మానవ వ్యవస్థలో 72,000 నాడులు లేదా నాడీ మార్గాలు ఉన్నాయి. శక్తి ఈ మార్గాల గుండా కదులుతుంది. ఈ 72,000 నాడులు మూడు ప్రధాన నాడుల నుండి ఉద్భవిస్తాయి : కుడి ప్రధాన నాడిని ‘పింగళ’ అని, ఎడమ ప్రధాన నాడిని ‘ఈడ’ అని, మధ్యగా వెళ్ళే దానిని ‘సుషుమ్న’ అని అంటారు.

ఈ మూడు నాడులు శక్తి వ్యవస్థకు ఆధారభూతమైనవి లేక వెన్నెముక లాంటివి. పింగళను పురుషతత్వానికి సాంకేతికంగా సూచిస్తారు. ‘ఈడ’ను స్త్రీ తత్వానికి సాంకేతికంగా సూచిస్తారు. నేను ‘పురుష’, ‘స్త్రీ’ తత్వాలు అని అన్నప్పుడు, అది లింగ పరంగా చెప్పటం లేదు. ప్రకృతిలోని కొన్ని నిర్దిష్ట అంశాల గురించి మాట్లాడుతున్నాను. ప్రకృతిలోని కొన్ని గుణాలు పురుష తత్వంగా, మరి కొన్ని స్త్రీ తత్వంగా గుర్తించబడ్డాయి. ఈ రెండు నాడీ ప్రవాహాలు ఈ గుణాలను సూచిస్తాయి.

మీరు ఒక మహిళా లేక ఒక పురుషుడా అనేదానితో దీనికి సంబంధం లేదు. మీరు మగవాళ్ళు అయినా మీలో ఈడ ప్రబలంగా ఉండచ్చు 

మీ పింగళ ఎక్కువ ప్రకటితమయితే, అప్పుడు పురుషతత్వం, అంటే చొచ్చుకుపోయే స్వభావం, దూకుడు స్వభావం కొంచం ప్రబలంగా ఉంటుంది. ఈడ ఎక్కువ ప్రకటితమయితే, స్త్రీ తత్వం, అంటే స్వీకరించే, ప్రతిబింబించే గుణం ప్రబలంగా ఉంటుంది. మీరు ఒక మహిళా లేక ఒక పురుషుడా అనేదానితో దీనికి సంబంధం లేదు. మీరు మగవాళ్ళు అయినా మీలో ఈడ ప్రబలంగా ఉండచ్చు; మీరు ఒక స్త్రీ అయినా మీలో పింగళ ప్రబలంగా ఉండచ్చు.

పింగళ, ఈడలను సూర్యచంద్రులతో సూచిస్తారు – సూర్యుడు పురుషతత్వాన్ని, చంద్రుడు స్త్రీ తత్వాన్ని సూచిస్తాయి. సూర్యుడు దూకుడుగా, చొచ్చుకుపోతూ ఉంటాడు. చంద్రుడు ప్రతిబింబిస్తూ ఉంటాడు. చంద్రుని చక్రాలు స్త్రీల శరీరంతో అనుసంధానమై ఉంటాయి కూడా! మీ మెదడు స్థాయిలో పింగళ మీ తార్కిక పార్శ్వాన్ని సూచిస్తుంది. ఈడ మీ సహజజ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ రెండు ద్వందాలు మీ భౌతిక జీవితానికి ప్రాధమికమైనవి. ఈడ, పింగళ రెండూ పూర్తిగా సచేతనంగా, సరైన సమతుల్యంతో ఉన్నప్పుడు మాత్రమే, ఒక మనిషి జీవితం సంపూర్ణం అవుతుంది.

ఒకసారి సుషుమ్నలోకి శక్తులు ప్రవేశించగానే మీ చుట్టూ ఏమి జరుగుతున్నది అనేదానితో సంబంధం లేకుంగా మీలో ఒక సమతుల్యత ఉంటుంది. 

కేంద్ర నాడి అయిన సుషుమ్న మీ శరీరంలోని అతి ప్రధానమైన అంశం, ఇది సాధారణంగా అన్వేక్షించ బడనిదిగా మిగిలిపోతుంది. సుషుమ్న ఒక సంపూర్ణమైన, స్వతంత్రమైన వ్యవస్థ. కానీ అది మీ మొత్తం వ్యవస్థకే ఆధారమైనది. ఒకసారి సుషుమ్నలోకి శక్తులు ప్రవేశించగానే మీ చుట్టూ ఏమి జరుగుతున్నది అనేదానితో సంబంధం లేకుంగా మీలో ఒక సమతుల్యత ఉంటుంది. ఇప్పుడు మీరు తగినంత సమతుల్యతతో ఉండి ఉండచ్చు, కానీ బాహ్య పరిస్థితులు కొంచం తారుమారు అవ్వగానే మీరు కూడా తారుమారై పోతారు. అయితే మీ శక్తులు సుషుమ్నలోకి ప్రవేశించన వెంటనే, మీ అంతర్గత జీవన విధానం బాహ్య పరిస్థితుల నుంచి స్వేచ్ఛ పొందుతుంది.

ప్రేమతో,
సద్గురు