మనీషా కోయిరాలా: భారతదేశం ఇంకా నేపాల్ ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత వారసత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా ఎందుకు మనం పశ్చిమ దేశాలవైపే చూస్తున్నాం?

సద్గురు: ఏదైతే సఫలం అవుతుందో అందరూ దాన్నే కోరుకుంటారు. ఈ రోజున పశ్చిమ దేశాలు విజానికి చిహ్నాలుగా మారిపోయాయి. అందుకే మనం ముప్పై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా జాకెట్టూ, టై వేసుకుంటున్నాం. దురదృష్టవశాత్తూ ఇవాళ, విజయం అంటే ఆర్ధిక విజయం తప్ప మరేదీ లేదు. దాని విషయంలో తర్జన భర్జనలు అవసరం లేదు. దాన్ని మనం ఒప్పుకుని, దానిపై స్వారీ చెయ్యటమే.

భారతదేశం గనుక ఆర్ధికంగా విజయం సాధిస్తే, భారతీయమైన విషయాలు మరింత ప్రాముఖ్యతను పొందుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా, దేశమంటే - పటంపై ఉన్న కొన్ని గీతాలు కాదు. దేశమంటే ఒక “భావన” అనే విషయం మనుషుల మనసుల్లోకి చేరాలి. ఆత్మగౌరవ నిర్మాణం జరగాలంటే, ఒక చరిత్ర కావాలి. వేరే ఏ దేశానికీ మన దేశాలకున్నంత చరిత్ర లేదు. ఉదాహరణకి, ఆంగ్కోర్ లో ఉన్న మందిరాలు, తమిళ రాజులు కట్టినవే. కానీ స్కూల్ లో చదువుకుంటున్న ఒక్క తమిళ కుర్రాడు కూడా దీని గురించి ఒక్క లైను కూడా చదవడు. మనం గర్వపడే ఏ ఒక్కటీ మనం చదవం.

ఆత్మగౌరవం ఆకాశం నించి ఊడిపడదు. మనం చరిత్రపుటల్లో దాచిన గొప్ప విషయాలన్నిటినీ బయటకు తీసుకురావాలి - ముఖ్యంగా యువతకి ఇవి తెలియాలి. మనం అటూ ఇటూ తప్పిపోయాం. ఆ కీర్తినీ గౌరవాన్నీ తిరిగి తేవటం ఈ సమయంలో చాలా అవసరం.