ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటి??

 

ఈ సృష్టి అంతా కూడా ఒక శక్తి ప్రకంపనే అని ఆధునిక శాస్త్రం చెప్తోంది. మీరు ఏదైనా ఒక శబ్దాన్ని ఉచ్చరించినపుడు, ఒక ప్రకంపన కలుగుతుంది. ఈ శబ్దాలని సంక్లిష్టంగా అమర్చడంవల్ల, ఒక మంత్రాన్ని సృష్టిస్తారు. ఈ మంత్ర ఉచ్ఛారణ వల్ల కొంత శక్తిని నిక్షిప్తం చేస్తారు. దీన్ని, మంత్ర-ప్రతిష్ఠ అంటారు. నాలాగ, ఎవరైతే అవన్నీ చదువుకోలేదో... నేను ఎటువంటి ఆధ్యాత్మిక పాఠశాలకు వెళ్లలేదు, నాకు తెలిసిందల్లా ఇదే... ఇదొక్కటే నాకు తెలిసింది. ఇది - ఆది నుంచి అంతం వరకు నాకు తెలుసు. నేను, నాలో ఉన్న ఈ జీవాన్ని ఇందుకు వాడతాను. నాకు మంత్రాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు – ఏవీ తెలియదు. నాకు తెలిసినదల్లా, ఈ జీవం మాత్రమే... ఇది ప్రాణం. నేను, నా ప్రాణాన్ని ఉపయోగించి చేస్తున్నాను.

ధ్యానలింగానికి, యోగేశ్వర లింగానికి వ్యత్యాసం ఏవిటి?

ధ్యానలింగం ఎంతో సున్నితమైన ప్రక్రియ. ఈ రోజున అక్కడ బాగా రద్దీ పెరిగిపోయింది. అక్కడ ధ్యానం చేసుకోడానికి ప్రజలు లైన్లో నించుంటున్నారు. యోగేశ్వర లింగం ఇంకా సరళమైన ప్రక్రియ. ఇది ప్రజలు తేలిగ్గా అనుభూతి చెందగలరు. ధ్యానలింగం ఎంతో సున్నితమైనది. ముక్తి కోసం సృష్టించబడినది. కానీ ఇది శ్రేయస్సు కోసం, మరి అన్నీ అంశాల కోసం సృష్టించబడింది. ధ్యానలింగం లో కూడా  ఈ అంశాలన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ ఎంతో సున్నితంగా ఉంటాయి. ఈ రెండిటినీ మనం పోల్చలేము. ధ్యానలింగం సృష్టించాలంటే దీనికంటే వెయ్యి రెట్లు కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈయన(ఆదియోగి) ప్రజలకు మరింత చేరువగా ఉంటారు.

భక్తి అంటే..

మీరు లయమైపోవడానికి ఒక సాధనమే - భక్తి. మీరు భక్తిలో ఉన్నప్పుడు, మీ గురించిన ఆలోచన మీకు ఉండదు. మీకంటే మరేదో మీకు ముఖ్యమయ్యింది – అని అర్థం. ప్రతీ ప్రాణికీ కూడా... వారి జీవితమే ముఖ్యమైనది.  భక్తి – అంటే మీ జీవితంలో మీరు మరొకదాన్ని ఎంతో ముఖ్యంగా చేసుకున్నారు - అని అర్థం. ఇది మీరు ఒక ఆలోచనాగా చూస్తే – మీకు హాస్యాస్పదంగా అనిపించవచ్చు. కానీ, దీనివల్ల మీ భావాలని మీరు ఎంత మాధుర్యంగా తయారు చేసుకుంటున్నారంటే, మీ జీవితానుభూతి ఎంతో అద్భుతంగా ఉంటుంది. భక్తిలో ఉన్నవారిని చూడండి; ఎప్పుడూ కవిత్వం రాస్తూ ఉంటారు. ఎందుకంటే, వారి జీవితంలో అంత మాధుర్యం ఉంటుంది.

ప్రేమలో పడ్డవారు కూడా ఇది చేస్తారు. కానీ, కొద్ది కాలానికి అదంతా ఎండిపోతుంది. కానీ , మీరు భక్తిలో ఉంటే అది ఎల్లప్పుడూ అలా పారుతూనే ఉంటుంది. ఎందుకంటే, మీలో మీరు ఒకరకమైన మాధుర్యానికి చేరుకున్నారు. మరొక కోణం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, ఏ రంగంలో అయినా సరే, ఎవరైనా గానీ, ఏదైనా విశిష్ఠమైనది వారి జీవితంలో సాధించాలనుకుంటే, వారు చేస్తున్న దానిపట్ల భక్తి లేకుండా చేయలేరు... కదా..?  భక్తి అనేది భగవంతునిపట్ల మీరు చూపించే భావన కాదు… భక్తి అనేది మీరు ఎలా ఉన్నారు అని... మీరు ఉన్న విధానమే భక్తి. మీరు భక్తిలో ఉన్నప్పుడు; అన్నిటిపట్ల ఎంతో నిమగ్నమై ఉంటారు. ‘మీరు ఎవరు’ అన్నది నిజంగానే బయటకు వ్యక్తీకరణం అవుతుంది. మీరు భక్తిలో లేనప్పుడు , మీరు కేవలం ఒక సగం మానవుడిగా మాత్రమే జీవిస్తారు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు