మీరు దేనినైతే ‘నేను’ అని పిలుస్తారో, దేనినైతే మానవ శరీర నిర్మాణం అని పిలుస్తారో అది ఒక ప్రత్యేక ‘సాఫ్ట్-వేర్’ పని. మనకందరికీ తెలుసు ‘సాఫ్ట్-వేర్’ అంటే స్మృతి. అది ఒక వ్యక్తి శరీర నిర్మాణం కావచ్చు లేదా పెద్ద విశ్వ నిర్మాణం కావచ్చు, అది పంచభూతాలయిన ఐదు మూలపదార్థాలు – భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం తో నిర్మితమై ఉంటాయి. ఈ పంచభూతాలకు వాటిదైన ఒక స్మృతి ఉంటుంది. అవి ప్రవర్తించే తీరుకు గల కారణం అదే.

నీటికి జ్ఞాపక శక్తి ఉంటుంది కనుక దానిని ఎలా నిల్వ చేయాలన్న విషయమై మనం చాలా ఎరుకతో ఉండాలి.

ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ప్రయోగాలు జరిపి, శాస్త్రజ్ఞులు నీరు స్మృతి కలిగి ఉంటుందని, నీరు స్పృశించిన ప్రతి విషయాన్ని గుర్తుంచుకుంటుందని కనుగొన్నారు. మన సంస్కృతిలో మనకు ఈ విషయం ఎప్పటి నుండో తెలుసు. ఎవరు పడితే వారు ఇచ్చిన ఆహారం లేదా నీటిని తీసుకోవద్దని మన నానమ్మలు, అమ్మమ్మలు చెబుతుంటారు. మన మీద ప్రేమాభిమానం గల వారి చేతినుండి మాత్రమే మనం ఏదైనా తీసుకోవచ్చునని  చెబుతారు. గుడిలో, తీర్థంగా ఇచ్చే ఒక చుక్క నీటి కోసం కోటీశ్వరుడు కూడా పోటీపడుతాడు ఎందుకంటే ఇది మీరు బయట కొనగలిగేది కాదు. దివ్యత్వ స్మృతి ఆ నీటికి ఉంది. అదే తీర్థం అంటే. ప్రజలు ఈ తీర్థాన్ని త్రాగాలని కోరుకుంటారు. అందువల్ల వారిలో ఉన్న దివ్యత్వాన్ని వారు గుర్తు చేసుకుంటారు. దానికున్న స్మృతిని బట్టి, ఈ H2Oనే విషంగానూ మారగలదు లేదా జీవితానికి అమృతమూకాగలదు.

నీటికి జ్ఞాపక శక్తి ఉంటుంది కనుక దానిని ఎలా నిల్వ చేయాలన్న విషయమై మనం చాలా ఎరుకతో ఉండాలి. మీరు నీటిని రాగి పాత్రలలో రాత్రంతా లేదా కనీసం నాలుగు గంటల పాటు నిల్వ చేసి ఉంచితే, ఆ నీరు రాగి నుంచి కొన్ని ప్రత్యేక లక్షణాలు సంతరించుకుంటుంది. అలాంటి నీటిని తాగడం వల్ల అది మీ శరీర ఆరోగ్యానికీ, ముఖ్యంగా కాలేయానికి ఎంతో మేలు చేయడంతో పాటు శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది. నీటిని పంపులతో బలంగా తోడి, అది ప్లాస్టిక్ పైపుల ద్వారా మలుపులు తిరుగుతూ ప్రయాణిస్తే, అటువంటి నీటికి చాలా ప్రతికూలత కలుగుతుంది.

నీటికి జ్ఞాపక శక్తి ఉన్నట్లే ఎంత పైపులలో ప్రయాణం చేసినా దాని సహజ స్థితికి మారే గుణం కూడా అది కలిగి ఉంది. మీరు ఒక గంట సేపు నీటిని అలా ఉంచితే, దానికి గల ప్రతికూలతను సరిదిద్దుకొని దాని సహజ స్థితికి మారుతుంది. నాలాగానే మీరూ నిరంతరం ప్రయాణంచేస్తూ ఉన్నట్టైతే, మీరు తీసుకునే భోజనం నియంత్రణ లో లేకపోతే, ఆమ్లాలు వివధ రూపాలలో మీ శరీరంలో చేరుతాయి. రాగిపాత్ర లో నిల్వ చేసిన నీరు ఇటువంటి ఆమ్ల పదార్దాలను తొలగిస్తుంది.