Sadhguruమీరు ఇంతవరకు జీవితంలో పడిన శ్రమ అంతా ఒక్కదాని గురించే. మీరు మంచి ఉద్యోగం కోసం వెతికినా, వ్యాపారం ప్రారంభించినా, డబ్బు సంపాదించినా, పెళ్లిచేసుకున్నా, వీటన్నిటి వెనకా ఉన్న ఒకే ఒక్క కోరిక: "ఆనందం". కానీ, ఈ ప్రయత్నంలో ఎక్కడో ఒకచోట జీవితం సంక్లిష్టమైపొయింది.

ఈ భూమి మీద మీరు, మరే ఇతర ప్రాణిగా పుట్టినా, జీవితం ఎంతో సరళంగా ఉండేది. మీ అవసరాలన్నీ శారీరకమై ఉండేవి. కడుపు నిండితే ఆ రోజు గొప్పరోజు అని లెక్క. మీరు మీ పెంపుడు కుక్కనుగాని, పిల్లిని గాని గమనించండి. ఆ పూటకి వాటి కడుపు నిండితే చాలు, అవి ప్రశాంతంగా ఉంటాయి. కానీ, మీరు మనిషిగా ఈ భూమ్మిద పడిన తర్వాత, అన్ని విషయాలూ మారిపోతాయి. కడుపు ఖాళీగా ఉంటే ఒకే సమస్య: ఆకలి.  కడుపు నిండితే? వంద సమస్యలు. మన మనుగడే ప్రశ్నార్థకమైనపుడు మన జీవితాల్లో అదే పెద్ద సమస్య. ఒకసారి ఆ అవసరం తీరితే, అది పెద్ద విషయమేమీ కానట్టనిపిస్తుంది. మనిషికి అతని మనుగడకు అవసరమైనవి సమకూరడంతో జీవితం ముగిసిపోదు, జీవితం అక్కడి నుండే మొదలవుతుంది. అసలు దానితోనే ప్రారంభమవుతుంది.

ఒక వంద సంవత్సరాల క్రిందట రాజులకీ మహరాజులకీ కూడా దొరకని వస్తువులు ఇపుడు సామాన్యునికి అందుబాటులో ఉన్నాయి.

ఈ రోజుల్లో, అంటే మన తరంలో, మన ముందర తరాల వారికంటే, మన మనుగడకు అవసరమైనవన్నీ ఒక పద్ధతి ప్రకారం నడిచిపోతున్నాయి. మీరిపుడు సూపరు మార్కెట్ కు వెళ్ళి ఒక సంవత్సరానికి కావలసిన వస్తువులన్నీ కొనుక్కోగలరు. అది మీరు గడపదాటి బయటకి కాలు పెట్టకుండా కూడా చేసుకోగలరు. మానవ జీవిత చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఇలా సాధ్యపడలేదు. ఒక వంద సంవత్సరాల క్రిందట రాజులకీ మహరాజులకీ కూడా దొరకని వస్తువులు ఇపుడు సామాన్యునికి అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రహం మీద జీవించిన మనుషులందరిలోకీ మన తరమే ఎంతో సుఖమైన జీవితం గడపగలుగుతున్నది. కానీ, మనం ఇప్పటివరకు జీవించిన వాళ్ళలో, ఎక్కువ ఆనందంగా ఉన్నవాళ్ళమూ, జీవితాన్ని ఎక్కువగా జీవించిన వాళ్ళమూ, ఎక్కువ ప్రశాంతతగలిగిన వాళ్ళము  మాత్రం కాదు.

ఇలా ఎందుకు జరుగుతోంది? మన చుట్టురా ఉన్న వాటిల్లో లోపాలనన్నిటినీ సరిదిద్దగలిగాము. ఇక ఏమాత్రం చక్కదిద్దినా ఈ భూమి మిగలదు అన్నంతగా.  కానీ  వెయ్యి సంవత్సరాల క్రిందటి మన పూర్వీకులకన్నా మనం ఏమంత ఎక్కువ ఆనందంగా లేము. ఇవేవీ జరగటం లేదంటే, ఎక్కడ పొరపాటు ఉందో అని వెనుతిరిగి చూసుకోవలసిన సమయం కదా? మనం వేసుకున్న ప్రణాళికలు మనల్ని గమ్యానికి చేర్చకపోయినా, వాటినే అంటి పెట్టుకుని ఎన్నాళ్ళు వేళాడతాం?

ఇది మనలో సమూలమైన మార్పులను తీసుకురావలసిన సమయం.

శ్రేయస్సు అంటే ఏంటి? అది ఎలా చేకూరుతుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు