సాధకుడు: మనస్సు మాట వినేలా చెయ్యడం ఎలా..?

సద్గురు: మీ మనస్సు మీ మాట విననక్ఖర్లేదు. మీరు నిజానికి మనస్సు అని దేనినైతే పిలుస్తున్నారో - అది ఈ సమాజం చెత్తబుట్ట. మీ దగ్గర మనస్సు ఒక బుట్ట ఉంది. అందులో మీరెక్కడికి వెళ్ళినా సరే, చుట్టూ ఏమి జరుగుతున్నా సరే, పోగు చేస్తూ, పోగు చేస్తూ, పోగు చేస్తూ.. ఉన్నారు.  ఇప్పుడు మీకు ఉన్న మనస్సుని పరీక్షించి చూస్తే, మీ మనస్సు అన్నది మీరు ఎటువంటి వాతావరణంలో అయితే ఉన్నారో, దానిని బట్టే ఉంటుంది. ఉదాహరణకి, మీరు ఆఫ్రికాలో ఒక కుగ్రామంలో పుట్టినట్లైతే, మీరు మరో విధంగా ఆలోచిస్తూ, అనుభూతి చెందుతూ ఉంటారు. కదూ..? మీ మనస్సు అన్నది, కేవలం కొంత సమాచారం. ఇది, మీ జీవితానుభూతివల్ల వస్తుంది. ఇందులోపల చాలా వరకు మీ ఎరుక లేకుండానే వెళ్లింది. ఏదో కొద్దిగా మాత్రం ఎరుకతో వెళ్లింది. కానీ, చాలావరకూ ఎరుక లేకుండానే వెళ్లింది. మీరు ఇప్పుడు మీ మనస్సు అని దేనినైతే పిలుస్తున్నారో, అది ఒక సంక్లిష్టమైన ముద్రల సమూహం. అవి  మీ పంచేంద్రియాల ద్వారా మీ జీవితంలో, ప్రతీ క్షణం గ్రహించినవి.  మీరు ఏది చూసినా, ఏది విన్నా, ఏది వాసన చూసినా, రుచి చూసినా లేదా స్పర్శ చూసినా అది మీ మనస్సులోకి వెళ్తుంది.  ఇది కొంత సమాచారంగా అక్కడ ఉంటుంది. మీ లోనికి ఎటువంటి సమాచారం వెళ్లింది అన్న దానిని బట్టి,  మీరు ఒక రకమైన సంస్కారాలు ఏర్పరచుకుంటున్నారు. ఈ సంస్కారాలు ఒక రూపు దాల్చి, వాటిని మీరు మీ వ్యక్తిత్వం అని అంటున్నారు. ఇదంతా కూడా, మీరు ఎరుకలేకుండా పోగుజేసుకున్న ఒక చిందర-వందర. ఇదంతా కూడా, మీరు స్పృహతో పొగుజేసుకుని ఉండి ఉండొచ్చు.  కానీ, ఇదంతా కూడా ఎరుక లేకుండా పొగుజేయబడినదే..!

మీరు ప్రపంచంలోని చెత్త అంశాలన్నీ తీసుకుని వచ్చినా, ఏది ఏమిటీ అన్నది మీకు సరిగ్గా తెలిసినట్లైతే, అది మీ జీవితాన్ని పెంపొందించగలదు

ఇప్పుడు మీ మనస్సు మీ మాట విననక్ఖర్లేదు. మీ మనస్సు అన్నది కొంత సమాచారం. సమాచారం మాత్రమే. మీరు కనుక స్పృహతో ఉన్నట్లైతే, మీరు దానిని, మీ ప్రయోజనం కోసం, ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగిస్తారు. అదే, మీరు ఎరుకతో లేకపోయినట్లైతే, మీ వినాశనానికి ఉపయోగిస్తారు. ఈ ప్రపంచంలోని ప్రతీ విషయాన్ని- అది అందంగా ఉందా..? అసహ్యంగా ఉందా..? అని కాకుండా, మీకు దానిగురించి తెలిసినట్లైతే, దానిని ఎలా వాడుకోవాలో తెలిసినట్లైతే, అది మీకు ఉపయోగపడుతుంది. మీరు ప్రపంచంలోని చెత్త అంశాలన్నీ తీసుకుని వచ్చినా, ఏది ఏమిటీ అన్నది మీకు సరిగ్గా తెలిసినట్లైతే, అది మీ జీవితాన్ని పెంపొందించగలదు. మీరు దానిని స్పృహతో వాడినట్లైతే, ప్రతీదీ కూడా మీ జీవితాన్ని మెరుగుపరచగలదు. మీరు ఎరుక లేకుండా ఉన్నట్లైతే, ప్రతీదీ మీ జీవితానికి హానికరమే కావచ్చు. అందుకని  మీ మనస్సు మీ మాట వినక్ఖర్లేదు. మీ మనస్సు ఒక టేప్-రికార్డర్ వంటిది. అది అన్నిటినీ రికార్డ్ చేసి పెట్టింది. మీరు నిద్రపోతూ ఉన్నా, మెలకువగా ఉన్నా ఇది పని చేసింది. ఈ టేప్-రికార్డర్ ఎప్పుడూ పని చేస్తూనే ఉంది. ఇది ఎప్పుడూ మిమ్మల్ని వింటూనే ఉంది. వినడం మాత్రమే కాదు, ప్రతిదాన్నీ రికార్డ్ చేస్తూ ఉంది. ఇప్పుడు సమస్య ఏమిటంటే, మీ పర్మిషన్ లేకుండానే, ఇది రికార్డ్ చేసినవాటిని ప్లే కూడా చేస్తూ ఉంది. అది, రికార్డ్ చేసినవన్నీ ఊరికే అలా ప్లే చేస్తూ ఉంది.  మీకు నచ్చినా, నచ్చక పోయినా..! అది సరైన సమయమైనా, కాకపోయినా..!! అది రికార్డ్ చేసిన సంగీతమంతా కూడా ప్లే చేస్తూనే ఉంది. విషయం ఇదే.

జ్ఞానయోగి తన బుద్ధిని ఉపయోగించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈయనకి, మిగతావారంటే చిన్న చూపు.

ఇప్పుడు ఇది ఎలాంటిదో మనం ఒక ప్రయోగం చేసి చూడొచ్చు. మీరు, మీ కార్ ఎక్కారు. మీకు ఒక చోటికి వెళ్లాలని ఉంది.  మీకు ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్తుంటే ఫరవాలేదు. మీరు ఇటు వెళ్లాలనుకుంటే, అది మరెటో వెళ్తోంటే, అలాంటి వాహనం ప్రమాదకరమైనదే కదా..? ఇప్పుడు మీరు అలాంటి ప్రమాదకరమైన వాహనంలోనే ప్రయాణం చేస్తున్నారు. మీ వాహనం లోనికి మీరు రోజులో కొన్ని గంటలు ఎక్కుతున్నారు. దీనిద్వారానే మీ జీవితమంతా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ మనస్సు అనే వాహనం ద్వారానే, మీరు జీవితమంతా ప్రయాణం చేస్తూ ఉన్నారు.. కదూ..? మీకు దీని మీద కంట్రోలు ఉందా? కంట్రోలు లేని వాహనం ఉపయోగించి, మీరు ఎక్కడికో చేరుకోవాలనుకుంటున్నారు. ఇది అలా పని చేయదు. ఉదాహరణకు, మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారనుకోండి, అది కంట్రోల్ తప్పినప్పుడు, మొట్టమొదటిగా ఏమి చెయ్యాలనుకుంటారు..? బ్రేకులు వెయ్యాలనుకుంటారు. అది ఏమైనా సరే.. మీరు ఒకటే అనుకుంటారు. ఎలాగో-ఒకలా దానిని ఆపాలని..! ఇప్పుడు సరిగ్గా మీరు మీ మనస్సుతో, ఇదే అనుకుంటున్నారు. మీరు కనుక రోజులో కనీసం కొన్ని క్షణాలైనా ఎరుకతో మీ మనస్సుని ప్రశాంత పరచుకోగలిగితే, ఈ మనస్సనేది ఒక అద్భుతమైన సాధనమన్నది మీరు గుర్తిస్తారు. ఈ మనస్సు అనే అద్భుతాన్ని, మీరు ఇప్పుడు ఎంతో వినాశకరంగా వాడుతున్నారు. ఇది మీకు ఎంతో పారవశ్యాన్ని తెచ్చిపెట్టగలదు. ఇది దివ్యత్వానికి నిచ్చెన కాగలదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

Pixabay