సద్గురు: తన రాజ్యాన్ని త్యజించి, న్యాయంగా తనకు చెందవలసిన ప్రతిదాన్నీ విడిచిపెట్టి దూరంగా వెళ్లేందుకు సుముఖతతో ఉండిన వ్యక్తి పేరిట, శతాబ్దాలుగా, 2.77 ఎకరాల భూమి గురించి ఈ దేశం గాయపడుతూ ఉండడం అనేది ఎంతో విరోధాభాసం. అదే సమయంలో అతని పట్ల ఈ ఉపఖండంలోని లక్షలాది మంది హృదయాలలో ఉన్న అపూర్వమైన భక్తిని కూడా తక్కువగా అంచనా వేయలేము.

ముందుగా, నేను హిందూ సమాజానికి గానీ, ముస్లిం సమాజానికిగానీ మద్దతుదారునిగా భావించను అనే విషయాన్ని చెప్పనివ్వండి. ఒక యోగిగా, నేను ఏ ఒక్క విశ్వాసంతోనూ గుర్తింపు ఏర్పర్చుకోను. యోగా అనేది గుర్తింపులను తొలగించే శాస్త్రం, వాటిని పొందే శాస్త్రం కాదు. దక్షిణ భారతదేశంలో, రాముడి జన్మస్థలానికి సంబందించిన ప్రశ్న అంత పెద్ద భావోద్వేగ సమస్య కాదు అనేది కూడా వాస్తవమే. దక్షిణాన రాముడి భక్తులు ఎంతో మంది ఉన్నారు, కానీ ఒక పవిత్ర స్థలంగా అయోధ్య అనేది వారికి అంత పెద్ద ప్రాముఖ్యత ఉన్న ప్రదేశం కాదు.

ఏదేమైనా, నేను సుప్రీంకోర్టు వారి తీర్పును స్వాగతిస్తున్నాను అంటే, దానికి కారణం: ఈ దేశం యొక్క అభివృద్ధికి అడ్డంగా ఉన్న అవరోధాలు నిర్మూలించబడాలి అని కోరుకునే ఎంతో మందిలో, నేనూ ఒకడిని. 95 శాతం మంది జనాభా ఇలానే భావిస్తున్నారని నాకు తెలుసు. సమిష్టిగా, మనమందరమూ దీర్ఘకాలంగా తీవ్రమవుతూ ఉన్న ఈ సమస్యకు ఒక అంతిమ పరిష్కారానికి రావాలి అని కోరుకుంటున్నాము. సుప్రీంకోర్టు వారి తీర్పు ఇదే పనిని చేసింది. ఇది అందరూ స్వాగతించాల్సిన గొప్ప మైలురాయి వంటి తీర్పు.

ఎన్ని చెప్పినా, అతని కధ ఓ విజయ గాధను సూచించదు. వాస్తవానికి, అతని జీవితంలో అన్నీ వరుస విపత్తులే

మన వ్యక్తిగత విశ్వాసాలు ఏమైనప్పటికీ, ఈ నాగరకతకి మార్గదర్శకంగా నిలిచిన కథనాలలో రామాయణం ఒకటని మనం మర్చిపోకూడదు. 7,000 పై చిలుకు సంవత్సరాల నుండి మిలియన్ల మంది జీవితాలలో రాముడు ఎంతో ముఖ్యమైన ప్రభావాన్ని చూపాడు. అతను మతపరమైన వ్యక్తి కాదని గమనించడం చాలా ముఖ్యం. అతన్ని ఏ మతమూ కేవలం తమకే సొంతం అనరాదు. రామాయణ కథలో కూడా రాముడు ఏ సందర్భంలోనూ తనను తాను హిందువుగా ప్రకటించుకోలేదు. ఈ దేశానికి రాముడు సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక చిహ్నంగా ఉన్నాడంటే, దానికి కారణం - అతను చేసే అన్నింటిలో స్థిరత్వం, సమతుల్యత, శాంతి, సత్యం, ధర్మం, కరుణ ఇంకా న్యాయం ఉండడం వల్లనే. గొప్ప నాగరికతను నిర్మించడానికి అవసరమైన లక్షణాలను కలిగి ఉన్నందున మనము ఆయనపై పూజ్యభావమును చూపుతాము. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ రామరాజ్య ఉపమానాన్ని వాడారంటే, దానికి కారణం - ఈ గొప్ప వ్యవస్థాపక కధనం మన మన రక్తంలోనే ఉంది, ఇది మన సామూహిక మనస్తత్వాలలో లోతుగా పొందుపర్చబడి ఉంది. ఇటువంటి కథను ఆటంకపరచకుండా ఉండటం ముఖ్యం.

అవును, ఆధునిక మనస్తత్వానికి, మనం రాముడిని ఎందుకు ఆరాధిస్తామో అర్ధం కాక ఆశ్చర్యపడే అవకాశం ఉంది. ఎన్ని చెప్పినా, అతని కధ ఓ విజయ గాధను సూచించదు. వాస్తవానికి, అతని జీవితంలో అన్నీ వరుస విపత్తులే. ఒకే జీవితకాలంలో అన్ని దురదృష్టకర సంఘటనలను కేవలం కొద్ది మంది మాత్రమే ఎదుర్కున్నారు .. సింహాసనాన్ని అధిష్టించడానికి అతను చట్టబద్ధమైన వారసుడు అయినప్పటికీ, అతను తన రాజ్యాన్ని కోల్పోతాడు, అంతే కాదు అడవికి బహిష్కరించబడతాడు. అక్కడ అతను తన భార్యను పోగొట్టుకుంటాడు, ఆమెను తిరిగి పొందడానికి యుద్ధం చేస్తాడు, ఈ ప్రక్రియలో ఒక దేశం మొత్తాన్ని తగులబెడతాడు, ఆమెను తిరిగి తీసుకువస్తాడు, తన ప్రజల నుండి విమర్శలను, నిందలను ఎదుర్కొని ఆమెను మరోసారి బహిష్కరిస్తాడు! అంతకంటే దురదృష్టం: తనకు ప్రియమైన తన రాణి, విషాదకరంగా పిల్లలను అడవిలో ప్రసవించవలసి రావడం. ఇది చాలదు అన్నట్టు, వారెవరో తెలియక, రాముడు తన సొంత పిల్లలతో యుద్ధం చేస్తాడు. ఆపై చివరకు, జీవితంలో తాను ప్రేమించిన ఏకైక మహిళ, సీత, అడవిలో మరణిస్తుంది. స్పష్టంగా, ఇది ఒక విపత్తుల పరంపర, అంతే కాదు, ఆ మనిషి జీవితం ఓ భారీ వైఫల్యం. కానీ మనము అతన్ని గౌరవిస్తున్నామూ అంటే, దానికి కారణం – తాను జీవించిన విధానం: తన వైఫల్యాలతో తాను హుందాగా, ధైర్యంగా, ఇంకా స్థైర్యంగా వ్యవహరించిన విధానం.

ఈ నాటి ఆధునిక దృక్పదంతో చూసి ఈ కథను నేడు విమర్శించవచ్చు: సీత పట్ల రాముడు వ్యహరించిన తీరును మహిళల పట్ల అనుచితమైనదిగా మనము కొట్టిపారేయవచ్చు, లేదా వానరాల వర్ణనను నీచమైనదిగా మరియు జాతి అహంకారం కలిగినదిగా చూడవచ్చు. వాస్తవానికి, గతంలోని వారిని ఎవరినైనా ఎంచుకుని, వారిని విమర్శిండం అనేది చాలా తేలిక. అది కృష్ణుడైనా, యేసు అయినా, బుద్ధుడైనా, సమకాలీన దృక్పదంతో వారిని పరీక్షించి, ఏదో ఒక విధంగా వారు అసంపూర్ణమైనవారని, లేదా లోపాలు కలిగిన వారనీ తేల్చడం చాలా సులభం. కానీ మనము సీదాసాదా అభిప్రాయాలతో వీరిని తిరస్కరించే ముందు, మానవులకి ఆదర్శ చిహ్నాలు అవసరమన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. తమలో లోపాలుగా అనిపించే అంశాలు ఉన్నప్పటికీ, వీరు శతాబ్దాలుగా ఈ కీలకమైన పాత్రని పోషిస్తున్నారు.

రాజకుమారుడైన రాముడు, లక్ష్మణుడు మరియు సీతలను అయోధ్య నుండి 14 సంవత్సరాలు బహిష్కరించారు. దశరధ మహారాజు మరియు రాణులు విలపిస్తూ ఉండగా వారు అయోధ్యను విడిచిపెట్టారు (సౌజన్యం: రామాయణం, పరిచయ వాక్కులు: జెపి లాస్టీ, వివరణ: సుమేధ వి ఓజా, రోలీ బుక్స్, 2016)

రాముడిని ఇంత అసాధారణమైన వ్యక్తిగా నిలబెడుతున్నది ఏమిటో చూద్దాం. అనేక వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో పాలకులు కేవలం ఆక్రమణ కారులుగా ఉన్నప్పుడు - తరచుగా ఆటవికులకు ఏమీ తీసిపోని వారిగా ఉన్నప్పుడు – రాముడు ఆదర్శప్రాయమైన మానవత్వాన్నీ, త్యాగాన్నీ ఇంకా న్యాయాన్నీ ప్రదర్శించాడు. ఆయన్ని గౌరవించేది బాహ్య ప్రపంచాన్ని జయించినందుకు కాదు; ఆయన అంతర్ముఖ జీవితంలో విజేత అయినందుకు, ఎందుకంటే ప్రతికూలతల వల్ల అతను తన స్థిరత్వాన్ని ఏమాత్రం కోల్పోలేదు. ఆఖరికి రావణుడిని చంపినప్పుడు కూడా అతడు విర్రవీగలేదు, పడిపోయిన ఆ వీరుడి శరీరం దగ్గరకి వచ్చి, తాను ఇలా చేయవలసి వచ్చినందుకు పశ్చాత్తాప పడతాడు. తన జీవితంలో ఎదురైన అన్ని సవాళ్ళలోనూ, అతను ఎప్పుడూ తన సమతుల్యతను కోల్పోడు, ఎప్పుడూ ద్వేషాన్ని లేదా పగని పెంచుకోడు. అతను వంచన, రాజకీయ అవసరాల కోసం నైతికతను విడిచిపెట్టడం, అనేవి లేకుండా రాజ్యాన్ని నడుపుతాడు, ఇంకా అధికార దుర్వినియోగం అవ్వకుండా చాలా జాగ్రత్త వహిస్తాడు. శాంతమూర్తి, తన ప్రజల కొరకు తన సొంత ఆనందాన్ని త్యజించటానికి ఇష్టపడుతూ, చిత్తసుద్ది ఇంకా త్యాగం కలిగిన జీవితాన్ని గడుపుతూ, మార్గదర్శకంగా ఉండి నడిపిస్తాడు. అన్నింటినీ మించి, ముక్తి లేదా స్వేచ్ఛకి విలువ ఇచ్చే ఈ సంస్కృతిలో, ప్రతికూలత నుండి, స్వలాభం నుండి, నీచ - ప్రవృత్తి నుండి పొందిన స్వేచ్ఛకు అతను ఒక నిదర్శనం. కార్మిక ఒడిదుడుకులతో కూడుకున్న జీవితం, తన అంతర్ముఖాన్ని హైజాక్ చేసేందుకు అతను అనుమతించలేదు.

సంక్షిప్తంగా చెప్పాలంటే, రాముడు ఒక మార్గదర్శకుడు అయింది కొరతలేని జీవితాన్ని గడపడం వల్ల కాదు, ప్రశంసాయోగ్యమైన జీవితాన్ని గడపడం వల్ల. అందుకే ఆయనను మర్యాద పురుషుడిగా భావిస్తారు. రామరాజ్యం ఒక ఆదర్శంగా నిలుస్తుందీ అంటే, దానికి కారణం అది న్యాయమైన ఇంకా నిష్పాక్షికమైన రాజ్యానికి నిదర్శనం కాబట్టి, దౌర్జన్యం లేదా అజమాయిషీ కలిగి ఉన్న రాజ్యం కాదు కాబట్టి. ఈ రోజున మనం భారతదేశాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నది ఈ విధంగానే, అందువల్లే ఈ మహాకావ్యం శాశ్వతమైన ప్రాముఖ్యత కలిగినదిగా నిలుస్తుంది.

ఎంతో తీవ్ర భావోద్వేగ సమస్యను ఒక రియల్ ఎస్టేట్ సమస్యను పరిష్కరించే విధానంలో పరిష్కరించలేము. అలా చేస్తే, అది ఎప్పటికీ సంతృప్తికరంగా ఉండదని సొలొమోను పంచిన జ్ఞానం మనకి చెబుతుంది. ఇద్దరు మహిళలు ఆ బిడ్డ తమదేనని వాదిస్తూ వారుతెలివైన తమ రాజును సంప్రదించినప్పుడు, అతను ఆ బిడ్డని రెండుగా విభజించి, చెరుసగం తీసుకోమని చెప్తాడు. నిజమైన తల్లి వెంటనే అవతలి మహిళతో, ‘నా బిడ్డను మీరే తీసుకోండి. నేను నా బిడ్డకి అలా ఎప్పటికీ చేయలేను’ అంటుంది. ఊరికే ముక్కలు ముక్కలు చేయడం అనేది ఎప్పుడూ పరిష్కారం కాదు. ప్రతి ఒక్కరికీ అర్ధవంతం, గౌరవనీయం మరియు ఆమోదయోగ్యం అయినదే పరిష్కారం. సుప్రీంకోర్టు వారి తీర్పు మనకు దీనిని ఇచ్చింది. ఎంతో కాలం నుండి ఈ దేశానికి తీవ్రంగానూ, విస్తృతంగానూ నష్టాన్ని కలిగించిన ఒక సమస్యను ఇది నిర్ణయాత్మకంగానూ, నిస్పక్షపాతంగానూ అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని పరిష్కరించింది. రెండు వర్గాల బాధ్యతాయుతమైన సభ్యులూ ఈ తీర్మానాన్ని స్వాగతించారు. ఇప్పుడిక ముందుకు సాగవలసిన సమయం ఇది.

ప్రతి సమస్యకు పరిష్కారాలను కనుగొనవలసిన సమయం వచ్చింది. వలసరాజ్యాల పాలన ఈ రెండు వర్గాలను విభజించడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ, హిందువులు, ముస్లింలు ఇద్దరూ 1857 లో మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం అని పిలువబడే దానితో పోరాడటానికి కలిసి వచ్చారని మనం మర్చిపోకూడదు.

ఈ దేశంలోని ఒక నిర్దిష్ట విభాగం - అదృష్టవశాత్తూ, ఓ చిన్న భాగం - ప్రతి పరిష్కారంలోనూ సమస్యలను వెతకాలనుకుంటుంది. కానీ ఇప్పటివరకు ఈ మనస్తత్వాన్ని కలిగివున్నది చాలు. ప్రతి సమస్యకు పరిష్కారాలను కనుగొనవలసిన సమయం వచ్చింది. వలసరాజ్యాల పాలన ఈ రెండు వర్గాలను విభజించడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ, హిందువులు, ముస్లింలు ఇద్దరూ 1857 లో మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం అని పిలువబడే దానితో పోరాడటానికి కలిసి వచ్చారని మనం మర్చిపోకూడదు. మనల్ని విభజించడం ద్వారా మనల్ని బలహీనపరిచేందుకు వారు పన్నిన ఎత్తుగడకి లొంగడానికి మనము నిరాకరించాము. మనము మన సొంత కథను రాసుకోవాలని నిర్ణయించుకున్నాము. స్వాతంత్య్ర సంగ్రామంలో, మనము ఐక్యమై ఒక ప్రజానికంగా, ఒక దేశంగా, ఒక ఉమ్మడి లక్ష్యానికి కట్టుబడి ముందుకు సాగాము. మళ్ళీ మరోసారి అలా చేయవలసిన సమయం ఆసన్నమయింది.

మనం, క్రోధము మరియు సంఘర్షణల గాథలను మళ్ళీ తెరమీదకు తెస్తూ, హింస మరియు ప్రతీకార కథలను మళ్ళీ మళ్ళీ ప్రస్తావిస్తూ చరిత్రలో పూర్వం అయిన గాయాల బాధను పునః ప్రారంభం చేస్తూ ఉండవద్దు. మిగిలి ఉన్న బాధ ఏదైతే ఉందో, దాన్ని నయం అవనిద్దాము. ఎవరి వారసత్వాన్ని వారు రక్షించడానికి ప్రయత్నిస్తున్నారో, ఆయన ఎవరి మీదా చెడు సంకల్పాన్ని గానీ, ఆగ్రహాన్ని గానీ కలిగి ఉండలేదు అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, హిందూ సమాజం బాధలో ఉన్నవారిని శాంతపరచాల్సిన సమయం ఇది. రాముడు ప్రదర్శించిన వినయాన్ని జ్ఞాపకం చేసుకుని, కృపా కృతజ్ఞతతో నమస్కరించ్చాల్సిన సమయం ఇది. అలాగే ఇక్కడి ముస్లిం సమాజం వారు కూడా తాము “ఈ భూమి మొత్తం ప్రార్థనా స్థలమే” అని చెప్పే బోధనకు వారసులమని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. దీనికి మించిన కలుపుకుపోయే వ్యాఖ్య మరొకటి లేదు.

సుప్రీంకోర్టు వారి తీర్పు ఒక మైలురాయి. దీని అర్ధం - మన గందరగోళానికి మనమే బాధ్యత తీసుకుంటున్నాము, ఈ బాధ్యతని మన పిల్లలపై, మనుమలపై మోపడానికి నిరాకరిస్తున్నాము అని. ఈ దేశంలో భవిష్యత్తు తరాలకు వారి వారి సొంత సమస్యలు ఉంటాయి, కానీ, కనీసం మనము ఒక ప్రాబల్యమైన సమస్యను వారిపై మోపడం లేదు. ఇకపై మన గతంచే బాధింపబడడాన్ని నిరాకరిద్దాం. అప్రస్తుతమైన చరిత్ర యొక్క కథనాలచే కుంటుపడేందుకు నిరాకరిస్తూ, వంతెనలను నిర్మించి, ముందుకు సాగవలసిన సమయం ఇది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు