ప్ర: ఈ రోజుల్లో ఉద్యోగం చెయ్యకుండా ఇంటి పనులు చూసుకుంటున్న స్త్రీలని కొన్నిసార్లు చులకన భావంతో చూస్తున్నారు. చిన్న పిల్లలు ఉన్నారని తెలిసినా ఈ చులకన భావం ఉంటుంది. మనం ఎలా స్పందించాలి?

సద్గురు: సాధారణంగా మనుషులు ఆర్ధిక అవసరాల కోసం పని చేస్తారు. మీకు ఒక విషయంలో అత్యంత అభిరుచి ఉండి ఉద్యోగం చేస్తున్నారంటే అది వేరే విషయం. కానీ చాలా మంది తమ ఆర్ధిక పరిస్థ్తిని మెరుగు పరచుకోవటం కోసం మాత్రమె ఉద్యోగం చేస్తారు. కాబట్టి ఆర్ధిక అవసరాల కోసం స్త్రీలు ఆఫీసునించి కానీ ఇంటి నించి కానీ పని చేస్తున్నారంటే అది మంచి విషయమే. ఇక్కడ ప్రశ్న “స్త్రీలు పని చెయ్యాలా లేదా” అన్నది కాదు. మీకు అటువంటి అవసరం ఉందా లేదా అన్నది అసలైన ప్రశ్న.

మా అమ్మ ఇల్లు వదిలి పని కోసం ఎప్పుడూ బయటకు వెళ్ళలేదు, మా నాన్న కూడా మా అమ్మ పని చెయ్యాలని ఎప్పుడూ అనుకోలేదు. అంటే ఆవిడ దేనికి పనికిరాని మనిషా? ఎంత మాత్రమూ కాదు. ఆవిడే కనక లేకపోతె మేము ఎలా ఉండే వాళ్ళం?

ఆర్ధిక అవసరాల కోసం కాకుండా సామాజిక అవసరాల కోసమే అయితే, స్త్రీలు కచ్చితంగా పని చేయాల్సిన అవసరం నాకు కనబడటం లేదు. ఎంతో సాంకేతికతను సృష్టిస్తున్న కారణమే భవిష్యత్తులో స్త్రీలే కాదు పురుషులు కూడా పని చెయ్యాల్సిన అవసరం లేకుండా చేయడమే. జీవితాన్ని ఒక పెద్ద సెలవులాగా గడిపెయ్యచ్చు! కానీ నిర్బంధంగా పని చెయ్యటానికి అలవాటు పడిన చాలా మంది పని చేస్తూనే ఉంటారు. సమయాన్ని ఎలా గడపాలో వాళ్ళకు తెలియదు. కానీ అది ఎంతో దురదృష్టకరమైన పరిస్థితి. ఇక స్త్రీలు పని చెయ్యటం అన్న విషయానికి వస్తే, ప్రతి స్త్రీ పని చెయ్యాలన్న అభిప్రాయం గత 40 లేక 50 ఏళ్ళల్లోనే వచ్చింది. స్త్రీలు ఆర్ధికంగా పురుషునిపై ఆధారపడటం కారణంగా, స్త్రీలు ఒక రకమైన దోపిడీకి గురవటం వలన ఈ స్థితి ఏర్పడింది. దీనికి ప్రతిక్రియగా, స్త్రీలు, పనిచెయ్యటం ఒక్కటే దీనికి పరిష్కారం అనుకున్నారు. నా ఉద్దేశ్యంలో స్త్రీలు ఇలా దోపిడీకి గురవ్వడమనేది కొన్ని కుటుంబాలలో మాత్రమే ఉంటుంది. చాలా కుటుంబాలలో ఇలా జరగదు. డబ్బు సంపాదిస్తేనే నిజమైన స్త్రీ అన్న అభిప్రాయం పురుషుల మనసు లోనించే వచ్చింది. స్త్రీల స్వాతంత్ర్యం అన్న పేరుతొ స్త్రీలు మగవారి విలువలను అనుకరిస్తున్నారు. ఇది అసలుసిసలైన బానిసత్వం. స్త్రీ స్వతంత్రంగా ఉండదలుచుకుంటే, మగ వారి విలువలని పాటించడం కాదు – తన స్త్రీత్వాన్ని పెంపొందించుకుని ఒక సువాసనలు వెదజల్లే పువ్వులా ఈ ప్రపంచంలో ఎలా వికసించగలదో చూడాలి. ఇది స్త్రీ మాత్రమే చెయ్యగలదు.

మీ శ్రేయస్సును అధిగమించి జీవితాన్ని చూడటం

నా సొంత అనుభవం ఇలా ఉంది. మా అమ్మ ఇల్లు వదిలి పని కోసం ఎప్పుడూ బయటకు వెళ్ళలేదు, మా నాన్న కూడా మా అమ్మ పని చెయ్యాలని ఎప్పుడూ అనుకోలేదు. అంటే ఆవిడ దేనికి పనికిరాని మనిషా? ఎంత మాత్రమూ కాదు. ఆవిడే కనక లేకపోతె మేము ఎలా ఉండే వాళ్ళం? ఆవిడకి ఉన్న ఆ అంకిత భావం, నిస్వార్ధంగా పిల్లల కోసం, భర్త కోసం తనను తాను పూర్తిగా సమర్పించుకోవటం వల్లనే మేము జీవితంలో ఇంత పైకి ఎదగగలిగాము. మీ శ్రేయస్సు కన్నా మీతో ఉన్నవారి శ్రేయస్సు ముఖ్యం అనుకోవటం, వారి బాగోగులని గురించి ప్రేమ, మార్దవంతో పట్టించుకోవటం, ఒక గాఢమైన అనుబంధంతో వారికి కావలసినదల్లా చెయ్యటం మా అమ్మ సాంగత్యం వల్ల మా రక్తంలో జీర్ణించుకుపోయింది. తన బాగోగులని గురించి ఎప్పుడూ మా అమ్మ ఆలోచించలేదు. మా అమ్మ ఎంతో ఆనందంగా రాత్రింబవళ్ళు తన కుటుంబానికి సేవ చేసింది. అది బానిసత్వం కాదు. ఈ పని ఎంతో నిస్వార్థ ప్రేమతో చేసింది. మీరు ఆవిడకి మిమ్మల్ని అందరూ దురుపయోగం చేసుకుంటున్నారు అని చెబితే, ఆవిడ దాన్ని అవమానంగా తీసుకుంటుంది ఎందుకంటే ఆమె చేస్తున్నది అంత ప్రేమానుభూతితో కూడుకున్నది.

మీరు డబ్బులు సంపాదించినంత మాత్రాన ప్రపంచం అందంగా మారిపోదు. అది ఒక మనిషి జీవితమే కానివ్వండి, కుటుంబమే కానివ్వండి, సమాజమే కానివ్వండి, లేక ప్రపంచమే కానివ్వండి – అది రమణీయంగా ఉండటానికి కారణం కొంతమంది ప్రేమతో ప్రజలకు ఏదో చేయాలని తమ శ్రేయస్సును పక్కన పెట్టి ముందుకు వస్తారు. అది ఈ ప్రపంచాన్ని ఇంత అందంగా తీర్చుదిద్దుతుంది.

కుటుంబం ప్రపంచంలో ఒక విడదీయలేని అతి చిన్న భాగం. ఈ ప్రేమ పూరితమైన వ్యవహారం ఒక కుటుంబంలో లేకపోతే ఈ ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు. ఒక బిడ్డ ఇలాంటి ప్రేమపూరితమైన, అంకిత భావం ఉన్న వాతావరణంలో పెరగకపోతే, పెద్దైన తర్వాత అది జరగదు.

భిన్నాభిప్రాయాలతో వ్యత్యాసంగా ఉండటం

అంటే స్త్రీ ఉద్యోగం కోసం బయటకు వెళితే ఈ ప్రేమ, అనురాగాలు, అంకిత భావం రావని కాదు. ఉద్యోగం చెయ్యటం ముఖ్యమైతే, దాని గురించి ఏదో ఒకటి చెయ్యాలి. మళ్ళీ మా అమ్మను ఉదాహరణగా తీసుకుంటే, ఆవిడ ఉద్యోగం చెయ్యటానికి బయటకు వెళ్ళలేదు. కానీ ఇంట్లో చేయ్యగల్గినవన్నీ ఇంట్లో చెయ్యటం మూలాన బయటి కొట్లల్లో కొనాల్సిన అవసరం ఉండేది కాదు.

నా చిన్నప్పటినించి నేను కుటుంబం నించి వేరయ్యేంత వరకూ నేను కొంచమైనా ఎంబ్రాయిడరీ లేని దిండు మీద ఎప్పుడూ పడుకోలేదు. మా అమ్మ నేను పడుకునే ప్రతి దిండు మీదా ఎంబ్రాయిడరీ - ఒక చిన్న చిలక బొమ్మో, ఒక చిన్న పువ్వు బొమ్మో ఉండేలా చూసింది. అలా కాకపోతే నా జీవితం మరో మాదిరిగా ఉండేది. ఆమె ఏదైనా కొట్టులో కొని ఉండవచ్చు. మా తండ్రి గారు ఆ ఖర్చు భరించగలరు. కానీ అమ్మ తన చేతులతో ఆ ఎంబ్రాయిడరీ వేస్తేనే ఆవిడకి తృప్తిగా ఉండేది. తన ప్రేమ చూపించటానికి ఇదో విధానం. మీరు డబ్బులు సంపాదించినా సరే, మిగిల్చినా సరే అది కుటుంబానికి మీ వంతు చేసే సహాయం. కాబట్టి ప్రతి స్త్రీ ఏ రీతిలో నిర్వహణ చేస్తుందనేది ఆమె మీద ఆధారపడి ఉంటుంది. అంతే కానీ ప్రతి స్త్రీ తప్పనిసరిగా పని చెయ్యాలని కానీ చెయ్యకూడదని కానీ ఎవ్వరూ తత్వాభొదలుప్రతిపాదించకూడదు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు