మీరు ఒక సంస్ధ యొక్క నాయకులైనా లేదా  సాధారణ ఉద్యోగి అయినా , మీ చుట్టూ ఒక అందమైన పని వాతావరణాన్ని సృష్టించే బాధ్యత మీ మీదనే ఉంటుంది.  అలాంటి వాతావరణాన్ని సృష్టించుకోవడానికి మనకు దోహదపడే  కొన్ని చిట్కాలను సద్గురు మనకు ఈ వ్యాసంలో అందజేస్తున్నారు. 


#1 “కష్టపడి” పని చేయటం మానండి!
work2

చిన్నప్పటి నుండీ ఎవరూ మనకు ఆనందంగా చదువుకోమని, ప్రేమగా పని చేయమనీ చెప్పలేదు. అందరూ మనకి, “కష్టపడి చదవండి!, కష్టపడి పని చేయండి!” అనే చెప్పారు. అందువల్ల అందరూ ప్రతిదీ కష్టపడి చేస్తున్నారు, చివరకు జీవితం సులభం కాదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిదీ కష్టపడి చేయటం అనేది అహం యొక్క స్వభావం. ఎందుకంటే అందరికన్నాఒక మెట్టు పైన ఉండాలన్నదే దానికున్న ఒకే ఒక్క ముఖ్యమైన లక్షణం. అలా జివించడం చాలా బాధాకరం. మీరు చేసేదంతా అలానే చేస్తున్నప్పుడు, ప్రతిదీ కష్టపడి చేయటం అనేది సహజంగానే సంతృప్తికి మూలకారణం అవుతుంది. మీరు ఏదైనా ఆనందంగా చేస్తే, మీకు ఏమీ చేసినట్లే అనిపించదు.

మీరు ఎంతో పని చేసి కూడా ఏమీ చేయని అనుభూతితో ఉండడం ఒక అద్భుతం, అవునా, కాదా? పని చేయడం అలా ఉండాలి. మీరు రోజుకి 24 గంటలు పనిచేయవచ్చు, కానీ మీకు ఏమీ చేసినట్లు అనిపించకపోతే, మీ మీద ఆ పనికి సంబంధించిన ఏ భారమూ ఉండదు. మీరు ఆ భారాన్నంతా మీ తల మీద మోస్తూ ఉంటే, మీ శక్తిసామర్ధ్యాలు ఎప్పటికీ వ్యక్తమవవు. ఇంకా మీకు మటుకు రక్తపోటు, మధుమేహం లేదా అల్సర్లు రావచ్చు.

#2 పోటీని దాటి వెళ్ళండి!

work3

నిజమైన మానవ సామర్ధ్యం పోటీలో వ్యక్తమవ్వదు. మీరు ఎవరితో అయినా పోటీ పడుతున్నప్పుడు, మీరు అతని కన్నా ఒక అడుగు ముందుండాలని అనుకుంటారు, అంతే! మీకున్న పూర్తి సామర్ధ్యత గురించి మీరు ఆలోచించరు. నిజమైన సామర్ధ్యం ఏ నిర్భంధతలూ లేని విశ్రాంత స్థితిలోనే వ్యక్తమౌతుంది. మీరు ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మనసు, శరీరమూ తమ పూర్తి సామర్ధ్యంతో పనిచేయగలుగుతాయి. సాధారణంగా మీరు మనుషులను విశ్రాంతిగా ఉండమంటే, వారు నిర్లక్ష్యంగా ఉంటారు. మీరు వారిని తీవ్రతతో ఉండమంటే, వారు ఒత్తిడికి గురవుతారు. మీరు ఈ తేడాని గమనించారా?  తీవ్రతతో ఉన్నప్పుడు కూడా విశ్రాంతిగా ఉండటం మీకు తెలవాలి. మీరు తీవ్రతతో, అదే సమయంలో విశ్రాంతిగా ఉండగలిగితే, మీకున్నసామర్ధ్యం పూర్తిగా ఉపయోగించుకోబడుతుంది.

#3  ఎల్లప్పుడూ ఒక స్వచ్ఛంద కార్యకర్తలా ఉండండి!

work4
మీరు స్వచ్ఛంద సేవ చేసినప్పుడు, మీ పనే ఒక సమర్పణ అవుతుంది. కానీ మీ ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ చేసే అదే పని మీకు భారమవుతుంది. అదేపని, అదేమీరు, కానీ చాలా తేడా. మీరు ఒక పనిని ఆనందంగానూ చేయగలరు, విసుగ్గానూ చేయగలరు. అందుకని మీరు మీ ఆఫీసులో చేసే ప్రతిదానిని కూడా ఒక సమర్పణగా ఎందుకు చేయకూడదు? అలా చేయకుండా మిమ్మల్ని ఏది ఆపుతోంది?

మీరు ఎల్లప్పుడూ ఒక స్వచ్ఛంద కార్యకర్తలా ఉండాలి. స్వచ్చందమంటే మీ జీవితాన్ని ఇష్టంగా నిర్వహించడం. ఇప్పుడు మీరు “నేను స్వ చ్ఛందకార్యకర్తని” అంటే దాని అర్ధం “ నేను చేసే ప్రతిదీ కూడా ఇష్టపూర్వకంగా చేస్తున్నాను!“ అని. అవునా, కాదా? కాబట్టి  ఇలా ఎంపిక చేసుకునే అవకాశం మీకుంది. మీరు మీ జీవితాన్ని ఇష్టంగా అయినా లేదా అయిష్టంగా అయినా నిర్వహించవచ్చు. అది మీరు ఇష్టంగా చేస్తే, అది ఒక ప్రేమవ్యవహారమై మీకొక స్వర్గంలా అనిపిస్తుంది. అదే మీరు అయిష్టంగా చేస్తే,  అది మీకొక నరకం అవుతుంది. ఒక స్వచ్ఛంద కార్యకర్త అవ్వటమంటే, ఎదో ప్రోగ్రాంలో గిన్నెలు కడిగి, కూరలు తరగటం కాదు. అది అన్ని రకాల పరిస్దితులను అంగీకరించి, మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని సరైన తీరులో ఇష్టంగా నిర్వహించుకోవడం, అయిష్టంగా కాదు. అయిష్టత ఏర్పడిన మరుక్షణం, మీ జీవితంలో ఎంతో అద్భుతమైనది జరుగుతున్నా కూడా మీరు జీవితంలో ఓడిపోయినట్లే భావిస్తారు.

#4 మీ సహోద్యోగుల ఉత్తమ సామర్ధ్యాన్ని వెలికి తీయండి!

work5

మీరు ఒక పరిశ్రమని నడుపుతున్నా, కుటుంబాన్ని నడుపుతున్నా, మీకు ఏదైనా పని పూర్తవ్వాలంటే లేదా మీ పక్కవారిలోని ఉత్తమ సామర్ధ్యాన్ని బయటకి తీయాలంటే, వారు మిమ్మల్నిఎదో విధంగా ప్రేమించాలి. కానీ వారు మీతో ప్రేమలో పడే ముందు, వారు ఎలాంటి వారు అన్న దానితో సంబంధం లేకుండా, మీరు వారితో ప్రేమలో పడాలి. అప్పుడే వారు మిమ్మల్ని ప్రేమించి , మీ కోసం వారు చేయగలిగినంత చేస్తారు.

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

సంపాదకుడి సూచన:
మీరు పనిచేసే చోట సంతోషకరమైన, మెరుగైన పని వాతావరణాన్ని సృష్టించడానికి మీకు ఏది దోహదపడింది? కింది కామెంట్స్‌లో మీ అనుభవాలు, చిట్కాలు దయచేసి మాతో పంచుకోండి!