ప్రశ్న: నేను శరీరాన్ని కాదు, నేను మనసుని కాదు. మరి నేనెవర్ని?


మీరు వీధిలోకి వెళ్లి అక్కడ ఎవరినైనా "మీరెవరు? " అని అడగొచ్చు, కాని మీరు "నేనెవర్ని" అని అడిగితే...? మీరు అలాంటి ప్రశ్న అడగకూడదు. ఈ ప్రశ్న మిమ్మల్ని అంతర్గతంగా వేధించాలి. ఒకసారి ఇలా జరిగింది, ఓసారి సిన్సినటి విమానాశ్రయం లో ఉన్నాం. అక్కడ చాలా మంది ఉన్నారు. ఒకతను మాత్రం క్యు లో నిలబడకుండా పక్క వైపు నుంచి వచ్చి టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఉన్న అధికారిణి "ఎమండీ, ఇక్కడ క్యు ఉంది, దయచేసి లైన్ లో నిలబడండి" అని చెప్పారు. ఆయన "నేను హడావిడిలో ఉన్నాను" అన్నారు. అందరూ తోందరలోనే ఉన్నారు దయచేసి వెళ్లి నిల్చొండి అందావిడ. "మీకు నేనెవరినో తెలుసా?" అన్నారు ఆయన కోపంగా. అప్పుడు ఆవిడ అక్కడ ఉన్న మైక్ తీసుకొని "ఇక్కడ ఒకతనికి తను ఎవరో తెలీదట, దయచేసి ఎవరైనా ఆయనకి సహాయం చేయండి" అని చెప్పారు.

సరే, ఇప్పుడు నేను మీకు "మీరు ఆత్మా, పరమాత్మ, మీరది, ఇది " అని చెప్పాను అనుకోండి. అవి కేవలం మాటలు మాత్రం అవుతాయి అంతే కదా? అంతకు మించి మీ అనుభవంలో ఏముంటుంది? కొంతమందికి ఐదు ఆరు పేర్లు ఉంటాయి చూడండి, ఆ విధంగా మీరు ఆత్మా,పరమాత్మ, ఇంకోటి అని నేను చెప్పాననుకోండి ఎం లాభం. మీరు ఈ పదాలను నేర్చుకోకుండా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు ఏమి తెలియకుండా ఉరికే పదాలు రావడం అన్నది ప్రమాదకరమైనది. ఇదొక ప్రాధమికమైన ప్రశ్న. నేనిక్కడ ఎలా బ్రతుకుతున్నాను? ఈ సృష్టి విధానం ఏంటో తెలీకుండా నేనిక్కడ ఎలా బ్రతుకుతున్నాను? ఇదేమిటో తెలీకుండా ఎవరైనా ఇక్కడ అర్ధవంతంగా బ్రతకగలరా? మీరీ ప్రశ్న అడిగారు అంటే ఇది కేవలం మీ కుతూహలం వలన మాత్రమే కాని, నేను ఏమిటో తెలుసుకోవాలన్న ఆవేదన నుండి రావట్లేదు.

ఒకసారి నాకు మూడున్నర నాలుగేళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా, నాకేమి తెలీదన్న విషయం నేను తెలుసుకున్నాను. అప్పట్లో ఎవరైనా ఒక మంచి నీళ్ళ గ్లాస్ ఇచ్చారనుకోండి, అదంటే ఏంటో నాకు తెలియదు. ఆ నీళ్ళ వంక చుస్తూ అలా గంటలు తరబడి కూర్చుండి పోయేవాడిని. దాన్ని ఎలా వాడుకోవాలో నాకు తెలుసు కాని అదేమిటో నాకు తెలియదు. ఈరోజుకి మీకు నీరు అంటే ఏంటో తెలుసా? చూడండి మీ శరీరంలో మూడు వంతులు నీరే, ఈ భూమి మీద కూడా మూడు వంతులు నీరే ఉంది. మీకు నీరంటే ఏంటో తెలుసా? దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసు. మీకు కనబడని అణువుని కూడా ఎలా వాడుకోవాలో తెలుసు కాని అసలు అదంటే ఏంటో మీకు తెలుసా? సరే, నేను అలా నీటిని చూస్తూ ఐదు ఆరు గంటలు అక్కడే కళ్ళు అలా అప్పగించి చూస్తూ ఉండిపోయేవాడిని.

నేను వాళ్ళ గురించి మొత్తం తెలుసుకోగాలిగేవాడిని. వాళ్ళ భవిష్యత్తు , వర్తమానం అన్నీ, కాని వాళ్ళు చెప్పేవి మాత్రం ఒక్క ముక్కకూడా అర్ధం చేసుకునేవాడిని కాదు. 

మా నాన్నగారు వైద్యులు కావడం వల్ల నా ప్రవర్తన చూసి నేను మానసిక వైద్యుడిని కలవడం అవసరం అని అనుకునేవారు. నా సమస్యేంటంటే నేనొక వస్తువుని చూసాననుకోండి నాకు అదేమిటో తెలియదు, అదేమిటో తెలీకుండా వేరే దాని పట్ల నా ధ్యాస ఎలా మళ్ళించగలను. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను బడికి పంపించారు, మా అమ్మ "నువ్వు టీచర్ ఎం చెబితే అది వినాలి, ఆవిడ పట్ల ధ్యాస పెట్టాలి అని చెప్పారు". సరే, నేను టిచర్ మీద ధ్యాస పెట్టడం మొదలుపెట్టాను. ఎంత ధ్యాస పెట్టానంటే వాళ్ళ పైన అంత ధ్యాస ఎవరూ పెట్టుండరు. వాళ్ళు ఎమి చెప్తున్నారో శ్రద్ధగా విన్నాను, కొంత కాలానికి అర్ధం చేసుకున్నదేమిటంటే వారు ఒక రకమైన శబ్దాన్ని మాత్రమే చేస్తున్నారు, దానికి సంబంధించిన అర్ధాన్ని నేనే కడుతున్నాను అని. ఇది నిజమే కదా? కేవలం శబ్దం మాత్రమే చేస్తున్నారు, కాని దాని అర్ధం మీరే చేసుకుంటున్నారు కదా? సరే ఈ విషయం నేను తెలుసుకున్నాను. వాళ్ళు ధ్వని మాత్రమె చేస్తున్నారు నేనే అర్ధాన్ని కల్పించుకుంటున్నాను అని తెలిసిన తరువాత నేను ఆ అర్ధాల్ని తీసుకోవడం మానేసాను. ఇక అప్పుడు రకరకాల ధ్వనులు ఒకదాని తరవాత ఒకటి వస్తున్నట్టు అనిపించేది.

ఇది నాకు చాల ఆశ్చర్యకరంగా అనిపించేది, నేను వాళ్ళ గురించి మొత్తం తెలుసుకోగాలిగేవాడిని. వాళ్ళ భవిష్యత్తు , వర్తమానం అన్నీ, కాని వాళ్ళు చెప్పేవి మాత్రం ఒక్క ముక్కకూడా అర్ధం చేసుకునేవాడిని కాదు. పరీక్షల్లో కూడా ఎప్పుడూ ఖాళీ కాగితం ఇచ్చేసేవాడిని.
నాలుగున్నర సంవత్సరాల క్రితం ఈ స్కూల్ వాళ్ళు నన్ను వాళ్ళ వార్షికోత్సవానికి ఆహ్వానించడానికి వచ్చారు. వారితో నేను "నేనెందుకు,నేను అంత మంచి విద్యార్ధిగా కాదు కాదా, అసలు కనీసం ఓ సామాన్య విద్యార్ధిగా కూడా ఉండేవాణ్ణి కాదు కదా?" అన్నాను. "లేదు లేదు మా స్కూల్ నుండి కేంద్ర మంత్రులు ఉన్నారు, క్రికెట్ స్టార్ లు ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు కాని మీరొక్కరే మర్మజ్నులున్నారు, అందుకే మీరు రావాలి" అన్నారు. సరే, నేను వెళ్ళాను, వెళ్లి అక్కడ చూస్తే, ఆ స్కూల్ భవనం అప్పట్లో ఎలా ఉండేదో ఇంకా అలానే ఉంది.

నాకు సుమారు పన్నెండేళ్ళ వయసు ఉన్న తరుణం లో నేను అంతగా మాట్లాడే వాణ్ణి కాదు. ఒకరోజు ఒక టీచర్ నన్ను ఎదో మాట్లాడించాలని ఒక ముప్పై నలభై నిముషాలు ప్రయత్నం చేసారు . కాని నేనేమి మాట్లాడలేదు. ఆయన నా దగ్గరకు వచ్చి భుజం పట్టి అలా ఊపుతూ, "నువ్వు దేవుడి వైనా అయ్యుండాలి, లేదా దయ్యానివైనా అయ్యుండాలి. నువ్వు రెండోది అయ్యి ఉంటావని నేను అనుకుంటున్నాను" అని అన్నారు. ఆయన నన్ను అవమాన పరిచారని నాకేమి అనిపించలేదు, కాకపోతే అప్పటివరకు నాకు ఇదేమిటి( ఆయన )? అదేమిటి ( వెరేవన్నీ)? ఇలాంటి ప్రశ్నలుండేవి. కాని ఒకటి స్పష్టంగా ఉండేది, ఇది నేను అని. ఈయన ఇలా అనేసరికి అసలు నేనేమిటి అన్న ప్రశ్న మొదలయ్యింది. నేను ఇంతకి దేవుడినా..? దయ్యాన్నా..? అని.

 మీరు మీ జ్ఞానేంద్రియాలతో తెలుసుకునే వాటికంటే, అనుభవ పూర్వకంగా తెలుసుకోవలసింది ఎంతో ఉంది.

ఈ ప్రశ్న వచ్చిన తరువాత నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను. అలా జరుగుతున్నా సమయంలో నేను ఒకసారి 20-25నిముషాలు కూర్చున్నాననుకున్నాను. కాని నేను కళ్ళు తెరిచేసరికే నా చుట్టూరా చాలా మంది జనం. ఒకరికి వాళ్ళ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు అవుతుందో, ఇంకొకరు వారి వ్యాపారం ఎలా ఉంటుందీ అని తెలుసుకోవాలని ఎగబడ్డారు. అసలు విషయం ఏమిటంటే నేను అలా 13రోజులు కళ్ళు మూసుకొని కూర్చుండిపోయాను. నేను నా కాళ్ళు జాపుకుందామని చూసేసరికే నా మోకాళ్ళు బాగా పట్టేసాయి. నాకసలు సమయం తెలియలేదు, నేనక్కడ 20-30 నిముషాలు కూర్చున్నానుకున్నాను.

ఇది మీతో ఎందుకు చెబుతున్నానంటే మీరు మీ జీవితాన్ని ఎలా అనుభవిస్తున్నారో, ఈ ప్రకృతి మిమ్మల్ని అలా లయబద్ధంగా అట్టిపెట్టింది, కాని మీరు మానవులవ్వడం వల్ల కేవలం మనుగడ కోసం చేసేవే అంతా కాదు అన్న విషయం మీకు తెలుసు. కాని దానికి మించింది ఏదో మీకు తెలియాలి అని అనుకున్నప్పుడు మీ నుంచి కొంత ప్రయత్నం అవసరం. మిమ్మల్ని ఒక అడవిలో వదిలేసామనుకోండి, మీకు మానవులంటే తెలీదు, మీ ఎదురుగా ఏదైనా తినే పదార్ధం వచ్చింది అనుకోండి, ముందు దాన్ని తీసి చెవిలో పెట్టుకుని ఆ తరువాత ఇది కాదు అని నోట్లో పెట్టుకోవడం నేర్చుకున్నారా? కాదు. కేవలం మీరొక్కరే మానవులుగా ఈ ప్రపంచంలో ఉన్నా సరే ఆహారాన్ని నోట్లోనే పెట్టుకోవాలి అన్న విషయం తెలుస్తుంది. కాని ఇప్పుడు మీరు చేస్తున్న ఎన్నో పనులు ఎలా చేయాలో తెలియదు కదా? దీనికోసం ఎంతో కృషి, శ్రమా పెట్టవలసి వచ్చింది. మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు అక్షరాలు రాయలేకపోయేవారు, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని అయినా సరే రాసేయగలరు. ఎందుకంటే దాన్ని ప్రయత్నం చేసి, సాధన చేసి నేర్చుకున్నారు.

మానవ జీవితం ఎప్పుడూ మనుగడ తోనే సంతృప్తి చెందదు. మీరు ప్రయత్నిస్తే మాత్రమే అంతకు మించినదేదో మీకు తెలుస్తుంది. మీరు మీ జ్ఞానేంద్రియాలతో తెలుసుకునే వాటికంటే, అనుభవ పూర్వకంగా తెలుసుకోవలసింది ఎంతో ఉంది. దానికోసం మీరు కనీసం ఒక్కసారైనా మీ భౌతికతను దాటే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మీరు సినిమాకి వెళ్లారనుకోండి, ఆ హీరో మీకోసం నవ్వుతాడు, ఏడుస్తాడు, యుద్ధం ఇంక ఎవేవో అన్నీ చేస్తాడు. మీరు కేవలం అలా ప్రేక్షక పాత్రలో కూర్చుంటారు అంతే. కానీ మీరు జీవితంలో ఈ విధంగా చేయకూడదు, ఒకవేళ మీ జీవితానికి ఇదే ఆఖరి రోజు అనుకోండి, ఎలా ఉండాలి? ఈ రోజు ఎంతో విలువైనదిగా ఉండాలి. ఎప్పుడోకప్పుడు ఆ రోజు రానే వస్తుంది కదా అందుకని ఆ రోజు వచ్చేలోపు కనీసం మీరేమిటి అన్నది మీకు తెలియాలి కదా? నేను ఏ రకమైన పురాణాలు కాని వేదాలు కాని చదవలేదు, ఏ రకమైన బోధనలు తెలుసుకోలేదు. కాకపోతే ఇది ఏమిటి (అయన్ని చూపిస్తూ) అన్నది తెలుసుకున్నాను, ఇదేమిటో మీరు తెలుసుకోవాలంటే మీరింకా ఎన్నో వేల జన్మలు ఎత్తినా సరే ఈ సృష్టి అనేది ఇంకా ఎంతో ఉంది. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన దానికంటే ఎంతో కొంత అవతల ఉన్న విషయం కూడా తెలియాలి. ఇదే నా ఆకాంక్ష, నా ఆశీర్వాదం కూడా.

ప్రేమాశీస్సులతో,
సద్గురు