ప్రేమ అనేది కేవలం ఒక బంధం కాదు. ఇది, మనల్ని అనంతపు అంచుల దాకా తీసుకెళ్తుంది. ప్రేమ అనేది ఎంతో అందమైన విషయం. మీరు మీ భావాలతో చేయగల అత్యుత్తమమైన పని - ఇదే. మీ భావాలు ఎప్పుడూ ఉండగలిగినంత మధురంగా ఉండడానికి, ఇదే పెద్ద అవకాశం. కానీ  మీరు దీని పరిమితులను అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని ఎవరైనా ఎంత ఎక్కువగా ప్రేమించినప్పటికీ కూడా, కొన్ని షరతులు ఉన్నాయి. అది మీ స్నేహితుడైనా, భర్త అయినా, భార్య అయినా, మీ తల్లితండ్రులైనా, మీ పిల్లలైనా...అందరికీ ఎక్కడో ఒక చోట ఒక రేఖ ఉంది. మీరు ఆ రేఖను దాటి వచ్చారంటే, ఈ ప్రేమంతా మాయమైపోతుంది. ఇది కొన్ని షరతులకు లోబడి ఉంటుంది.  ఇందులో తప్పేమీ లేదు. ప్రేమ అనేది ఎప్పుడూ కూడా, మనం కొంత బాధ్యతతో నిర్వర్తించాలి. లేకపోతే అది మనకి దక్కదు. ప్రేమ అనేది ఒక పువ్వు లాంటిది. మీ చేతిలో ఒక పువ్వు ఉందనుకోండి, దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి కదా? మీ ప్రేమను, మీరు నిలబెట్టుకోవాలి అంటే ఎన్నో షరతులను నెరవేరుస్తూ ఉండాలి.

ఏదైనా ఒక క్షణంలో, మనుషులు అన్నింటినీ సుముఖంగా చూసినపుడు, వారు ఎవరినైనా ప్రేమగా చూడగలుగుతారు.

ప్రస్తుతం, మీరు ఎలా ఉన్నారంటే, అది ఏదైనా సరే, అది మీకు చెందినదైతేనే, మీరు దానిని ప్రేమగా చూడగలరు. మీలో ఇది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది - ఏదో మీకు చెందాలి. లేదంటే, మీకు అసంతృప్తి కలుగుతుంది. మీరు దేనినైనా మీదిగా భావించినపుడే, మీ భావనలు మధురంగా మారుతున్నాయి. కాని, మీ జీవితంలో ప్రతీ క్షణం, మీ భావాలను మధురంగా ఎలా ఉంచులోవాలో మీకు గనుక తెలిస్తే, మీ జీవన విధానం ఎంతో ఉన్నత జీవన విధానం అవుతుంది. మీ చుట్టూ ఎవరైనా ఉన్నారనుకోండి, వారికి ఈ మాధుర్యాన్ని మీరు పంచిపెట్టవచ్చు. ఒకవేళ ఎవరూ లేకపోతే, మీరు అలానే ప్రేమగా ఉండవచ్చు.

మీ భావాలకి మూలమైనది - ప్రేమ. అంతేగానీ ఈ సృష్టికి మూలం - ప్రేమ అనుకోకండి. ఎవరైతే ప్రేమను పొందడం లేదో, వారు మాత్రమే దేవుడిని ప్రేమగా, ఈ సృష్టికి మూలమైనది ప్రేమ - అని అనుకుంటున్నారు. నిజానికి అది అలా కాదు. ప్రేమ అనేది మానవాళికి సంబంధించిన భావన మాత్రమే. ఏదైనా ఒక క్షణంలో, మనుషులు అన్నింటినీ సుముఖంగా చూసినపుడు, వారు ఎవరినైనా ప్రేమగా చూడగలుగుతారు. చాలామంది, ఎల్లప్పుడూ ఏవో కుతంత్రాలతో ఉంటారు. వారు ప్రేమని అనుభూతి చెందాలి అంటే వారి ఎదురుగా ఉన్నవారు, వారికి చెందినవారై ఉండాలి. అంటే, వారి తల్లో, తండ్రో, పి‌ల్లలో లేదా ఏదో ఒక విధంగా వారికి చెందినవారై ఉండాలి. నేను, ప్రేమని అసహ్యకరంగా చూపించడం లేదు. ప్రేమ అనేది, మీ అంతర్గతంలో కలిగినప్పుడు ఎంతో అందమైన విషయం. మీ చుట్టూరా ఉన్న ప్రజలు, మీతో ప్రేమగా ఉండడం అన్నది ముఖ్యమైన విషయం కాదు. మీరు ప్రేమగా ఉండడం అన్నదే ముఖ్యం. ఎవరైనా అలా ప్రేమగా ఉండగలిగితే, అది ఎంతో అద్భుతమైన విషయం.

ప్రజలు ఎంతో గర్వంగా నడుస్తూ ఉండడం నేను చూస్తూ ఉంటాను. కానీ వారు నన్ను చూసినవెంటనే, ఎంతో వినయంతో వంగి నమస్కరిస్తారు. ఇది సరికాదు.  మీలో ఒక మార్పు రావాలి.  మీరు భక్తితో గనుక వంగి నమస్కరిస్తే, అది ఎంతో అద్భుతమైన విషయం. ఇది, అన్నిటిపట్ల చెయ్యాలి. ఒక విషయాన్ని ఎక్కువగా,  మరొకదాన్ని తక్కువగా చూడడం అన్నది - సరైనది కాదు.

ప్రేమ అనేది, మీరు చేసేది కాదు. ప్రేమ అనేది, మీరు ఉండే విధానం.

ప్రేమ-ద్వేషం అన్నవి నాణేనికి రెండు ప్రక్కల లాంటివి. ఇది ఒక వైపున పడితే అది ప్రేమ వ్యవహారము అవుతుంది. అదే నాణెం మరొకవైపుకి పడితే అది ద్వేషం అవుతుంది. మీరే ప్రేమగా మారిపోయారనుకోండి, అది మీకు ఎంతో అద్భుతమైన విషయం. మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే, ఇలాంటి వారితో ఉండడం అన్నది వారికి కూడా ఒక మధురానుభూతే కదా..? మీ వల్ల వారికి కూడా ఇది వ్యాపించవచ్చు..! మీరే ప్రేమగా మారిపోయినప్పుడు, మీరు ఏమి చేసినా సరే, మీ చుట్టూ ఉన్నవారు దానిని మంచిగానే తీసుకుంటారు. వారి అంతరాలలో ఎక్కడో, ఇది మీరు సదుద్దేశంతోనే చేస్తున్నారనే విషయం వారికి తెలుస్తుంది. ఇలా జరగనప్పుడు, మీరు మంచి విషయాలు అనుకునేవి కూడా, చెడ్డగా మారే అవకాశం ఉంది.

ప్రేమ అనేది, మీరు చేసేది కాదు. ప్రేమ అనేది, మీరు ఉండే విధానం. అంటే మీలో, మీ భావాలలో ఒక రకమైన మాధుర్యం వచ్చిందని అర్థం. అప్పుడు మీరు ఏది తీసుకున్నా,ఇచ్చినా,ఎవరినైనా తాకినా ఎంతో ప్రేమగా చేస్తారు. మీ చుట్టూరా ఎవరూ లేకపోయినా సరే..! మీరు అక్కడ ఊరికే అలా ప్రేమగా కూర్చోగలరు. ప్రేమ గురించిన మీ సిద్ధాంతాన్ని మీరు మార్చుకోవాలి. ప్రేమ - అనేది వేరెవరి గురించిన విషయమో కాదు. ఇది మీ గురించిన విషయమే..!! మీ భావాలు మాధుర్యంగా ఉండడం వల్ల, మీ జీవితం ఎంతో అందంగా మారిపోతుంది. అప్పుడు ఏమి జరిగినా సరే, అది సఫలం అయినా కాకపోయినా.. ఏదైనప్పటికీ - మీ జీవితం ఎంతో మాధుర్యంతో నిండిపోయి ఉంటుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు