయన తన వ్యాన ప్రాణాన్ని తన శరీర వ్యవస్థలోనే వదిలిపెట్టాడు. తన శరీర నిర్వహణ జరగాలి కాబట్టి ఇలా చేసారు.

అప్పుడు ఏమైందంటే, త్రాచు పాము కరచి ఒక రాజు మరణించాడు. త్రాచుపాము విషం మీ వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు, మీ రక్తం గడ్డ కట్టడం మొదలై మీకు శ్వాస తీసుకోవడం కష్టతరమౌతుంది. ఎందుకంటే రక్త ప్రసరణ కష్టంగా మారినప్పుడు, శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. మీ ప్రాణ వాయువు బయటకి పోవడానికి చాలా ముందుగానే మీ మెదడు పనిచేయడం ఆగిపోతుంది. పరకాయ ప్రవేశం చేయాలనుకునే వారికి ఇది చక్కటి అనువైన స్థితి. సాధారణంగా, గంటన్నర సమయం పాటు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కానీ ఒక వ్యక్తి శరీరంలోకి త్రాచు పాము విషం ప్రవేశించినప్పుడు, నాలుగున్నర గంటల సమయం పాటు మీకు ఈ అవకాశం ఉంటుంది.

కాబట్టి ఆది శంకరులు ఈ అవకాశం పొంది, ఆయన చాలా సులభంగా రాజు శరీరంలోకి పరకాయ ప్రవేశం చేశారు. అలాగే ఆయన ఆ ప్రశ్నలకు అనుభవపూర్వకమైన సమాధానాలు చెప్పేందుకు ఆ ప్రక్రియను అనుభూతి చెందారు. రాజు ఆంతరంగికులైన కొందరు తెలివైన వారు, ఒక మనిషిచనిపోయాడని నిర్ధారించిన తరువాత, ఉన్నట్టుంది శక్తి పుంజుకుని లేచి కూర్చోవడంవల్లా, ఇంకా ఆయన ప్రవర్తనను బట్టి, అది రాజు కాదనీ, వేరెవరో అదే శరీరంలోకి ప్రవేశించారని గుర్తించారు. రాజ్యం నలుమూలలా సైనికులను పంపి, ఎక్కడైనా ఒక శరీరం పడి ఉన్నట్టు కనిపిస్తే, దానిని వెంటనే తగుల బెట్టమని ఆదేశమిచ్చారు. తద్వారా, ఆ శరీరంలోని వారు గనుక రాజు శరీరంలోకి ప్రవేశించిన వారు అయితే, ఆయన మళ్ళీ తిరిగి ఆ శరీరాన్ని పొందలేడు కాబట్టి, రాజు శరీరంలోనే ఉండిపోతాడు. ఇప్పుడు రాజు మళ్ళీ బతికాడు – భిన్నమైన వ్యక్తి కాని చూడడానికి రాజులానే ఉన్నాడు, అయితే ఏంటి? అనుకున్నారు. కానీ వాళ్ళు ఆ ప్రయత్నంలో సఫలం కాలేదు. ఆదిశంకరులు ఆ రాజు శరీరాన్ని వదిలిపెట్టి తిరిగి తన శరీరంలోకి ప్రవేశించారు.

ఆదిశంకరులు – తన శిష్యులకు నేర్పిన గుణపాఠం

sadhguru-wisdom-article-adi-shankara-drinking-alcohol-illustrative-img

ఒకసారి, ఆదిశంకరులు వడి వడిగా నడుస్తూ ఉంటే, ఆయనను వెంబడిస్తూ శిష్యగణం పరుగు పరుగున నడుస్తూ, వారు ఒక గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి వెలుపలి శివార్లలో, ఆయన కొంతమంది మద్యపానం చేయడం చూశాడు. అది ఇంట్లో తయారు చేసిన సారాయి లేదా కల్లు లాంటి మద్యం. భారతదేశంలో ఆ రోజుల్లో …. ఓ పాతిక-ముప్పై ఏళ్ల క్రితం వరకు కూడా, మద్యం దుకాణాలు ఎప్పుడూ గ్రామానికి వెలుపలనే ఉండేవి. వాటిని ఎప్పుడూ గ్రామ శివారు దాటి లోపలికి తెచ్చేవారు కాదు. ఈరోజుల్లో, గ్రామంలోనే మద్యం అమ్ముతున్నారు, మీ ఇంటి పక్కనో, మీ పిల్లాడు చదివే స్కూల్ పక్కనో ఉంటున్నాయి. ఆ రోజుల్లో, ఎప్పుడూ ఊరికి బయటే ఉండేవి.

ఆది శంకరులు వారిలో కొందరు మత్తులో తూలుతుండడం చూశాడు. మీకు తెలుసా, తాగుబోతులు ఎల్లప్పుడూ వాళ్ళు తమ జీవితంలోనే ఉత్తమ దశలో ఉన్నామని, మిగతావాళ్ళందరూ దానిని కోల్పోతున్నారని అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఆయన్ని చూసి కొన్ని విమర్శలు చేశారు. మారుమాట్లాడకుండా, ఆదిశంకరులు దుకాణంలోకి వెళ్లి, ఒక ముంత తీసుకుని, అందులోని కల్లు తాగేసి నడుచుకుంటూ వెళ్ళాడు.

ఆయన వెనుక ఆయన శిష్యులు పరుగు పరుగున నడుస్తూ తమలో తాము “మన గురువు మద్యం తాగినపుడు, మనం మాత్రం ఎందుకు తాగకూడదు?” అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఆదిశంకరులకు ఏం జరుగుతోందో అర్థమైంది. తరువాతి గ్రామానికి చేరుకున్నప్పుడు, అక్కడ ఒక కమ్మరి పనిచేస్తున్నాడు. శంకరులు లోపలికి వెళ్లి, ఇనుము కరిగించిన ద్రవం ఉన్నఒక కుండను తీసుకుని తాగి, నడుచుకుంటూ వెళ్ళాడు. ఇక ఇప్పుడు మీరు ఆయన్ని అనుకరిద్దాం అనుకోరు కదూ...!

ఆదిశంకరుల మరణం

ఆయన జీవితపు అంత్యదశలో, ఆది శంకరులు ఈ సంస్కృతి, తన బ్రాహ్మణత్వపు జీవన విధానం, ఇంకా ఆయన వేద పరిజ్ఞానంలో సుస్థాపితుడై ప్రాథమిక అంశాలను అంతగా పట్టించుకోలేదు. ఒకరోజు, ఆయన ఒక ఆలయంలోకి వెళ్తుండగా, మరొక వ్యక్తి ఆలయం నుండి వెలుపలికి వస్తున్నాడు. ఆ వ్యక్తి ఒక తక్కువ కులానికి చెందిన వాడు (చెండాలుడు). కానీ ఆది శంకరులు ఒక బ్రాహ్మణుడు, పరమ శుద్ధుడుగా పరిగణిస్తారు. ఆయన ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు, ఈ తక్కువ కులానికి చెందిన వ్యక్తిని చూసి, అది ఒక దుశ్శకునంగా భావించాడు. ఆయన భగవంతుడ్ని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు, ఈ చెండాలుడు ఆయనకు ఎదురొచ్చాడు. ఆయన “పక్కకి తొలుగు” అన్నాడు. ఆ మనిషి అక్కడే నిలబడి, “ ఏది పక్కకి తొలగాలి, నేనా లేక నా శరీరమా?” అన్నాడు. అతను అడిగిందల్లా అదే. ఇది ఆదిశంకరులను బలంగా స్పృశించింది. ఇంకా ఆయన మాట్లాడిన ఆఖరిరోజు అదే. ఇకపై ఏ బోధనా చేయలేదు. సరాసరి హిమాలయాలకు వెళ్ళాడు. ఆయన మళ్ళీ ఎవరికీ కనిపించలేదు.

ఆదిశంకరులను మహానీయుడిగా చేసిందేమిటి?

అలాంటి ఒక మనిషిని ఎలా తయారుచేస్తారు? జీవించిఉన్న కొద్ది కాలంలోనే, ఆయన కాలినడకన ఈ దేశమంతా తిరిగాడు. ఇంతటి శక్తి, ఈ తపన, ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చి ఉంటుంది? ప్రధానమైన మరియు ప్రతీకాత్మకమైన ఒక అంశం ఏంటంటే, ఆది శంకరులు కాలడి అనే గ్రామం నుండి వచ్చారు, ఇప్పుడు అది ఒక చిన్న పట్టణం. కాలడి అంటే అక్షరాలా “అట్టడుగున” అని అర్థం. దక్షిణ భారతదేశంలో, మనం భారతమాత పాదాల వద్ద ఉన్నాము. ఎన్నో రకాలుగా ఇది మనకు ఫలితాలనిచ్చింది.

మహాభారతంలో ఒక అద్భుతమైన కథ ఉంది. అర్జునుడు మరియు దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుని మద్దతు కూడగట్టుకోవడానికి వెళ్తారు, వారిలో ఒకరు కృష్ణుడి తల వద్ద నిలుచుంటే, మరొకరు ఆయన పాదాల వద్ద నిలబడ్డారు – అదే యుద్ధ ఫలితాన్ని అంతటినీ నిర్ణయించింది. ఆ రోజు మధ్యాహ్నం, అర్జునుడు కృష్ణుని పాదాల వద్ద నిలబడ్డప్పుడు, అతడు యుద్ధాన్ని ప్రాథమికంగా గెలిచేశాడు. మన దేశం ఇంకా మన సంస్కృతుల ప్రాథమిక స్వభావం - మనం అన్నిటికీ నమస్కరిస్తాం కనుక మనం ఎదుగుతాం. మనం మన మార్గాన్ని పక్కకి నేట్టేయడం వల్ల ఎదగము – మనం నమస్కరించడం వల్ల ఎదుగుతాం. భారత్ అంటే మనం ఎల్లప్పుడూ దైవం పాదాల చెంత ఎలా ఉండాలో నేర్చుకున్నాము అని. ఇది ఆడంబరాలకు అందెవేసే సంస్కృతి కాదు; సహజమైన ధర్మనిష్ఠ గల సంస్కృతి. మనం ప్రతీదానికి నమస్కరించడం నేర్చుకున్నాము – అది ఒక దేవుడైనా, పురుషుడైనా, స్త్రీ, ఒక శిశువు, జంతువు, చెట్టు, లేదా ఓ రాయి ఏదైనా సరే. కేవలం ఈ ఒక్క అంశంతోనే, మనం మహనీయులను అందించగలిగాము. దైవం పాదాల చెంత ఉండటం ద్వారా, మనం పరిణామం చెందడం, వికసించడం నేర్చుకున్నాము, అలాగే దీర్ఘకాలం పాటు, మిగతా ప్రపంచానికి వెలుగు దివ్వెగా మారగలిగాం. వేల సంవత్సరాల క్రితం, ఆది శంకరుల కంటే ముందు, ఆదియోగి మొదలుకొని, అనేక మంది యోగులు, మార్మికులు, జ్ఞానులు, ఋషులు దీనినే అనేక విధాలుగా చెప్పారు.

తనని తాను వ్యక్తపరచుకోవడంలో బుద్ధి పూర్వకమైన స్పష్టత అలాగే తనకు గల ఉత్సాహం ఇంకా శక్తితో దేశమంతటా దానిని వ్యాప్తి చేయడం అనేవి ఆది శంకరులనుమహనీయునిగా చేస్తాయి. ఈ రోజు ప్రపంచంలో చాలా ప్రాధాన్యత కలిగిన ఒక అంశం ఏమిటంటే, ఆయనకు గల జ్ఞానం ఇంకా వివేకం, విశ్వాసం లేదా నమ్మకం వల్లనో కలగలేదు. అవి ఆత్మసాక్షాత్కారం వల్ల కలిగాయి. ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది ఒక విధంగా, ప్రాథమికమైన మానవ తర్కానికి ఇంకా ప్రస్తుత వైజ్ఞానిక ఆవిష్కరణలకు సయోధ్యలో ఉండనంత వరకు, ప్రజలు దానిని స్వీకరించరు. భావి తరాలు, తమకు తర్కపరమైనదిగా తోచకపోతే దేనినైనా తిరస్కరిస్తారు. ఈ సందర్భంలో చూస్తే, భావితరాలకు ఆధ్యాత్మికతను అంగీకార యోగ్యంగా అందించడంలో ఆది శంకరులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

మాయను గురించి ఆదిశంకరుల బోధనలు – సద్గురు ఇచ్చిన స్పష్టత

ఆదిశంకరులు చేసిన బోధనలను కొంతవరకు అపార్థం చేసుకోవడం జరిగింది. కనీసం దానినైనా స్పష్టం చేయడం అనేది మనం ఆయనకు బాకీ పడ్డాం. ఆయన “అంతా మాయ” అన్నప్పుడు చాలామంది ఏంటి ఆయన అర్థం లేకుండా మాట్లాడేది? అనుకుంటారు. అది ఎలా వివరించబడింది (తప్పుగా) అంటే – “మాయ అంటే, అది ఉనికిలో లేనిది అని”. కానీ, మాయ అంటే అది ఉనికిలో లేదు అని అర్థం కాదు. మాయ అనేది ఒక భ్రమ, అంటే మీరు ఉన్న దానిని అది ఉన్న విధంగా చూడడం లేదు అని అర్థం. ఇక్కడ మీకు బయటికి, దృఢమైన శరీరం ఉన్నట్లు అనిపిస్తోంది, కానీ మీరు తినే ఆహారం, మీరు త్రాగే నీరు, మీరు పీల్చే గాలి, మీ శరీరంలోని కణాలు రోజువారీ మారిపోతున్నాయి. ఆ కణాలు ఏ రకానికి చెందిన కణాలు అనే దాన్ని బట్టి, మీ శరీరంలోని కణజాలం ఇంకా అవయవాలు, రెండు రోజుల నుండి కొన్ని సంవత్సరాల వ్యవధిలో పూర్తిగా పునరుద్ధరింపబడుతుంది. దీనర్థం, కొంత కాలం తారువాత, మీకు పూర్తిగా ఒక కొత్త శరీరం ఉంటుంది. కానీ మీ అనుభూతిలో, అది పాతదానిలాగే అనిపిస్తుంది. – అది మాయ. అదేవిధంగా, మీరు ఈ ఉనికి గ్రహించే విధం, మీ ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా మీరు ప్రపంచాన్ని తెలుసుకనే విధానం, అది పూర్తిగా గురి తప్పింది – అది మాయ (భ్రమ). అది ఎండమావి లాంటిది. మీరు హైవేలో వాహనం నడుపుతూ ఉంటే, కొన్నిసార్లు బాగా దూరంలో అక్కడ నీళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది. తీరా మీరు అక్కడికి వెళ్లి చూస్తే, కచ్చితంగా అక్కడ నీరు ఉండదు. కాంతి వక్రీభవనం చెందడం ద్వారా ఇది ఏర్పడింది. ఇది ఫలానాది, మరేదో దానిలా అనిపిస్తుంది.(కనిపిస్తుంది). “నేను” అని మీరు అనుకునేది అంతావాస్తవానికి అదే – ఇదే మాయ. “ఇతరమైనది” అని మీరు అనుకునేది వాస్తవానికి మీరే. అంతా అదే అని మీరు అనుకునేది ఏదీ లేనిదిగా అవ్వవచ్చు. ఆదిశంకరులు మాయ అని చెప్పేది దీని గురించే.

ఆది శంకరుల బోధలు – సృష్టి ఇంకా సృష్టికర్త రెండూ ఒకటే

మానవ వ్యవస్థను గురించి తెలుసుకోవడం ద్వారా మనం ఈ మొత్తం విశ్వాన్ని తెలుసుకోవచ్చని కూడా ఆయన చెప్పారు. ఆధునిక భౌతికశాస్త్రం ఏం చేబుతోందంటే, విశ్వం అంతా ప్రాథమికంగా ఒకే శక్తి అని. అదేవిధంగా, ఆది శంకరులు సృష్టి ఇంకా సృష్టికర్త ఒకటే అని చెప్పారు. ఈరోజున, ఎంతో కృషి తరువాత, ఆధునిక శాస్త్ర విజ్ఞానం, ఆది శంకరులు ఇంకా అనేక మంది గత కాలపు జ్ఞానులు అత్యంత స్పష్టంగా చెప్పినదానికి సమాంతరంగా వచ్చింది.

నేటి ప్రపంచంలో ఆది శంకరుల ఔచిత్యం

ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కొండల నుండి నగరాలు, పట్టణాలు ఇంకా అన్నిటికీ మించి, ప్రజల మనసులు, హృదయాల్లోకి చేరవలసిన అవసరం ఉంది. ఈ సంస్కృతిని, ఈ నైష్ఠికతను, నమస్కరించడాన్ని నేర్చుకోవడం ద్వారా మనకు ఎనలేని లాభాన్ని తెచ్చిపెట్టిన ఈ వినమ్రతా భావనను తిరిగి తెచ్చుకోవలసిన సమయం ఇది. ఇది మన బలం, ఇది మన మార్గం, మన పరిణామం, ఆత్మసాక్షాత్కార ప్రక్రియ మరియు విధానం. ఇది అత్యంత గొప్ప నిధి – ఇది దేశ భవితవ్యం కానుంది. మనం ఇది ఒక్కటి గనుక చేసినట్లయితే, మొత్తం ప్రపంచం మన నుండి మార్గదర్శకత్వం కోరుతుంది. మనం ఈ దేశంలో అలాగే మిగతా ప్రపంచంలో ఆది శంకరుల స్ఫూర్తిని రగిలిద్దాం.

ఆది శంకరుల స్తోత్రాలు

ఆది శంకరులు తన మేధస్సుఇంకా భక్తి తాలూకు సంకేతాన్ని కలిగి ఉన్న ప్రగాఢమైన శ్లోకాలను ధారగా కురిపించారు. ఆయన రచించిన ఈ శ్లోకాలు లేదా స్తోత్రాలు వేయికి పైగా సంవత్సరాల తరువాత కూడా ఇప్పటికీ ప్రజల మనస్సుల్లో, హృదయాల్లో సజీవంగా ఉండడం అనేది మానవ చైతన్యాన్ని జాగృతం చేయడంలో అలుపెరగని ఆయన కృషికి, ఆయన జ్ఞానానికి ఒక నివాళి.

అత్యంత ప్రసిద్ధమైన ఆదిశంకరుల రచనల్లోనుండి నాలుగింటిని ఇక్కడ ఇస్తున్నాము:

#1 నిర్వాణ షటకం

 

నిర్వాణ షటకం ఏళ్ల తరబడి సన్యాస ధర్మానికి పర్యాయపదంగా మారిన ఒక శక్తివంతమైన స్తోత్రం. మొదటిసారి అది రచించబడినప్పుడు ఎంతటి ప్రభావాన్ని కలిగి ఉందో, ఈరోజుకీ అదే ప్రభావంతో ఉంది, శ్రద్ధతో కూడిన శబ్దాల అమరిక ఆధ్యాత్మిక ప్రక్రియకు మూల స్తంభంగా యోగ మార్గంలో సాధన చేయబడుతుంది.

ఈ వ్యాసాంగంలో, నిర్వాణ షటకం గేయం, అర్థం మరియు సద్గురు అందించిన వివరణ అలాగే, ఈ స్తోత్రం ద్వారా ఆదిశంకరులు ఏమి చెప్పదలచుకున్నారో తెలుసుకోండి.

#2 భజ గోవిందం

 

ఆది శంకరుల రచనల్లో సద్గురు ఎక్కువగా పాడే స్తోత్రాలలో భజగోవిందం ఒకటి. ఈ స్తోత్ర విశిష్టత ఏమిటంటే, అది సాధకుడిని తనకు సాధ్యపడే ఏ మార్గంలోనైనా సరే, భవ సాగరాన్ని దాట మని ప్రేరేపిస్తుంది.ఆదిశంకరులు చెప్పేది ఏంటంటే మీరు ముక్తి ఎలా సాధించారు అనేది విషయం కాదు – అది భోగం ద్వారానైనా, క్రమశిక్షణ ద్వారా, అభ్యాసం ద్వారా నైనా – మీరు ఎలా దానిని చేరుకున్నారు అనేది ప్రధానం కాదు, చేరుకోవడమే ప్రధానం. ఈ స్తుతి గేయం ఇంకా సద్గురు ఇచ్చిన క్లుప్తమైన వివరణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

#3 సౌందర్యలహరి

 

ఆదిశంకరుల ఈ సుందర కవితా సంపుటి, సృష్టి యొక్క సౌందర్యాన్ని, బ్రహ్మాండమైన శక్తిని కీర్తిస్తుంది. ‘సౌండ్స్ ఆఫ్ ఈశా’ అందించిన ఈ రసభరితమైన అనునయం, గేయ సారాన్ని ఓడిసిపడుతుంది. అలాగే ఆది శంకరుల అసాధారణ ప్రతిభా శీలతకు ఒక నివాళి.

#4 ప్రాత స్తువే పరశివాం భైరవి

 

ఈ గేయం కమలంలో ఆసీనురాలైన వాక్కులకు, భాషలకు అధిదేవతగా దేవిని స్తుతిస్తుంది. ఇది ఆది శంకరాచార్య విరచితం. దేవీ నవరాత్రుల పర్వదినాల సందర్భంగా సౌండ్స్ ఆఫ్ ఈశా వారిచే స్వరకల్పన చేయబడింది. ఇది దేవీ అనుగ్రహాన్ని కోరే ప్రార్థన.

ప్రాత స్తువే పరశివాం భైరవి గేయం మరియు అర్థం ఈ బ్లాగ్‌స్పాట్‌లో ఇవ్వబడింది.