ప్రేమకి, ప్రేమించేది అలాగే ప్రేమించబడేది అనేవి రెండు కావాలి. అదెలా అంటే నేను మాట్లాడాలనుకుంటే, నాకు మాట్లాడేందుకు ఒకరు కావాలి. ఈ రోజుల్లో వాళ్లతో వాళ్ళే మాట్లాడుకుంటూ వీధుల్లో నడుచుకుంటే వెళ్ళే మనుషుల్నిమీరు చూస్తున్నారు. పదేళ్ళ క్రితం, ఈ పనిని నిస్సంకోచంగా పిచ్చితనం అని పిలిచేవాళ్ళు, కానీ ఇవాళ మాకు తెలుసు మీరు హ్యాండ్స్ ఫ్రీ ఫోన్‌లో మాట్లాడుతున్నారని.  తమతో తాము మాట్లడుకోనంతవరకు, మామూలుగానే పరిగణిస్తారు. కానీ, ఒక్కసారి అలా చేస్తే, ఇక ఆ మనిషికి "ఏదో అయిందని" మీరు అనుకుంటారు. కాబట్టి ప్రేమ అనేది ఒక విషయంపైనో, వ్యక్తిపైనో చూపించేది. మీపై మీరు చూపించుకొనేది కాదు.

మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటానికి మీరొక మార్గం కనిపెట్టడానికి కారణం - మీలో ఉన్న గాఢమైన ఒంటరితనపు భావన. 

‘నన్ను నేను ప్రేమిస్తున్నాను’ అనేది ఒక చెడ్డ ఆలోచన. ఇది ‘నేను నాతో మాట్లాడుకుంటాను’ లాంటిది. మీరు మీతో మాట్లాడుకుంటుంటే, ఒకటి రెండుగా మారుతుంది. ఇది ఒక మనిషిలో బాగా నాటుకుపోతే, అలాంటి వ్యక్తిని పిచ్చివాడని అంటాం. ప్రేమకు రెండు కావాలి, ఎందుకంటే ప్రేమనేది ఒక లావాదేవి. ‘నన్ను నేను ప్రేమిస్తున్నాను’ అనే విషయమే లేదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటానికి మీరొక మార్గం కనిపెట్టడానికి కారణం - మీలో ఉన్న గాఢమైన ఒంటరితనపు భావన, అలాగే మీ చుట్టూ ఉన్న వారెవరితోనూ సంబంధం నెలకొల్పకోవడానికి మీరు సిద్ధంగా లేకపోవడమే. మిమ్మల్ని మీరు ద్వేషించుకున్నా, మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నా, అదొక మానసిక స్థితి మాత్రమే. మీతో మీరొక ప్రేమ వ్యవహారాన్ని నడపలేరు.

ప్రస్తుతం ప్రజాదరణ కలిగిన ఒక తత్వ బోధన ఇలా చెప్తుంది - ‘మిమ్మల్ని మీరు ప్రేమించండి. మిమ్మల్ని మీరు నమ్మండి’ అని. మీకు ఏ విషయాలైతే తెలియవో, వాటినే మీరు నమ్ముతారు. ‘మిమ్మల్ని తెలుసుకోండి’. ఇది బావుంది. ‘మిమ్మల్ని మీరు నమ్మండి?’ ఈ ఆలోచనే వింతగా ఉంది ! నేను గ్రహించలేకపోతున్నాను అని మీరు ఎందుకు చెప్పరు. ‘నన్ను నేను నమ్ముతున్నాను, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను’ అన్నది ఖచ్చితంగా మిమ్మల్ని మీరు అయోమయంలో పడేసుకునే మార్గం. ఇలా చేస్తే, మీరొక వింత జాతిని సృష్టించినవారవుతారు.

ప్రేమలో ఎవరూ లేవరు; ప్రేమలో ఎవరూ పైకి పాకరు. మీరు ప్రేమలో పడతారు 

మీరెప్పుడైతే, ‘ నన్ను నేను ప్రేమిస్తున్నాను,’ అని చెప్తారో, ఇక మీరు ఎవరితోనూ సంబంధాన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడదు. మరెవరినైనా ప్రేమిస్తే జీవితమనే మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మీలో కొంత భాగాన్ని వదులుకోవాల్సి వస్తుంది. మీరు ఆ వ్యక్తి కోసం కొంత వెసులుబాటు కల్పించాలి. ఎప్పడూ నిజంగా ప్రేమించని వ్యక్తులే ప్రేమించడాన్ని ఒక సుఖం అనుకుంటారు. ప్రేమొక  సుఖం కాదు; ప్రేమ మిమ్మల్ని మీరు ఓడించుకునే ఓ మార్గం. మీరెంతగా ప్రేమిస్తే, అంతగా మీరు ముక్కలౌతారు. ఇందుకే ‘ప్రేమలో పడటం’ అనే మాట వచ్చింది. ప్రేమలో ఎవరూ లేవరు; ప్రేమలో ఎవరూ పైకి పాకరు. మీరు ప్రేమలోపడతారు. ఎందుకంటే, మీరు ‘నేను’ అనుకునేదానిలో కనీసం కొంతైనా పడిపోతేనే, అక్కడో ప్రేమ వ్యవహారానికి తావుంటుంది. మీరు మీలానే ఉంటూ ప్రేమించాలని ప్రయత్నిస్తూ ఉంటే, అసలేమీ జరగదు. మీరు దాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు. ప్రేమలోని అందం ప్రేమించే ప్రక్రియలో  మీరు పూర్తిగా నశించిపోవడమే. అది స్వీయ-నాశనానికై కలిగే బలమైన కాంక్ష. ప్రేమ వ్యవహారాలంటే అవే.

ఎప్పుడైతే మీరు ఇతరులకు ఒక ఇంచు కూడా స్థలమివ్వరో, అప్పుడే మీరు మీతో ప్రేమ వ్యవహారాన్ని మొదలుపెడతారు. ఆ తరువాత కొంతకాలానికి, మీరు రెండుగా అయిపోతారు, ఎందుకంటే ఏవైనా రెండు లేకపోతే ప్రేమే లేదు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించడానికి ప్రయత్నించకండి; మరెవరినైనా ప్రేమించడానికి ప్రయత్నించండి. మనుషులు మరీ అసాధ్యులనిపిస్తే, ఒక కుక్కతో ప్రేమలో పడటానికి ప్రయత్నించండి. ఇప్పటికే చాలామంది మనుషులపై ఆశలు వదులుకొని కుక్కల్ని ప్రేమించడం ప్రయత్నిస్తున్నారు, ఎందుకంటే ఒక కుక్క మిమ్మల్ని ఆదరించినట్టుగా మరెవరు ఆదరించలేరేమో. మీరు ఇంటికి రోజుకు ఐదు సార్లు వచ్చినా, ఆ ఐదు సార్లూ అది మిమ్మల్ని అత్యంత ఉత్సాహంతో స్వాగతిస్తుంది.

మిమ్మల్ని మీరు ప్రేమించలేరు. ఎందుకంటే మీలో మీరు ఇద్దరిని సృష్టించుకుంటారు.

దీన్ని మీకోసం ఎవరూ చేయరు, మీ భార్య, మీ బిడ్డ కూడా! కాబట్టి మీకు ఇంకొకరు మీ మీద శ్రద్ధ చూపించాలని చాలా తీవ్రంగా అనిపిస్తోంటే, కుక్క మీకు చాలా మంచిది. ఒక కుక్కను ప్రేమించడానికి ప్రయత్నించండి. అందులో విజేతలైతే, అప్పుడు మనిషిని ప్రేమించడం మొదలుపెట్టండి. కానీ మిమ్మల్ని మీరు ప్రేమించే ప్రయత్నం చేయకండి. అది చాలా అర్థరహిత ఆలోచన. మిమ్మల్ని మీరు ప్రేమించలేరు. ఎందుకంటే మీలో మీరు ఇద్దరిని సృష్టించుకుంటారు. ఒకసారి ఈ రెండూ స్థిరపడిపొతే, ఇక మీరు వ్యాధిగ్రస్తులవుతారు!

యోగా ద్వారా మనం అన్నిటిని ఒకటి చేయాలని చూస్తున్నాం. మీలో మీరు ఎన్నో విభజనల్ని చేయాలని చూస్తున్నారు. మీరొక ‘ఇండివిడ్యువల్’ (వ్యక్తి). ఆంగ్లంలో 'ఇండివిడ్యువల్' అంటే ఇక ఏ మాత్రం విభజించలేనిదని అర్థం. దాన్ని మీరు మరింతగా విభజించగలిగితే , ఇక మీరేమాత్రం ఒక 'ఇండివిజ్యువల్' కారని అర్థం. దానికి మీరు అన్నిటినీ కలుపుకోవచ్చు, కానీ దాన్నిక ఏమాత్రం విభజించలేరు. అలా చేస్తే మీరు వ్యాధిగ్రస్తులవుతారు.

ప్రేమతో,
సద్గురు