అంతుచిక్కని చుక్కలరేడు
ArticleNov 18, 2016
ఈ వారం సద్గురు నవంబరు 14 న భూమికి అతిచేరువగా వచ్చి దర్శనమిచ్చిన Super Moon మీద తన తాజా కవిత "అంతుచిక్కని చుక్కలరేడు"ని పంపారు. మన భూమికి ఉన్న ఒకే ఒక ఉపగ్రహమైన చంద్రుడు 1948 తర్వాత ఇంతదగ్గరగా రాలేదు. " నీ వెన్నెల వెలుగులందించిన బలంతో నా కన్నులు నా లోని చీకటిని కనుగొన్నప్పుడు, భ్రాంతిమదమైన నీ ఆకారములోని మార్పుల వెనుక రహస్యాలను నేను చేదించగలుగుతున్నాను." అంటారు.
అంతుచిక్కని చుక్కలరేడు
నువ్వొక వెన్నముద్దవన్న
అద్భుత జానపద గాథలను నమ్మాను.
తర్వాత నీమీద ఒక మనిషి కాలిడి
మానవాళి చరిత్రకి మహోన్నత ఖ్యాతి గడించామన్న
వైనాన్నీనమ్మాను.
నీ మారుతున్న జ్యామితిని పరిశీలిస్తూ
ఒంటరిగా గడిపిన ఎన్నో రాత్రులో
నీ తత్త్వమేమిటో
నన్ను రూపుదిద్దడంలో
నీపాత్ర ఏమిటో వితర్కిస్తూ గడిపాను.
నా శరీర నిర్మాణాన్ని
నా అవగాహన పరిధుల్నీ
నేను అర్థం చేసుకుంటుండగానే
వెలుతురు కల్పించిన భ్రమలో
చిక్కుకున్న నా కళ్ళకి అందకుండా
నీ ఆకారాన్ని మార్చుకున్నావు.
నీ వెన్నెల వెలుగులందించిన బలంతో
నా కన్నులు నా లోని చీకట్లు కనుగొన్న పిదపే
భ్రాంతిమదమైన నీ ఆకారములోని మార్పుల వెనుక
రహస్యాలను నేను చేధించగలుగుతున్నాను.
నువ్వు కేవలం కాంతిని ప్రతిఫలిస్తున్నా
నీకు ఉమ్మనీటిని ప్రభావితం చేయగల శక్తితో
నా పుట్టుకను నిర్వహించావు. నాకు తెలుసు.
నా మరణంలో కూడా నీ ప్రభావం ఉంటుంది.
నా జ్ఞానపరిధిని నిర్ణయిస్తూ
అటూ ఇటూ తిరుగాడే
నియంత్రణ కవాటానివి నువ్వు