యోగాసనం – అంతః ప్రగతికి సాధనం …!!

 
సాధారణంగా మనకు ఇలాంటి ప్రశ్నలు వస్తూవుంటాయి, "ఈ ఇంద్రియాలను దాటి ఎదగటం చాలా కష్టమైనదా? ఇది సాధించటానికి నేను ఏ హిమాలయాల గుహలోకో వెళ్ళాలా?" అని....
అస్సలు అవసరం లేదు అనేదే దీనికి సమాధానం. వారి జీవితంలో కొన్ని నిముషాలు వినియోగించటానికి ఇష్టపడిన వారెవరైనా దీనిని తెలుసుకోవడం ఆరంభించవచ్చు. ఈ అవకాశం ఎక్కడో హిమాలయ పర్వతాలలో కూర్చుని లేదు, అది మీలోనే ఉంది. మీలో ఉన్నదే మీకు అందుబాటులోలేదు.
మీరు పనిలో ఉండటం వల్ల కానీ లేక బయట జరిగేదానితోనే మీరు చిక్కుకుపోయి ఉండటంవల్లకానీ మీరు ఎప్పుడూ అంతర్ముఖంగా ధ్యాస పెట్టలేదు. మీ మనసులో జరుగుతున్నది కూడా బయట జరిగేదాని ప్రతిబింబమే, అంటే ఇంకో మాటగా చెప్పాలంటే, మీరు అంతర్ముఖంగా అసలు  ధ్యాస పెట్టలేదు. ధ్యాస పెట్టక పోవటం వల్లే చాలా మందికి ఈ అవకాశం లేకుండా పోతోంది.
చాల మంది తమపై తాము కొంచం శ్రద్ధ చూపటం లాంటి చిన్న అలవాట్లు చేసుకుంటే అది వారి జీవిత తత్వాన్నే చాలా విధాలుగా మార్చేస్తుంది. రోజుకి పదిహేను లేదా ఇరవై నిముషాలు ఈ ప్రక్రియ మీద  కాలం వినియోగించడమే దీనికి  కావాల్సింది. మీ పరిమితులను దాటే అనుభవం మీ అంతర్గతం నుంచే వస్తుంది. పరిణామం అనేది మీరు నిజంగా ఇష్టపూర్వకంగా ఉంటేనే జరుగుతుంది; అది లేకపోతే ఈ భూమి మీద ఏ శక్తి మిమ్మల్ని కదిలించలేదు.
పరిణామం అనేది మీరు నిజంగా ఇష్టపూర్వకంగా ఉంటేనే జరుగుతుంది; అది లేకపోతే ఈ భూమి మీద ఏ శక్తి మిమ్మల్ని కదిలించలేదు. 
మీదిగా అనుకునే ప్రతీదాని మీద మీరు ధ్యాస పెట్టి చూడడం మొదలు పెట్టండి: మీ దుస్తులు, మీ మేకప్, మీ జుట్టు, మీ చర్మం, మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు. ఇవేవి మీరు కాదు అని మీరు తెలుసుకోండి. మీరు కాని వాటిని మీరు తగ్గించుకుంటూ పోండి. అసలు వాస్తవం ఏమిటి అనే నిర్ణయానికి మీరు రానక్కర్లేదు. సత్యమనేది ఒక నిర్ణయం కాదు. మీరు చేసుకునే తప్పుడు అభిప్రాయాలను పక్కన పెడితే సత్యం మీ ముందుకు తప్పక వస్తుంది. ఇది మీరు ఒక రాత్రిని అనుభవించే విధంగానే ఉంటుంది: రాత్రి అంటే, సూర్యుడు ఎక్కడికి వెళ్ళలేదు; కేవలం ఈ గ్రహం వేరే వైపుకి చూస్తోంది, అంతే. అలాగే మీరు మీ అంతరాత్మ గురించి ఆలోచిస్తున్నారు , చదువుతున్నారు, మాట్లాడుతున్నారు ఎందుకంటే మీరు వేరే వైపు చూడటంలో మునిగిపోయారు. అంతేగాని నిజంగా ఈ జీవం ఏమిటి అని మీరు తగినంత ధ్యాస పెట్టి చూడలేదు. కావలసింది ఒక నిర్ణయం కాదు, దృష్టి మీలోకి సారించడం. అప్పుడు అంతా తెలుసుకోవడం తేలికవుతుంది.
మీ ఎరుకలో అన్నింటినీ ఒక్కటిగా అనుభూతి చెందితే అప్పుడు మీరు యోగాలో ఉన్నట్లు. మీలో ఇటువంటి అనుభూతిని, ఐక్యతను సాధించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మీ శరీరంతో మొదలుపెట్టి, మీ శ్వాసతో, తరువాత మీ మనస్సుతో, ఆపై మీ అంతరాత్మపైనే చేయవచ్చు. ఇలా ఎన్నో మార్గాలు సృష్టించబడ్డాయి, కానీ అవన్నీ యోగలోని వివిధ దశలు మాత్రమే. ఇవ్వన్నీ కూడా జాగ్రత్తగా, సమతుల్యంతో ఒక్కసారే, ఒకే భాగంగా పరిగణన చేయటం ముఖ్యం. నిజంగా ఏ తేడాలు లేవు, మీరుగా ఉన్న ప్రతి అంశాన్ని యోగ వినియోగించుకుంటుంది. ఇప్పుడు మీరుగా పరిగణిస్తున్నదాంట్లో మీ శరీరం చాలా పెద్ద భాగం. శరీరాన్ని ఉపయోగించి పరిణామ ప్రక్రియను త్వరితం చేసే శాస్త్రమే  హఠ యోగ.
ఇప్పుడు మీరుగా పరిగణిస్తున్నదాంట్లో మీ శరీరం చాలా పెద్ద భాగం. శరీరాన్ని ఉపయోగించి పరిణామ ప్రక్రియను త్వరితం చేసే శాస్త్రమే  హఠ యోగ. 
శరీరానికి తన సొంత ధోరణులు, తన సొంత అహంకారము, ఒక స్వభావము ఉంటాయి. ‘రేపటి ఉదయం నుంచి నేను అయిదు గంటలకు లేచి నడవటానికి వెళ్తాను’ అని మీరు నిర్ణయించుకున్నారనుకుందాం. మీరు అలారం పెట్టుకుంటారు. అది మోగుతుంది. మీరు లేవాలి అనుకుంటారు కానీ, మీ శరీరం ‘నోరు మూసుకుని, పడుకో!’ అంటుంది. దానికీ తనదైన, ఒక సొంత విధానం ఉంటుంది కదా? హఠ యోగ అనేది శరీరంపై పని చేస్తూ, దాన్ని క్రమశిక్షణకు లోబరిచి, శుద్ధంచేసి, శరీరాన్ని ఉన్నత స్థాయి ప్రాణశక్తి, అవకాశాల కోసం సిద్ధం చేస్తుంది. హఠ యోగ ఒక వ్యాయామం కాదు. శరీరం పనిచేసే తీరుని అర్ధం చేసుకుని, ఒక నిర్దిష్ట వాతావరణాన్ని సృష్టించి, శరీర భంగిమల ద్వారా మీ ప్రాణశక్తిని ఒక నిర్ణీత దిశలో నడిపించటమే హఠ యోగ లేక యోగాసనము.
మీరు అంతర్గతంగా ఉన్నత స్వభావానికి చేరుకునేందుకు అనుకూల పరిచే భంగిమే యోగాసనము. 
‘ఆసన’ అంటే ఒక భంగిమ. మీరు అంతర్గతంగా ఉన్నత స్వభావానికి చేరుకునేందుకు అనుకూల పరిచే భంగిమే యోగాసనము . దీనికి ఇతర కోణాలు ఉన్నాయి, కానీ టూకీగా చెప్పాలి అంటే, ఒకరు కూర్చున్న విధానాన్ని గమనించి, వారు మీకు చాలా కాలంగా తెలిసినవారైతే, వారికి (మనసులో) ఏమి జరుగుతుందో మీరు దాదాపు తెలుసుకోవచ్చు. మిమ్మల్ని మీరు గమనించుకుని ఉంటే, మీరు కోపంగా ఉన్నప్పుడు ఒకలా కూర్చుంటారు; ఆనందంగా ఉంటే మరొకలా కూర్చుంటారు; ఒత్తిడిలో ఉంటే ఇంకోలా కూర్చుంటారు.  ఎరుకలోని ప్రతి స్థాయికీ లేక మానసిక, భావోద్వేగ స్థితికి మీ శరీరం సహజంగానే ఒక రకమైన భంగిమలోకి వస్తుంది. ఆసన శాస్త్రం దీనికి విలోమమైనది. అంటే మీరు (కావాలని) చేతనంగా మీ శరీరాన్ని ఒక విభిన్న భంగిమలోకి తీసుకువస్తే మీరు మీ ఎఱుకను ఉచ్ఛ స్థితికి తీసుకువెళ్ళవచ్చు.
ప్రేమాశీస్సులతో,
సద్గురు