శివుడి 5 వివిధ రూపాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి ఈ వ్యాసంలో సద్గురు మనకు వివరిస్తున్నారు..

https://soundcloud.com/sadhguru/yoga-yoga-chant

యోగ యోగ యోగేశ్వరాయ

భూత భూత భూతేశ్వరాయ

కాల కాల కాలేశ్వరాయ

శివ శివ సర్వేశ్వరాయ

శంభో శంభో మహాదేవాయ

యోగేశ్వరా

యోగ మార్గంలో ఉండడం అంటే జీవితంలో మీరు ఒక దశకు చేరుకున్నట్టు. మీకు ఈ భౌతికమైన దాని పరిమితులు అనుభూతి చెంది, పరాన్ని తెలుసుకోవాలి అన్న అవసరం మీకు కలిగి, మీకు ఈ విశ్వం అంతా కూడా ఒక నిర్బంధంలాగా అనిపించినపుడు - మీరు ఈ దశకు చేరుకుంటారు. ఒక చిన్న సరిహద్దు మిమ్మల్ని నిర్బంధిస్తే, ఎంత పెద్ద సరిహద్దు అయినా సరే ఎప్పుడో అప్పుడు మీకు నిర్బంధమే కదా..? ఈ విషయం తెలుసుకోడానికే మీరు విశ్వాన్నంతా చుట్టి రానక్కర్లేదు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఈ సరిహద్దు మిమ్మల్ని నిర్బంధిస్తుంది అని తెలిస్తే, మీరు విశ్వాన్నంతా చుట్టివస్తున్నపుడు ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు అది కూడా నిర్బంధంగానే మారుతుంది. కాకపోతే మీరు ఎంత వేగంగా అక్కడవరకు చేరుకోగలరు... అన్నదే ప్రశ్న! ఒకసారి మీరు వేగంగా చేరుకోగల సామర్థ్యాన్ని పెంచుకున్నారనుకోండి – అప్పుడు ఎలాంటి సరిహద్దైనా సరే మీకు ఒక నిర్బంధంగానే మారుతుంది.

ఒకసారి ఇది మీరు అర్థం చేసుకున్న తరువాత మీలో ఒక రకమైన తృష్ణ మొదలౌతుంది. ఈ భౌతిక సృష్టినంతా అధిగమించినా కూడా, ఆ తృష్ణ సంతృప్తి చెందదు - అప్పుడు “యోగా” మొదలవుతుంది. యోగా అంటే ఈ భౌతిక సృష్టి  పరిమితులను కూలదొసేయడమే. మీ కృషి అంతా కూడా ఈ భౌతిక సృష్టి మీద ఆధిపత్యం సాధించడానికి కాదు, దాని పరిమితులను కూలదొసేయడానికి, అభౌతికమైనదానిని స్పృశించగలగడానికి. మీరు ఈ పరిమితమైనదానిని అపరిమితమైనదానితో ఐక్యం చేయాలనుకుంటున్నారు. ఈ పరిమితాని అపరిమిత తత్వంతో లయం చేయాలనుకుంటున్నారు. అందుకని -“యోగీశ్వరాయ”.

భూతేశ్వరాయ

ఈ భౌతిక సృష్టి అంతా కూడా మనం దృష్టి, శ్రవణం, రుచి. వాసన, స్పర్శ వలనే గ్రహించగలుగుతున్నాము. ఈ శరీరం, ఈ గ్రహం, ఈ విశ్వం, ఈ సృష్టి అంతా కూడా ఈ పంచ భూతాల విన్యాసమే. కేవలం ఐదు పదార్థాలతో ఎంత గొప్ప సృష్టి. కేవలం ఐదు పదార్థాలతో. మీరు వీటిని మీ చేతి మీద లెక్కబెట్టవచ్చు కూడా, వీటితో ఎన్ని విషయాలు సృష్టించబడ్డాయి. ఈ సృష్టి ఇంతకంటే ఎక్కువ కారుణ్యం చూపించలేదేమో. ఒకవేళ  ఐదు కోట్ల పదార్థాలంటే మీకు ఏం చేయాలో తెలీదు. కానీ కేవలం ఐదు పదార్థాలు...ఈ పంచ భూతాలు. వీటిమీద మీరు నియంత్రణ చేయగలిగితే, మీ ఆరోగ్యం, మీ శ్రేయస్సు, మీరు ఈ ప్రపంచంలో ఉండే స్థానం, మీకేమి కావాలో అది సృష్టించుకోగలిగే సామర్థ్యం – ఇవన్నీ కూడా మీ నియంత్రణలో ఉంటాయి. తెలిసో తెలియాకో, ఎరుకతోనో ఎరుక లేకుండానో ప్రజలకి వీటిమీద కొంత వరకు నియంత్రణ ఉంటుంది. ఎవరికి ఎంతవరకు వీటిమీద నియంత్రణ ఉంది అన్నదాన్ని బట్టి వారి శరీర తత్వంగాని, వారి మానసిక తత్వంగాని, వారు చేసే పనులతత్వం గాని, వారు ఈ ప్రపంచంలో ఎంత సఫలత పొందుతారు, వారికి ఎంత దూర దృష్టి ఉంటుంది – ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి.

“భూత భూత భూతేశ్వరాయ” – అంటే ఎవరికైతే ఈ పంచ భూతాలమీద నియంత్రణ కలిగున్నారో వారు ఈ జీవన గమ్యాన్ని కనీసం భౌతిక పరిస్థితుల్లో నిర్ణయించగలరు...అని అర్థం.

కాలేశ్వరాయ

కాల అంటే సమయం. మీరు ఈ పంచభూతాల మీద ఎంత నియంత్రణ సాధించినప్పటికి మీరు ఈ అనంతమైనదానితో ఒక్కటై పోవాల్సిందే. మీరు లయం అయిపోవాల్సిందే. మీరిక్కడ ఉన్నంతవరకు మీ కాలం సాగిపోతూనే ఉంటుంది.  కాలాన్ని నియంత్రించగలగడం అనేది పూర్తిగా ఒక విభిన్నమైన కోణం. కాలం అంటే కేవలం సమయం కాదు. కాలం అంటే అంధకారం కూడా. ఎందుకు కాలం అంటే అంధకారం..? కాలం వెలుగు అవ్వలేదు. ఎందుకంటే వెలుగు కాలంలో ప్రయాణం చేస్తుంది. వెలుగు కాలానికి దాస్యం చేస్తుంది. మనం వెలుతురు అని దేనినైతే అంటామో దానికి ఒక మొదలు, ఒక అంతం ఉన్నాయి. కానీ కాలం అలాంటిది కాదు. మన హిందూ విధానంలో దీనిని అర్థం అయ్యేలా చెప్పాలంటే ఆరు కోణాలుగా కాలాన్ని మనం వివరించవచ్చు.

మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మీరు ఇక్కడ ఉన్నంతసేపు మీ కాలం సాగిపోతూనే ఉంటుంది. మనం భారతీయ భాషల్లో ఎవరైనా చనిపోయినప్పుడు – దానిని ‘కాలమైపోయింది’ అని చెపుతాము. ఇంగ్లీష్ భాషలో కూడా ‘ఎక్స్పైర్డ్’ అన్నమాట వాడతారు. ఇప్పుడు మందులన్నీ కూడా ఒక ఎక్స్పైరీ డేట్ తో వస్తున్న విధంగానే, మానవులు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ తో వస్తున్నారు. మీరు ఎన్నో చోట్లకి వెళ్తున్నాం అని అనుకోవచ్చు. కానీ మీ దేహానికి సంబంధించినంతవరకు మీరు శ్మశానం దిశగానే వెళ్తున్నారు. ఒక్క క్షణం కూడా ఆ దిశను మార్చడం లేదు.  కావాలంటే మీరు కొద్దిగా నిదానించవచ్చు. కానీ మీరు ఈ దిశని మార్చలేరు.

మీకు వయసు మీద పడుతున్నకొద్దీ ఈ భూమి మెల్లిగా మిమ్మల్ని తనలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తోందని మీరు గమనిస్తారు. అప్పుడు ఈ జీవితం దాని ఆవృత్తాన్ని పూర్తి చేసుకుంటుంది. కాలం అనేది ఎంతో విశేషమైన కోణం. ఇది మిగతా కోణాలతో ఇమడదు. ఈ సృష్టిలో అన్నిటిలోకెల్లా మోసపూరితంగా వుండేది ఈ కాలమే. మీరు దానిని ఆపలేరు. ఎందుకంటే అది నిజానికి అసలు లేదు. అది మీకు తెలిసిన సృష్టి రూపాలలో లేదు. ఇది ఎంతో శక్తివంతమైన సృష్టి కోణం. ఇది సృష్టినంతా కూడా ఒక్కటిగా పట్టి ఉంచుతోంది. ఇందుకనే మోడ్రన్ ఫిజిక్స్ కి గురుత్వాకర్షణ శక్తి ఎలా పని చేస్తుందో తెలియడం లేదు. ఎందుకంటే గురుత్వాకర్షణ అనేది లేదు. కాలమే అన్నిటిని ఒక్కటిగా పట్టి ఉంచుతోంది.

శివ – సర్వేశ్వర – శంభో

శివ అంటే, ఏదైతే లేదో, ఎదైతే లయం అయిపోయిందో - అది. ఎదైతే లయమైపోయిందో అది ఈ సృష్టి అంతటికీ కూడా మూలం. ఎదైతే అనంతమైనదో అది సర్వేశ్వరుడు. శంభో అనేది ఒక తాళం చెవి లాంటిది. ఒక మార్గం. మీరు మీ శరీరం ముక్కలైపోతుందేమో అనే విధంగా దీనిని ఉచ్చరించగలిగినప్పుడు మీకు ఆ మార్గం లభ్యం అవుతుంది. మీరు మిగతా అంశాలనన్నింటినీ నియంత్రించి అక్కడివరకు చేరుకోవాలి అంటే ఎంతో ఎక్కువ కాలం పడుతుంది. కానీ మీరు ఈ చిన్న దోవ తీసుకోవాలనుకుంటే వాటన్నిటినీ దాటి వెళ్లిపోవచ్చు. వాటిని అధిగమించడం ద్వారా కాదు. వాటినుంచి తప్పించుకోవడం ద్వారా.

ప్రేమాశిస్సులతో,
సద్గురు