సాధకుడు :గతంలో తాము లోనైన వేధింపులకు  కోపం తెచ్చుకోకుండా మనుషులు ఎలా వ్యవహరించగలరు ?

 సద్గురు: తామెలా ఉన్నా దానికి కారణం “తమ బాల్యంలో ఎదురైన వేధింపులు” అని మనుషులు సమర్ధించుకో జూస్తారు. ఈ రోజుల్లో ఇదొక వ్యాధిలా మారింది, ఈ సమస్య బృహత్తర పరిమాణాలను సంతరించుకుంది. మీరు చేస్తున్న తప్పుడు పనికి “నువ్వెందుకలా చేసావు?” అని ఎవరైనా సంజాయిషీ అడిగితే, అప్పుడు వారు “నా చిన్నప్పుడు మా నాన్న నాకు ఏం చేసాడో తెలుసా?” అంటారు.

మీరు జీవితంలో వేధింపులకు గురయ్యుంటే, మీరు అవాంఛనీయ పరిస్థితులని ఎదుర్కొని ఉంటే, ఇంకెవరినీ అలాంటి పరిస్థితులకు గురిచేయనంత వివేకాన్ని మీరు కలిగి ఉండాలి.

ముఖ్యంగా మీ తండ్రి ఒక మూర్ఖుడైనప్పుడు, అతనొక మూర్ఖుడని గ్రహించే సామర్థ్యం మీకు ఉన్నప్పుడు, మీరు మరింత వివేకవంతంగా బ్రతకాలి, అంతే కదా? మీరు జీవితంలో వేధింపులకు గురయ్యుంటే, మీరు అవాంఛనీయ పరిస్థితులని ఎదుర్కొని ఉంటే, ఇంకెవరినీ ఇలాంటి పరిస్థితులకు గురిచేయనంత వివేకాన్ని మీరు కలిగి ఉండాలి. అలా ఉండటం చాలా తెలివైన పని. కాదంటారా? కానీ మనుషులకు కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి కావాలి. వారి జీవితంలో ఇలాంటి సంఘటనలేవీ జరగకపోయినా, వారు గందరగోళంలోనే ఉంటారు. బహుశా వాళ్ళు కోపంతో ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు నైరాశ్యంతో ఉంటారు.

మీరు దౌర్భాగ్యాలుగా ఎంచినవన్నీ మీ జీవితంలోని ఘటనలు మాత్రమే. జీవితంలో మీరనుకున్న విధంగా జరగకపోతే, దాన్ని మీరు దౌర్భాగ్యంగా పరిగణిస్తారు.

మీరు దౌర్భాగ్యాలుగా ఎంచినవన్నీ మీ జీవితంలోని ఘటనలు మాత్రమే. జీవితంలో మీరనుకున్న విధంగా జరగకపోతే, దాన్ని మీరు దౌర్భాగ్యంగా పరిగణిస్తారు. మనమనుకున్న ప్రకారం కాకుండా మరే విధంగా కూడా జీవితం జరగాలని మనం కోరుకోము. ప్రతి మనిషి ఆకాంక్ష అదే. కానీ చాలా విషయాలు మనమనుకున్న విధంగా జరగవు.

జరిగినవి ఎంత అసంతృప్తికరంగా ఉన్నా కూడా, మన మెదడు చురుకుగా ఉంటే, వీటిని అధిగమించే మేధస్సు మనకు ఉంది. మనకేదైనా బాధాకరమైనది జరిగితే, మనకు కలగాల్సిన మొదటి ఆలోచన ఏమిటి? “నాకు గానీ మరెవరికి గానీ మళ్ళీ ఇలా జరగకూడదు” అని.  ఇది చాలా మానవీయమైన ఆలోచన. కానీ ఇప్పుడు మీకలా జరిగింది కాబట్టి, మీరు దాన్ని ప్రతీ ఒక్కరికీ చేసి ఇలా అంటారు - “ నేనిలా ఎందుకు చేస్తున్నానంటే నాకు వాళ్ళు అలా చేసారు” అని అంటారు.  దీనికి కచ్చితంగా చికిత్స (థెరపీ) అవసరం. ఇదేదో ఒక వ్యక్తికి సంబంధించిన స్థితి కాదు. మొత్తం సమాజమే ఈ స్థితిలో ఉంది. వాళ్ళు ఇదంతా సరైందే అనుకుంటారు. కానీ ఇది సరైంది కాదు. దీనికి సామాజిక సైకో-థెరపీ (మానసిక చికిత్స) అవసరం.

ముఖ్యంగా మీరు అసభ్య ప్రవర్తనకు గురయ్యుంటే, ఆ ప్రవర్తనకు గురైన బాధ మీకు తెలుసు కాబట్టి, మీరు ఇక అది ఎవరికీ జరగకుండా చూడాలి

ముఖ్యంగా మీరు అసభ్య ప్రవర్తనకు గురయ్యుంటే, ఆ ప్రవర్తనకు గురైన బాధ మీకు తెలుసు, కాబట్టి మీరు ఇక అది ఎవరికీ జరగకుండా చూడాలి. కానీ అలాంటి భావన ఇంకా రాలేదు. నేనొకరి బాధాకరమైన అనుభవాలను తక్కువ చేసి చూపాలని ప్రయత్నించడం లేదు. దాని వెనుక బాధ ఉందని నాకు తెలుసు, కానీ మనం ఈ బాధనే పెంచుకుంటూ పోవాలా లేదా ఈ బాధని వివేకంగా మార్చుకొని, మన జీవిత అనుభవం నుంచి వివేకాన్ని పెంచుకోవాలా?  ప్రతీ మనిషికీ ఎంచుకునే స్వేఛ ఉంది. ఈ స్వేఛే సమాజానికి కూడా ఉంది. ఈ ఎంపికని మనం కచ్చితంగా ఉపయోగించుకోవాలి.

ప్రేమాశీస్సులతో,

సద్గురు