Sadhguruనా చిన్నతనంలో మళ్ళాదిహళ్ళి స్వామిగా పేరుపడిన రాఘవేంద్రస్వామి మా తాతగారి ఊరు వస్తుండేవారు. అప్పుడు బహుశా నా వయసు పన్నెండో పదమూడో ఉంటే ఆయనకి ఎనభై ఒక్కటి. అప్పుడు నేను ఎంత ధృఢంగా ఉండేవాడినంటే నేను ఏదైనా ఇట్టే ఎక్కగలిగి ఉండేవాణ్ణి.

మా తాతగారుండే గ్రామంలో, వాళ్ళ పెరడులో పెద్దపెద్ద నూతులుండేవి... ఆరు ఏడు అడుగుల వ్యాసం, 120, 130 అడుగుల లోతూ. నీళ్ళు పైతట్టు నుండి సుమారు 60 అడుగుల లోతు ఉండేవి. మగపిల్లలందరికీ అందులోకి దూకి పైకి రావడం ఒక ఆటగా ఉండేది. దూకడంలో ఏమాత్రం పొరపాటు దొర్లినా రాతిగోడకి తలతగిలితే మనిషి చావడం ఖాయం. పిల్లలెవ్వరూ నూతిలో దూకిన తర్వాత నా అంత వేగంగా బయటకి ఎక్కగలిగేవారు కాదు. కానీ ఒక రోజు, ఈ ఎనభై ఏళ్ళు దాటిన ముసలాయన నా కంటే త్వరగా బయటకి వచ్చేసారు. ఆ వయసులోనూ అంత త్వరగా ఎలా రాగలిగారో తెలుసుకుందామని ఆయన్ని అడిగితే, "రా! నాతో యోగా చేద్దువు గాని," అన్నారు. ఆ సంఘటనే నన్ను ఆయన దగ్గరకి వెళ్ళడానికి పురికొల్పి, సరళమైన యోగా సాధనలు నేర్చుకునేలా చేసింది.

సద్గురు ఙ్ఞానోదయం

నాకు నిజంగా కొండలు, పర్వతాలు అంటే చాలా ఇష్టం. ఇక మైసూరు చాముండి హిల్స్ అయితే నాకు ఎంతో ప్రేమ. ఆ రోజుల్లో మైసూరు నగరంలోని యువకులకు ఒక ఆనవాయితీ ఉండేది, అదేమిటంటే - వారు కొత్తగా మొటార్ సైకిల్ నేర్చుకోవాలంటే చాముండి హిల్స్ కు వెళ్తారు. వారు ప్రేమలో పడితే చాముండి హిల్స్ కు వెళ్తారు. వారు ప్రేమలో విఫలమైతే చాముండి హిల్స్ కు వెళ్తారు. వారు ధ్యానం చేయాలంటే చాముండి హిల్స్ కు వెళ్తారు. మొత్తం మీద వారికేం జరిగినా చాముండి హిల్స్ కు వెళ్తారు . ఏం జరగక పోయినా వారు చాముండి హిల్స్ కు వెళ్తారు. అదొక ఆచారం అయింది.

నేను ఈ ప్రాంతానికి తరచూ వెళ్ళేవాడిని. ఈ ప్రాంతంలో నేను విస్తృతంగా తిరిగాను, బసచేశాను, ధ్యానం చేశాను, ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేశాను. నేను నా వ్యాపార సమావేశాలను కూడా చాముండి హిల్స్ పైనే నిర్వహించేవాడిని. అందుకే ఈ స్థలం నేను ఎక్కువ సమయాన్ని వెచ్చించిన స్థలం అన్నమాట. ఆ రోజుల్లో నా జీవితంలో, నేను రకరకాల వ్యాపార కార్యక్రమాలలో పూర్తిగా మునిగి పోయి ఉన్నప్పుడు, ఒకానొక అద్భుతం నాలో సంభవించింది. ఆ రోజు నాకు ఖచ్చితంగా గుర్తుంది. అది సెప్టెంబర్ 23, 1982. ఆ రోజు నుండి నేను తిరిగి అంతకు మునపటి వ్యక్తిగా ఎప్పుడూ లేను.

ఆ రాయి పై నేను కళ్ళు తెరుచుకునే కూర్చున్నాను. కొన్నినిమిషాల తరువాత నేనెక్కడున్నానో నాకు తెలీలేదు. 

ఆ రోజు మధ్యాహ్నం నాకు రెండు వ్యాపార సమావేశాల మధ్య కొంత ఖాళీ సమయం దొరికింది. అంతే, నేను నా బండిని చాముండి హిల్స్ వైపు నడిపాను. కొండపై బండి నిలిపి ఒక ప్రత్యేకమైన రాయి దగ్గరికి వెళ్ళాను. అది చాలా విశాలమైన రాయి. అదే నేను తరుచుగా కూర్చునే స్థలం. ఆ రాయి పై నేను కళ్ళు తెరుచుకునే కూర్చున్నాను. కొన్నినిమిషాల తరువాత నేనెక్కడున్నానో నాకు తెలీలేదు. ఆ క్షణం వరకూ అందరిలాగే నేను కూడా, ఈ శరీరం ‘‘నేను’’ ఆ శరీరం మరొకరు’’ అనే నమ్మేవాడిని. అయితే అకస్మాత్తుగా కొన్ని నిమిషాలలో ఏది నేనో, ఏది నేను కాదో తెలియలేదు. ‘‘నేను’’ ఏంటో అది ప్రతిచోటావుంది. నేను ఏ రాయి పై అయితే కూర్చున్నానో ఆ రాయి, నేను పీలుస్తున్న గాలి, నా చుట్టూ ఆవరించి వున్న వాతావరణం, ప్రతీదీ , అన్నీ అలా నేను అయిపోయింది.

దీని గురించి నేను ఏం చెప్పినా, అది అర్థం లేని విషయంగా, బుద్దిలేని తనంగా అనిపిస్తుంది. నేనాస్థితిలో 10 లేక 15 నిమిషాలు వున్నా అనుకున్నా. నేను అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు కూర్చున్నాను. కాని నేను, మనం అనుకునే సాధారణ స్థితిలోకి వచ్చినప్పుడు, అప్పుడు సమయం రాత్రి 7.30 నిమిషాలు అయింది. అంటే నాలుగున్నర గంటలు గడిచిపోయాయి. సూర్యుడు అస్తమించాడు. నా కళ్ళు తెరిచే వున్నాయి. నేను పూర్తిగా మేలకువగానే వున్నాను. కానీ సమయం వూరికే జారిపోయింది. అయితే పెద్దవాడిని అయ్యాక మొట్ట మొదటిసారి నా జీవితంలో, నా కళ్ళ వెంట నీరు కారుతోంది. నా ఎనిమిది సంవత్సరాల వయస్సు నుండి, నేను కన్నీళ్ళు అంటే చాలా చిన్నతనంగా భావించే వారిలో ఒకడిని. నేను ఎప్పుడూ నా కంటి నుండి ఒక్క చిన్న నీటి చుక్కను కూడా రానీయలేదు. నేను అలా జీవించాను. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా నా కన్నీళ్ళు ఎంతగా వర్షించాయంటే, నా చొక్కా తడిసిపోయింది.

నేను ఎప్పుడూ చాలా సంతోషంగా, శాంతిగా వుంటూ వచ్చాను. అది ఎప్పుడూ ఒక సమస్యగా లేదు. నేను చేసే ప్రతిదాంట్లో  విజయం సాధిస్తూ వచ్చను. ఎటువంటి సమస్యలూ లేని యువకుడిని. అయితే ప్రస్తుతం, నా శరీరంలోని ప్రతీ అణువు ఒక కొత్త అనిర్వచనీయమైన స్థితిలో, ఒకానొక పారవశ్యంతో ఓలలాడుతోంది. నాకు దాన్నిగురించి చెప్పడానికి వేరే పదాలే దొరకలేదు.నాకు ఏం చెప్పాలో తెలియలేదు. నాలో ఏం జరుగుతోందో నాకే తెలియలేదు. నాకేం జరిగి వుండవచ్చు?’’ అని నన్ను నేను అడిగినప్పుడు, తర్కంలో గట్టి శిక్షణ గలిగిన నా మనస్సు చెప్పగలిగినది ఏంటంటే బహుశా నిన్ను యితరుల నుండి వేరుచేసే ఒకానొక పరికరాన్ని నీవు కోల్పోతున్నావు’’ అని. ఇదే విషయాన్ని నేను నా అత్యంత సన్నిహిత మిత్రులలో ఒకరితో పంచుకుంటే, వాళ్ళు అడిగింది అంతా ఒక్కటే అప్పుడు నీవు ఏదన్నా తాగి వున్నావా? లేక నీవు ఏదయినా మాదక పదార్ధం తీసుకున్నావా?’’ అనే. ఇదే వాళ్ళు నన్ను అడగగలిగింది. నాకు తెలుసు దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు అని. ఎందుకంటే దాన్ని నా చుట్టూ వున్న మరెవరికీ నేను అన్వయించలేక పోయాను. ఏదో అత్యంత అద్వితీయమైన సంఘటన నాలో జరుగుతోంది.

అందుకే నాకు దాన్ని పోల్చేందుకు ఏదీ దొరకలేదు. నాకు తెలిసిందల్లా ఏంటి అంటే, నేను ఒక బంగారు నిక్షేపాన్ని తాకాను. నాలోనే వున్న, పేరు లేని ఒక బంగారు నిక్షేపాన్నుంచి నేను కనీసం ఒక్క క్షణం కూడా దూరం కావడానికి యిష్టపడను. నాకు తెలుసు, ఏదయితే జరుగుతుందో అది పూర్తిగా పిచ్చితనం. కానీ నేను దాన్ని ఒక్క క్షణం కూడా కోల్పోవాలని అనుకోవడం లేదు. ఎందుకంటే అత్యంత అద్భుతమైనది, అనన్యసామాన్యమైనది నాలో సంభవం అవుతోంది.

వెల్లంగిరి పర్వతాలు

నా చిన్నప్పటినుండి నా కళ్ళలో ఎప్పుడూ పర్వతాలు కదలాడుతూ ఉండేవి. నాకు పదహారేళ్ళ వయసులో మిత్రులతో ఈ విషయమై చర్చించినపుడు, "నీకేమైనా పిచ్చా? ఎప్పుడూ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి?" అన్నారు. నాకు అప్పుడు అర్థమయింది నాకు తప్ప ఎవరికీ పర్వతాలు కనిపించడంలేదని. కొన్నాళ్ళ పాటు అవి ఎక్కడున్నాయో ఎలాగైనా కనుక్కోవాలనిపించేది. తర్వాత ఆ ఆలోచన మానుకున్నాను. మీ కళ్ళజోడుమీద ఒక చిన్నచుక్క ఉందనుకొండి, కొంతకాలం అయ్యేసరికి మీరు దానికి అలవాటు పడిపోతారు. ఇది సరిగ్గా అలాంటిదన్నమాట. చాలా కాలం గడిచిన తర్వాత, ధ్యానలింగాన్ని ప్రతిష్ఠించడానికి అనువైన ప్రదేశంకోసం వెదుకుతున్నప్పుడు, తిరిగి వరదలా పాతజ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి, నేను మళ్ళీ నాకళ్ళలో మెదలాడిన ఆ కొండశిఖరం కోసం వెదకసాగాను.

సరిగ్గా అక్కడ ఎదురుగా అదే శిఖరం, చిన్నప్పటినుండి నా కళ్ళలో వెంటాడుతున్నది కనిపించింది. ఆనాటినుండి అది నా కళ్ళల్లో కనపడడం మానేసింది.

నేను తిరగని ప్రదేశం అంటూ లేదు. అన్ని చోట్లా తిరిగాను. గోవా నుండి కన్యాకుమారికి మోటారు సైకిలుమీద కనీసం 4 సార్లు అటూ ఇటూ తిరిగి ఉంటాను. నాకెందుకో ఆ శిఖరాలు పడమటి కనుమల్లోనే ఉండి ఉండాలని అనిపించింది. మట్టిరోడ్డూ, తారురోడ్డన్న తేడా లేకుండా కర్వార్ పర్వతశ్రేణి నుండి కేరళ, కర్ణాటక సరిహద్దువరకు బహుశా కొన్ని వేల కిలోమీటర్లు మోటారు సైకిలు మీద ప్రయాణం చేసి ఉంటాను.
కానీ, ఒక సారి అదృష్టవశాత్తూ కొయంబత్తూరు దాటి దగ్గరలో ఉన్న ఒక పల్లెకు వెళ్ళాను. పల్లంగా ఉన్న ఒక చోట నేను వంపు తిరుగుతుంటే, నాకు వెల్లంగిరి పర్వతాలలోని ఏడవ శిఖరం కనిపించింది. సరిగ్గా అక్కడ ఎదురుగా అదే శిఖరం, చిన్నప్పటినుండి నా కళ్ళలో వెంటాడుతున్నది కనిపించింది. ఆనాటినుండి అది నా కళ్ళల్లో కనపడడం మానేసింది.

ఈ భూతలం మీద "ఏవి అన్నిటికన్నా గొప్ప పర్వతాలు?" అని అడిగితే, నేను "వెల్లంగిరి" పర్వతాలు అని అంటాను. నా దృష్టిలో ఇవి కేవలం పర్వతాలు కావు. నేను పుట్టినప్పటి నుంచి ఈ పర్వతాల ముద్ర నా కళ్లలో మెదులుతూనే ఉంది. అప్పటినుండి నన్ను అవి వెంటాడుతునే ఉన్నాయి. అవి నాలోనే జీవించాయి. అవే నన్ను నడిపించినవీ, నా మార్గదర్శకాలూను. నా దృష్టిలో ఇవి కేవలం రాళ్ళగుట్టలు కావు. నేను ధ్యానలింగాన్ని సృష్టించడానికి నాకు కావాల్సిన అపార సంపద.

ధ్యానలింగం

భారతదేశంలోని కొన్ని దేవాలయాలను మీరు చూడాలి. మీకు ఏ దేవుళ్ల మీదా విశ్వాసం ఉండవలసిన అవసరం లేదు. మీలో కొంచెం స్పందన ఉంటే చాలు, మీరక్కడ కేవలం కూర్చుంటే చాలు. అది మీ అంతరంగంలో నుండే మిమల్ని ఉత్తేజ పరుస్తుంది.c3

ఈశా యోగా సెంటర్లో మీరు వచ్చి ధ్యానలింగంలో కూర్చుంటే చాలు, అది మిమల్ని లోపలినుంచి ఊపివేస్తుంది. ఎందుకంటే, దాన్ని చాలా శక్తిమంతమైన పద్ధతిలో ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ క్రతువులుండవు, అర్చనలుండవు; ఎల్లప్పుడూ సంపూర్ణ నిశ్శబ్దమే. అన్ని మతనేపథ్యాల వారూ ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా ధ్యానలింగంలో కూర్చుంటేచాలు, ధ్యానమంటే తెలియనివారు కూడా గాఢమైన ధ్యానస్థితిని అనుభవిస్తారు. ఈ స్థానాన్ని ఆ విధంగా సృష్టిచడం జరిగింది.

ఒక చుక్క ఆధ్యాత్మికత

ప్రస్తుతం ఈశాలో మేము ‘ఒక చుక్క ఆధ్యాత్మికత’- అనే అతి సాధారణ ప్రక్రియను ఎవరైనా ఎవరికైనా ఎటువంటి ప్రమాదమూ లేకుండా బోధించగలిగే ప్రక్రియను అందిస్తున్నాం. కుల, మత, జాతి, లింగ తదితర ఏ భేదమూ లేకుండా కనీసం ఒక చుక్క ఆధ్యాత్మికత ఐనా ప్రతి వ్యక్తీ పొందడం అన్నదే లక్ష్యం. ఒక్క చుక్క అంటే తేలికగా భావించకండి. ఆ చుక్క అదానికదే ఒక మహాసముద్రం.

ఈశా క్రియ

నేలపై తూర్పు ముఖంగా కూర్చోండి. కాళ్ళు ఒకదానిపై ఒకటి వేసుకుని కళ్ళు మూసుకోండి.

అరచేతులు పైకి ఉండేటట్టు చేతులు బయటకి చాచి తొడలపై ఉంచండి. తలని కొంచెం పైకి లేపి ఉంచండి.

మీ దృష్టిని కనుబొమల మధ్య కొద్దిగా కేంద్రీకరించండి.

ధ్యానం

ఈ ధ్యానం మూడు దశల్లో జరుగుతుంది:

మొదటి దశ:

మెల్లగా ఊపిరి తీసుకుని వదలండి. ఊపిరి తీసుకునే ప్రతిసారీ మనసులో “నేను శరీరాన్ని కాదు” అనుకుంటూ, ఈ ఆలోచన పూర్తయ్యేదాకా శ్వాస తీసుకుంటూ ఉండండి.

ఊపిరి వదిలే ప్రతిసారీ “నేను మనసుని కూడా కాదు” అనుకుంటూ, ఈ ఆలోచన పూర్తయ్యేదాకా శ్వాస వదులుతూ ఉండండి.

ఇలా ఓ 7 నుంచి 11 నిమిషాల దాకా చెయ్యండి.

రెండవ దశ:

నోరు తెరిచి “ఆ…” అన్న శబ్దాన్ని పలకండి. మీ నాభికి కొద్దిగా క్రిందనుండీ ఈ ధ్వని రావాలి. మరీ గట్టిగా ఈ శబ్దాన్ని పలకక్కరలేదు, శబ్ద ప్రకంపనలు మీకు అనుభూతి అయితే చాలు.

ఈ “ఆ…” శబ్దాన్ని 7 సార్లు పలుకుతూ, ప్రతిసారీ పూర్తిగా ఊపిరి వదలండి.

మూడవ దశ:
నిశ్శబ్దంగా 5-6 నిమిషాలు కూర్చోండి. మీ తలని కొంచెం పైకి లేపి, దృష్టిని కనుబొమల మధ్య పూర్తిగా కేంద్రీకరించండి.

మొత్తం సమయం 12 నుండి 18 నిమిషాలు పడుతుంది. కావాలంటే మీరు ఇంకా ఎక్కువ సేపు కూడా కూర్చోవచ్చు.