ప్రశ్న: ఎవరో అన్నారు, 'శిశువు పుట్టగానే అది క్రమంగా ఎలా ఎదుగుతూ పోవాలో స్పష్టంగా తెలియజెప్పే సూచనావళి పుస్తకం (instruction manual) ఏదీ దానితో రాదు!' అని. ఒక వేళ, 'మనిషి జన్మించినప్పటినించీ మరణించేదాకా ఎలా ఉండాలి?' అని వివరించే పుస్తకం ఎవరైనా రాయాలనుకోండి, అది ఎలా ఉండాలి?

సద్గురు: ఖాళీ పుస్తకమైతే మంచిది. ఈ రోజుల్లో మీరు ప్రతి దాన్నీ ఓ యంత్రం లాగా మలచే ప్రయత్నమే చేస్తున్నారు. కేవలం ఇతగాడిని 'ప్రయోజనకరంగా' ఎలా వినియోగించుకోవాలి?” అన్న భావనను మించి ఎన్నో ఇతర అంశాలు ఒక మనిషిలో ఉన్నాయి. మనిషి మరెవరికో ప్రయోజనకరంగా ఉండి తీరాలనేమీ లేదు. అదెలా ఉంటుందంటే, బండికి కట్టిన ఎద్దులు బండిని లాగుతూ, అడవిలో స్వేచ్ఛగా గంతులు వేసే జింక పిల్లలను చూసి , 'అయ్యో, పాపం వీటి జీవితమంతా వ్యర్థం చేసుకొంటున్నాయి. వీటివలన ఎవరికీ ఏ ఉపయోగమూ లేదు కదా! ఎలాంటి దుస్స్థితి !' అని దిగులుపడినట్టుగా ఉంటుంది. జింక పిల్లలలో ఆనందం ఉంది. మిమ్మల్ని మీరే ఒక లాగుడు బండికి తగిలించుకొంటే ఇక మీలో ఆనందం ఉండదు.

మీరు ఏదో రకంగా ప్రయోజనకరంగా ఉండాలనే ఆరాటంతో ఆనందమే ఎరగని మనిషిగా అయిపోతే, జీవితానికి ఉద్దేశించిన ప్రయోజనాలన్నీ కోల్పోయినట్టే. మీరు చేసే పనికి అర్థమంటూ ఉండదు. మీ ముఖంలో నిరంతరం విషాదాన్ని నిలుపుకొని , ప్రపంచం కోసం ఏదేదో చేసినందుకూ మెచ్చుకొని, సంఘం మీకు ఏవైనా బిరుదులూ, బహుమతులూ ఇస్తే ఇవ్వచ్చు కానీ అది మీ జీవితములో వాటికి ఏ విలువా ఉండదు.

సూచనల పుస్తకాలు అవతల పారేయండి

మీ జీవితాన్ని మరెవరి తెలివితోనో చూడటం మానండి. మీ జీవితాన్ని మీరే మరింత తెలివిగా గమనించుకోండి. ఇతరుల ప్రభావాలు దూరంగా పెట్టగలగాలే గానీ, ఎవరి జీవితాన్ని వారు వివేకంతో పరీక్షించుకొనే పాటి తెలివితేటలు ప్రతివారికీ ఉంటాయి. ఎందరో ప్రాచీన, ఆధునిక ఆదర్శ పురుషులతో ప్రభావితం అవ్వడమన్నదే మీ సమస్య. దీని వల్ల మీ మనస్తత్వం 'అభిమానుల సంఘం' మనస్తత్వంగా మారిపోతున్నది. అభిమానుల సంఘం మనస్తత్వం ఇంకా అంతగా పరిణితి చెందని స్థితిలో ఉంటుంది.

ప్రతి సాధారణ శిశువూ ఒక సంపూర్ణమైన వ్యక్తిగానే లోకంలోకి వస్తుంది. మీరు చేయగలిగిందల్లా ఆ శిశువు తన పూర్తి సామర్థ్యానికి వికసించేందుకు తోడ్పడే పోషణ అందించటమే. ఒక రకమైన శిశువును మరొకరకంగా మార్చలేరు. మీ తోటలో మీరు కావాలనుకొన్నది ఒక కొబ్బరి చెట్టు, కానీ ఒక మామిడి మొక్క మొలిచిందనుకోండి. మీరేం చేస్తారు? అది కొబ్బరి చెట్టులా లేదు కనక దాని కొమ్మలన్నీ నరికేసి, ఒక్కటి మాత్రం మిగలనిస్తారా? అలా చేస్తే, పాపం, ఆ మామిడి చెట్టు ఎందుకూ కొరగాకుండా పోతుంది! మీరు చేయగలిగిందల్లా పిల్లలు మేధా శక్తి పరంగానూ, శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉండేందుకు కావలసిన పోషణ అందించడమే. అది జరగాలంటే , మీరు వాళ్ళ ఎదుగుదలకు అడ్డుపడకుండా , కేవలం పోషణను మాత్రమే అందిస్తూ ఉండాలి.

అనుకూలమైన వాతావరణం ఏర్పరచడం

పిల్లలు మీ ద్వారా లోకం లోకి వచ్చారు, మీలో నుంచి కాదు! వాళ్ళు మీ సొంతం అని ఎప్పుడూ అనుకోవద్దు. వాళ్ళు మీ ద్వారా లోకం లోకి రావటం మీకు లభించిన వరం. వాళ్ళకు అనుకూలమైన ప్రేమపూరితమైన వాతావరణం ఏర్పరచటం వరకూ మీ విధి. మీ ఆలోచనలూ, మీ భావోద్రేకాలూ, మీ భావజాల ధోరణులూ, మీ నమ్మకాలూ ఈ చెత్త అంతా వాళ్ళ మీద రుద్దద్దు. బిడ్డకు తన సొంత తెలివితేటలు ఉంటాయి. తన దోవ తను వెతుక్కోగలడు. ఆ తెలివితేటలు పూర్తిగా వికసించేందుకు అవసరమైన అనుకూల వాతావరణం మీరు ఏర్పరచగలిగితే, బిడ్డ తనకు తెలిసిన రీతిలో తనను నిభాయించు కుంటాడు.

'అయితే అంతా బాగానే జరుగుతుందా?' బాగా జరగచ్చు, జరగక పోనూవచ్చు. అసలు విషయం అది కాదు. కానీ, బాగా జరగక పోయేందుకు అవకాశాలు చాలా తక్కువ. బిడ్డ తన తెలివితేటలు తాను ఉపయోగించుకొంటూ పెరిగితే, ఎప్పుడయినా ఒక పొరపాటు చేసినా దానిని తన స్వబుద్ధితో తానే సరిదిద్దుకోగలుగుతాడు. పిల్లలు వాళ్ళ యోగక్షేమాలు సరిగా చూసుకొంటున్నంత సేపూ, వాళ్ళ జీవితాలకు హాని కలిగించని పనులేమీ చేసుకోనంత సేపూ , మీరు చూస్తూ ఊరుకోండి. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు మీరు ఎలా అయితే ఊరికే వేచి ఉన్నారో, బిడ్డకు ఇరవయ్యొక్క సంవత్సరాలు వచ్చేదాకా అలాంటి నిరీక్షణే చేయాలి. బిడ్డ గర్భవాసంలో ఉన్నప్పుడూ మీరేమీ చేయలేదు కదా! పోషణకు అవసరమైన ఆహారం మాత్రం తీసుకొంటూ, వేచి ఉన్నారు కదా! సరిగ్గా అలాగే తరవాత కూడా. అనుకూలమైన వాతావరణం అందించండి, వేచి చూడండి.

ప్రేమాశిస్సులతో,

సద్గురు