మీరు చాలా విషయాలు నమ్ముతున్నారు. మీరు పుట్టకముందు ఎక్కడో ఉన్నారని, చనిపోయిన తర్వాత మరెక్కడికో పోతున్నారని ఇలా అన్నీ మీరు నమ్ముతారు. ఎన్నో ఊహించుకుంటారు. మీకు ముందే ఇన్ని ఊహలుంటే సత్యాన్ని చేరుకునే మార్గం లేదు. అవునా? మీరు సత్యాన్ని చేరుకోవాలంటే మొదట చేయవలసిన పని ఊహలు చేయకపోవడం. నిజమైన సాధకునికి ఊహలుండవు, అతను కేవలం అన్వేషిస్తుంటాడు. మీ నమ్మకాలు సరైనవేనని నేను చెప్తే అది మిమ్మల్ని సత్యానికి దగ్గరగా తీసికొని వెళుతుందా? మీరు కొంచెం సంతోషిస్తారు “ఓ, నా ఆలోచనలు సరైనవే” అనుకుంటారు. కాని ఏమైనా పరిష్కారం లభిస్తుందా? అందువల్ల మీ విశ్వాసవ్యవస్థల్ని రూఢిపరచడం వల్ల కలిగే లాభమేమీ లేదు.

మనుషులతో ఇదో పెద్ద సమస్య; వాళ్ళే కరెక్టు అనుకుంటారు. ఇదే అన్నిటికంటే పెద్ద సమస్య. వాస్తవానికి ఈ ప్రపంచంలో ఘర్షణ అంతటికీ ఇదే కారణం. “నేను రైటు, నువ్వు తప్పు” – ఇదే అసలు సమస్య అవునా? “నేను నమ్మింది కరెక్టు, నువ్వు నమ్మింది తప్పు” ప్రపంచంలో సమస్యలన్నిటికీ మూలం ఇదే కదా! అది కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు. అందువల్ల మీరు ఊహిస్తున్నదానికి వాస్తవంతో ఎటువంటి సంబంధమూ లేదు. భౌతికాన్ని అధిగమించినదాన్ని భౌతికమైన సందర్భంలో అర్థం చేసుకొనే ప్రయత్నం వల్ల ఉపయోగం లేదు. భౌతికానికి ఆవల ఉన్న దాన్ని మీ ఇంద్రియజ్ఞానంతో తెలుసుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు.అది సాధ్యం కాదు. మీరు మహాసముద్రం లోతును కొలవడానికి అడుగు కొలబద్ద తీసికొని వెళుతున్నారు. మీరు మహాసముద్రపు లోతు తెలుసుకోవాలనుకుంటే తగిన సాధనం ఉపయోగించాలి. లేదంటే మీరు తప్పుడు లెక్కలతో తిరిగి వస్తారు.

ఆవల ఉన్నదాన్ని తెలుసుకునేదేలా??

మొట్టమొదట మీరు చేయవలసింది పంచ జ్ఞానేంద్రియాలకు ఆవల, భౌతికం కాని దాన్ని తెలుసుకోవాలన్న అవగాహన కలిగి ఉండడం. అప్పుడు మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు, లేకపోతే కేవలం విశ్వసించడమో, విశ్వసించకపోవడమో చేస్తారు, అంతేకదూ! దేవుడు నిజంగా నా జేబులో ఉన్నాడని నేను చెప్తే ఇక్కడున్న చాలామంది నమ్ముతారు.” ఇది ఒక జోక్, మేము నమ్మము” అనుకుంటున్నారు కాని కొంత కృషి చేసి ఒక కథ చెప్తే నమ్మించవచ్చు. ఒకవేళ ఇంతమంది నన్ను నమ్ముతున్నారు, ఇంతమంది నమ్మడం లేదు. అయితే వీళ్లలో (ఆస్తికులు,నాస్తికులు) ఎవరైనా ఇంతకుముందుకంటే దేవునికి దూరమయ్యారా? లేదు ఏమీ మారలేదు, కదూ. మరి మన ఊహల్ని రూఢి పరచుకోవడంలో మనమెందుకు మన సమయం వృథా చేసుకుంటున్నాం. మీరు మీ అవగాహనను పెంపొందించుకోవాలి, మీ అవగాహన ద్వారానే మీకు తెలుస్తుంది. తెలుసుకోవడానికి మరో మార్గం లేదు. అవునా? మరొకదాన్ని తెలుసుకోవడానికి మీరు దాన్ని అవగాహన చేసుకోవాలి, అప్పటివరకు మీకు తెలియదు.

 తెలివైన వాళ్లు సంకోచంతో కనిపిస్తారు కానీ మూఢత్వంతో ఉన్నవారు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు
మీరు గ్రహిస్తే మీకు తెలుస్తుంది. మీరు గ్రహించకపోతే మీకు తెలియదు. “నాకు తెలియదు” అని ఒప్పుకోవడం మీ కిష్టంలేదు. అందుకనే నమ్ముతున్నారు, అవునా? మీరొక సాంఘిక పరీక్షను దాటదలచుకుంటే, దానికి విశ్వాసం మంచి పద్ధతే. కాని మీకు నిజంగా తెలియాలంటే దానికి విశ్వాసం మంచిమార్గం కాదు. విశ్వాసం మీకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది కాని మూర్ఖులకు ఆత్మవిశ్వాసం మంచిది కాదు. తెలివితక్కువ వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువయితే అది చాలా చాలా ప్రమాదం. తెలివైన వాళ్లు సంకోచంతో కనిపిస్తారు కానీ మూఢత్వంతో ఉన్నవారు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. మీరు చూశారా? గొప్ప ఆత్మవిశ్వాసం. మీరొకదాన్ని విశ్వసించినట్లయితే గొప్ప ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. మీకు దేని గురించీ ఎటువంటి సందేహమూ ఉండదు, ఎందుకంటే మీరు దాన్ని గురించి ఆలోచించనే ఆలోచించరు. మీకు 100% నిశ్చయం.

తెలిస్తే "తెలుసు" లేకపోతే "తెలీదు" అని ఒప్పుకొండి

మీరు తిలివిగలిగిన వారైతే చూట్టూ చూస్తారు, అవునా? అక్కడ ఏం ఉందో, ఏం లేదో చూస్తారు. మీరు దేవుడిలోనే కాదు, మరెన్నో విషయాల మీద విశ్వాసం ఉన్నవారు కాబట్టి చుట్టూ చూడరు. ఏం ఉందో, ఏం లేదో తెలుసుకోరు. మీ జీవితాన్ని తెలుసుకోవడంలో అత్యంత వివేకవంతమైన మార్గమేమిటంటే “నాకు తెలిసిందేదో తెలుసు, తెలియంది తెలియదు.” మీరు నిజాయితీగా ఈ నిశ్చయానికి వస్తే మీ జ్ఞానం దినదినాభివృద్ధి చెందడం గమనిస్తారు. మీరు నమ్మిన మరుక్షణం మీరక్కడే ఆగిపోతారు. వాస్తవానికి విశ్వాసం అన్నది మరణం. మార్క్స్ చెప్పాడు, “అది నల్లమందు. మతం నల్లమందు, అది మనుషుల్ని నిద్ర పుచ్చుతుంది” అని.

ఆయన చెప్పింది సరైనదే. అది ప్రజల్ని నిద్రపుచ్చుతుంది, అవునా? నిద్ర చాలా సౌకర్యంగా ఉంటుంది. అందులో దోషమేముంది? ఎందుకు నిద్రపోకూడదు? అలా అనుకుంటే, ఎందుకు చనిపోరు? అది మరింత సౌకర్యంగా ఉంటుంది కదా! ఎలాగూ మీరొక విశ్వాసి, మీ దేవుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు, మరెందుకు వెళ్లరు?  నిజమేకదా..! మీకు తెలుసు, మీరు మరణించినప్పుడు దేవుడి దగ్గరికే వెళతారు. ఇక సమస్య ఏముంది, ఎందుకు ఎదురుచూస్తున్నారు, ఆ ఆసుపత్రులకెందుకు వెళుతున్నారు, ఈ అర్థరహితమైన పనులన్నీ ఏమిటి? ఎందుకు వెళ్లిపోరు? దేవుడి దగ్గరకు సాగే మీ పురోగతిని ఎందుకు నిరోధిస్తున్నారు? అది సరైంది కాదు కదా. మీరు నిజంగా విశ్వసించడంలేదు, అవునా?

ప్రేమాశీస్సులతో,
సద్గురు

Pixabay