వాస్తవానికి సూత్రం ఒక మాధ్యమం. మనం మరొకటి కూడా ఉపయోగించవచ్చు, కాని దారం తేలికగా దొరుకుతుంది, అనుకూలంగా ఉంటుంది. దానివల్ల ప్రయోజనం నెరవేరుతుంది, తగినంతకాలం మన్నుతుంది కూడా. ఎవరైనా ఒక ఆరునెలల సాధన మీద ఉన్నారనుకోండి,  వారికొక విధమైన సూత్రం కడతాం. అదే ఒకరికి మూడేళ్ల సాధనను నిర్ణయించామనుకోండి, వారికి మరోరకమైన సూత్రం కడతాం. ఎందుకంటే అది మూడేళ్లకాలం మన్నాలి కదా. లేకపోతే ఒక్క దారమే అంతకాలం మన్నదనుకుంటే, అదలా మన్నడానికి దానికి మరో వస్తువును అదనంగా చేరుస్తాం. సూత్రం శరీరం లాంటిది. కేవలం భౌతికమైన ఆధారం. యోగాలో మనం శరీరాన్ని కేవలం ఒక ఆధారంగా ఉపయోగిస్తున్నాం, ఇది సృష్టి స్వభావం. చివరికి మీ భౌతిక దేహం కూడా ఒక వేదిక మాత్రమే. అసలైంది కాదు. ఆ పద్ధతిలో మొత్తం సృష్టి జరిగింది. అయితే ఆధునిక సమాజాలలో మనం కొన్ని ప్రమాణాలు నిర్ణయించాం, అవన్నీ పూర్తిగా భౌతికమైనవి కాబట్టి మనం మొత్తం సృష్టిని ఈ భౌతికతకే పరిమితం చేయాలని ప్రయత్నిస్తున్నాం.

శివుడు వీరభద్రుని ఎలా సృష్టించాడు

యోగుల లోకగాథల్లో ఒక సంఘటనను చెప్తారు. శివుడు ఒక జీవిని సృష్టించడానికి సూత్రాన్ని ఉపయోగించాడట. శివుడి మొదటి భార్య సతీదేవి తండ్రి ఒక యజ్ఞం చేస్తున్నాడు. సతి యజ్ఞస్థలానికి వచ్చింది. శివుడు రాలేదు. యజ్ఞ సమయంలో దక్షుడు శివుణ్ణి అవమానిస్తూ దూషించాడు. ఈ అవమానాన్ని భరించలేక సతీదేవి యజ్ఞ జ్వాలల్లో దూకి భస్మమైపోయింది. ఆమె అవమానం భరించలేక ఆత్మదహనం చేసుకున్నదన్న విషయం తెలిసి శివుడు రౌద్రుడయ్యాడు. ఆయన తన జటల్లో ఒకదాన్ని లాగి రాతిమీద విసిరికొట్టాడు. అప్పుడు తాంత్రిక యోధుడు వీరభద్రుడు జన్మించాడు. శివుడతన్ని యజ్ఞస్థలికి పంపించాడు. వీరభద్రుడు యజ్ఞస్థలికి వెళ్లి యజ్ఞస్థలంలో ఉండి సతి మరణాన్ని ఆపడానికి ఏమీ చేయని వారినందరినీ చంపివేశాడు. నా భార్య అగ్నిలోకి నడిచింది. ఎవరూ ఆమెని ఆపాలని కూడా అనుకోలేదు, ‘చూస్తూ ఉండిపోయారు’ ‘మీలో ప్రతి ఒక్కరూ చనిపోవాలి’ అని శివుడన్నాడు.  వీరభద్రుడు యజ్ఞధ్వంసం చేశాడు. దక్షుని వధించాడు.

సూత్రాలలో రకాలు

వీరభద్రుని సృష్టించడానికి శివుడు తన వెంట్రుకల్ని ఉపయోగించాడు. సూత్రం సహజమైన పధార్ధంతో చేసింది, ముడిదీ, పసుపు పూసినదీ, తడిదీ అయినట్లయితే అది కొద్ది సెకండ్లలోనే మీ శరీరంలో భాగంలాగా అయిపోతుంది. సూత్రం అనేది ఒకదాన్ని కలిపి ఉంచే దారం. పతంజలి యోగసూత్రాలు ఒక దారం మాత్రమే. ఎవరెవరి సామర్థ్యాన్ని బట్టి వారు దానికి మట్టి పూసలు, ముత్యాలపూసలు, రత్నాల పూసలు లేకపోతే తమ జీవితాన్నే దానికి కూర్చవచ్చు. దారానికి ఎన్ని రకాల వాటినో కూర్చవచ్చు. మీ శరీరంలో ఏ భాగానికి ఆ దారాన్ని కడుతున్నారన్న దాన్నిబట్టి – దాన్ని మీ నడుముకో, మెడకో కట్టుకుంటున్నారనుకోండి – దాన్ని భిన్నరీతిలో కూర్చవలసి ఉంటుంది. చేతి మణికట్టుకు కట్టుకొనే సూత్రం అన్నిటిలోనూ సరళమైంది. ఎందుకంటే దాన్ని కట్టుకోవడం ఒక పరిమిత ప్రయోజనం కోసం, నిర్దిష్ట ప్రయోజనం కోసం. దానికి మరింత విపులమైన లక్ష్యం ఉన్నట్లయితే విస్తృతమై ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది.

అచేతన వస్తువులకుండే వివేకం

మనం ప్రాణం లేని వస్తువులు అంటున్నవి కూడా ఒక ప్రత్యేక పద్ధతిలో పనిచేస్తాయి. మీరొక విత్తనాన్ని వేరువేరు ప్రదేశాల్లో నాటినట్లయితే అవి నేల స్వభావాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, మరెన్నో ఇతర అంశాలను బట్టి వేరువేరు రీతిలో పెరుగుతాయి. నేల కూడా ప్రాణం లేనిదే కావచ్చు. కాని దాని ప్రత్యేక లక్షణాలు దానికుంటాయి. అది తానెలా పనిచేయాలనుకుంటుందో అలా పనిచేస్తుంది. ప్రాణరహిత వస్తువులలో ఒక భిన్నరీతికి చెందిన వివేకం ఉంటుంది. ఆధునిక సమాజాలు వివేకాన్ని కేవలం మేధగానూ, ఆలోచనా ప్రక్రియగానూ భావిస్తున్నాయి. కాని మీరు ఆలోచనా ప్రక్రియ ద్వారా నిజంగా దేన్నీ గ్రహించలేరు. మీ శరీరంలో సేంద్రియంగా జరుగుతున్నది ఆలోచనా ప్రక్రియకు ఆవల జరుగుతున్నది, కాని మనం ఈ వివేకాన్ని గుర్తించడం లేదు. మనం వివేకం అంటే కొన్ని రకాల ఆలోచనలనే అనుకుంటున్నాం. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం, నిర్దిష్ట కాల పరిధిలో పనిచేసే విధంగా తయారుచేసిన వివేకవంతమైన దారమే సూత్రం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు