ఆత్మజ్ఞానం పొందడం ఎంతో తేలికని సద్గురు చెబుతున్నారు. మనం చేయవలసిందల్లా అది ఎక్కడో లేదు మనలోని ఉందని తెలుసుకొని అంతరంగంలో చూడడమే అని అంటున్నారు.

ఇప్పుడు భగవంతుడు దీనిని ఎందుకు ఇంత కష్టంగా చేశాడు అన్నది ప్రశ్న..! నిజానికి భగవంతుడు దీనిని ఏమాత్రం కష్టంగా చేయలేదు. మరోరకంగా చెప్పాలంటే, ఇది కష్టమైనదీ కాదు. మీరు రమణ మహర్షి గురించి విన్నారా..? ఆయన ఏమన్నారంటే “ఆత్మజ్ఞానం అతి సులభం” అని..! అంటే సృష్టిలో ఉన్న అన్నింటిలోకీ ఆత్మజ్ఞానం తేలికైనది అని..! అది నిజానికి అంత తేలికైనది కూడా..! ఇది కేవలం మీరు ఒకే సమయంలో సుముఖంగానూ విముఖంగానూ ఉండడంవల్ల ఇలా జరుగుతోంది. ఈ సంఘర్షణ అన్నది మీది..! ఇది కష్టమైనది కాదు. మీలో ఉన్నదానిని అనుభూతి చెందడానికి మీరు ఏ కష్టమైన పనులు చెయ్యాలి..? కాని మీరు ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నారు. మీరు ఈ ప్రక్క గదికి వెళ్లాలంటే, మీకు ఈ బిల్డింగ్ గురించి కొంత తెలిస్తే, మీరు ఇలా తిరిగి అలా వెళ్లిపోతారు. అదే,  మీకు ఈ బిల్డింగ్ ఎలా కట్టారో తెలియకపోతే మొత్తం ఇలా చుట్టూ తిరిగి వస్తారు. ఆ విధంగా కూడా ఆ గదిని చేరుకోవచ్చు. కాకపోతే ప్రపంచం అంతా చుట్టూ తిరిగిరావలసి ఉంటుంది. ఇది కూడా ఒక విధంగా ప్రయాణం చెయ్యడమే. కానీ ప్రపంచాన్ని అంతా చుట్టి రావడం అనేది ఒక మూర్ఖమైన పని. అవునా..? కాదా..? మీరు ఇలా ప్రపంచాన్ని అంతా చుట్టి రావాలి అనుకుంటే, ఎన్నో ప్రమాదాలు మీకు మధ్యలో ఆటంకం కలిగించవచ్చు.

మీరు ఏదో ఒక రోజున ఇటువంటి ఎరుకను తెచ్చుకొని, ఒక్కసారి వెనుదిరుగుతారని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఇది ఎంతో సరళం, ఎంతో తేలిక..!

ఒకానొక సమయంలో యూరప్ లో కొన్ని వేలమంది ప్రజలు, ఇండియాను కనుగొనాలని బయలుదేరారు. చాలామంది మార్గమధ్యంలోనే రాలిపోయారు. వారు సముద్రంలో మునిగిపోయారు. కేవలం ఒక్క వాస్కోడీగామా మాత్రమే రాగలిగారు. ఎవరైతే సముద్రంలో మునిగిపోయారో, మనం వారి గురించి ఎప్పుడూ విననేలేదు. వారి పేర్లు కూడా మనకి తెలియదు. వారు ఎవరు..? ఏమి చేశారు..? ఏమీ మనకు తెలియదు..! కానీ ఎవరైతే వచ్చారో, వారినే మనం ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాం. కానీ ఆ వేల సంఖ్యలో ఉన్నవారు ఎవరైతే సముద్రంలో మునిగిపోయారో, వారు తుడిచిపెట్టుకు పోయారు! అవునా..? కాదా..? అందుకని ఈ ప్రక్క గదికి వెళ్లడానికి ప్రపంచాన్ని అంతా చుట్టి వెళ్లాలనుకుంటే, ఆ గదికి వెళ్లగల అవకాశం ఎంతో తక్కువ. మీరు అక్కడికి వెళ్లలేరని కాదు..! కానీ అందుకు అవకాశం ఎంతో తక్కువ. ఎందుకంటే ప్రయాణం ఎంతో కష్టంగా ఉంటుంది కాబట్టి..! మీరు కూడా ఈ విధంగానే వెళ్లాలనుకుంటున్నారు. కానీ గది ఇక్కడ ఉంది. కేవలం మీరొకసారి వెనుదిరిగారనుకోండి, అంతే!

మీరు ఏమి చెయ్యాలనుకుంటున్నారంటే, ఉదాహరణకి ఇక్కడ మీ ఎదురుగుండా మీ నీడ ఉందనుకోండి. మీరు ఎలా అయినా సరే, దాన్ని దాటి వెళ్లాలనుకొని మొదట త్వరగా నడవడం మొదలు పెడతారు. అప్పుడు మీ నీడ మీకంటే తొందరగా నడుస్తుంది..! ఆ తర్వాత మీరు పరుగెట్టడం మొదలు పెడతారు. ఇప్పుడు మీ నీడ మీకంటే వేగంగా పరుగెడుతుంది..! కానీ మీరు కనుక ఒక్కసారి వెనుదిరిగారనుకోండి, మీ నీడ మీ వెనక్కి వెళ్లిపోతుంది. చెయ్యవలసినదల్లా ఇంతే..! కానీ మీరు అలా తిరగాలనుకోవడం లేదు. మీరు ఇదే త్రోవలో వెళ్లాలనుకుంటున్నారు. ఇది సాధ్యమే..కానీ ప్రపంచాన్నంతా చుట్టిరావలసి ఉంటుంది.

మీరు ఏదో ఒక రోజున ఇటువంటి ఎరుకను తెచ్చుకొని, ఒక్కసారి వెనుదిరుగుతారని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఇది ఎంతో సరళం, ఎంతో తేలిక..!

ప్రేమాశీస్సులతో,
సద్గురు