Death-Book-Banner

 

మరణం, మరణించడం

సద్గురు: మరణం అనేది చాలా ప్రాథమిక ప్రశ్న. వాస్తవానికి, మరణం గురించి మనం చదివిన గణాంకాల కన్నా, మరణం మనకి మరింత దగ్గరగా ఉంటుంది. అవయవ స్థాయిలో, కణాల స్థాయిలో ప్రతి క్షణం, మనలో మరణం జరుగుతోంది. ఇందువల్లనే, కేవలం మీ లోపలున్న వాటిని ఒకసారి పరిశీలించడం ద్వారా, మీ వయస్సు ఎంతో మీ వైద్యుడికి తెలిసిపోతుంది. నిజానికి, మనలో మరణం అనేది మనం పుట్టక ముందర నుంచే మొదలైంది. మీరు అజ్ఞానంతో ఇంకా ఎరుక లేకుండా ఉన్నప్పుడు మాత్రమే, అది భవిష్యత్తులో ఏదో ఒక రోజున సంభవించేదిగా మీకు అనిపిస్తుంది. మీరు ఎరుకతో ఉంటే, జీవం, మరణం రెండూ కూడా, ప్రతి క్షణం జరుగుతూ ఉండడాన్ని మీరు చూస్తారు. కేవలం మీరు ఇంకొంచం ఎక్కువ స్పృహతో ఊపిరి పీల్చుకుంటే, ప్రతి ఉచ్ఛ్వాసంతో జీవం ఉందనీ, ప్రతి నిశ్శ్వాసంతో మరణం ఉందనీ మీరు గమనించవచ్చు.  

కేవలం మీరు ఇంకొంచం ఎక్కువ స్పృహతో ఊపిరి పీల్చుకుంటే, ప్రతి ఉచ్ఛ్వాసంతో జీవం ఉందనీ, ప్రతి నిశ్శ్వాసంతో మరణం ఉందనీ మీరు గమనించవచ్చు

పుట్టిన వెంటనే, పిల్లవాడు చేసే మొదటి పని శ్వాస తీసుకోవడం, గాలిని పీల్చుకోవడం. ఆలాగే మీ జీవితంలో మీరు చివరిగా చేసేది శ్వాస వదలడం. మీరు ఇప్పుడు ఊపిరి వదిలి, తరువాతి ఊపిరి తీసుకోకపోతే, మీరు చనిపోతారు. మీకు ఇది అర్ధం కాకపోతే, ఒక శ్వాస వదలి, మీ ముక్కును మూసి ఉంచండి తరువాతి శ్వాస తీసుకోకండి. కొద్ది క్షణాల్లో, మీ శరీరంలోని ప్రతి కణం, జీవం కోసం పెద్దగా గోల చేయడం ప్రారంభిస్తుంది. జీవం, మరణం అనేవి అన్ని వేళలా జరుగుతూనే ఉన్నాయి. అవి ఒకే శ్వాసలో విడదీయరాని విధంగా కలిసి ఉన్నాయి. ఈ సంబంధం శ్వాసకు అతీతంగా కూడా ఉంటుంది. శ్వాస కేవలం ఒక సహాయ నటుడు మాత్రమే. అసలైన ప్రక్రియ జీవ శక్తి లేదా ప్రాణం అనే దానికి సంబంధించినది. జీవ శక్తి లేదా ప్రాణం అనేదే భౌతిక ప్రక్రియను నియంత్రిస్తుంది. ఈ ప్రాణశక్తిపై కొంత ప్రావీణ్యాన్ని సంపాదిస్తే, శ్వాసకు అతీతంగా ఎంతో కాలం ఉండవచ్చు. శ్వాస అనేది తక్షణమే అవసరమయ్యే విషయం, అది ఆహారం, నీటి కోవకి చెందినదే.

మరణం ఎంతో ప్రాథమికమైన అంశం, ఎందుకంటే చిన్న విషయం ఒకటి జరిగితే, మీరు రేపు ఉదయం పోవచ్చు. రేపు ఉదయం దాకా ఎందుకు? ఇప్పుడు చిన్నదేదో జరిగితే, తరువాతి క్షణం మీరు పడిపోవచ్చు. మరే ఇతర జీవిలా అయినా మీరు ఉండి ఉన్నట్లయితే, మీరు ఇదంతా ఆలోచించలేకపోవచ్చు, కానీ ఒకసారి మానవ సహజమైన తెలివితేటలు కలిగి ఉన్నప్పుడు, మీ జీవితంలోని ఇంత ముఖ్యమైన అంశాన్ని మీరు ఎలా విస్మరించగలరు? మీరు దాన్ని విస్మరించి, మీరు ఎప్పటికీ ఇక్కడే ఉండబోతున్నట్లుగా ఎలా జీవించగలరు? కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న తరువాత కూడా, మానవులకు ఇంకా మరణం గురించి ఏమాత్రం తెలియక పోవడం ఏమిటి? అలా ఉంటే, వారికి జీవితం గురించి కూడా ఏమీ తెలీదు. జీవితంలోని పైపై అలంకారాలన్నీ మనకి తెలుసు, కానీ మీకు అసలు జీవం గురించి ఏమి తెలుసు?

ప్రాథమికంగా, ఈ విశ్వంలో మీరు ఎవరు అనే దృష్టికోణాన్ని మీరు కోల్పోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. మనం ఉన్న ఈ సౌర వ్యవస్థ రేపు ఉదయం ఆవిరైపోతే, ఈ విశ్వంలో ఎవరూ దీనిని కనీసం గమనించను కూడా గమనించరు. ఇది అంత చిన్నది, కేవలం ఒక చిన్న రేణువు. ఒక రేణువైన ఈ సౌర వ్యవస్థలో, భూగోళం మరింత చిన్నని రేణువు. ఆ చిన్ని రేణువులో, మీరు నివసించే నగరం ఇంకా, ఇంకా చిన్ని రేణువు. అందులో, మీరు ఒక పేద్ద మనిషి. అదే అసలు సమస్య. మీరు ఎవరు అనే దృష్టికోణాన్ని మీరు పూర్తిగా కోల్పోయినప్పుడు, జీవం యొక్క స్వభావం గురించిగాని లేదా మరణం యొక్క స్వభావం గురించిగాని మీరు ఏమాత్రమైనా గ్రహించగలరని ఎలా అనుకుంటున్నారు?

ప్రశ్న: కానీ సద్గురు, మరణం నన్ను ఎంతగానో బాధపెడుతుంది, ఆఖరికి అది బాల్కనీలో పావురం అయినా లేదా హైవే మీద కుక్క అయినా. నాకు ఈ విధంగా ఎందుకు అనిపిస్తుంది?

సద్గురు:: అన్ని భయాలకు మరణం మూలకారణం. మీకు మృత్యువు లేకపోతే, మీలో భయం అనేది ఉండదు, ఎందుకంటే ఆఖరికి మిమల్ని ముక్కలుగా నరికినా కూడా, మీరు చనిపోరు. కానీ ఇందులో భయపడటానికి ఏముంది? మరణం ఒక అద్భుతం. అది ఎన్నింటికో ముగింపు తెస్తుంది. ప్రస్తుతం, మీరు ఉన్న స్థితిలో, ఇది భయంకరమైనదని మీరు అనుకోవచ్చు, కాని మీరు వెయ్యి సంవత్సరాలు జీవించినట్లైతే, మీరు మరణాన్ని ఉపశమనంగా భావిస్తారు. మీరు ఇక్కడ మరీ ఎక్కువకాలం ఉంటే, మీరు ఎప్పుడు వెళ్ళిపోతారా అని ప్రజలు ఎదురు చూస్తుంటారు! మరణం ఒక గొప్ప ఉపశమనం. కాకపోతే అది అకాల మరణం కాకూడదు. మనలో సృజనాత్మక శక్తి ఇంకా ఉన్నప్పుడు, చుట్టుప్రక్కల మనం ఏదో చేయగలిగినప్పుడు ఇంకా క్రియాశీలంగా పనిచేయగలిగినప్పుడు మనం చనిపోవాలనుకోము.

 

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-9

మరణం అనివార్యం 

తగిన సమయంలో చనిపోవాలనుకుంటే, మీరు సాధన చేయాలి, తద్వారా ఎప్పుడు చనిపోవాలో మీరే నిర్ణయించుకోవచ్చు. లేదంటే, మీరు చనిపోయిన పావురాన్ని చూసినా కూడా, అది మీ మరణాన్ని గుర్తు చేస్తుంది. ఏదైతే నిన్న ఎగురుతూ ఉందో, ఈ రోజు అది చనిపోయి, ఎండిపోయింది. మీరు కూడా ఒక రోజు అలానే అవుతారని ఊహించుకోవడం అనేది మీకు భయంకరంగా ఉంటుంది, ఎందుకంటే మీరు పోగుచేసుకున్నదానితో మీ గుర్తింపు చాలా బలమైనది అయిపోయింది. మీరు సేకరించిన దానితో మీ గుర్తింపు అని నేను అన్నప్పుడు - ఈ ‘శరీరము’ అని మీరు అనేది కూడా, మట్టితునక మాత్రమే. మీరు మట్టిని సేకరించి ఈ శరీరంగా, ఇంకా మీ గుర్తింపులుగా మలుచుకున్నారు. అవి ఎంత బలంగా మారాయంటే, దానిని కోల్పోవడం ఒక భయంకరమైన విషయంగా అనిపిస్తుంది.

ఉదాహరణకి మీరు అధిక బరువు ఉన్నారని, మీరు ఓ పది కేజీలు తగ్గడానికి మేము సాయం చేసామని అనుకుందాం. మీరు ఆ తగ్గిన బరువు గురించి బాధపడిపోయి, ఏడుస్తారా? ఖచ్చితంగా కాదు, చాలా మంది పది కేజీలు తగ్గినప్పుడు, ఎంతో ఆనందం పొందుతారు. ఇప్పుడు ఒకవేళ మీరు మీ మొత్తం యాభై లేదా అరవై కేజీలను వదిలేశారనుకుందాం. అయతే ఇందులో పెద్ద విషయం ఏముంది? మీకు గనుక జీవం గురించి ఉన్నది ఉన్నట్టుగా తెలిసి ఉంటే, అలాగే మీరు పోగుచేసుకున్న దానిలో మీరు మునిగిపోకుండా ఉంటే, శరీరాన్ని వదిలేయడం అనేది అంత పెద్ద విషయం కాదు.

పక్షులు, కీటకాలు, కుక్కలు ఇంకా మానవుల మృతదేహాలు అనేవి కేవలం మట్టిని మట్టికి తిరిగి ఇవ్వడం మాత్రమే. అదేదో ఒక గొప్ప నాటకం కాదు, ఇది సహజమైన ప్రక్రియ. మీరు, మీరు తీసుకున్న దానిని తిరిగి ఇవ్వాలి, అది రీసైకిల్ అవ్వాలి. మీరు మీ పుట్టుక, జీవితం ఇంకా మరణానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చుకోవచ్చు, కానీ భూమాత విషయానికొస్తే, ఇది కేవలం రీసైక్లింగ్ మాత్రమే. అది మిమ్మల్ని అలా పైకి నెట్టి, తిరిగి మిమ్మల్ని లోనికి లాగేసుకుంటుంది. మీరు మీ గురించి ఎంతో ఎక్కువగా అనుకోవచ్చు, కానీ మీరు సేకరించిన వాటిని ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలి. అది మంచి పద్ధతి. మీరు వేరొకరి నుండి తీసుకున్న ప్రతిదీ, ఎదో ఒక సమయంలో తిరిగి ఇవ్వాలి. మరణం మంచి పద్ధతి, నన్ను నమ్మండి.

ప్రశ్న: కానీ మరణం గురించి తెలుసుకోవడానికీ, ఇంకా బాగా జీవించడానికీ మధ్య సంబంధం ఏమిటి?

సద్గురు: మరణం జీవానికి ఆధారం. మీరు మరణాన్ని అర్థం చేసుకోకపోతే, జీవాన్ని మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు, అలాగే సరిగా జీవించనూ లేరు, ఎందుకంటే జీవం, మరణం అనేవి ఉచ్ఛ్వాస నిశ్వాసల్లాంటివి. అవి రెండూ కలిసి ఉంటాయి వాటిని విడదీయలేము. ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది మీకు మరణం తారసిల్లినప్పుడే ప్రారంభమవుతుంది - అది మీ మరణం కావచ్చు, లేదా వారు లేకుండా జీవించలేనని మీరు అనుకున్న, మీకు ప్రియమైన వ్యక్తి మరణం కావచ్చు. చాలా మంది మనస్సులలో “అసలు ఇదంతా ఏమిటి? ఆ తరువాత ఏమి జరుగుతుంది?” అన్న ప్రశ్న వచ్చేది మరణం సమీపిస్తున్నప్పుడు లేదా అది సంభవించినప్పుడు మాత్రమే. జీవిత అనుభవం చాలా వాస్తవమైనదిగా అనిపిస్తున్నంతవరకు, అదంతా, ఊరికే అంతమైపోబోతుంది అని మీరు నమ్మరు. కానీ ఒకసారి మరణం దగ్గర పడినప్పుడు, మనస్సులో “దీనికి మించి ఖచ్చితంగా మరేదో ఉండి ఉండాలి” అన్న ఆలోచన వస్తుంది. ఎంత ఆలోచించినా సరే, మనస్సు అది తెలుసుకోలేదు, ఎందుకంటే మనస్సు ఇప్పటివరకూ సేకరించిన సమాచారం ఆధారంగా మాత్రమే పనిచేస్తుంది. మనస్సుకు మరణం గురించి తనదైన అవగాహన ఉండదు, ఎందుకంటే దాని వద్ద ప్రామాణికమైన సమాచారం ఏమీ లేదు - ఉన్నది కేవలం పనికిరాని కబర్లు మాత్రమే.

చనిపోయిన తరువాత మీరు వెళ్లి దేవుని ఒడిలో కూర్చుంటారు అన్న మాట విన్నారు కదా, మరి అలా అయితే, మీరు ఈ రోజే వెళ్ళిపోవాలి. అటువంటి భాగ్యం మీకు ఉంటే, మీరు దానిని ఎందుకు వాయిదా వేయాలో, కారణం నాకు కనపడడం లేదు. మీరు స్వర్గం, నరకం గురించి మాట్లాడటం విన్నారు. మీరు దేవదూతల గురించి ఇంకా మరెన్నింటి గురించో విన్నారు, కాని నమ్మకమైన సమాచారం మాత్రం లేదు. మరణించిన తరువాత ఏమి జరుగుతుందో ఆలోచించే ప్రయత్నంలో మీ సమయాన్ని వృథా చేసుకోకండి, ఎందుకంటే అది మీ మానసిక పరిధిలోనిది కాదు.

ఎరుకతో మరణించడం

తెలుసుకోవడానికున్న ఏకైక మార్గం ప్రజ్ఞ తోనే. ఆంగ్లంలో, మనం దానిని “awareness” అని అంటాము, కాని ఈ పదాన్ని దాని సాధారణ అర్థంలో తీసుకోకండి. మీరు ఎరుక(స్పృహ)తో ఉంటే, వాటి గురించి ఆలోచించకుండా, వాటి గురించి సమాచారం పొందకుండా, విషయాలను తెలుసుకునే మార్గం ఒకటి ఉంటుంది. మీరు మీ చుట్టూ ఉన్న జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తే, ప్రతి జీవీ కూడా, వాటి గురించి ఆలోచించకుండానే తెలుసుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి. వాస్తవానికి, మీరు ఆలోచిస్తే, మీకు ఎలా శ్వాస తీసుకోవాలో కూడా తెలీదు. దానికదే జరుగుతుంది. అది మీ తెలివితేటలు కాదు - అది సృష్టికర్త యొక్క మేధస్సు. మీ శరీరం వంటి సంక్లిష్టమైన యంత్రాన్ని, మీ నిర్వహణకి వదిలేస్తే, అప్పుడు అది ఒక విపత్తుగా మిగులుతుంది.

... జీవించడం, మరణించడం అంటూ ఏవీ లేవు. ఇదంతా లీల- ఒక నాటకం.

మీ సహాయం లేకుండా, మీ అవగాహన లేదా ఆలోచన లేకుండానే ఎన్నో జరుగుతాయి. ప్రజ్ఞ ఆలోచనకు అతీతమైనది. ప్రజ్ఞ అంటే సృష్టి యొక్క మూలం. మీరు దానిని అందుకోగలిగితే, జీవానికీ ఇంకా మరణానికీ మధ్య ఎల్ల అని మనం దేనినైతే అనుకుంటామో, దానిని దాటవచ్చు. వాస్తవానికి, అసలు ఎల్లలు లేవు - మీరు ప్రస్తుతం జీవిస్తున్నారు అలాగే మరణిస్తున్నారు కూడా. సామాజిక స్థాయిలో, ప్రజల పరిమిత అనుభవంలో, అవగాహనలో, ఒకరు ఈ రోజు ఇక్కడ ఉండి, రేపు పోవచ్చు. కానీ జీవ పరంగా, అస్తిత్వ ప్రక్రియ పరంగా, జీవించడం ఇంకా మరణించడం అనేవి ఏవీ లేవు. ఇదంతా లీల- ఒక నాటకం.

జగన్నాటకం

మనం ఇదంతా జగన్నాటకం అని అన్నప్పుడు, దానర్థం దైవం మీ జీవితంతో ఆడుకునే ఒక ఉన్మాది అని కాదు. ప్రతిదీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నది కాబట్టి మనం దాన్ని ఒక నాటకం అని అంటాము. ఉనికి పరంగా, మీరు బాల్యాన్ని, కౌమార్యాన్ని, మధ్య వయస్సుని ఇంకా వృద్ధాప్యాన్ని వేరు చేయలేరు - ఇవన్నీ ఒకదానిలోకి ఒకటి చొచ్చుకుని ఉంటాయి. దేనినైతే మీరు ఒక వ్యక్తి అంటారో, ఇంకా దేనినైతే మీరు విశ్వం అంటారో, ఆ రెండింటినీ విడదీయలేము. దేనినైతే మీరు పిండాండం అంటారో, ఇంకా దేనినైతే మీరు బ్రహ్మాండం అంటారో, ఆ రెండింటినీ విడదీయలేము. ఆ కోణంలో చూస్తే, అది ఒక నాటకం.

మరణం ఇంకా మరణానికి ఆవల ఉన్నది, ఎక్కడో స్వర్గం లేదా నరకంలో దాక్కున్న రహస్యం కాదు - అది ఇప్పుడే, ఇక్కడే ఉంది.

కానీ మీరు ఒకదానికీ, ఇంకా మరొకదానికీ మధ్య ఎల్లలు పెడితే, ఇక అప్పుడు ఆట ఉండదు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు, ‘శ్వాస’ మీకూ, ఆ చెట్టుకూ మధ్య ఆడుతూ ఉంటుంది. మీరు దానిని వేరు చేయలేరు, అంటే "నా శ్వాస నేను తీసుకుంటాను, తన శ్వాస తనని తీసుకోనివ్వండి." అనలేరు. ఇలా చాలా ఇళ్లల్లో జరుగుతోంది, "నా పని నేను చూసుకుంటాను - నీ పని నువ్వు చూసుకో" అని మీరు ఆటని పరిమితం చేయడానికి ప్రయత్నించిన క్షణమే, జీవితం మీనుండి చేజారిపోతుంది.

జీవన్మరణాల స్వభావాన్ని తెలుసుకునే ప్రయత్నంలో చాలా జరిగాయి. కానీ మీరు ప్రయోగాలు చేయడం ద్వారానో లేదా దాని గురించి ఆలోచించడం ద్వారానో దాన్ని గ్రహించలేరు. మీరు దానిని అనుభవం ద్వారా మాత్రమే గ్రహించగలుగుతారు. మరణం గురించి ఇంకా మరణం తరువాత ఏమి జరుగుతుందన్న దాని గురించి ప్రజలు నన్ను అడిగినప్పుడల్లా, దాని గురించి అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే మంచిదని నేను వారికి గుర్తు చేస్తూ ఉంటాను. వారు చనిపోవాలని నేను అనడం లేదు. నా ఉద్దేశ్యం ఏమిటంటే, మీరు మీలోని జీవాన్ని అనుభూతి చెందాలి. మీరు శరీరాన్ని మాత్రమే అనుభూతి చెందుతూ ఉంటే, నేను ఏమి చెప్పినా, మీరు తప్పుడు నిర్ధారణలకు వస్తారు. మీ జీవితానుభవం మీ మానసిక ఇంకా శారీరక నిర్మాణాలకు పరిమితం అయితే, మీరు ఈ పార్శ్వాన్ని తెలుసుకో లేరు. మరణం ఇంకా మరణానికి ఆవల ఉన్నది, ఎక్కడో స్వర్గం లేదా నరకంలో దాక్కుని ఉన్న రహస్యం కాదు - అది ఇక్కడే ఉంది. ఈ క్షణం అది ఇక్కడే ఉంది. కాకపోతే, చాలా మంది ఇతర విషయాలతో చాలా బిజీగా ఉన్నందువల్ల, వారు ఎప్పుడూ తగినంత శ్రద్ధ చూపలేదు.

వారికి వారి వృత్తి, వారి జీవితం కంటే చాలా ముఖ్యమైనది. వారి ప్రేమ వ్యవహారం వారి జీవితం కంటే చాలా ముఖ్యమైనది. పక్కనున్న వారితో వారికున్న చిన్న సమస్య వారి జీవితం కంటే చాలా ముఖ్యమైనది. వారు ధరించే బట్టలు వారి జీవితం కంటే చాలా ముఖ్యమైనవి. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. మీకు జీవితం గురించి తప్పుడు భావనలు ఉన్నాయి కాబట్టి, మీకు జీవితం దూరం అవుతూ ఉంది. కానీ వాస్తవానికి, జీవితం దూరం కావడం కాదు - మీరే జీవితం నుంచి తప్పించుకుంటున్నారు. జీవితం మిమ్మల్ని తప్పించుకునే ప్రయత్నించడం లేదు - మీరే దానినుంచి చాలా విధాలుగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

జీవితంలోని చేదైన, బాధాకరమైన అనుభవాలు ఎన్నడూ కూడా జీవం వల్ల సంభవించవు. అవి మనస్సును, మీ శరీరాన్ని నిర్వహించుకోడంలో మీకున్న అసమర్థత వల్ల మాత్రమే సంభవిస్తాయి. జీవితం ఎప్పుడూ కూడా మీకు బాధనో, దుఃఖాన్నో కలిగించలేదు. వాటిని కలిగించేది శరీరం, మనస్సు మాత్రమే. మీ మానసిక నిర్మాణాన్ని, మీ శారీరక నిర్మాణాన్ని ఎలా నిర్వహించుకోవాలో మీకు తెలియదు. మీకు రెండు అద్భుతమైన ఉపకరణాలు ఇవ్వబడ్డాయి, కానీ మీరు గందరగోళంలో పడుతున్నారు. అన్ని బాధలూ, దుఃఖాలూ మీ నుండే వచ్చాయి, జీవితం నుండి కాదు.

ప్రజ్ఞ అనేది తెలుసుకోగల మీ సామర్ధ్యానికి సంబంధించిన విషయం. అది జీవాన్నీ, జీవ స్వభావాన్నీ, ఇంకా జీవ మూలాన్నీ మీకు అందుబాటులోకి తెస్తుంది. ఇవి వేర్వేరు విషయాలు కాదు - ఇవి మనం జీవానికి ఆపాదించే భిన్నమైన పేర్లు మాత్రమే. మూలం అనేది లేదు, అభివ్యక్తమయ్యేది అంటూ ఏదీ లేదు - అంతా ఒకటే. జీవం ఇంకా మరణం అంటూ లేవు. ఇది జీవమూ కాదు, మరణమూ కాదు - ఇది ఈ వీటన్నింటి నాటకం మాత్రమే. మీరు దీనిపై ఆట ఆడవచ్చు, ఆ తరవాత ఒక రోజున దానిని ఆపేయవచ్చు. జీవం ఆడుతుందీ, ఆగిపోతుంది, ఆడుతుందీ, ఆగిపోతుంది, కానీ ప్రాధమికంగా జీవం అనేది ఒక నిర్దిష్టమైన చర్య కాదు, ఒక నిర్దిష్ట సంఘటన కాదు. అది ఒక అద్భుతం అంతే. అది సృష్టి నేపథ్యం. అది సృష్టి యొక్క మూలం.

ప్రశ్న: ఒక కారు నన్ను ఢీ కొట్టబోయి, కొద్ది క్షణాల వ్యవధిలో నేను తప్పించుకున్నప్పుడు, నేను దాదాపూ మరణం అంచులదాకా వెళ్లాను. ఆ కొద్ది సెకన్ల పాటూ, నేను ప్రతిదాన్నీ ఎంతో వివరంగా (స్లో మోషన్ లో), అనుభూతి చెందాను. ఆ కొన్ని సెకన్ల అనుభవం ఆ విధంగా ఎందుకు ఉంది, అలాగే జీవితాన్ని ఆ స్థాయి వివరాలతో నేను అనుభూతి చెందగలనా?

సద్గురు:: ఇది జరిగింది - ఇండియానాలోని ఒక చిన్న పట్టణంలో, ఇద్దరు వృద్ధులు స్థానిక బార్‌లో కలుసుకున్నారు. ఇద్దరూ రెండు వేర్వేరు టేబుల్స్ వద్ద మౌనంగా కూర్చుని, తాగుతున్నారు. అప్పుడు ఒకతను మరోకతని వైపు చూసాడు. అతని నుదిటి మీద పుట్టు మచ్చను చూశాడు. అతను అతని వైపు చూస్తూ, “హే, నువ్వు జాషువావా ?” అని అడిగాడు. "అవును, మీరు ఎవరు?" “గుర్తు పట్టలేదా? నేను, మార్క్ ని. మనిద్దరం కలిసి యుద్ధంలో పాల్గొన్నాం”. "ఓరి భగవంతుడా!" ఇక అప్పుడు, ఒక్కసారిగా వారిలో ఉత్సాహం వచ్చింది. “రెండవ ప్రపంచ యుద్ధంలో, మనిద్దరం కలిసి పాల్గొన్నాం. ఇప్పటికి యాభై సంవత్సరాలు గడిచిపోయాయి.”

వారు ఒకే టేబుల్ వద్ద కూర్చుని తాగడం, కబుర్లాడడం, తినడం ప్రారంభించారు. వారు యూరప్ లో, రెండవ ప్రపంచ యుద్దాన్ని నలభై నిమిషాల పాటు చూశారు. నలభై నిమిషాల భీకర పోరుని చూసారు. వారు ఈ నలభై నిమిషాల గురించి చాలా స్పష్టంగా రెండు గంటలకు పైగా మాట్లాడుకున్నారు. ఈ చర్చ అంతా పూర్తయిన తర్వాత, ఒకతను మరోకతన్ని, "అప్పటి నుండి నువ్వు ఏం చేస్తున్నావు ?" అని అడిగాడు. అతను, "ఆఁ, నేను ఒక సేల్స్ మెన్ గా ఉంటున్నాను"అన్నాడు. నలభై నిమిషాల యుద్ధం గురించి, వారు రెండు గంటలు గొప్ప ఉత్సాహంతో మాట్లాడారు. నలభై సంవత్సరాల జీవితం - "నేను ఒక సేల్స్ మెన్ గా ఉంటున్నాను." అంటూ ముగించేసాడు. ఇదే జరుగుతున్నది

సమాధి సాధన చేయడం

దురదృష్టవశాత్తు, చాలా మంది విషయంలో, మీరు వారిని మరణంతో బెదిరించినప్పుడు మాత్రమే వారిలో జీవం మేల్కుంటుంది - అది యుద్ధం కానివ్వండి లేదా కారు ప్రమాదమే కానివ్వండి. ఒకసారిగా, మరణం మీ ముందరికి వచ్చినప్పుడు, ఆ సమయంలోనే మీలోని జీవం పూర్తిగా మేల్కొంటుంది - ఇది దురదృష్టకరం! నిజంగా మీ మర్త్య స్వభావం మీకు ఎదురు పడినప్పుడు, మీ జీవం చాలా ముఖ్యమైన విషయం అని మీరు అర్థం చేసుకుంటారు.

sadhguru-wisdom-article-sadhguru-quotes-on-death-07

నేను ప్రజలను గమనిస్తున్నప్పుడు, వారందరూ సమాధి సాధన చేస్తున్నట్లు అనిపిస్తుంది - తమ సమాధిలో ఉన్నప్పుడు ఎలాంటి భంగిమలో ఉండాలి, ఎలాంటి ముఖ కవళికలను కలిగి ఉండాలి! అనేదానికి సాధన. వారు మర్త్యులని అర్థం చేసుకోరు. వారు, మేము ఇక్కడ ఎప్పటికీ ఉండిపోతాము అని భావిస్తారు, కాబట్టి వారు జీవించి ఉన్నప్పుడు మరణాన్ని ప్రాక్టిస్ చేస్తారు. కానీ మీరు వారిని మరణంతో బెదిరించినప్పుడు, వారిలో జీవం మేల్కుంటుంది. కృష్ణుడు తన బోధన ఇవ్వడానికి యుద్ధరంగాన్నే ఎందుకు ఎంచుకున్నాడని మీరు అనుకుంటున్నారు? ఒక ఆశ్రమ ప్రశాంతతలో కాదు, అందమైన అరణ్యాలలో కాదు, హిమాలయ గుహలో కాదు, కానీ వంచనతో నిండిన యుద్ధభూమిలో - ఎందుకంటే మరణ ముప్పు లేనిదే, తమ జీవితాన్ని చూసే తెలివితేటలు చాలా మంది మానవులలో లేవు.

ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వచ్చినప్పుడు, చాలా మంది జ్ఞానోదయం పొందే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను! అది అలవాటైన కొంత కాలం తరువాత, మీరు దాన్ని నమ్మేసి నిద్రించడం నేర్చుకుంటారు, అది వేరే విషయం, కానీ ప్రారంభంలో, అది బ్రేక్ వేస్తుందో లేదో మీకు తెలీదు. అది సమయానికి ఆగుతుందో లేదా గుద్దుతుందో మీకు తెలీదు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు చట్టబద్దమైన మొదటి కొన్ని నెలల్లో, ఈ భూమి మీద కొంత జ్ఞానోదయం కలగవచ్చని నేను అనుకుంటున్నాను! కొంతమంది జ్ఞానోదయం పొందిన వారిని చూసేందుకు మనం సిద్ధంగా ఉండాలి.

జీవంతో తృళ్ళిపడడం

come-alive-illustrative-image

ఏదో కారు ప్రమాదం కోసం వేచి ఉండకండి. ఇప్పటికిప్పుడే ఒరిగిపోయి, చనిపోయే అవకాశం ఉందని మీరు తెలుసుకోవాలి. మీకలా జరగాలని నేను కోరుకోవడం లేదు. మీకు దీర్ఘాయుష్షుతో ఉండాలని నేను ఆశీర్వదిస్తాను. కానీ అలా జరిగే అవకాశం మాత్రం ఉంది. ప్రతి రోజు చాలా మంది అలా చనిపోతారు. కూర్చుని, నిల్చుని, పడుకొని - వారు అన్ని రకాల భంగిమల్లో చనిపోతారు.

మీరు చనిపోయే అవకాశం ఉందని మీరు గ్రహించినప్పుడు, ఉన్నట్టుండి మీరు జీవాన్ని విలువైనదిగా భావిస్తారు, దానిపై ఆసక్తి కనబరుస్తారు. నేను ప్రజలకు గుర్తు చేస్తూనే ఉంటాను, ఈ విషయంలో జీవితంతో మీకు ఓటమి లేదు, అందరూ ఉత్తీర్ణులే అవుతారు. జీవితాన్ని సక్రమంగా నిర్వహించనందున వారి జీవితం ఆపివేయబడడం మీరు ఎప్పుడూ చూడలేదు, కదా? అందరూ దాటతారు. కానీ చాలావరకు వారు దేన్ని దాటుతున్నారో తెలియకుండానే దాటి వెళ్ళిపోతారు.

మీరు గుద్దుకోబోయే కొద్ది క్షణాల ముందు, మీరు దాటి వెళ్తూ ఉన్నారని మీకు తెలుస్తుంది. మిగిలిన సమయం అంతా, మీకు అది తెలియదు. ప్రస్తుతం, మీ మెదడు సృష్టించే నాటకం అన్నింటిపైనా వ్యాపించి ఉంది. అంటే, అల్పమైన మీ మానసిక సృష్టి, మనం జీవిస్తున్న ఈ అద్భుతమైన సృష్టిని ఆవహించి, దాన్ని కప్పేస్తూ ఉంది. మీ అల్పమైన సృష్టి విరిగి పడిపోయినప్పుడు, కేవలం పరిస్థితి వైపరీత్యం కారణంగా, మీరు ఆలోచించలేక పోయినప్పుడు లేదా భావోద్వేగాన్ని సృస్టించ లేకపోయినప్పుడు, అకస్మాత్తుగా మీరు నిజంగా సజీవంగా ఉన్నట్లు మీకు అనిపిస్తుంది..

మేము మీకు బోధిస్తున్న యోగా అంతా, మీకు దీక్ష ఇస్తున్న అన్ని ప్రక్రియలూ కూడా, మీ సొంత నాటకం నుండి మిమ్మల్ని కొంత దూరం చేసుకోవడంలో మీకు సహాయపడటం కోసమే, తద్వారా విశ్వ నాటకం మీ అవగాహనలోకి వస్తుంది. ఇది జరగకుంటే, ఈ జీవితానికి ఏమీ ఉండదు.

 

Death-Book-Banner