Sadhguru2010 జనవరిలో భైరవీ దేవిని ప్రతిష్టించిన నాటినుండి మేము ఎప్పుడు వెనుదిరిగి చూసుకోలేదు. ఆ ఉత్తేజం నల్లేరుమీద బండి నడకలా సాగిపోయింది. దేవి అసంఖ్యాకుల జీవితాలని తాకింది. ఇప్పటికే పూర్తిస్థాయిలోఉన్న నాలుగు భైరవి ఆలయాల నిర్మాణం ఖరారయింది. చాలా చిన్న చిన్న మందిరాలు అనేకం రాబోతున్నాయి. కనుక ఆమె అన్ని ప్రదేశాలకూ తరలి వెళుతోంది. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించకముందే నేను అనుమానం వెలిబుచ్చాను, ధ్యానలింగం కంటే ఆమే ఎక్కువ ప్రాచుర్యం పొందుతుందేమోనని. నిజానికి అది భయం కాదు. మీ ఇంట్లో పసిబిడ్డ ఉన్నపుడు మిగతా అన్నిటికంటే పసిబిడ్డకే ప్రాధాన్యత ఉంటుంది. అది తప్పుకాదు.

ఎక్కువమందికి ధ్యానలింగం కంటే దేవిని అనుభూతిచెందడానికి కారణం ఆమెలోని  భౌతిక అంశమే.  ధ్యానలింగం చాలా సున్నితమైనది దాన్ని అనుభూతి చెందడానికి కొంత ఉన్నతస్థాయిలో గ్రహణశీలత (గ్రహించగల శక్తి) ఉండాలి. దాని ప్రమాణం వేరు. దేవికి భౌతిక అంశం ఉంది . ఆమె మీకు చెంప ఛెళ్ళుమనిపించవచ్చు. ఆమె మీకు ఆనందాన్ని కలిగించే పనులూ అనేకం చెయ్యవచ్చు... వాటితోపాటు చెంపలు వాయించినా వాయించవచ్చు.  అవును. నేను చెబుతున్నాను వినండి.  మీ చెంపమీద 50 వేళ్ళ అచ్చులు పడ్డా ఆశ్చర్యపోవద్దు. కనుక, దేవి మీకు కనిపించినట్టేనా? ఆమె నిజంగా ప్రత్యక్షమవుతుంది. ఆమె భౌతికంగా కనిపిస్తుందా? తప్పకుండా.  నాకు సంబంధించినంతవరకు, నాకు ఆమె సజీవ మూర్తి. చాలా మందిదీ అదే అనుభూతి.

మీకు మీ గురించిన స్పృహ లేకపోతే, మీరు కానిది ఏదో అది అనుభూతి చెందగలరు.

అయితే దేవిని అనుభూతి చెందాలంటే, నేనేం చెయ్యాలి? మీరు ఏమీ చెయ్యనక్కరలేదు. మీకు మీ గురించిన స్పృహ లేకపోతే, మీరు కానిది ఏదో అది అనుభూతి చెందగలరు. మీకు మీ గురించిన స్పృహ అధికమైతే, అక్కడ మీకు అనుభూతి చెందడానికి ఏదీ ఉండదు. అది ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే అంతే! దేవిని మీరు చూడకుండా తప్పించుకోలేరు. మీకు దృష్టి సవ్యంగా ఉన్నపుడు, నేను పెద్ద అక్షరాలలో... అ ఆ ఇ ఈ ... అని రాస్తే  మీరు చదవగలరు. ఈ క్షణంలో దేవి కూడా అంతే. ఏమీ గ్రహించలేని వారికి కుడా ఆమె దొరుకుతుంది.  అఖండ భైరవి... ఆమెని మీరు చూడకుండా తప్పించుకోలేరు. అది అంత సులభమూ, సరళమూ కాదు.  చాలా మంది తమ శ్వాసే తాము అనుభూతి చెందలేరు. అలాంటి వాళ్ళకి వాళ్ళ గుండె లబ్ డబ్ లబ్ డబ్ మని కొట్టుకుంటే దాన్నే అనుభూతి చెందలేరు; వాళ్ళు ఇంకొకటి ఎలా అనుభూతి చెందగలరు?

తమ గుండె కొట్టుకోవడం అనుభూతి చెందని వాళ్ళున్నారు, వాళ్ళ శ్వాసని అనుభూతి చెందలేనివాళ్ళున్నారు, పున్నమి చంద్రుణ్ణి చూడని వాళ్ళున్నారు. ఒక దోమ కుడితే, గుండే కొట్టుకుంటుంటే, కనీసం తమ శ్వాసనైనా అనుభూతి చెందలేని వాళ్ళు, తాము భుజించిన ఆహారం ఎలా తమ శరీరంలో ప్రవర్తిస్తుందో తెలియని వాళ్ళు, దేవిని ఎలా గుర్తించగలుగుతారు?  వాళ్ళ ముఖం మీద 50 చేతివేళ్ళ ముద్రలు పడవలసిందే. మీకు కావాలంటే ఆ పనికూడ చెయ్యగలం.  నేను హాస్యానికి చెప్పడం లేదు.  మేము ఆ పని చెయ్యగలం, కాని అది చాలా బాధ కలిగిస్తుంది. కొందరి జీవితాల్లో భైరవి వల్ల కొన్ని చిత్రమైన సంఘటనలు జరిగాయి. బహుశా, అవి వాళ్ళు బయటకి చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు. కనుక వాటిని అంతటితో విడిచిపెడుతున్నాను.  కానీ అటువంటి విషయాలు కొన్ని జరిగాయన్నది సత్యం.  చాలా మంది మనుషులతో వచ్చిన చిక్కేమిటంటే, వాళ్ళు అప్పటికే ఏదో ఊహించుకోవడం మొదలుపెడతారు.

మీరు ఏదీ ఊహించుకోవద్దు. అనుభూతికి ఆలోచన మంచిదికాదు.  అనుభూతికి ఆలోచన ప్రత్యామ్నాయం అని మీరు భావిస్తే, దానికంటే తెలివితక్కువగా బ్రతకడం మరొకటి ఉండదు. ఆలోచన కొంతకాలమే ఆనందాన్నిస్తుంది. అది నియంత్రణ దాటిపోతే మీకు ఏమీ పాలుపోదు. అనుభవం అలా కాదు. అనుభవం జీవితాన్ని మారుస్తుంది. ఆలోచనతో మీరు స్వర్గానికి రెండు నిమిషాలలో వెళ్ళి రాగలరు. కానీ మీరు ఉన్నచోటనే ఉంటారు. మీరు వెనుదిరిగి వచ్చినందుకు కొంచెం విచారం వేస్తుంది.  కాని జీవితంలో చెందిన నిజమైన అనుభూతి అటువంటిది కాదు. ఇది భౌతికంగా అనుభూతి చెందడం. అది సుసాధ్యం.

భక్తి

మీరు ఆమెగురించి పాటలు పాడుతున్నారనో, ఆమెపట్ల భక్తి కలిగి ఉన్నారనో ఆమె మీకు ప్రత్యక్షమవదు. ఆమె ఎప్పుడూ అక్కడే ఉంటుంది. కేవలం భక్తిద్వారా మిమ్మల్ని మీరు పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. భక్తి ఇనుమడిస్తున్నకొద్దీ, మీరెవరు అన్న ప్రధాన్యత క్రమంగా కోల్పోతుంది. మీకు భక్తి ఉందాలేదా అన్నది ఆమెకు అవసరం లేదు. ఆమెకు మీ భక్తితో సంబంధం లేదు. మీ భక్తికి మీతో ప్రమేయం ఉంది. మీరు భక్తిలో పూర్తిగా లీనమైతే, మీ అస్తిత్వం మిగలదు. "మీది" అన్నది ఏదీ మిగలనప్పుడు, ఆమె ప్రాభాతకిరణమంత స్పష్టంగా, సత్యంగా కనిపిస్తుంది. మీరు అనుభూతి చెందడానికి కావలసిందల్లా, మీరు శూన్యంగా ఉండగలగాలి.  మీరు ఎంత శూన్యస్థితిలో ఉంటే, మీ అనుభవం అంత బలంగా ఉంటుంది.

మీ భక్తి దేవి కోసం కాదు. మీ భక్తి మిమ్మల్ని మీరు తన్మయత్వంలో మరిచిపోడానికి.

మీ భక్తి దేవి కోసం కాదు. మీ భక్తి మిమ్మల్ని మీరు తన్మయత్వంలో మరిచిపోడానికి. కానీ, ఆమె లేకుండా మీరు భక్తులు కాలేరు.  మీకు ఒక ఆశ్రయం కావాలి. మీరు భక్తులు కావడానికి ఒక దేవుడో, దేవతో కావాలి. కనుక ఆమెని మీరు వినియోగించుకుంటున్నారు. మీరు ఎవరితోనైనా ప్రేమలో పడినపుడు, ఏ వస్తువునైనా  కాంక్షించినపుడు ఇలాగే ఉంటుంది.  మీరు ఒక మేఘాన్ని చూసినా, "ఆహా. ఆ మేఘం భైరవిలా ఉంది"  అంటారు; ఒక రాయిని చూస్తే, " అది భైరవిలా  లేదూ?" అంటారు; శివభక్తులు, వాళ్లకి మీరు ఏది చూపించినా, " అది అచ్చం శివలింగంలా ఉంది" అంటారు.  "అదిగో ఆ మబ్బు కనిపిస్తోందా. అది శివలింగంలా ఉంది. అలా అనిపించడం లేదూ? కనిపించడం లేదూ?" అని అడుగుతారు.  అది మీకు తెలివితక్కువదనంగా కనిపించవచ్చు. అది ఒక స్థాయిలో తెలివితక్కువే. కానీ అదొక అద్భుతమైన సాధనం.  మీరు ప్రతిదాంట్లోనూ అది చూడగలిగినపుడు, మీకు మీరు ఎందులోనూ కనిపించరు.

మీరేమిటో అన్న స్పృహని తగ్గించుకునేందుకు ఇదొక బలమైన సాధనం. ఎందుకంటే, మీకు ఈ ప్రపంచం గురించి ఉన్న స్పృహ అంతా, మీకు మీగురించి ఉన్న స్పృహే. ఈ విషయం అర్థం చేసుకొండి. ఈ ప్రపంచం గురించి మీకున్న అనుభవమంతా, మీ గురించి మీకున్న అనుభవమే. అంతా మీలో ప్రతిఫలించినదే. మీకు సంబంధించినంతవరకు, మీరు ఉన్నారు గనుక మీకు ఈ ప్రపంచం ఉంది.  మీ అస్తిత్వం కారణంగా, మీకీ ప్రపంచం అంతా ఉన్నట్తు కనిపిస్తుంది. ఈ స్థితిలో మీకు భక్తీ ఉండదు, ఏ అనుభూతీ ఉండదు.  మీరు ప్రపంచంలో చూస్తున్నదంతా మీ మనసు మీకు విశదీకరిస్తున్నదే. అది మీ మనసులో ప్రతిబింబించేదే. అది కాదు ప్రపంచం.  అది కాదు సృష్టి. అతను కాదు సృష్టికర్త. అపరిమిత స్థాయిలో ఉన్న ఈ "నేను" ను ధ్వంసం చెయ్యాలి.  అప్పుడు భైరవి అన్నిచోటుల్లో కనిపిస్తుంది. కొంత సేపు గడిచిన తర్వాత, ప్రతీది అలాగే ఉంటుంది.  మీరు ఒక ఆకుని చూస్తే, "ఓహ్. ఇది భైరవిలా ఉంది," అనుకుంటారు. ఒక పువ్వును చూస్తే అది భైరవిలా ఉందనుకుంటారు. ఈ విషయం మీరెవరితోనూ చెప్పక్కర్లేదు. మీమట్టుకు మీరే అనుకోండి.  కాలక్రమంలో మీరెవరన్నది మాయమైపోతుంది.

కాబట్టి  - ఇది తెలివితక్కువ కాదూ? ఒక ఆలోచన సరిగా పనిచేస్తున్నపుడు దాన్ని తెలివితక్కువ అంటారా? మేలైనదంటారా? అది పనిచేస్తోంది. అది చాలు. అన్ని సాధనాలూ ఉపయోగించాలి తప్ప, విశ్లేషించకూడదు. అవి విశ్లేషణకోసం కాదు ఉన్నది, వినియోగానికి.  మీరు దాన్ని ఉపయోగిస్తే పనిచేస్తుంది. దాన్ని విశ్లేషిస్తే అందులో ఏముంటుంది? మిమ్మల్ని నేను ముక్కముక్కలు చెసి చూస్తే, అందులో చూడ్డానికేముంటుంది? అందులో ఏమీ ఉండదు. అవునా?

ప్రేమాశిస్సులతో,
సద్గురు