సాధకుడు: ప్రేమ నా జీవితాన్ని నడిపిస్తోంది అని అనిపిస్తుంది, కానీ నాకు “ఒకరితో లేదా మరొకరితో ఉండడం.. ఎవరిపట్ల అయినా బేషరతు అయిన ప్రేమ కలిగి ఉండడం..” అన్నదాని గురించి ఎక్కడో కొంచం సంకోచం ఉంది.  

సద్గురు: అది నిజంగా బేషరతైనదా ?  

సాధకుడు: ఏమో, నాకు తెలియదు. బహుశా అయ్యి ఉండవచ్చు. 

సద్గురు: ఎన్నో షరతులు ఉన్నాయి.. కదూ ? మీరు, అన్ని షరతులూ ఎదుటివారి మీద విధించారు. మీకు, వారి పట్ల ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఒకవేళ రేపు వారు వాటిని నిభాయించలేకపొతే, మీ ప్రేమ కాస్తా కోపంగా ఆ తరువాత ద్వేషంగా మారిపోతుంది. అందుకని; మీ ప్రేమను మనం నిలబెట్టాలంటే, ఎదుటివారు ఏమి చేస్తారో దాన్ని నియంత్రించాలి....వారు మీ అంచనాలను తప్పకుండా ఉండేందుకు..! లేదంటే; మీ అద్భుతమైన ప్రేమ ఎంతో అసహ్యమైన కోపంగా మారిపోతుంది.

ప్రేమ జీవితంలో ఎంతో సున్నితమైన కోణం

నేను, అనుబంధాలను చిన్నబుచ్చడానికి ప్రయత్నం చెయ్యడం లేదు. కానీ దేనికైతే ఒక పరిమితి ఉందో దాని పరిమితిని చూడడంలో తప్పేమీ లేదు. దానికి ఒక పరిమితి ఉంది - అంటే, దానికి అందం లేదనిగాని, అందులో అందం లేదనీ కానీ కాదు కదా ? ఒక పువ్వు ఎంతో అందంగా ఉంటుంది. కానీ; దానిని మనం నలిపేస్తే అది రెండు రోజుల్లో ఎరువుగా మారిపోతుంది. ఒక క్షణంలో మనం పువ్వుని నాశనం చెయ్యవచ్చు. కానీ అది పువ్వుకు ఉన్న విశిష్టతనూ దాని అందాన్నీ ఏమాత్రమూ తగ్గించదు. ఏమాత్రమైనా తగ్గిస్తుందా ? లేదు..!! అలానే, మీ ప్రేమ కూడా ఎంతో సున్నితమైనది. మీరు దానిగురించి ఏవో ఊహాగానాలు చేసుకోకండి. అదే సమయంలో దానిలో అందం లేదని కూడా నేను అనడం లేదు.

కానీ అంత సున్నితమైన అంశాన్ని మీ జీవితానికి పునాదిగా మలచుకున్నట్లయితే సహజంగానే మీకు ఎప్పుడూ ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు అలాంటి సున్నితమైన పువ్వుమీద కూర్చొని ఉన్నారు కాబట్టి. మీరు మీ ఇల్లు కట్టుకోవాలని అనుకున్నప్పుడు భూమి మీద కాకుండా, అది అందంగా ఉంది కదా అని ఒక పువ్వు మీద,  మీ ఇల్లు కట్టుకోవాలనుకుంటే.. మీరు ఎప్పుడూ భయంలో జీవించవలసిందే..!! మీరు మీ పునాదులను భూమి మీద కట్టుకుని, పువ్వుని చూసి, దాని వాసన చూసి, దాన్ని స్పర్శ చేసినట్లయితే; అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ; మీ ఇంటినే ఒక పువ్వు మీద నిర్మించాలనుకుంటే, మీరు ఎల్లప్పుడూ భయంలోనే ఉంటారు. నేను ఆ కోణంలో దీనిగురించి చెపుతున్నాను. అంతేకానీ; ప్రేమని తక్కువ చేసేందుకు చెప్పడం లేదు.

ప్రేమ ఒక అవసరం

ఒక స్థాయిలో చూస్తే, ప్రేమ ఒక అవసరం....! ఇది పూర్తిగా ఇంతే అని  నేనడం లేదు. కానీ, ఎంతోమందికి ప్రేమ అనేది కేవలం ఒక అవసరం. వారు ఇవి లేకుండా జీవించలేరు. ఎలా అయితే శరీరానికి అవసరాలు ఉన్నాయో, అదే విధంగా మీ భావాలకు కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి. నేను, మీరు లేకుండా జీవించలేను అని చెప్పడానికీ, నేను ఒక ఊత సాయం లేకుండా నడవలేను అని చెప్పడానికీ మధ్య ఏ తేడానూ లేదు. ఒకవేళ వజ్రాలు పొదిగిన చేతి కర్ర ఉన్నదనుకోండి, మీరు దానితో ఎంతో తేలికగా ప్రేమలో పడిపోగలరు. మీరు ఈ చేతికర్రను ఒక పది సంవత్సరాలు వాడిన తరువాత, నేను, మీరు ఆ కర్ర లేకుండా నడవగలరు అని చెపితే.. మీరు ‍అహ‌‌ఁ .. లేదు ఆ చేతికర్రను ఎలా వదిలేస్తానూ.. అంటారు. వీటిల్లో జీవితానికి సంబంధించిన ఎటువంటి జ్ఞానమూ లేదు. అదేవిధంగా ప్రేమ పేరుతో కూడా మిమ్మల్ని మీరు పూర్తి నిస్సహాయులుగా చేసుకుని, మీలో మీరు అసంపూర్ణత్వం అనుభూతి చెందుతున్నారు.

అంటే దానర్థం.. ఇందులో అందం లేదనా..?? దానికి మరొక కోణం లేదనా?? దానికి మరొక కోణం ఉంది. ఎంతోమంది ప్రజలు ఒకరు లేకుండా మరొకరు జీవించినవారు ఉన్నారు. ప్రేమ అనేది ఒకవేళ నిజంగానే ఆవిధంగా మారితే, ఇద్దరు వ్యక్తులు ఒక ప్రాణంగా, ఒక జీవంగా ఉన్నట్లయితే, అది ఎంతో అద్భుతమైనది.

ఒక రాణి ప్రేమ కథ

ఇది రాజస్థాన్ లో నిజంగా జరిగింది. రాజస్థాన్ కు చెందిన రాజుకు ఒక అందమైన భార్య ఉండేది. ఆవిడ ఆయనని ఎంతగానో ప్రేమిస్తూ, ఆయనకే అంకితమై ఉండేది. కానీ ఆ రాజుకి ఎంతోమంది ఉంపుడుగత్తెలు ఉండేవారు. ఆవిడ మాత్రం ఆయనలో పూర్తిగా నిమగ్నమై ఉండేది. ఆయనకు ఎంతోమంది ఉంపుడుగత్తెలు ఉండడంవల్ల, ఇది ఆయనకు హాస్యాస్పదంగా అనిపించేది. ఆయన ఆశ్చర్యపోయేవాడు. కానీ ఆవిడ ఆయనపట్ల చూపుతున్న శ్రద్ధ ఆయనకు నచ్చేది. ఒక్కోసారి, అది చాలా ఎక్కువగా కూడా అనిపించేది. అప్పుడు ఆమెను కొంచం ప్రక్కకి తోసేసి, వేరేవారితో ముందుకి సాగిపోయేవాడు. కానీ ఆవిడ మాత్రం ఆయనకి పూర్తిగా అంకితమై ఉండేది.

అందుకు రాజు నవ్వులాటగా “ నీవు కూడా అంతేనా? నన్ను అంతగా ప్రేమిస్తున్నావా??” అని అడిగాడు.

రాజూ-రాణికి రెండు మాట్లాడే పెంపుడు మైనాలు ఉండేవి. ఒకరోజున వాటిల్లో ఒక పక్షి చనిపోయింది. అప్పుడు ఆ మరో పక్షి అక్కడ ఊరికే అలా కూర్చొని ఉండేది. ఆహారం కూడా తినేది కాదు. ఆ పక్షిని ఆహారం తీసుకునేలా చెయ్యడానికి ఆ రాజు అన్ని విధాలా ప్రయత్నించాడు. కానీ ఆ పక్షి ఆహారం తీసుకోకుండా, రెండు రోజుల సమయంలో అది కూడా  మరణించింది.

ఇది చూసేసరికి, ఆ రాజులో మార్పు వచ్చింది. ఇదేంటి ఏ జీవి అయినా తన ప్రణాన్నే కదా ఎక్కువ విలువైనదిగా చూస్తుంది. కానీ ఈ పక్షి ఇక్కడ కూర్చొని అలా మరణించింది. 

రాజు తన భార్యతో ఇది చెప్పినప్పుడు, ఆవిడ “ఎవరైనా మరొకరిని సంపూర్ణంగా ప్రేమించినప్పుడు, వారు లేకుండా జీవించలేకపోవడం సహజమే కదా?! ఎందుకంటే; ఆ తరువాత వారి జీవితానికి అర్థమే ఉండదు”  అన్నది.

అందుకు రాజు నవ్వులాటగా “ నీవు కూడా అంతేనా? నన్ను అంతగా ప్రేమిస్తున్నావా??” అని అడిగాడు.

ఆవిడ దానికి సమాధానంగా “అవును, నాకు కూడా ఇది ఇంతే..!!” అని చెప్పింది. రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు.  

ఒకరోజున రాజు తన స్నేహితులతో కలిసి వేటకు వెళ్ళాడు. ఈ పక్షులు చనిపోవడం, ఆయన భార్య ఈ విధంగా మాట్లడడం.. ఆవిడ కూడా ఇది నిజమే అని చెప్పడం.. వీటన్నింటితో; ఆవిడ మీద ఒక ఆట ఆడాలన్న చిలిపి కోరిక ఆయన మనస్సులో కలిగింది. ఒకనాడు ఆయన బట్టలు తీసేసి వాటికి రక్తాన్ని పూసి వాటిని ఎవరి ద్వారానో రాజభవనానికి పంపించి, “రాజు ఒక పులి చేతిలో మరణించాడు..” అని చెప్పించాడు. రాణి ఆయన దుస్తులను ఎంతో హుందాగా స్వీకరించింది. ఆవిడ కళ్ళల్లో ఒక చుక్క కూడా నీరు లేదు. ఆవిడ ఒక చితిని ఏర్పాటు చేసి, ముందర ఆ దుస్తులను ఆ చితిమీద వేసి, తరువాత తానూ కూడా ఆ చితిలో పడి మరణించింది.

ప్రజలు దీనిని నమ్మలేకపోయారు. ఆ రాణి అలా ఆ చితిలోకి వెళ్లి మరణించింది. ఇక చెయ్యడానికి ఏమీ లేదు. ఎందుకంటే; ఆవిడ ఆ చితిలో పడి మరణించింది కాబట్టి..! ఆవిడకు అంత్యక్రియలు చేశారు. ఈ వార్త రాజుని చేరేటప్పటికి, ఆయన క్రుంగి పోయాడు.  ఆయన చిలిపిగా ఆట ఆడుదామనుకున్నాడు. కానీ ఆవిడ నిజంగా చనిపోయింది. ఇది ఆత్మహత్య కాదు. ఆవిడ కేవలం అలా చనిపోయింది. అంతే..!

మంగళసూత్రం: రెండు జీవితాలను ఒక్కటిగా ముడివేస్తుంది 

ప్రజలు దీనిని ఎందుకు ఇష్టపడ్డారంటే, రెండు వేరువేరు ప్రాణాలు ఒక్కటిగా చెయ్యబడుతున్నాయి కాబట్టి. భారతదేశంలో, వివాహం ఎలా చెయ్యాలన్న దాని వెనుక ఒక పెద్ద శాస్త్రం ఉంది. ఇద్దరికి వివాహం చేసేటప్పుడు, వారికుటుంబాల మధ్య సయోధ్యత, వారి శరీరాల మధ్య సయోధ్యత చూసేవారు కాదు. వారి శక్తి ఒకరికొకరికి అనుకూలంగా ఉందా? లేదా? అనేది చూసేవారు.

ఎన్నో సందర్భాల్లో, వారిద్దరూ ఒకరినొకరు చూసుకునేవారు కూడా కాదు. అది అసలు అవసరం అయ్యేదే కాదు. ఎందుకంటే; వీరిద్దరూ ఒకరికి ఒకరు జత కూడతారా.? లేదా అన్న విషయం ఎవరైతే వీరికంటే బాగా తెలుసుకోగలరో, చెప్ప్పగలరో, అటువంటివారు చూసి, చెప్పేవారు. ఒకవేళ వారికిగా వారు ఎంపిక చేసుకున్నట్లయితే, వారు కన్ను-ముక్కు తీరుని బట్టో, మరోదానిని బట్టో, చేసుకోవచ్చు. వివాహం అయిన మూడు రోజుల తరువాత, అవేవీ లెక్కలోనికే రావు. ఒకవేళ మీ భార్యకి అందమైన కళ్ళు ఉన్నప్పటికీ ఆవిడ ఊరికే అలా మిమ్మల్ని తేరిపారా చూసిందనుకోండి అందులో ఉపయోగం ఏమి ఉంది ?

మంగళసూత్రం అంటే ఒక పవిత్రమైన సూత్రం. మంగళసూత్రాన్ని తయారు చెయ్యడం అనేది ఒక పెద్ద శాస్త్రం.

మంగళసూత్రాన్ని తయారు చేసే విధానం తెలిసిన వారు వివాహాలు నిశ్చయించేవారు. మంగళసూత్రం అంటే ఒక పవిత్రమైన సూత్రం. మంగళసూత్రాన్ని తయారు చెయ్యడం అనేది ఒక పెద్ద శాస్త్రం. నూలుపోగుకు కొంత పసుపుని పోసి, శక్తివంతం చేసి, ఒక విధానంలో తయారు చేసేవారు. ఒకసారి దీనిని కట్టిన తరువాత, అది ఈ జీవితానికీ తదనంతరము కూడా..!

ఎన్నో సందర్భాల్లో; దంపతులు ఎన్నో జన్మలపాటూ దంపతులుగా ఉన్న దాఖలాలూ ఉన్నాయి. మీరిది ఎరుకతో చేసుకున్న ఎంపిక. ఎందుకంటే; ఇందులో ఉపయోగించే విధానాలు ఎటువంటివంటే, ఇక్కడ కేవలం భౌతికంగానూ భావపరంగానూ ఇద్దరు వ్యక్తులను ఒక్కటిగా చెయ్యడం మాత్రమే కాదు..! మీరు శరీరంతో, మనసుతో, భావంతో చేసినది మరణంతో పోతుంది. కానీ మీరు ఏదైతే శక్తిపరంగా చేస్తారో, అది అలా నిలిచి ఉంటుంది. మీరు ఇద్దరు వ్యక్తుల నాడులను ఒక్కటిగా చెయ్యవచ్చు. అందుకే, ఒకసారి ఇలా చేస్తే అది జీవితాంతం ఉండే సంబంధంగా భావించేవారు. ఇక మళ్ళీ తిరిగి చూసుకునే అవసరమే లేదు. ఎందుకంటే ఇలా ఇద్దరు వ్యక్తులను ఒక్కటిగా చేయడం అన్నది మీ అవగాహనకు మించింది.

మీరు శరీరంతో, మనసుతో, భావంతో చేసినది మరణంతో పోతుంది. కానీ మీరు ఏదైతే శక్తిపరంగా చేస్తారో, అది అలా నిలిచి ఉంటుంది.

ఇప్పుడు కూడా అదే పద్ధతిని ఉపయోగిస్తున్నారు. కానీ, ప్రజలకు ఇది ఎలా చెయ్యాలో తెలియదు. అందుకని; సహజంగానే ప్రజలు ఈ పసుపు త్రాడుని వేసుకోము అని అంటున్నారు. మీరు వేసుకున్నా, వేసుకోకపోయినా ఇప్పుడు దానికేమీ పెద్ద అర్ధం లేదు. ఎందుకంటే; దాని వెనకాల ఉన్న శాస్త్రం అంతా మరుగున పడిపోయింది.

ఎవరికైతే ఇది చెయ్యడం తెలుసో; అటువంటివారు చేసినప్పుడు, ఆ దంపతులలో - “ఈవిడ నా భార్య అవ్వాలా? వద్దా?” “ఈయన ఎప్పటికీ నా భార్తగానే ఉంటాడా?” - వంటి ఆలోచనలే వచ్చేవి కాదు. మరణం కూడా వీరిని విడదీయలేకపోయేది.

ఇటువంటి దంపతులు భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. ఒకరు మరణించగానే మరొకరు ఎంతో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కొన్ని నెలల్లో మరణిస్తారు. ఎందుకంటే; శక్తిపరంగా వీరు ఈ విధంగా ఒక్కటి చెయ్యబడ్డారు. మీరు కనుక ఈ విధంగా మరొక వ్యక్తితో ఒక్కటి చెయ్యబడితే; రెండు జీవాలూ ఒక్క ప్రాణంగా ఉన్నట్లయితే, అది జీవించడానికి ఎంతో అద్భుతమైన విధానం. అది ముక్తి కాదు. అయినప్పటికీ, అది జీవించడానికి ఎంతో అందమైన విధానం.

ప్రేమే గమ్యం కాదు

ఈ రోజుల్లో, ప్రజలు ప్రేమగురించి మాట్లాడినప్పుడు; వాళ్ళు కేవలం భావపరమైనదాని గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. మీ భావాలు ఈరోజున ఒక విధంగా ఉంటే రేపు మరొక విధంగా ఉంటాయి. మీరు, మొట్టమొదట ఈ అనుబంధం ఏర్పరచుకున్నప్పుడు; ఇది ఎప్పటికీ అని అనుకున్నారు. కానీ, మరొక మూడు నెలల్లో “అసలు ఇలాంటి వ్యక్తితో నేనెందుకు ఉన్నాను?” అని అనుకుంటారు. మీ ఇష్టాయిష్టాలు ఈవిధంగా నడుస్తున్నాయి కాబట్టి; ఇలాంటి స్థితిలో, మీ అనుబంధాలు కేవలం మిమల్ని బాధ మాత్రమే పెడతాయి. ఒక అనుబంధంలో స్థిరత్వం లేనప్పుడు, అది  వచ్చి-పోతూ ఉన్నట్లయితే, అది ఎంతో బాధని కలిగిస్తుంది. ఇదంతా పూర్తిగా అనవసరం.

మీరు ప్రేమలో పడడానికి కారణం, అది మీకు పారవశ్యాన్ని తెచ్చిపెట్టాలని. ప్రేమే మీ లక్ష్యం కాదు. పారవశ్యం అన్నది మీ లక్ష్యం. గాయపడినా సరే.. ఎన్నోసార్లు బాధపడ్డా సరే..ఎవరితోనో ప్రేమలో పడడం అన్నదానిగురించి, ప్రజలు పిచ్చెక్కిపోతున్నారు. ఎందుకంటే; వారు ప్రేమ అంటే, అందులో కొంత పారవశ్యం ఉందని అనుకున్నారు. ప్రేమ అనేది, పారవశ్యానికి ఒక కరెన్సీ లాంటిది. కానీ  ప్రస్తుతం ప్రజలకు ఈవిధంగా మాత్రమే ఆనందంగా ఉండడం తెలుసు.

కానీ, మీ సహజ తత్వంలోనే మీరు ఆనందంగా ఉండడానికి ఒక మార్గం ఉంది. మీరు ఎంతో పారవశ్యంలో ఉండే వ్యక్తి అయితే;  ప్రేమగా ఉండడం అన్నది అసలు ఒక సమస్యే కాదు. ఎలా అయినా మీరు ప్రేమగానే ఉంటారు. కానీ మీరు ప్రేమ ద్వారా పారవశ్యాన్ని కోరుకున్నప్పుడు మాత్రమే; ఎవరితో ప్రేమగా ఉండాలి? అన్న ప్రశ్న ఎదురౌతుంది.  కానీ మీరు సహజంగానే పారవశ్యంలో ఉన్నప్పుడు; మీరు ఏది చూసినా సరే, మీరు దానిని ప్రేమగానే చూస్తారు.  ఎందుకంటే; దానితో చిక్కుకుపోతామేమో అన్న భయం మీకు ఉండదు. చిక్కుకుపోతామేమో అన్న భయం ఇంక ఉండనప్పుడు మాత్రమే; మీకు జీవితంలో పూర్తిగా నిమగ్నమవ్వడం అంటే ఏమిటో తెలుస్తుంది.