మహిళలు కూడా క్రియా యోగ మార్గాన్ని చేపట్టవచ్చా?

ఒక స్త్రీ కూడా క్రియ పధంలో పురోగమించవచ్చు కానీ 100% అలానే పురోగమించాలనుకుంటే, ఆమెకు భౌతికంగా కొంత ప్రతికూలత ఉంటుంది. ఆమెకు సహజసిద్ధంగా ఒక చిన్న వైకల్యం ఉంది కనుక ఆమె కొంచం ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది.
 

సాంప్రదాయ పరంగా క్రియా యోగా కేవలం పురుషుల కోసమే అని నమ్మేవారు. ఇది యోగా స్వభావం అటువంటిది అవ్వటం వల్ల కాదు, కానీ గతంలో సామాజిక పరిస్థితుల స్వభావం అలా ఉండేది. సాధారణ జీవిత పరిస్థితుల నుంచి దూరంగా ఉండటం క్రియ యోగాలో భాగంగా ఉండేది. అది ఈ సంస్కృతిలో స్త్రీలకు సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే వారికి ఎనిమిది, తొమ్మిది ఏళ్ళ వయస్సు వచ్చేసరికి పెళ్లి చేసేసేవాళ్ళు. ఆమెకు పదిహేను సంవత్సరాలు వచ్చేసరికి సాధారణంగా ఒక బిడ్డను కనేది. అలాగే చాలా మంది గురువులు రూపొందించిన క్రియ యోగా సాధనలు కూడా పురుషులకు సరిపోయేవిగా ఉండేవి. ఎందుకంటే వారి శిష్యులు మగవాళ్ళే ఉండేవారు. దానర్ధం స్త్రీలు ఎవ్వరూ క్రియ పధంలో నడవలేదని కాదు. కొంత మంది స్త్రీలు ఉన్నారు, కానీ వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నారు. అందువల్ల ఎక్కువ సాధనలు వారికోసం రూపొందించబడలేదు.

అవును, ఒక స్త్రీ కూడా క్రియ పధంలో పురోగమించవచ్చు కానీ 100% అలానే పురోగమించాలనుకుంటే, ఆమెకు భౌతికంగా కొంత ప్రతికూలత ఉంటుంది. ఆమెకు సహజ సిద్ధంగా ఒక చిన్న వైకల్యం ఉంది కనుక ఆమె కొంచం ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది.

ఏది ఏమైనా, ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి చెందాలంటే వాళ్ళు జీవితంలోని అన్ని అంశాలను కలగలుపుకుని, జ్ఞాన, కర్మ, క్రియ, భక్తి పార్శ్వాలతో సరైన సమ్మేళనాన్ని తయారుచేసుకోవటం ఉత్తమం. సాధారణంగా స్త్రీలలో భావోద్వేగ పార్శ్వం ఇతర పార్శ్వాలకంటే ఎక్కువ ప్రబలమైనది కనుక, దాన్ని ఉపయోగించుకోవటం మంచిది. ఒక మహిళా సాధకురాలికి కొంచం భక్తి ఉంటే ఆమె చేసే క్రియలు మరింత త్వరగా తేజోవంతం అవుతాయి. ఇది ప్రతీ స్త్రీ, పురుషుడికీ 100% వర్తించదు, కానీ మీరు పురుష తత్వం అని చెప్పుకునేది జ్ఞాన, క్రియ, కర్మల సమ్మేళనంతో ఎక్కువ సౌఖ్యంగా ఉంటుంది, అదే స్త్రీ తత్వం అయితే భక్తి, క్రియల సమ్మేళనంతో ఎక్కువ సౌఖ్యంగా ఉంటుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు