సద్గురు:ప్రజలతో నాకు ఉన్న ఏకైక సమస్య ఏమిటంటే, వారికి అవసరమైన తీక్షణత లేకపోవడం. వారు గనుక తగినంత తీక్షణతతో ఉంటే, మనం పరమోత్తమమైన దాని కోసం ఒక జీవితకాలం పాటూ కృషి చేయాల్సిన అవసరం ఉండేది కాదు - ఈ రోజే, పనిని పూర్తి చేయవచ్చు. చాలా మంది మనుషుల జీవితాలలో, మరణించే క్షణం లేదా మరణం సంభవించే అవకాశం ఉన్న క్షణం అనేది అత్యంత తీక్షణమైన అనుభవం. చాలామంది వారి జీవితం మొత్తంలో ఆ స్థాయి తీక్షణతను అసలు తాకే ఉండరు. వారి ప్రేమలో, వారి నవ్వులో, వారి ఆనందంలో, వారి పారవశ్యంలో, వారి కష్టాలలో - ఎక్కడా కూడా, వారు ఆ స్థాయి తీవ్రతను తాకరు - కేవలం మరణంలో మాత్రమే ఆ తీవ్రతను పొందుతారు.

అందువల్ల, శివుడు వెళ్లి దహన వాటికలో లేదా ‘కాయాంత స్థానంలో’ కూర్చుని ఉన్నాడు. ‘కాయం’ అంటే “శరీరం,” అంత అంటే “అంతం”. కాయాంత అంటే “శరీరం ముగిసే చోటు” - “జీవం ముగిసే చోటు” కాదు. ఇది కాయాంత మాత్రమే, జీవాంత కాదు. మీరు ఈ గ్రహం మీద నుండి పోగుచేసుకున్నదంతా, మీరు ఇక్కడే వదిలేయాలి. మీరు గనుక, మీకు తెలిసిందంతా మీ శరీరమే, అనే విధంగా జీవించి ఉంటే, మీరు దానిని విడిచిపెట్టాల్సిన క్షణం, మీ జీవితంలోని అత్యంత తీక్షణమైన క్షణం అవుతుంది. శరీరానికి మించి ఉన్నది ఏదైనా మీకు తెలిసి ఉంటే, అప్పుడు దానికి పెద్ద ప్రాముఖ్యత ఉండదు. తను ఎవరో, తన యొక్క స్వభావం ఏమిటో గ్రహించినవారికి, కాయాంత అనేది అంత గొప్ప క్షణమేమీ కాదు. ఇది వారికి కేవలం మరోక క్షణం, అంతే. కానీ, తాము కేవలం భౌతిక శరీరంగా మాత్రమే జీవించిన వారికి, ‘మీరు’ అని మీకు తెలిసిన యావత్తుతో విడిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు, ఇది చాలా తీక్షణమైన క్షణం అవుతుంది.

అమరత్వం అనేది ప్రతి ఒక్కరికీ సహజమైన స్థితి. మరణం అనేది మీరు సృష్టించుకున్న పొరపాటు. ఇది జీవితాన్ని చూసేందుకు సరైన దృక్పథం కాదు. భౌతిక శరీరం విషయానికొస్తే, -కాయాంత – శరీరం అంతం అయ్యే దశకు ఖచ్చితంగా వస్తుంది. కానీ కేవలం శరీరంగా ఉండడం కాకుండా, మీరు ఒక జీవంగా అయితే, మీరు కేవలం ఒక జీవించే శరీరంగా మాత్రమే కాకుండా, జీవిస్తున్న జీవిగా ఉంటే, అప్పుడు అమరత్వం అనేది మీకు ఒక సహజ స్థితి. మీరు మర్త్యులా(mortal) లేక అమరులా అనేది కేవలం గ్రాహ్యతకి సంబంధించిన ప్రశ్న మాత్రమే - అస్తిత్వపరంగా ఎటువంటి మార్పు అవసరం లేదు.

శివుడు, మీతో ఇంకా మీ డ్రామాతో విసుగు చెంది, స్మశానంలో కూర్చుంటాడు. విసుగు ఎందుకంటే, ఊరంతటా జరిగే నాటకం మొత్తం పూర్తిగా అవివేకమైనది. అసలైన విషయం, దహన వాటికలో మాత్రమే జరుగుతుంది.

అందుకే జ్ఞానోదయాన్ని, సాక్షాత్కారం అని పిలుస్తారు, ఒక సాధించిన విషయం అనో, లేదా సంపాదించుకున్న విషయంగానో ప్రస్తావించరు. మీరు చూస్తే, అది మీకు ఉంటుంది. మీరు చూడకపోతే, అది మీకు ఉండదు. అది మీ గ్రాహ్యతకి సంబందించిన ప్రశ్న మాత్రమే - వాస్తవానికీ ఎటువంటి ప్రాథమిక, అస్తిత్వపరమైన మార్పు జరగదు. మీరు సన్నద్ధం కాబడి ఉంటే, ఇంద్రియాలతో కాకుండా, మీ ప్రజ్ఞతో సన్నద్ధం కాబడి ఉంటే, అప్పుడు మీకు శరీరం మాత్రమే కాదు, జీవం కూడా తెలుస్తుంది, ఇక అప్పుడు మీరు సహజంగానే అమరులు. మీరు మీ అమరత్వం కోసం కృషి చేయవలసిన అవసరం లేదు. మీరు ‘ఇది ఉన్నదే ఆ విధంగా’ అని గ్రహిస్తే చాలు.

అందుకని, శివుడు తన నివాసాన్ని కాయంత స్థానానికి లేదా స్మశానానికి మార్చాడు. ‘స్మ’ అనేది శవాన్ని లేదా మృత దేహాన్ని సూచిస్తుంది, ‘శాన’ అనేది, ‘శన్య’ లేదా పడకను సూచిస్తుంది. మృతదేహాలు ఎక్కడ పడుకోబెట్టబడి ఉంటాయో, అక్కడే ఆయన నివసిస్తాడు, ఎందుకంటే ఆయన బతికి ఉన్న వారితో పనిచేయడం అనేది సమయాన్ని వృదా చేసుకోవడమే అని గ్రహించాడు. మీరు అవసరమైన తీక్షణతకు వారిని తీసుకురాలేరు. ప్రజలలో కొంచెం తీక్షణతను తీసుకురావడానికి మీరు ఎన్నో ఉపాయాలు వాడాల్సి ఉంటుంది.

తీక్షణత అనేది తలెత్తదు, ఎందుకంటే మీరు మనుగడ స్వభావాన్ని మీలోని అతిపెద్ద అంశంగా చేశారు. ఈ సజీవ శరీరంలో రెండు ప్రాథమిక శక్తులు ఉంటాయి. ఒకటి మనుగడ ప్రవృత్తి - మరొకటి అపరిమితంగా విస్తరించాలనే కోరిక. మీరు మనుగడ ప్రవృత్తిని శక్తివంతం చేస్తే, అది ఎల్లప్పుడూ తక్కువ స్థాయిలో పనిచేసేందుకు ప్రయత్నిస్తుంది, ఎందుకంటే మనుగడ అంటే సురక్షితంగా ఆడడం. మీరు అపరిమితంగా అవ్వాలనే కోరికను శక్తివంతం చేస్తే, మీరు అపరిమితమైన విస్తరణను కోరుకుంటుంటే, మీ శక్తి అంతా కేంద్రీకృతమయ్యేది దానిపైనే అయితే, అప్పుడు జీవితంలో పూర్తి తీక్షణత ఉంటుంది.

ప్రతి ఇతర జీవిలోనూ మనుగడ ప్రవృత్తి ప్రబలంగా ఉంటుంది. మనం మనుషులుగా మారిన పరిణామ దశలో, మన జీవితాలలో ఉన్నత స్థాయి అవగాహన ఇంకా తెలివితేటలు ప్రవేశించాయి - మనుగడ ప్రవృత్తిని తగ్గించి, విస్తరించాలనే కోరికను రగిలించాల్సిన సమయం ఇది. ఈ రెండు శక్తులలో, ఒకటి ఎల్లప్పుడూ మీలోని తీక్షణతకు ఆజ్యం పోసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడూ మిమ్మల్ని గీత కిందే ఉండేలా చేస్తుంది. మీరు కొరతగా ఉండే వనరులను ఆదా చేసుకోవడమనేది చేయవచ్చు, కానీ జీవానికి కొరత లేదు.

శివుడు, మీతో ఇంకా మీ డ్రామాతో విసుగు చెంది, స్మశానంలో కూర్చుంటాడు. విసుగు ఎందుకంటే, ఊరంతటా జరిగే నాటకం మొత్తం పూర్తిగా అవివేకమైనది. అసలైన విషయం, దహన వాటికలో మాత్రమే జరుగుతుంది. బహుశా పుట్టిన క్షణంలో ఇంకా మరణించిన క్షణంలో కూడా, ఎంతో కొంత అసలైనది జరుగుతుంది. ప్రసూతి అనేది కొంచెం ఎక్కువగా జరుగుతున్నప్పటికీ, ప్రసూతి గృహాలు ఇంకా దహన వాటికలు, ఈ రెండు మాత్రమే సముచితమైన ప్రదేశాలు.

పరిమితంగా ఉండడం తప్పా? కాదు, కానీ పరిమితంగా ఉండటం అనేది బాధాకరంగా ఉంటుంది. బాధలో ఉండటం తప్పా? కాదు. మీకు అది బాగుంటే, నాకు వచ్చిన సమస్య ఏమిటి?

శివుడు, జీవితం అత్యంత అర్థవంతంగా అనిపించే ప్రదేశంలో కూర్చుంటాడు. కానీ మీరు భయపడితే, మీరు మనుగడ లేదా ఆత్మరక్షణ ధోరణిలో ఉంటే, ఇది మీకు అర్ధవంతంగా అనిపించదు. కేవలం మీరు విస్తరించి, అనంతమైన దాన్ని తాకడానికి ఆరాటపడుతున్నప్పుడు మాత్రమే, ఇది మీకు అర్థవంతంగా అనిపిస్తుంది. మనుగడ సాగించాలనుకునే వారిపై ఆయనకు ఆసక్తి లేదు. మనుగడ సాగించడానికి, మీకు నాలుగు అవయవాలూ ఇంకా పనిచేసే మెదడు కణాలు కొన్ని ఉంటే చాలు. వానపాములు, మిడతలు ఇంకా ఇతర జీవులు అన్నీ కూడా - మనుగడ సాగిస్తున్నాయి, బాగానే ఉన్నాయి. మీరు మనుగడ సాగించడానికి అవసరమైనది అంతటి మెదడు మాత్రమే. కాబట్టి, మీరు మనుగడ ధోరణితో ఉన్నట్లయితే, మీలో ఆత్మరక్షణ అనేది అత్యంత ప్రబలంగా ఉన్నట్లయితే, అప్పుడు ఆయన మీతో విసుగు చెందుతాడు - మీరు చనిపోయే వరకు అతను వేచి ఉంటాడు.

ఆయన్ని వినాశకుడు(లయకారుడు) అని పిలిచేది, ఆయన మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నందు వల్ల కాదు. ఆయన దహన వాటికలో వేచి ఉంటాడు - మృతదేహం నాశనమయ్యే దాకా! ఎందుకంటే శరీరం నాశనం అయ్యే వరకు, చుట్టుపక్కల ప్రజలు కూడా మరణం అంటే ఏమిటో గ్రహించరు. తమకి ప్రియమైన వారు ఎవరైనా చనిపోయినప్పుడు, ప్రజలు మృతదేహం మీద పడిపోతారు, దానిని తిరిగి జీవానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ - కౌగిలించుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు - ఎన్నో విషయాలు చేస్తారు. కానీ ఒకసారి మీరు శరీరానికి నిప్పంటించిన తర్వాత, ఎవ్వరూ కూడా వెళ్లి మంటలను కౌగిలించుకోరు. వారి ఆత్మరక్షణ ప్రవృత్తి వారికి, ‘ఇది అసలైనది కాదు’ అని చెబుతుంది.

ఇది తప్పొప్పులకు సంబంధించిన ప్రశ్న కాదు, కానీ ఇది పరిమిత భావనకు ఇంకా పరమోత్తమ భావనకు మధ్య ఉన్న ప్రశ్న. పరిమితంగా ఉండడం తప్పా? కాదు, కానీ పరిమితంగా ఉండటం అనేది బాధాకరంగా ఉంటుంది. బాధలో ఉండటం తప్పా? కాదు. మీకు అది బాగుంటే, నాకు వచ్చిన సమస్య ఏమిటి? నేను దేనికీ వ్యతిరేకం కాదు. నాకు నచ్చని ఒకే ఒక విషయం ఏంటంటే, మీరు ఒక దిశలో వెళ్లాలనుకుంటూ, దానికి వ్యతిరేక దిశలో వెళ్తూ ఉండడం నాకు నచ్చదు.

విచక్షణారాహిత్యం అనేది ఒక్కదాన్నే నేను వ్యతిరేకిస్తున్నాను, ఎందుకంటే మానవ జీవితంలోని ప్రాథమిక విషయం ఇదే, ఇతర ప్రాణులకన్నా మీకు ఎంతో ఎక్కువ విచక్షణ ఉంది - లేదా, మీరు ఇతర ప్రాణులకన్నా ఎక్కువ విచక్షణని కలిగి ఉండాలి. కాని చాలా మంది ప్రజలు దీనిని తప్పని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. సృష్టి అంటే మేధస్సు. సృష్టికర్త అంటే అత్యుత్తమ మేధస్సు. దురదృష్టవశాత్తు, అన్ని రకాల గందరగోళంలో ఉన్న చాలా మంది ప్రజలు, దేవుడి గురించి మాట్లాడుతారు, అలాగే చాలా మంది ప్రజలు గందరగోళంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడి గురించి మాట్లాడుతారు. మీరు ఒక మంచి, వెచ్చని షవర్ కింద ఉంటే, మీరు సినిమా పాట పాడతారు. మేము మిమ్మల్ని చల్లని తీర్థకుండంలోకి పంపితే - “శివ! శివ!” అంటారు. ఇబ్బంది కలిగిన క్షణమే, మీ మనసులోకి శివుడు వస్తాడు. జీవితం మీకు కావలసిన విధంగా సాగుతున్నప్పుడు, మీరు అన్ని రకాల వ్యక్తుల గురించి ఇంకా అన్ని రకాల విషయాల గురించి ఆలోచిస్తారు. మీ తలపై ఎవరైనా తుపాకీ పెడితే - “శివ! శివ! ” అంటారు. పిలవాల్సింది అతనిని కాదు. అతను శ్మశానవాటికలో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరైనా మీ తలపై తుపాకీ పెడితే, మిమ్మల్ని రక్షించడానికి మీరు శివుడిని పిలిస్తే - ఆయన రాడు.

మీరు కేవలం శరీరంగా మాత్రమే కాక, ఒక జీవంగా జీవిస్తున్నట్లైతే, అప్పుడు అమరత్వం అనేది మీ సహజ స్థితి అవుతుంది.

జీవితం గురించి ఏమాత్రం పనిచేయని ఒక విషయం ఏమిటంటే, దాన్ని వెనుకకు నడిపించే ప్రయత్నం చేయడం. మీరు ముందుకు పరిగెత్తితే, మీరు ఏ దిశలో వెళ్ళినా, మీరు ఏమి చేయదలుచుకున్నా - మీరు పాడినా, నృత్యం చేసినా, ధ్యానం చేసినా, ఏడ్చినా, నవ్వినా - అది మిమ్మల్ని ఉన్నత స్థాయి తీక్షణత వైపుకు తీసుకువెళ్తున్నట్లయితే, అది పనిచేస్తుంది. మీరు దాన్ని వెన్నక్కి నడిపించాలని ప్రయత్నిస్తే, అది పనిచేయదు. చాలా మంది మనుషుల విషయంలో, వారు విచారంగా అవ్వడానికి మీరు వారిని ఒక బాకుతో గుచ్చువలసిన అవసరం లేదు. మీరు వారిని ఒంటరిగా వదిలేస్తే చాలు, వారు విచారంగా అయిపోతారు. వారి ఆత్మరక్షణ ప్రవృత్తి సహేతుకమైన పరిమితులను దాటిపోయి, జీవితాన్ని తగ్గించి, దానిని వెనుకకు నడిపించడానికి ప్రయత్నిస్తోంది. దహన వాటికలో కూర్చుని శివుడు ఇచ్చే సందేశం ఇదే: ఆఖరికి మీరు చనిపోయినా సరే, అది పని చేస్తుంది, కానీ మీరు జీవాన్ని తగ్గించాలనుకుంటే, అది పనిచేయదు. మీరు జీవితాన్ని తగ్గిస్తున్నారా, లేదా జీవితాన్ని అనుమతిస్తున్నారా అన్న ప్రశ్న, మీరు ఏం చేస్తున్నారు, ఇంకా ఏం చేయడంలేదు అన్న దానిపై ఆధారపడి ఉండదు, కానీ ప్రస్తుతం ఈ జీవిత ప్రక్రియ ఎంతగా ఉప్పొంగుతూ ఉంది, అలాగే ఎంత తీక్షణంగా ఉంది, అన్నదానిపై అది ఆధారపడి ఉంటుంది.

మీరు చేసేది ఉపయోగకరమైనదా? కాదా? అన్నది కాదు ప్రశ్న. మీరు పనికిరాని విషయాలలో తీక్షణతని తీసుకురాగలిగినా సరే, అప్పుడు కూడా అది పని చేస్తుంది. కానీ, మీకు మీరు చేసే ప్రతి పనీ అర్థవంతమైనదిగా ఉండాలి. అది అర్థవంతం అయితే తప్ప, అది ఉపయోగకరంగా ఉంటే తప్ప, మీరు దానిలోకి నిమగ్నం అవ్వలేరు. ఆ కోణంలో చూసినప్పుడు, సార్ధకత ఇంకా ఉపయోగకరం అనేవి ముఖ్యమైనవి అవుతాయి. లేదంటే, సార్ధకత ఇంకా ఉపయోగకరం అనేవి ప్రాథమికంగా మానసిక పరమైన అంశాలు. అవి ఒక ప్రేరణ మాత్రమే, వాటితోనే ఏదీ అంతిమాన్ని చేరుకోదు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు

Editor's Note: Download Sadhguru's ebook, Shiva - Ultimate Outlaw. The ebook is filled with rich graphics and pearls of wisdom from Sadhguru that reveal many virtually unknown aspects about the being we call Shiva. Encounter Shiva like never before!