ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఒక్కొక్కరు ఒక్కోలా అనుకుంటారు. చాలామంది, ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే - ఎప్పుడూ ప్రేమగా ఉండడం, నవ్వుతూ ఉండడం, నెమ్మదిగా నడుచుకోవడం అనుకుంటారు. మరికొంతమంది, ఆధ్యాత్మికత అంటే, ఒక రకమైన వైకల్యం అనుకుంటారు. మరొక సాధారణ నమ్మకం ఏంటంటే , ఆధ్యాత్మికత అంటే మంచిగా ప్రవర్తించడం అని. ఇంకొంతమంది ఆధ్యాత్మికత అంటే తీవ్రమైన పనులు చేయడం - హుక్కా పీల్చడం, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం, బాధ్యతారహితంగా ఉండడం అనుకుంటారు. ఇంకొంతమందేమో, ఆధ్యాత్మికులుగా మారడమంటే - ఆనందంగా, ప్రశాంతంగా లేదా పారవశ్యంగా ఉండడానికి ప్రయత్నించడం అనుకుంటారు. ఆధ్యాత్మికులుగా ఉండడం అంటే ఇవేవీ కాదు. ఆధ్యాత్మికులుగా ఉండడం అంటే, ఒక విధంగా, మరింతగా అంతర్ముఖులు అవ్వడం, శరీరంతో ఉన్న గుర్తింపుని తగ్గించుకోవడం. 

మీరు అంతర్ముఖులు కాకుండా అడ్డుపడుతున్న ఒక ఆటంకాన్ని గుర్తించండి.

ప్రస్తుతం, ఉండనీకుండా మీకు అడ్డుపడుతున్న కొన్ని ఆటంకాలు ఉండి ఉండవచ్చు. మీ వైకల్యం ఏంటో మీకు తెలియాలి. అది, మీ చుట్టూ ఉన్న జీవం పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా, అతి మంచిగా ప్రవర్తిస్తుండడం కావచ్చు. లేదా, మీరు మీ లోపల, లేదా బయట ఉన్న జీవం గురించి పట్టించుకోనంత వెర్రి వారిగా ఉండడం కావచ్చు. లేదా, ఏదీ మిమ్మల్ని కదిలించలేదన్నంతగా, మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండడం కావచ్చు. మిమ్మల్ని మరింత ఆధ్యాత్మికులుగా మారనీకుండా, ఈ మార్గంలో మిమ్మల్ని సాఫీగా, సులభంగా నడవనీయకుండా మీకు అడ్డుప పడుతున్న ఆ ఒక్క ఆటంకం ఏమిటి? మీరు ఇది చేసి చూడండి: కళ్ళు మూసుకొని, మిమల్ని మీరు పరిశీలించుకోండి, మీ దృష్టిలో ఆధ్యాత్మికత అంటే ఏమిటో, మీకు ఏం జరిగితే మీరు ఇంకొంచం ఆధ్యాత్మికంగా మారుతారో; మీలోని జీవానికి మరింతగా స్పందిచగలుగుతారో చూడండి. మీరు అంతర్ముఖులు కాకుండా అడ్డుపడుతున్న ఒక ఆటంకాన్ని గుర్తించండి. మీరు స్పష్టంగా ఆ ఒక్కటి గుర్తించగలిగితే, దాన్ని మీకోసం నేను సరిచేస్తాను.

సాధారణంగా ఎదురయ్యే కొన్ని ఆటంకాలను చూద్దాం.

శరీరం బిగుసుగా ఉన్నట్లయితే, మీరు ఉదయాన్నే హఠ యోగా చేసి, దాన్ని సరిచేయవచ్చు. ఈ శరీరం, వాడే కొద్దీ మెరుగుపడేటటువంటి సాధనం. శరీరంలో బిగుసు ఇంకా ఘర్షణ ఉన్నాయంటే, ఒక విధంగా రిగార్ మోర్టిస్ వస్తున్నట్టే - అంటే నెమ్మదిగా కండరాలు బిగుసుకుపోతున్నాయని అర్థం. హఠ యోగా చేయడం ద్వారా అలా జరగకుండా అడ్డుకోవచ్చు. మీరు ఇక్కడ పూర్తి జీవంతో ఉండాలి. పూర్తి జీవంతో ఉండాలంటే శరీరం  బిగుసుకుపోకుండా చుసుకోవడం చాలా ముఖ్యం. మీ శరీరం, మనసు ఇంకా ప్రాణశక్తులు వీలైనంత తక్కువ బిగుసుగా ఉండాలి. అప్పుడే మీరు జీవితాన్ని మరింత లోతుగా తెలుసుకోగలరు.

చాలా మంది సాధన చేయాలనుకుంటారు, కానీ బద్ధకంతో చెయ్యకుండా ఉండిపోతారు. ప్రతి ఒక్కరికి ఒకే స్థాయి తీక్షణత ఉండకపోవచ్చు, కానీ సాధన మాత్రం కొనసాగాలి. మీరు ఇలా నియమం పెట్టుకోండి: శాంభవి చేయకుంటే - తిండి లేదు. ఇది కఠినం అనుకోకండి. యోగ మార్గంలో, ఎంతో మంది, ఇంతకంటే ఎన్నో తీవ్రమైన పనులు చేశారు. రోజుకు ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేయాలనుకునే యోగులు, మెలకువగా ఉండడానికి తేళ్లతో కుట్టించుకునేవాళ్ళు; లేదా అదే ప్రభావం కోసం వేలిని కోసుకుని దానిపై నిమ్మకాయ పెట్టుకునేవారు. మీరు చెయ్యల్సింది, కేవలం 21 నిమిషాల శాంభవి మాత్రమే. కనీసం ఆ మాత్రం నిబద్ధతైనా మీకు ఉండాలి. ఇది ఆధ్యాత్మికత గురించి ఆలోచించడం లేదా మాట్లాడటం కాదు. ఇది ఆధ్యాత్మికతను ఆచరించడం, ఆధ్యాత్మికంగా జీవించడం గురించి.

ఈ శరీరం, వాడే కొద్దీ మెరుగుపడేటటువంటి సాధనం.

మీకు శారీరక ఇబ్బందులు ఉంటే, మీరు ఇంకొంచం కృషి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే, శరీరం సమస్యగా మారితే, జీవితంలో మీ దృష్టంతా దానికే సరిపోతుంది. ఉదాహరణకి, మీకు ఊపిరాడకుండా చేసే ఆస్తమా వచ్చిందనుకోండి; కేవలం ఊపిరి పీల్చుకోవడం తప్ప, మరేదీ మీకు ముఖ్యం అవ్వదు. ఇదే ఎటువంటి నొప్పికైనా, లేదా వ్యాధికైనా వర్తిస్తుంది. శరీరాన్ని సరిగ్గా చూసుకోకపోతే, అది మీ దృష్టి మొత్తాన్ని ఆకర్షిస్తుంది. మీకు ఉన్నదంతా మీ శరీరాన్ని చూసుకోవడానికే సరిపోతుంది. శరీర స్వభావమే అది. దానిని చక్కగా ఉంచుకోవడమంటే, అందం గురించో లేదా మరొకరిని ఆకర్షించడానికో కాదు, మీ జీవితంలో మీ శరీరం ఒక అడ్డంకిగా మారకుండా ఉండేలా చూసుకోవడం గురించి. శరీరం మీకొక సోపానంలా ఉండాలి. శరీరం అడ్డంకిగా మారితే, దాన్ని అధిగమించడం చాలా కష్టం. అయినప్పటికీ మీరు ఆధ్యాత్మికంగా ఉండచ్చు, కానీ దానికి చాలా కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే, ఎప్పటికైనా శరీరం మీకు ఇబ్బంది కలిగిస్తుందని మీరు తెలుసుకునప్పుడు సహజంగానే శరీరాన్ని అధిగమించాలనే కోరిక బలపడుతుంది.

మీ మనసు కూడా ఒక ప్రధాన ఆటంకం అయి ఉండొచ్చు. పరిణామ ప్రక్రియ జరగడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. అయితే కోతి నుండి మనిషిగా మారడం మాత్రం చాలా త్వరగా జరిగిపోయింది. శరీరానికి సంబంధించినంత వరకు, చింపాంజీ డీఎన్‌ఏకు, మనిషి డీఎన్‌ఏకు తేడా కేవలం 1.23 శాతం మాత్రమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ మేధస్సు ఇంకా అవగాహన పరంగా, మానవులకు, చింపాంజీలకు, పోల్చుకోలేనంత వ్యత్యాసం ఉంది. మనకు ఇప్పటికీ, ఈ స్థాయి మేధస్సు అనేది కొత్త విషయమే. సమస్య ఏమిటంటే, మీ మేధస్సుకు తగినంత స్థిరమైన పునాది మీ వద్ద లేదు. అందుకే యోగా. మీ మేధస్సు మీకు కావలసిన విధంగా పని చేసేలా, స్థిరమైన పునాదిని నిర్మించడం కోసమే యోగ. మీ చేయి మీరు వెళ్లాలనుకున్న చోటికి వెళ్లినప్పుడు మాత్రమే అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అలానే, మీ మనస్సు కూడా మీరు కోరుకున్న చోటికి వెళ్ళినప్పుడు మాత్రమే అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అది ఎక్కడికి బడితే అక్కడికి వెళ్తుంటే, అదొక అక్కర్లేని గోల అవుతుంది.

మీ కర్మ కూడా మీకు ఒక ఆటంకం కావచ్చు. కర్మ అంటే దానికదే జరిగిపోయేది కాదు. కర్మ అంటే మీ జీవితాన్ని మీ చేతిలోకి తీసుకోవడం. మీ జీవితానికి మీరే సృష్టికర్త అని మీరు గ్రహించినప్పుడు, మీ విధిని మీ చేతుల్లోకి తీసుకుంటారు. అలా చేశాక కూడా, సామర్ధ్యం లేకపోవడం అనేది సమస్య కావచ్చు , ఈ విషయంలో, నేను మీకు సహాయం చేస్తాను. నేను ఉన్నది అందుకే. కానీ మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోకపోతే, నేనెందుకు నా చేతుల్లోకి తీసుకుంటాను? అలా తీసుకున్నా, అది పని చెయ్యదు. మీరు దానిని మీ చేతుల్లోకి తీసుకున్నాక కూడా, మీరు చేయాల్సింది చేయలేకపోతే, అప్పుడు నేను కల్పించుకుని మీ కోసం ఏదైనా చేయగలను.

ఇక చాలా మంది, ఎవరైనా వారిని వాడుకుంటారేమోననే భయంతో, ఎప్పుడూ వారిని వారు కాపాడుకునే ప్రయత్నంలో ఉంటారు. వారిని వాడుకోనివ్వండి. నా చుట్టూ కొందరు సలహాదారులుంటారు - వారు ఎప్పుడూ, నన్ను ఎవరైనా ఉపయోగించుకుంటారు లేదా ఏమైనా చేస్తారని జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఉంటారు. నేనేమో, "నన్ను ఉపయోగించుకోనివ్వండి. నేను ఇక్కడ ఉన్నది అందుకే. దాని గురించి బాధపడకండి", అని చెప్తూ ఉంటాను. జీవితానికి పెద్ద 'యెస్' చెప్పండి. 'నో' చెప్పడం వల్ల కోల్పోతారు కానీ, 'యెస్' చెప్పడం వల్ల మీరు ఏమి కోల్పోరు.. 'నో' చెప్పడం అనేది తలుపుని మూసెయ్యడం లాంటిది. ఏ కారణం వల్ల అయినా సరే, తలుపు మూసేయకండి. ఇది చాలా చిన్న జీవితం. తలుపులు మూసి తెరిచేంత సమయం లేదు.

ఇది ఆధ్యాత్మికత గురించి ఆలోచించడం లేదా మాట్లాడటం కాదు. ఇది ఆధ్యాత్మికతను ఆచరించడం, ఇంకా ఆధ్యాత్మికంగా జీవించడం గురించి.

కేవలం ఒక్క శరీరానికి మాత్రమే రక్షణ అవసరం. అలాగే కొన్ని సార్లు, కొన్ని విషయాలు సాధ్యపడవు. ఇవి మినహా, మిగతా అన్నిటికీ మీరు  'యెస్' అనే చెప్పాలి. ఈ విశ్వంలో, ప్రతీ పరమాణువూ, మీకు ఒక అవకాశమే.  'యెస్' అంటే నా ఉద్దేశం, మీ వైఖరిలో అని కాదు, ఈ ఉనికి యొక్క ప్రతిబింబంగా మీరు 'యెస్' చెప్పాలి. ఉనికి ఎల్లప్పుడూ అంగీకారంతోనే ఉంటుంది. మీరు కూడా అందులో ఒక భాగమేనని అర్ధం చేసుకున్నప్పుడు మీరు కూడా అన్నిటికీ 'యెస్' గా మారతారు. మీరు పీల్చుకునే గాలి మీకు 'నో' చెప్తే, మీరు బ్రతకలేరు. మీ శరీరంలోకి వెళ్ళే ఆహరం మీకు 'నో' చెప్తే, మీరు బ్రతకలేరు. ఈ విశ్వమే మీకు 'యెస్' చెబుతోంది. అలాంటప్పుడు మీరు మాత్రం ఎందుకు - ‘యెస్’ చెప్పాలా, ‘నో’ చెప్పాలా అని లెక్కలు వేస్తున్నారు? జీవితానికి వంద శాతం 'యెస్' చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.

కొంతమందికి, ఎవరైనా తమ గురించి చెడుగా అనుకుంటారేమో లేదా ఎగతాళి చేస్తారేమో అనే భయం ఉంటుంది. ముందుగా అసలు ఇతరులకు మీ పనుల మీద అంత ఆసక్తి ఉంటుందా? అలాగే వారికి మీ గురించి నిర్ధారణలు చేస్తూ కూర్చునేంత సమయం ఉంటుందా? ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారోనని బాధపడకండి. వారి మనసులో ఏం జరిగినా, అది వారి సమస్య.  మీ మనసు ఎలా ఉందనే దానిపై శ్రద్ధ వహించాలి. ఇది మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ఇతరుల మనసులో ఏముందనే దాని గురించి మీరు చింతించకండి. ఇతరులు ఏమనుకుంటున్నారోనని ఆలోచించడం మొదలు పెడితే, మీకు పిచ్చెక్కుతుంది. ఎందుకంటే, అదంతా కేవలం మీలో జరిగే ఊహ మాత్రమే. మీకు ఏదైనా ఉత్తమమైనదని అనిపిస్తే, ఇతరులు ఏమనుకున్నా సరే, అది చేసేయండి. ఎవరైనా మిమ్మల్ని చూసి నవ్వితే, మీరూ వారితో కలిసి నవ్వండి. ఒకవేళ మీరేదైనా తప్పు చేస్తుంటే, మీరు అలా చెయ్యకుండా వారు సహాయ పడతారు. కానీ ఏదేమైనప్పటికీ, చాలా మంది మీ గురించి అసలు ఆలోచించరు. వారి పనుల్లో వారు బిజీగా ఉంటారు.

అన్నిటికీ మించి, మీరొక స్థిరమైన పునాదిని ఏర్పరుచుకోవాలి. జీవితంలో, సమతుల్యంగా ఉండడం చాలా ముఖ్యం. సమతుల్యత లేకపోతే, మీ శరీరం ఇంకా మనసు, మీకు వ్యతిరేకంగా పని చేస్తాయి. స్థిరమైన పునాది అంటే, మీ శరీరం ఇంకా మనసు.. మీ సూచనలను పాటించాలి. మీ శరీరంలో సరైన కెమిస్ట్రీ ఉండేలా చేసుకోగలగాలి. ఇది మీ ఆరోగ్యానికి, శ్రేయస్సుకి ఎంతో అవసరం. మీ వ్యవస్థను నిర్వహించుకోగలిగే నైపుణ్యం మీకు ఉండాలి. అందుకోసమే యోగ. వంగడం, లేదా మెలితిరగడం వంటి సులభమైన ప్రక్రియలు మీ కండరాలను సాగదీయడం గురించి కాదు - అవి మీ మూలాన్నే మార్చేస్తాయి. కనీసం ఇరవై ఒక్క నిమిషాల శాంభవితో మొదలు పెట్టండి.. దానితో పాటు యోగ నమస్కారాలు లేదా సూర్య క్రియ కూడా చెయ్యండి. అది మీ వ్యవస్తకి స్థిరత్వాన్ని, సమతుల్యతను తీసుకొస్తుంది. ప్రయాణాన్ని ఆస్వాదించడానికి, సమతుల్యత అవసరం. దానికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

Love & Grace

Shambhavi Mahamudra, a powerful yogic practice offered in Isha’s Inner Engineering programs.