సద్గురు: “పిల్లలను పెంచడం అనేది కొంత విచక్షణతో కూడిన విషయం. అందరు పిల్లలకూ వర్తించే ఒకేరకమైన నిర్దిష్ట నియమమ ఏదీ లేదు. ఒక్కొక్కరకమైన (రకరకాల) పిల్లలకు ఒక్కోరకమైన (రకరకాల) శ్రద్ధ, ప్రేమ, కాఠిన్యం అవసరం. నేను కొబ్బరి తోటలో నిల్చుని ఉన్నప్పుడు మీరొచ్చి "ఒక్కో మొక్కకు ఎంత నీరు కావాలి?" అని మీరడిగితే, నేను "మొక్కకు కనీసం 50 లీటర్లు కావాలి" అంటాను. మీరు ఇంటికి వెళ్లి గులాబీ మొక్కకు 50 లీటర్ల నీళ్లు పోస్తే అది చచ్చిపోతుంది. కాబట్టి మీ ఇంట్లో ఎటువంటి మొక్క పెరుగుతోంది, దాని అవసరాలేంటి అన్నది గ్రహించాలి.”

సూచన #1: మీ విశేషాధికారాన్ని గుర్తించండి.

మీ ద్వారా వచ్చిన ఈ గారాల పట్టి, మీ ఇంట్లో నడయాడుతుండడం మీ భాగ్యమని తెలుసుకోండి. పిల్లలు మీ ఆస్తి కాదు; మీ సొంతం కాదు. వారిని పెంచడంలో, వారికి ప్రేమాదరణలు చూపడంలో పొందే ఆనందాన్ని గురించి మాత్రమే ఆలోచించండి. మీ భవిష్యత్తుకు వారిని పెట్టుబడిగా చేయకండి.

సూచన #2: జోక్యం చేసుకోవద్దు

వారికి ఏమికావాలని ఉందో, అదే కానివ్వండి. జీవితం మీకు అర్థమైన రీతిలో వారిని తీర్చిదిద్దే ప్రయత్నం చేయవద్దు. జీవితంలో మీరు చేసినవే, మీ బిడ్డ చేయనవసరం లేదు. మీ పిల్లలు మీరు ఊహించడానికే సంకోచించే పనులు చేయాలి. అలా అయితేనే ఈ ప్రపంచం పురోగమిస్తుంది.

సూచన #3: వారికి నిజమైన ప్రేమని అందించండి

పిల్లలను ప్రేమించడమంటే వారడిగిందల్లా సమకూర్చడమే అనే దురభిప్రాయం ప్రజల్లో ఉంది. వారడిగిందల్లా ఇవ్వడం మూర్ఖత్వం కదూ? మీరు ప్రేమిస్తున్నప్పుడు, వారికి అవసరమయినది చేయవచ్చు. మీకు ఎవరిమీదైనా నిజమైన ప్రేమ ఉంటే, వారికి ఉత్తమమైనదే చేస్తూ, ఆ విషయంలో నిష్టూరాలు పడడానికి మీరు వెనుకంజ వేయరు.

సూచన #4: ఎదగడానికి తొందర పెట్టొద్దు

పిల్లలు పిల్లలుగానే ఉండడం చాలా ముఖ్యం. వారిని పెద్దవారిగా చేయడానికి తొందర లేదు. ఎందుకంటే తరువాత వారిని తిరిగి పిల్లలుగా చేయలేరుగా. పిల్లలు, పిల్లచేష్టలు చేస్తుంటే అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ వాళ్ళు పెద్దయ్యాక పిల్లచేష్టలు చేస్తే, అది బాగుండదు. పిల్లలు, పెద్దవారవడానికి తొందరేం లేదు.

సూచన #5: ఇది నేర్చుకునే కాలంగా చేయండి, బోధించేదానిగా కాదు

పసివారు వచ్చినప్పుడు, మీకు తెలీకుండానే నవ్వడం, ఆడడం, పాడడం, సోఫా కింద దూరడం లాంటి, మర్చిపోయిన ఎన్నో పనులు మీరు చేస్తూ ఉంటారు.

పిల్లలకు బోధించడానికి జీవితం గురించి మీకేం తెలుసు? బ్రతకడానికి ఉపయోగపడే ఏవో కొన్ని కిటుకులు మాత్రమే మీరు బోధించగలరు. మీ పిల్లలతో పోల్చుకుని, మీలో ఎవరు ఎక్కువ ఆనందంగా ఉన్నారో చూడండి. మీ పిల్లలే కదా? అవునా? ఆనందం గురించి మీ పిల్లలకే అధికంగా తెలిస్తే, జీవిత సలహా దారుగా ఉండే అర్హతలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? మీకా, మీ పిల్లలకా ? మీ జీవితంలోకి పిల్లలు వస్తే, అది నేర్చుకునే సమయం కానీ బోధించే సమయం కాదు. పసివారు వచ్చినప్పుడు, మీకు తెలీకుండానే నవ్వడం, ఆడడం, పాడడం, సోఫా కింద దూరడం లాంటి, మర్చిపోయిన ఎన్నో పనులు మీరు చేస్తూ ఉంటారు. కాబట్టి జీవితం గూర్చి నేర్చుకోవాల్సిన సమయమిది.

సూచన #6: వారిలోని సహజ ఆధ్యాత్మికతను పోషించండి

మీరు జోక్యం చేసుకోకపోతే, ఆధ్యాత్మిక సాఫల్యానికి పిల్లలు ఎంతో దగ్గరలో ఉంటారు. సాధారణంగా తల్లిదండ్రులు, అధ్యాపకులు, సమాజం, టీ.వీ.- ఇలా ఎవరో ఒకరు వారితో అతిగా జోక్యం చేసుకుంటారు. ఈ జోక్యాన్ని బాగా తగ్గించే వాతావరణాన్ని సృష్టించి, మీరు అనుకునే మతం అనే మూసలో కాకుండా, పిల్లలు తమ మేధాశక్తితోనే పెరిగే అవకాశాన్ని కల్పించాలి. ఆధ్యాత్మికత అన్న శబ్దానికి అర్థం తెలీకుండానే, పిల్లలు సహజంగానే ఆధ్యాత్మికులు అవుతారు.

సూచన #7: ప్రేమాదరణలుండే వాతావరణం కల్పించండి

భయాందోళనలతో కూడిన వాతావరణాన్ని మీరు సృష్టిస్తే, మీ పిల్లలు ఆనందంగా ఎలా ఉండగలరు? వాళ్ళు కూడా అవే నేర్చుకుంటారు. ప్రేమ, ఆనందాలతో కూడిన వాతావరణాన్ని సృష్టించడమే మీరు చేయవలసినది.

సూచన #8: స్నేహ సంబంధాలు ఏర్పరచుకోండి

యజమానిలా పిల్లలపై మీ అధికారం చలాయించడం మాని, ఒక గాఢమైన స్నేహాన్ని సృష్టించండి. కుర్చీలో కూర్చుని, వారు ఏమి చేయాలో నిర్దేశించవద్దు. పిల్లల కంటే క్రింద కూర్చుని, వారు మీతో సులభంగా మాట్లాడేట్లు చేయండి.

సూచన #9: మర్యాద ఆశించడం మానుకోండి.

పిల్లల నుండి ఆశించాల్సింది ప్రేమ కదా? కానీ ఎందరో పెద్దలు "నీవు నన్ను గౌరవించాలి" అంటుంటారు. కొన్ని సంవత్సరాల ముందు జన్మించడం, ఆకారంలో పెద్దగా ఉండడం, బ్రతుకు తెరువు కోసం మరికొన్ని మెళుకువలు తెలియడం తప్ప, మీ జీవితం వారికంటే ఏవిధంగా గొప్పది?

సూచన #10: మిమ్మల్ని మీరు ఆకర్షణీయంగా చేసుకోండి

మీ పిల్లలకు మంచి పెంపకం ఇవ్వాలని మీకు నిజంగా ఉంటే, ముందు మిమ్మల్ని మీరు శాంతస్వరూపులుగా, ప్రేమ మూర్తులుగా తీర్చిదిద్దుకోవాలి.

పిల్లలు అనేక విషయాల మూలంగా ప్రభావితులవుతారు – టీ.వీ, ఇరుగు పొరుగు వాళ్ళు, అధ్యాపకులు, పాఠశాల, ఇంకా లక్షలాది విషయాలు. వాటిలో, వారికి ఆకర్షణీయంగా కనబడిన వాటి వైపే వారు వెళ్తూ ఉంటారు. తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏమిటంటే, తల్లి తండ్రులతో గడపటమే పిల్లలకు అన్నిటికంటే ఆకర్షణీయంగా ఉండేట్లు, మిమ్మల్ని మీరు తీర్చి దిద్దుకోవాలి. మీరు సంతోషమైన, తెలివితేటలున్న, అద్భుతమైన వ్యక్తి అయితే, మీ పిల్లలు మరింకెక్కడా సహచర్యం కోరుకోరు. ఏమి కావాలన్నా వాళ్ళు మీ దగ్గరికే వచ్చి అడుగుతారు.

మీ పిల్లలకు మంచి పెంపకం ఇవ్వాలని మీకు నిజంగా ఉంటే, ముందు మిమ్మల్ని మీరు శాంతస్వరూపులుగా, ప్రేమ మూర్తులుగా తీర్చిదిద్దుకోవాలి.

ప్రేమాశీస్సులతో,

సద్గురు