తమిళనాడులో జరిగిన ఒక అందమైన సన్నివేశం ఉంది. సమాజంలో అంటరానివాడు, ఒక కట్టుబానిస అయిన ఒకతను ఉండేవాడు. అతనికి పేరే లేదు. ఓ సమాజం ఎవరినైనా బానిసలుగా చేసుకోవాలనుకుంటే, చేసే మొట్టమొదటి పని ఏమిటంటే, వారికి పేరు అన్నది లేకుండా చెయ్యడం. ఎందుకంటే పేరు అనేది ఒక బలమైన గుర్తింపు. ముంబైని బాంబే గానూ, బెంగళూరుని బాంగ్లోర్ గానూ, తిరువనంతపురాన్ని ట్రివేండ్రం గానూ మార్చేశారు. ఈ మనిషికి పేరు లేదు. అందరూ అతనిని సాధారణంగా పాలేరు అని పిలుస్తూ ఉండేవాళ్లు.

బాల్యం నుంచీ, ‘శివుడు’ అన్న ఆలోచనే ఇతనిని అబ్బురపరచేది. ఒక కట్టు బానిసగా, అతనికంటూ సొంతమైన ఆలోచనలు ఉండకూడదు. కానీ, ‘శివుడు’ అన్న ఆలోచన అతనిని ప్రజ్వలింపజేసింది. ఇతను నివసిస్తున్న ప్రదేశానికి దాదాపు పాతిక కిలోమీటర్ల దూరంలో, ఇప్పుడు గొప్ప శివాలయంగా పేరు పొందిన తిరుపొంగూర్ ఆలయం ఉంది. ఇతనికి ఎప్పుడూ ఆ ఆలయాన్ని దర్శించాలన్న కోరిక. ఇతనికి, శివుడు తనను పిలుస్తున్నాడనిపించేది. కానీ, అతని జీవితం అతని సొంతం కాదు. అతను ఎటువంటి యాత్రా చెయ్యలేకపోయాడు.

తార్కికంగా ఆలోచించే మనసులతో వచ్చిన సమస్య ఏమిటంటే, మీకు ఏదైనా తృష్ణ కలిగినప్పుడు మీరు దానికి ఒక పిచ్చి సమాధానం ఇచ్చేసుకుని దానిని అక్కడికి-అక్కడే చంపేస్తారు.

ఎన్నోసార్లు తన యజమాని దగ్గరకు వెళ్ళి, “ నేను ఆ ఆలయానికి ఒక్కరోజు వెళ్ళి తిరిగి వచ్చేస్తాన” ని అడిగేవాడు. దానికి, ఆ భూస్వామి ఎప్పుడూ “ఈ రోజున కలుపుమొక్కలు పీకాలి, రేపు ఎరువులు జల్లాలి, ఎల్లుండి భూమి దున్నాలి. నువ్వు ఇలా ఒక్క రోజు కూడా వృధా చెయ్యడానికి వీలు లేదు. ఏమనుకుంటున్నావు..? ఇప్పటికే నీవు ఎందుకూ పనికిరావు. ఇంకా నీ జీవితంలో ఒక రోజంతా వృధా చేస్తావా..? లేదు” అనేవాడు. కానీ ఇతనిలో ఆలయానికి వెళ్ళాలనే తృష్ణ ఇంకా పెరగసాగింది. అతడు తిరుపొంగూరు లోని శివుడిని చూడాలనుకున్నాడు. ఒకరోజున ఏదో ఒక కొత్త శక్తి అతని శరీరమంతటా ప్రకంపించింది. అందుకని, అతను వెళ్ళి ఆ భూస్వామి ఎదురుగుండా కొంత హుందాతనంతో నించున్నాడు. సాధారణంగా కట్టు బానిసలకు ఇలాంటి హుందాతనం తెలియదు.

వెంటనే ఆ భూస్వామి మొదలు పెట్టాడు -  “మూర్ఖుడా క్రిందటిసారి మీ అమ్మకి వొంట్లో బాగోలేదు, అంతకు ముందర నీ తోబుట్టువు పెళ్లి, అంతకంటే ముందర నీ నాయనమ్మ చనిపోయింది. ఇప్పటికే మూడుసార్లు అయిపోయింది. ఇప్పుడు ఇంకా నువ్వు గుడికి వెళ్లాలనుకుంటున్నావు.” దీనికి అతను - “నేను ఇవాళ పని అంతా చేసేస్తాను. రేపు ఒక్క రోజు వెళ్ళి వస్తాన” ని అడిగాడు. ఆ భూస్వామి ఒక్క క్షణం ఏమరుపాటులో “సరే సాయంత్రంలోపు వెళ్ళిరా” అని అన్నాడు. వెంటనే అతను ఏమి చెప్పాడో తెలుసుకున్నాడు. అందుకని, “నువ్వు వెళ్ళేలోపల ఆ నలభై ఎకరాల స్థలం దున్నేసి వెళ్ళు. ఇప్పుడు సాయంత్రం కాబట్టి, నువ్వు పొద్దున్నలోపు ఆ పొలం దున్నేసి ఆ  తరువాత ఆలయానికి వెళ్లిపో” అని చెప్పాడు. ఆ పని చేసేందుకు ప్రయత్నం చేయడం మూర్ఖత్వమేనని అతును పని చేయడానికి ప్రయత్నించలేదు.

అతను వెళ్ళి పడుకున్నాడు. కానీ, అతని వ్యవస్థ అంతా ఒక కొత్త ప్రకంపనతో నిండి ఉంది. ఈ సారి అతను ఏది ఏమైనా సరే గుడికి వెళ్లితీరాల్సిందే అనుకున్నాడు. అతను పొద్దున్న లేచేసరికే అక్కడ గ్రామంలో అంతా కల్లోలంగా ఉంది. అతని ఆశ్చర్యానికి, ఆ నలభై ఎకరాలూ దున్నివేయబడి ఉన్నాయి. ఆ భూస్వామి, అక్కడ నోరు వెళ్లబెట్టుకుని నించున్నాడు. ఆ భూస్వామి భార్యా-పిల్లలూ ఈ పాలేరు కాళ్లమీద పడ్డారు. ఇతను ఏమనుకునేవాడంటే, “ఒకవేళ శివుడిని ఆర్థిస్తే  ప్రకృతి నియమాలు వంచుతాడేమో కానీ, ఈ మనుషులు ఎంత క్రూరమైనవాళ్ళంటే, వారిని ఎప్పటికీ మార్చలేము” అనుకునేవాడు. కానీ, ఈ సందర్భంలో శివుడు - మనుషులూ, దేవుడూ, ప్రకృతీ - అన్నిటి నియమాలూ కూడా వంచేశాడు. ప్రజలు వచ్చి అతని చేతిలో వెండి నాణాలు పెట్టారు. కొంతమంది అతనికి భోజనాన్ని అందించారు. మరొకరు వచ్చి అతనికి ఒక కర్ర ఇచ్చి “ఇతను ఆలయానికి వెళ్తున్నాడు ఎంతో ధన్యుడు. శివుడే తానుగా వచ్చి నలభై ఎకరాల భూమిని ఇతనికోసం దున్ని పెట్టాడు”-  అన్నాడు.

శివ దర్శనం కలిగించిన నంది

మనసులో ఎంతో ఆనందంతో ఇతను ఆలయానికి వెళ్ళాడు. కానీ జీవితమంతా సమాజంలో ఒక అంటరానివాడిగా జీవించడంవల్ల, అక్కడి పూజార్లు అతనిని  ఆ ఆలయం గుమ్మం దాటనివ్వరు అన్న విషయం అతను మర్చిపోలేదు. ఆలయం దగ్గర అలానే బయట నిలబడ్డాడు. శివుడు తన భక్తుడి కోసం అన్నిటినీ మార్చినా సరే, పూజార్లు దేనికీ మారరు కదా..!! అతను శివుడిని ఒక్కసారి చూడాలనుకున్నాడు. ఆ పెద్ద నంది ఏదైతే అక్కడ అడ్డుగా ఉందో, అది ప్రక్కకి జరిగింది. ఈ రోజుకి కూడా తిరుపొంగూరు నంది ఒక ప్రక్కకి కూర్చుని ఉంటుంది. ఆ తరువాత నుంచీ ప్రజలు, అతన్ని “నందనారు” అన్నారు. ఇతను ఒక గొప్ప సాధువు అయ్యాడు. మీరు, ఇతన్ని ఒక భక్తుడు అని అనలేరు. ఎందుకంటే ఇతని జీవితం అంతా కూడా ఒక తపన. ఈయన ఆ తపనని ఎప్పుడూ పోనివ్వలేదు.

తార్కికంగా ఆలోచించే మనసులతో వచ్చిన సమస్య ఏమిటంటే, మీకు ఏదైనా తృష్ణ కలిగినప్పుడు మీరు దానికి ఒక పిచ్చి సమాధానం ఇచ్చేసుకుని దానిని అక్కడికి-అక్కడే చంపేస్తారు. ఈ విధమైన తృష్ణతో ఎన్నో మనసులు అసలు జీవించనేలేవు. వారు వెంటనే ఏదో ఒక అర్ధం ఇచ్చేస్తారు. మీకు ఏదైనా కుతూహలం కలిగినప్పుడు ఏవో పిచ్చి ఆలోచనలతో దాన్ని అణచివేస్తారు. ఇది జీవితాన్ని త్రోసిపుచ్చడం లాంటిది. ఇలాంటి నిర్ధారణలతో మీకు మీరే ద్వారాన్ని మూసేసుకుంటారు. మనకు సమాధానం దొరకనివి ఎన్నో ఉన్నాయి. ఈ రోజున ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే, "మనకి ఈ విశ్వం యొక్క స్వభావం తెలియదు, అంతే కాదు మనం దానిని ఎప్పటికీ తెలుసుకోలేము కుడా" అని అన్నారు. అంటే సమాధానాలు లేని అన్ని ప్రశ్నలకూ మీ దగ్గర సమాధానం చెప్పేటంత మేధస్సుగానీ, మార్గం కానీ లేదన్న విషయం మీరు అంగీకరించాలి. అది మీకు మీరు నిజాయితీగా ఉండడం.

ఎవరైతే తనకు ఏమీ తెలియదు అని తెలుసుకుంటాడో, అతను నిజాయితీ ఉన్న మనిషి. ఎవరైతే ఏదో ఒక సమాధానాన్ని వెతుక్కుంటారో, వారు మూర్ఖులు. కానీ అలాంటివారు తాము ఎంతో తెలివిగలవాళ్లమనుకుంటారు. మీరు చెయ్యాల్సినదల్లా మీరు ఈ తృష్ణతో ఉండడమే..! మీ మనస్సు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, మీరు ఈ తృష్ణతో ఉండండి. కావలసింది ఇదే..!!

ప్రేమాశీస్సులతో,
సద్గురు