ప్రశ్న: తప్పు తనదైనా గానీ మా బాస్ అసలు నామాట వినడు. తప్పు ఒప్పు కోవడానికి ఆయన అహం అడ్డుపడుతున్నట్లుంది. నేనేం చేయాలి?

సద్గురు: ఆధ్యాత్మికత అంటే, బాహ్య పరిస్థితులను మీకు కావలసిన విధంగా మలచు కోవడానికి ముందు, మీ అంతరంగాన్ని కావలసిన విధంగా తీర్చి  దిద్దుకోవటమే. మీ అంతరంగాన్ని ఏవిధంగా ఉంచుకోవాలను కుంటున్నారు?సంతోషంగానా? దైన్యంగానా? సంతోషంగా ఉండాలనే, అవునా? ముందు ఈ పరిస్థితిని కల్పించుకోండి, ఎందుకంటే అంతరంగంలో ఈ పరిస్థితిని కల్పించుకోవడానికి కావలసినది ‘మీరు’ అనే ముదిపదార్ధం మాత్రమే. బాహ్య పరిస్థితులు మీకు కావలసిన విధంగా చేసుకోవాలంటే దానికి అనేకం అవుసరం అవుతాయి, అవన్నీ ఏప్పటికీ పూర్తిగా మీ అధీనంలోకి తెచ్చుకోలేరు. ఎప్పుడైనా బాహ్య పరిస్థితులను కొంతవరకే మీ అధీనంలోకి వస్తాయి, పూర్తిగా ఎన్నటికీ రావు. అంతరంగంలో ఈ పరిస్థితిని కల్పించుకోడానికి కావలసినది ‘మీరు’ అనే ముడిపదార్ధ మొక్కటే కాబట్టి,  మీరు ఈ ఒక్కదాన్ని కూడా మీ అధీనంలోకి తెచ్చుకోలేకపోతే, ఒకవేళ మిమ్మల్ని బాస్‌గా చేస్తే బాహ్యంగా అనేక పరిస్థితులను మీరు ఎలా అజమాయిషీ  చేయగలరు? అందుకే  ముందు మీ అంతరంగాన్ని అదుపులోకి తెచ్చుకోండి ఆ తరువాత మీకు చేతనైనంత శ్రమించి బాహ్య పరిస్ఠితులలో మీ ఆవశ్యకత ఎంతో విలువైనదిగా ఉండేటట్లుచేసుకోండి.

వాస్తవంలో ఉండండి

మీరు ఒక పరిశ్రమని నడుపుతున్నా, కుటుంబాన్ని నడుపుతున్నా, మీకు ఏదైనా పని పూర్తవ్వాలంటే లేదా మీ పక్కవారిలోని ఉత్తమ సామర్ధ్యాన్ని బయటకి తీయాలంటే, వారు మిమ్మల్నిఎదో విధంగా ప్రేమించాలి. కానీ వారు మీతో ప్రేమలో పడే ముందు, వారు ఎలాంటి వారు అన్న దానితో సంబంధం లేకుండా, మీరు వారితో ప్రేమలో పడాలి. అప్పుడే వారు మిమ్మల్ని ప్రేమించి , మీ కోసం వారు చేయగలిగినంత చేస్తారు. వాస్తవ స్వభావం ఇప్పుడు ఎలా ఉందంటే నాకు ఇతనంటే ఇష్టం లేదు, ఇతని గుడ్లు పీకేయాలనిపిస్తోంది - అనుకుంటున్నారు. కానీ, మీకు తెలియకుండానే అతను ఏ శ్వాసనైతే వదిలేస్తున్నాడో దానిని మీరు పీలుస్తున్నారు. ఏది మీరు వదిలేస్తున్నారో దానిని అతడు పీలుస్తున్నాడు. ఇందులో ఏమీ సమస్య లేదు. మీరు మీ అత్తగారు వదిలేసిన శ్వాస, మీ శత్రువు వదిలేసిన శ్వాస, మీ బాస్ వదిలేసిన శ్వాస, ఇవి మీకు నచ్చినా నచ్చకపోయినా శ్వాసిస్తున్నారు కదూ..?  అవునా..? ఒక పాకిస్తానీ శ్వాసను వదిలేస్తున్నాడనుకోండి దానిని మీరు శ్వాసగా తీసుకుంటున్నారు.  అలాగే, మీరు వదిలేసే శ్వాస వాళ్ళూ లోపలికి తీసుకుంటున్నారు. ఇది గాలి ఎటువైపు వీస్తోంది అనే దానిని బట్టి ఆధారపడి ఉంటుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు