ఇప్పటివరకు లెక్కలేనన్ని ‘భావ స్పందన’ కార్యక్రమాలను చేసాను, కానీ, ప్రతీసారీ అదో అద్భుత నూతన అనుభవంలా గోచరిస్తూ ఉంటుంది ! ప్రోగ్రాములో పాల్గొన్న వారి ముఖకవళికళను ఓ కంట కనిపెడుతూ, అతిజాగ్రత్తగా వేసే వారి అడుగులని చూస్తూ..క్లాసు అయిపోయే సమయానికి వారి పరిపూర్ణ వికాసానికి సాక్షిగా ఉండటం..ఇంతకంటే గొప్ప అనుభవం.. అనుభూతి ఏదైనా ఉంటుందా అని అనిపిస్తుంది! ఆనంద భాష్పాలను వర్షిస్తున్న నేత్రాలు..పట్టలేని పారవశ్యం, ఉప్పొంగుతున్న ప్రేమా..వేర్వేరు సామాజిక నేపధ్యాలనుంచి, ప్రపంచం నలుమూలలనుండి వచ్చిన వారు..దాదాపు ఏడువందలమంది, ఏ తారతమ్యాలూ లేకుండా..ఒకరిలో ఒకరు మమేకమైనప్పుడు అక్కడ నాకు కనిపించింది మూర్తీభవించిన ఏకత్వం..మానవత్వం! జీవన గమ్యాన్నేమార్చేసే శక్తి ఉన్న ఈ ‘భావ స్పందన’ కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు కొత్తేమీకాదు. అయినా, మనుషులని తమ మూలాలనుండి కదిల్చివేసి, వారిలో ఓ పరిణామాన్ని తీసుకొచ్చేఈ ‘భావ స్పందన’, ఐహిక ప్రపంచానికి సంబంధించినది కాదేమో అని అబ్బురపరుస్తూ ఉంటుంది.  ‘భావ స్పందన’ తరవాత మొదలైన ‘యంత్ర సెరేమొనీ'(ఉపచారం) సందడి తెల్లవారుఝాము దాకా సాగింది . దేవి అనుగ్రాహానికి పాత్రులైన భక్తుల జీవితానుభవాలూ, మాటల్లో వర్ణించలేనంత ఆశ్చర్యదాయకంగా ఉంటాయి!

మన పిల్లలు మరణం తప్ప మరో దారి లేదనుకుంటున్నారంటే, మౌలికంగా మనమేదో తప్పు చేస్తున్నామనే అర్ధం.  

ఇక మన దేశం మాటకొస్తే, ముందనుకున్నప్రకారం దేశవ్యాప్తంగా, ఏడు రాష్ట్రాల్లో 25,000 మంది స్కూలు పిల్లలకు యోగా కార్యక్రమాలను అందించాలన్న మా ఆశా..ఆశయం ...దూసుకెళుతున్నాయి. ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రభుత్వ పాఠాశాలల్లో చదువుకునే బడుగు వర్గానికి చెందిన పిల్లల శ్రేయస్సు కోసమే నిర్వహించబడుతోంది. బాధాకరమైన విషయమేమిటంటే, గత కొద్ది సంవత్సరాల్లో, 15 ఏళ్ల వయసు పిల్లలు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు , ఇలా మరణించినవారి సంఖ్య 1,700 –ఇది చెప్పుకోవలసి రావడం నిజంగా మన దురదృష్ట్టం. మన పిల్లలు మరణం తప్ప మరో దారి లేదనుకుంటున్నారంటే, మౌలికంగా మనమేదో తప్పు చేస్తున్నామనే అర్ధం. దీన్ని మనం పెడచెవినవేసి పట్టించుకోకపోవడం మన సమాజానికే ప్రమాదం! సంపూర్ణ సహకార హామీనిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు చూపిన ప్రతిస్పందనే దీన్ని ముందుకు తీసుకుని వెళుతుంది.

ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి , ఈశా దృష్టి అంతా మన పిల్లల శ్రేయస్సుపైనే. దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల పిల్లల జీవితంలోకి యోగాని ప్రవేశపెట్టబోతున్నాం. అత్యంత ఉన్నతమైన , ఆవశ్యకమైన ఈ హేతువు మీ సహకారంతోనే నెరవేరుతుంది –ఇది మన భావి పౌరులకి సంభందించినది –దీనికి మనేమే పూనుకోవాలి , రాబోయే తరాల శ్రేయోభిలాషులుగా మనమీ బాధ్యతని వహించితీరాలి. రాబోయే రెండు నెలలూ మనకెంతో ముఖ్యమైనవి, ఈ కలని సాకారం చేయడానికి మీ మద్దతుని కోరుతున్నాను. ముఖ్యంగా ప్రభుత్వ పాఠాశాలల్లో చదువుతున్న బడుగు వర్గానికి చెందిన పిల్లలకి ఇదెంతో లాభదాయకం.

నా తరువాయి మజిలీ కాలిఫోర్నియా, ఓ వారం పాటు అక్కడ ప్రోగ్రాముల తరవాత తిరిగి భారతదేశానికి, ఉజ్జయినీ కుంభ మేళ కి ప్రయాణమౌతాను, అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రసంగించి, వెంటనే ఉజ్జయినీ కుంభ మేళ లో ప్రసంగించడం! అంటే..ఓ కాలం..ఓ ప్రపంచం నుండి .. మరో కాలానికీ..మరో ప్రపంచంలోకి వెళ్ళడం అన్నమాట! ఇదో అద్భుతమైన అనుభవం మరి!

ప్రేమాశీస్సులతో,
సద్గురు

PC: flickr.com