ప్రకృతి ఇంకా నిశ్చలతలోని లయ

మీరు ఏ లయకు అనుగుణంగా ఉంటారు? ప్రకృతిలో ఉండే అనేకమైన లయలను గురించి సద్గురు ఇక్కడ వివరిస్తున్నారు. వాటితోపాటు నిశ్శబ్దంలో ఉండే నిశ్చల లయ గురించి కూడా!
 

ప్రశ్న: సద్గురు, సృష్టిలో ఉండే లయకు అనుగుణంగా ఉండటం గురించి మీరు కొంత వివరిస్తారా?

సద్గురు: ఒక విధంగా మీకు లయ అంటే ఏమిటో ఒక అవగాహన ఉంది. లయ అనేది అనేక విధాలుగా మిమ్మల్ని స్పృశిస్తుంది. నిజం చెప్పాలంటే, మీరు శ్రద్ధగా వినాలే గాని, ఈ జగత్తులో దాదాపు ప్రతిదానికీ ఒక లయ ఉంటుంది. లోతుగా వెళ్లకుండానే, కేవలం మన చెవి గ్రహించగల ధ్వని తరంగాల విషయమే చూడండి. మీరు శ్రద్ధగా విన్నారంటే, వాటన్నిటిలో ఒక లయ కనిపిస్తుంది. కీటకాలు గీ అని రొద చేస్తూ తిరుగుతుంటే, అందులో ఒక లయ ఉంది. అదొకరకం వాద్య సంగీతం! రహదారి మీద వినిపించే హోరును జాగ్రత్తగా వినండి, అదొక రకమైన లయ! ఎక్కడినుంచి ఏ శబ్దం ఉత్పన్నమైనా, ఆ శబ్దానికి ఒక లయ ఉండి తీరుతుంది. మీరు వినే ప్రతి శబ్దానికి ఒక లయ ఉన్నది అంటే, ఆ శబ్దానికి కారణమైన పదార్థానికి కూడా ఒక లయ ఉండి తీరాలి కదా! పదార్థానికి లయ ఉన్నదంటే, ఆ పదార్థానికి కారణమైన పదార్థ మూలానికి కూడా లయ ఉన్నట్టే. పదార్థానికి ఒక లయ ఉన్నదంటే, ఆ పదార్థం ఎందులోనుంచి వచ్చిందో ఆ మూల ద్రవ్యంలోనూ లయ ఉన్నట్టే. ప్రశ్న ఏమిటంటే, మీరు ఏ లయకు అనుగుణంగా ఉన్నారు, అని.

మీరు ఏ లయకు అనుగుణంగా ఉన్నారు?

మనం సంగీతం ఎలా వింటామో గమనించండి. మా చిన్నతనంలో మా ఇల్లంతా కర్ణాటక సంగీతమయంగా ఉండేది. అది మా ప్రతి శ్వాసలోనూ భాగమైపోయి ఉండేది. మా నాన్నగారికి కర్ణాటక సంగీతమంటే చాలా అభిమానం. మరి మా రోజులకు 'రోలింగ్ స్టోన్స్' (Rolling Stones) సంగీతం వచ్చేసింది. మా నాన్న గారికి అదంటేనే పడదు. ఆయన కూర్చొని పేపరో పుస్తకమో చదువుకొంటూ ఉంటే, మేము మెల్లిగా పాశ్చాత్య సంగీతం పెట్టి, క్రమంగా ధ్వని పెంచేవాళ్లం. ఆయన ఆ రోజు వార్తలు చదవటంలో మునిగిపోయి ఉంటే, మేము మెల్లిగా ధ్వని పెంచుకొంటూ వెళ్ళేవాళ్ళం. ఆయనకు మా సంగీతం నచ్చదని మాకు తెలుసు, కానీ ఆయనకు తెలియకుండానే ఆయన పాదం ఈ సంగీతానికి తాళం వేయటం ఆరంభించేది. అది పట్టుకొనే వాళ్ళం మేం. 'చూడండి, చూడండి, మీరు పాదంతో తాళం వేస్తున్నారు!! అంటే ఈ సంగీతం మీకూ ఇష్టమనేగా?' అంటుండే వాళ్ళం. ఆ సంగీతంలో లయ అలా ఉంటుంది. శరీరం అప్రయత్నంగా తాళబద్ధమై కదులుతుంది. కొన్ని రకాల సంగీతంవింటున్నప్పుడయితే, మీ శరీరం నిశ్చలంగా ఉండిపోతుంది. ముఖ్యంగా ధ్రుపద్ సంగీతం అలా ఉంటుంది. సాధారణంగా ధ్రుపద్ సంగీతంలో పాట అంటూ ఉండదు, 'ఆ' అని మాత్రమే అంటూ ఆ ఒక్క శబ్దంతోనే చాలాసేపు ఆలాపన చేస్తారు. ఆరుగంటలు అలా 'ఆ' శబ్దంతోనే పాడేయగలరు వాళ్ళు. మీరు వింటూ ఉంటే, అలా నిశ్చలంగా కూర్చొనిపోతారు. ఆ సంగీతం వెనక ఉద్దేశ్యమే మిమ్మల్ని నిశ్చలంగా ఉంచటం.

లయ అనే దానిలో ఎన్నో స్థాయిల్లో ఉంటుంది. శరీరానికి సంబంధించిన లయ ఒక విధంగా ఉంటుంది. మనసుకుండే లయను మీరు స్పృశించగలిగితే, అది మరోలా ఉంటుంది. మీ ఆంతరికమైన జీవశక్తి తాలూకూ లయను గమనిస్తే, అది మరో రకంగా ఉంటుంది. మన అంతరాంతరాల లోతులు తాకగలిగి, మన మనుగడలో ఒక విశిష్టమైన కోణాన్ని ప్రభావితం చేయగల లయను పట్టుకోగలిగితే, అది మిమ్మల్ని ధ్యానోన్ముఖులను చేస్తుంది. ఓ రకంగా, మా 'క్రియలూ', ధ్యానాల ద్వారా మేము ప్రయత్నించేది కూడా అలాంటి ధ్యానోన్ముఖ స్థితి కలిగించటానికే. ఆ 'లయ'లోకి ప్రవేశింపజేయటానికే మా ప్రయత్నం. అది నిశ్చల నిశ్శబ్దతలో లయ! అది లయలన్నిటిలోనూ ఉత్కృష్టమైన లయ. ఏ ప్రకంపనలూ లేని నిశ్చలత్వంలో లయ ఎలా ఉంటుంది? అది అనాదిగా(మొదలు అనేది లేకుండా) వస్తూ ఉన్న లయ. ప్రతి శబ్దానికి ఒక మొదలూ, ఒక తుదీ అంటూ ఉంటాయి. నిశ్శబ్దమైన నిశ్చలతలోంచి ఉత్పన్నమయ్యే లయకు మాత్రం ఆదీ, అంతమూ ఉండవు.

ప్రకృతి పిలుపు!

ప్రకృతిలో లయ గురించి చెప్పాలంటే - ఇంగ్లీషులో 'నేచర్' (nature) అంటే, నేలా, నింగీ, చెట్టూ చేమా ఇలాంటివన్నీ. కానీ, ప్రకృతి అంటే కేవలం అదేకాదు. ప్రకృతి అనే మాటకు చాలా కోణాల నుంచి అర్థం చెప్పుకోవచ్చు - పాశవిక ప్రకృతి అంటాం, మానవ ప్రకృతి అంటాం, భిన్న ప్రకృతులు అంటాం. మన శరీరానికి ఒక 'సహజ ప్రకృతి'- తత్త్వం- ఉంటుంది. అలాగే మనసుకూ, భావోద్రేకాలకూ, జీవచైతన్య శక్తికీ, ఇంకా సృష్టి కర్తకు కూడా సహజ ప్రకృతి ఒకటి ఉంటుంది.

వీటిలో ఏ ప్రకృతికి మీరు స్పందిస్తారు? శరీరం తాలూకు సహజ ప్రకృతికి అనుగుణంగా స్పందిస్తే ఒక దోవలో, మనసు తాలూకూ సహజ ప్రకృతికి స్పందిస్తే మరో దోవలో, అలాగే చైతన్య శక్తి తాలూకు సహజ ప్రకృతి, భూమికి సంబంధించిన 'ప్రకృతి', అంతరాంతరాలకు సంబంధించిన 'ప్రకృతి', ఇవన్నీ భిన్న మార్గాలలో తీసుకువెళతాయి. అవన్నీ విభిన్నమైన కొన్ని విధాల ప్రకంపనల నుండి పుట్టే లయలే, కానీ ఈ ప్రకంపనలన్నిటిలో సర్వోత్తమమైనది నిశ్చలతలో ఉండే ప్రకంపన. దీనినే 'శివ' అనే నిశ్చల ప్రకంపనగా సంప్రదాయికంగా ప్రస్తావించటం జరుగుతున్నది. అది అనాది. అందుకే శివుడిని స్వయంభు (తననుంచి తానే పుట్టిన వాడు) అంటాము. ఆయనకు ఆది అంటూ లేదు. ఆయన అలా అవ్యక్త స్థితిలో ఉంటూనే ఉన్నాడు. తాను కోరుకొన్నప్పుడు వ్యక్తరూపం ధరిస్తాడు. మళ్ళీ ఇచ్ఛ కలిగినప్పుడు అవ్యక్తుడైపోతాడు. అంటే ఆయనను ఆయనే ఇచ్ఛానుసారం సృష్టించుకొంటాడు. తనంతట తానే ఉద్భవిస్తాడు, తనంతట తానే కరిగిపోతాడు.

ఇచ్ఛాపూర్వకంగా శరీర పునః సృష్టి

మీరు మీ అంతట మీరుగా, మీ ఇచ్ఛాపూర్వకంగా పుట్టలేదు. కానీ మీరు మీఅంతట మీరే కరిగిపోవచ్చు. మీకు మీ అంతట మీరు ఎలా కరిగిపోవచ్చో తెలిస్తే, మీ అంతట మీరు మళ్ళీ ఎలా పుట్టుకురావచ్చో కూడా తెలుసుకోవచ్చు. ఈ శరీర వ్యవస్థను ఒక పద్ధతి ప్రకారం విడదీయటం చేతనయిన వాడికి, మళ్ళీ ఎలా జోడించచ్చో కూడా తెలిసి ఉంటుంది. తన మనుగడ గురించిన నిర్మాణ రహస్యాలు తెలియనివారు చనిపోయేటప్పుడు వారికి ఒక రకమైన తీవ్రత లేదా ఎరుక ఉంటే, మరి ఇక తిరిగిరారు. ప్రయత్నపూర్వకంగా, ఈ వ్యవస్థను ఒక క్రమ పద్ధతి ప్రకారం విడదీసి, తన నిర్మాణానికి కారణభూతమైన విభిన్నమైన లయల పొరలన్నిటినీ చక్కగా అవగాహన చేసుకొన్నవాడు, అవసరమైతే తన ఇచ్చానుసారం ఈ వ్యవస్థనంతా పునర్నిర్మించుకోగలడు.

ఇలా తన శరీరాన్ని తాను పునర్నిర్మించుకోగల దశకు చేరుకున్న యోగిని 'నిర్మాణ కాయుడు' అంటారు. ఆయన మళ్ళీ పుట్టాలనుకొంటే, మాతృగర్భవాసం చేసి శిశువుగా పుట్టడు. తాను కోరుకొన్న రూపంలో పూర్వం ఎలా ఉండేవాడో అలాగే అవతరించగలదు. శివుడు అలా ఎన్నో సార్లు వచ్చి వెళ్ళాడు. తన వ్యవస్థను మళ్ళీ మళ్ళీ విడదీసుకొని, మళ్ళీ మళ్ళీ తనను తాను పునర్నిర్మించుకొన్నాడు. కొన్నిసార్లు, భిన్నమైన అవతారాలుగా అవతరించాడు. తన భార్యను కలిసే సందర్భాలలో ఒక సుందరమైన రూపం ధరించేవాడు. ఇతరులను కలవాల్సి వస్తే, అప్పుడప్పుడు ఉగ్రరూపం ధరించేవాడు. తన శరీర ఛాయ మార్చుకొనేవాడు. ఇతరలక్షణాలన్నీ కూడా మార్చుకోగలిగే వాడు. ఎందుకంటే అవ్యక్త రూపంనుంచి వ్యక్త రూపానికి మారగలిగేందుకు ఆయన తనను తాను పునర్ వ్యవస్థీ కరించుకోగలిగేవాడు.

ప్రకృతిలో లయ అని మనం మాట్లాడుకొనేటప్పుడు, ఆ ప్రకృతి కేవలం భూగోళానికి మాత్రమే పరిమితం కాదు. భూగోళం ముఖ్యమయిందే, కానీ ఈ ఉనికిలో అదొక చుక్క మాత్రమే. భూగోళం మీద మనుగడ సాగిస్తూ జీవితంలోని కొన్ని అంశాలను నిర్వహించుకోవాలంటే, భూగోళపు లయకు అనుగుణంగా ఉండటం అవసరం. అదే సమయంలో, లౌకికమైన పరిమితులు దాటి, మన మనుగడకు సంబంధించిన లోకాతీతమైన పార్శ్వాల గురించిన జ్ఞానం పొందాలంటే, మీరు మీ ఇచ్ఛా పూర్వకంగా నిశ్శబ్దంలోని నిశ్చల లయలో ఎలా ప్రవేశించచ్చో, దానిలోనుంచి తిరిగి ఎలా బయటకు రావచ్చో తెలుసుకొంటే, మీరు కోరుకొన్నప్పుడు అందులోకి వెళ్లగలుగుతారు, తిరిగి వెనక్కు రాగలుగుతారు. అలా మీరు కేంద్ర స్థానాన్ని పట్టుకొని, తిరిగి మీరు ఇప్పుడున్న స్థితికి రాగలిగితే, ఆ స్వేచ్ఛను అందుకోగలిగితే, అప్పుడిక మీరు అన్ని రకాలైన లయలనూ, మీ కావలిసినట్టు స్పృశించగలరు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1