సంస్కృతిని కాపాడటం అవసరమా?

సంస్కృతి అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. దాన్ని యధాతధంగా ఎవరూ కాపాడలేరు. అది ప్రతినిత్యం పరిణామం చెందుతూ ఉంటుంది. అలాంటప్పుడు దానిని కాపాడటం అవసరమా? ఈ ప్రశ్నకు సద్గురు సమాధానం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి!
 

మీ సంస్కృతి ఎప్పుడైతే వ్యాపారశక్తుల చేత, దూకుడుస్వభావం గల  మతశక్తుల చేత మలచబడుతుందో, అప్పుడు దాన్ని ఆపడం, కాపాడటం అనే అవసరం ఏర్పడుతుంది

సంస్కృతి అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. దాన్ని యధాతధంగా ఎవరూ కాపాడలేరు. అది ప్రతినిత్యం పరిణామం చెందుతూ ఉంటుంది. దాంట్లో ఎలాంటి తప్పూ లేదు. అది సహజ పరిణామం చెందుతూ ఉంటే, ప్రజలు కొన్ని ఎంపికలు చేసుకుని, తదనుగుణంగా వారి జీవితాల్లో కొన్ని మార్పులు చేసుకుంటారు. కానీ మీ సంస్కృతి ఎప్పుడైతే వ్యాపారశక్తుల చేత, దూకుడుస్వభావం గల  మతశక్తులు చేత మలచబడుతుందో, అప్పుడు దాన్ని ఆపడం, కాపాడటం అనే అవసరం ఏర్పడుతుంది. అది సహజ పరిణామం చెందుతూ ఉంటే, అప్పుడు ప్రజలు  తదనుగుణంగా తినడం,  బట్టలు  వేసుకోవడం,  పనులు చేయడం వంటి విషయాలలో భిన్నమైన ఎంపికలు చేసుకుంటారు – ఇలా జరగడం 100% సరైనదే. కానీ వ్యాపార శక్తులు సంస్కృతిని తమ ప్రయోజనాల కోసం మలుచుతున్నాయి. మీరు దీన్ని ఆపకపోతే, రేపు మీ కొళాయి తిప్పినప్పుడు, నీళ్ళకు బదులు ఎదో ఒక సాఫ్ట్ డ్రింక్ వస్తుంది. ఇండియాలో ఇది ఇప్పటికే జరుగుతోంది. ఇవ్వాళ  రెస్టారెంట్లలో వాళ్ళు, మీకు నీళ్ళు ఇవ్వడానికి బదులు సాఫ్ట్ డ్రింక్ ఇస్తున్నారు. కాబట్టి, వ్యాపార శక్తులకు సంస్కృతిని మార్చేచేందుకు ఒక పథకం ఉంది. అలాంటప్పుడు, దాన్ని అలా  జరగకుండా ఆపడానికి మీకు  కూడా ఒక ఒక పథకం ఉండాలి. దీనిని ఎలా చేయాలనేది ఒక ప్రశ్నార్థక విషయమే.

 సంస్కృతిని కాపాడటం కోసం నైతిక నిఘా అవసరం లేదు, కానీ కొన్ని వేల సంవత్సరాలుగా మనం ఆచరిస్తున్న వాటి యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కలిగించడం కచ్చితంగా అవసరమే.

 సంస్కృతిని కాపాడటం కోసం నైతికత నిఘా అవసరం లేదు, కానీ కొన్ని వేల సంవత్సరాలుగా మనం ఆచరిస్తున్న వాటి యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కలిగించడం కచ్చితంగా అవసరమే.  ప్రపంచంలో వివిధ రకాల సంస్కృతులు ఉన్నాయి. సంస్కృతి అనేది కేవలం ఒక సామాజిక కట్టుబాటో లేదా వాతావరణ పరిస్థితుల వల్లో, ఇతర ప్రభావాల వల్లో ఒక ప్రత్యేక రీతిలో జీవించడమో ఐతే, అది వేరే విషయం. కానీ భారతదేశ సంస్కృతి ప్రజల్ని  క్రమంగా ఆధ్యాత్మికత  వైపు మళ్ళించేటట్లు మలచబడింది. ఎల్లప్పుడూ, ప్రాచీన కాలం నుండీ, మీ జీవితంలోని ప్రతీ విషయం- ఎలా కూర్చోవాలి , ఎలా నిలబడాలి, ఇలా ప్రతీదీ మిమ్మల్ని ఆధ్యాత్మికత  వైపు మరలించేవిగా మలచబడ్డాయి. ఈ సంస్కృతిలోని ఎన్నో అంశాలు యోగశాస్త్రాన్ని ప్రజల జీవితాల్లోకి ప్రవేశపెట్టడం వల్ల ఏర్పడినవే. అంటే మీకు తెలియకుండానే మీరు మీ నిత్య జీవనంలో యోగసాధన చేస్తున్నారు. ఇది వేల సంవత్సరాల క్రితం నుండి వస్తోంది.  మానవ సంక్షేమానికి  సంబంధించిన ఎన్నో ప్రయోజనాలు ఉండటం వల్లే ఈ పద్ధతులు, కట్టుబాట్లు మీ జీవితంలోకి తీసుకురాబడ్డాయి. ఇప్పుడు కొన్ని వ్యాపారశక్తులు తమ ప్రయోజనాల కోసం ప్రతీ దాన్ని మార్చాలనుకుంటున్నాయి. దీన్ని మీరు ఎలాగో ఒకలాగ ఆపకపోతే, వాళ్ళు మన సంక్షేమం  కోసం ఏర్పరచబడ్డ  మన  సంస్కృతినంతటినీ నాశనం చేస్తారు.

ఈ సంస్కృతిలోని ఎన్నో అంశాలు యోగశాస్త్రాన్ని ప్రజల జీవితాల్లోకి ప్రవేశపెట్టడం వల్ల ఏర్పడినవే. అంటే మీకు తెలియకుండానే మీరు మీ నిత్య జీవనంలో యోగసాధన చేస్తున్నారు

కాబట్టి, సాంస్కృతిక పరిరక్షణ  కొంత వరకు  కచ్చితంగా అవసరమే. ప్రజలు తామే ఎంచుకుంటూ మెల్లగా మరొక సంస్కృతి వైపు వెళుతుంటే, అది ఎవరూ కలగజేసుకోవాల్సిన విషయం కాదు. ప్రతీ మనిషికి ఎంచుకునే హక్కూ, తన జీవితాన్ని తనకు తోచినవిధంగా మార్చుకునే హక్కూ ఉన్నాయి. కానీ ప్రస్తుతం, చాలా మంది ఎంచుకోవడం లేదు. వాళ్ళపై ఎంపికలు రుద్దబడుతున్నాయి. చాలా కంపెనీల్లో ఉత్పత్తి శాఖల కంటే మార్కెటింగ్ శాఖలే పెద్దవిగా ఉన్నాయి, వాళ్ళు ఊరికే ప్రచారం చేస్తున్నారు. ఇక వీటికి తోడు, మత శక్తులు కూడా ఈ దేశ సంస్కృతిని, ప్రజల మౌలిక జీవన విధానాన్ని మార్చేందుకు ప్రచారం చేస్తున్నాయి. దీనిని ఏదో ఒక రకంగా ఆపాలి, కానీ దాన్ని సున్నితంగా , విజ్ఞతతో చేయాలి. సాంస్కృతిక పరిరక్షణ గురించి కొంత అవగాహన కల్పించడం కచ్చితంగా అవసరమే.

కానీ దురదృష్టవశాత్తూ సమాజంలోని మంచివాళ్ళు గొంతెత్తరు కాబట్టి, మొరటువాళ్ళు వీధుల్లోకి వచ్చి వారికి తోచింది చేస్తున్నారు. మీరు దేన్నైతే నైతిక నిఘా అంటున్నారో, అది చాలా మొరటు పద్ధతుల్లో జరుగుతోంది కాబట్టి,  ప్రతీ ఒక్కరూ దాన్ని అసహ్యించుకుంటున్నారు. మంచివాళ్ళు మాట్లాడడం మొదలుపెడితే, ఈ వీధి రౌడీలకు అసలు ఆస్కారమే  ఉండదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు