కృతజ్ఞతాభావం అంటే ఏంటి? మీరు మీ కళ్ళను  బాగా తెరిచి  మీ చుట్టుపక్కల ఉన్న జీవితాన్ని చూస్తే, మీ జీవితంలో మిగతావాటి ప్రమేయాన్ని మీరు స్పష్టంగా చూస్తే, కృతజ్ఞతాభావం కలగకుండా మానదు. మీ ఎదురుగా పళ్ళెం నిండా ఆహారం ఉందనుకుందాం. ఆ ఆహారం మీ పళ్ళెంలో ఉండడానికి ఎంతమంది పని చేసుంటారో మీకు తెలుసా ? విత్తనాలు నాటిన రైతు దగ్గరి నుండీ, ఆ భూమి మీద జరిగే ఎన్నో ఘటనలు దాకా, అలాగే కోత కోసేవాడు, దాన్ని అమ్మేవాడు, షాప్ కు తెచ్చేవాడు, దాన్ని అక్కడి నుంచీ కొనేవాడు, ఇలా దీనిలో ఎంతమంది ప్రమేయం ఉందో చూడండి.

మీరు మీ కళ్ళను  బాగా తెరిచి  మీ చుట్టుపక్కల ఉన్న జీవితాన్ని చూస్తే, మీ జీవితంలో మిగతావాటి ప్రమేయాన్ని మీరు స్పష్టంగా చూస్తే, కృతజ్ఞతాభావం కలగకుండా మానదు

‘ నేను దీనికి డబ్బు చెల్లించాను కదా! కాబట్టి, నాకది వచ్చి తీరాల్సిందే’ అని కాకుండా, మీ శ్వాస మొదలుకొని ఆహారం వరకూ, మీ జీవితంలో మీరు ఆస్వాదించే, అనుభూతి చెందే ప్రతీ విషయాన్నీ ఈ విధంగా చూడండి. ఈ మొత్తం వరుస క్రమంలో మనుషులు లేకపోయినా 'లేదా' ఉన్నవాళ్ళు చేయాల్సింది చేయకపోయినా, మీరు ఎంత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా, మీకు ఈ వస్తువులు దొరకవు. మీరు కళ్ళు తెరిచి, ఈ గ్రహం, ఈ గ్రహానికి అవతల ఉన్న ప్రతీ ప్రాణి మిమ్మల్ని ఎలా పోషిస్తోందో, మీకు ఎలా సాయపడుతోందో చూడండి. ఇదంతా మీరు చూడగలిగితే, అప్పుడు కృతజ్ఞతాభావాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉండదు. కృతజ్ఞత తెచ్చిపెట్టుకునే ఒక గుణం కాదు. మీకు ఇవ్వబడుతున్న వాటన్నిటినీ చూసి మీరు తబ్బిబ్బైనప్పుడు, మీ నుంచి పెల్లుబుకే భావనే కృతజ్ఞత. అది తెచ్చిపెట్టుకునే గుణమైతే, ఘోరంగా ఉంటుంది. కృతజ్ఞతంటే కేవలం “థాంక్యూ, థాంక్యూ” అని చెప్పడం కాదు. ప్రస్తుతం మీరు జీవించి ఉండటానికీ, క్షేమంగా ఉండటానికి సృష్టిలో ఉన్న ప్రతిదీ తోడ్పడుతున్నాయి. మీరు వాటిని కేవలం ఒక్కసారి గమనించినా, ఆ మనుషల మీదా, ఆ వస్తువుల మీదా కృతజ్ఞతా భావం ఉప్పొంగక మానదు. మీకు వారితో ఎటువంటి సంబంధం లేకపోయినా, మీకు వారు తెలియక పోయినా మీ జీవితంలోని ప్రతి క్షణం వారు మీకు అన్నీ అందిచ్చారు.

కృతజ్ఞత తెచ్చిపెట్టుకునే ఒక గుణం కాదు. మీకు ఇవ్వబడుతున్న వాటన్నిటినీ చూసి మీరు తబ్బిబ్బైనప్పుడు, మీ నుంచి పెల్లుబుకే భావనే కృతజ్ఞత

కాబట్టి, మీరు కళ్ళు తెరిచి మీ చుట్టూ ఉన్న జీవితం ఎలా జరుగుతోందో చూస్తే, మీరు కృతజ్ఞతా భావంతో ఉండకుండా ఎలా ఉంటారు? మీరు మరీ గర్వంతో జీవిస్తూ, ఈ భూమికే రాజునని అనుకుంటే, మీరు ప్రతీదీ కోల్పోతారు. మీరు పూర్తిగా మీ ఆలోచనలలోనే మునిగిపోయి ఉంటే, మీరు మొత్తం జీవన ప్రక్రియనే కోల్పోతారు. అలా కాకుండా, మీరు ఊరికే అలా చూడగలిగితే, కృతజ్ఞతతో ఉప్పొంగిపోతారు. మీరు కృతజ్ఞతతో ఉంటే, మీరు స్వీకరించడానికీ సిద్ధంగా ఉంటారు. మీకు ఎవరిపట్లైనా కృతజ్ఞతా భావం ఉంటే, మీరు వాళ్ళని గౌరవంగా చూస్తారు. మీరు దేన్నైనా గౌరవంగా చూస్తే, మీరు చాలా స్వీకారభావంతో ఉంటారు. మొత్తం యోగా ప్రక్రియ ఉద్దేశ్యమంతా మిమ్మల్ని మీకు కూడా తెలియని ఎన్నో రీతులలో లోతుగా, లోలోతుగా స్వీకారభావంతో ఉండేలా చేయడమే. అదే దాని లక్ష్యం. కాబట్టి, కృతజ్ఞతతో ఉప్పొంగిపోవడం స్వీకార భావంతో ఉండడానికి ఒక మనోహర మార్గం. అది మిమ్మల్ని కొంతవరకు సుముఖంగా ఉంచుతుంది.

మొత్తం యోగా ప్రక్రియ ఉద్దేశ్యమంతా మిమ్మల్ని మీకు కూడా తెలియని ఎన్నో రీతులలో లోతుగా, లోలోతుగా స్వీకారభావంతో ఉండేలా చేయడమే

ఎదో ఒకటి ఇవ్వాలంటే, దాన్ని స్వీకరించడానికి ఎవరో ఒకరు ఉండాలి. ఈ సృష్టిలోని ప్రతీ ఒక్కరూ, ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరూ సంపూర్ణంగా స్వీకారభావంతో ఉంటే, ఒకే ఒక్క క్షణంలో నేను ఈ మొత్తం ప్రపంచానికంతటికీ ముక్తి కలిగించగలను. మా పనిలో అతి క్లిష్టమైన అంశం మనుషుల్ని స్వీకారభావంతో ఉండేలా చేయడమే. వాళ్ళు వారి స్వీకారభావాన్ని పెంపొందించుకుంటే, వాళ్ళకేం కావాలో ఇవ్వడం చాలా సులభం. ఒకతనికి ఆకలిగా ఉంటే, వారిని తినేలా చేయడం కష్టమా ? ఎలాంటి శ్రమా అవసరం లేదు. కానీ అతనిలో ఆకలి పుట్టించాలంటే, అది కష్టమైన పనే!

ప్రేమాశీస్సులతో,
సద్గురు