చాంద్రమాన క్యాలండర్ లో అమావాస్యకు ముందు వచ్చే ‘చతుర్దశి’ నెలలోని మిగతా రాత్రుల కన్నా చిమ్మచీకటిగా ఉండే రాత్రి. ఈ రాత్రిని శివరాత్రిగా పరిగణిస్తారు. మనం “శివ” అన్నప్పుడు,  ఒక అంశంలో ఆదియోగి గురించి మాట్లాడుతున్నాం. ఇంకొక అంశంలో, “శివ” అంటే “ఏదిలేదో అది” అని అంటున్నాం. ఉన్నది అంటే సృష్టి. లేనిది అంటే “శివ”. సృష్టి అంతా “శూన్యం” నుండే వచ్చిందని ఈ రోజున ఆధునిక శాస్త్రం కూడా చెబుతున్నది. ప్రతీది శూన్యం నుండి వచ్చి తిరిగి శూన్యంలో లయమైపోతుంది. శూన్యం అనేది సృష్టికి ఆధారం. అందుకని మనం శివుడిని సృష్టికి ఆధారంగా భావిస్తాం. అంటే ఏది లేదో అదే ఉన్నదానికి ఆధారం.

రాత్రిపూట మీరు ఆకాశం వంక పైకి చూసినట్లైతే, ఆకాశంలో వందల కోట్ల నక్షత్రాలు ఉంటాయి. కాని అది ముఖ్యం కాదు. నక్షత్రాల కన్నా ఖాళీగా ఉండే స్థలం ఆకాశంలో ఎక్కువగా ఉంటుంది. విస్తారమైన శూన్యం బ్రహ్మాండమైనది. అందులో సృష్టి అతిసూక్ష్మమైనది. సృష్టి అంతా శివుని ఒడిలో జరుగుతున్నట్లు మనం ఎప్పడి నుంచో చెబుతున్నామ. మనం శివుడిని నల్లని వాడని పిలుస్తాం. విశేషమేమిటంటే, నేటి ఆధునిక శాస్త్రవేత్తలు కూడా జగత్తులో ప్రతీదానిని తనలో ఇమిడ్చుకొని ఉంచుకునే దానిని ఒక అంధకార శక్తిగానే అభివర్ణిస్తున్నారు. దానిని మరొకలాగా వర్ణించడానికి వీలులేక, దాని తత్వాన్ని గ్రహించలేక వారు దానిని ఒక అంధకార శక్తిగా పిలుస్తున్నారు. వారు శివ అనడం ఒక్కటే తక్కువ.

 మనం మంత్రం అన్నప్పుడు మంత్రార్ధం కంటే మంత్ర మూలాన్నితెలుసుకోవాలి. మంత్ర మూలం శబ్ధం.  

సంవత్సరంలోని ఈ 12 శివరాత్రులలోమహా శివరాత్రి చాలా విశిష్టమైనది. ఈ రాత్రి ఉత్తరభూగోళంలో మానవవ్యవస్థలోని శక్తులు సులువుగా ఊర్థ్వముఖంగా పయనిస్తాయి. ఈరోజు మనం ఆధ్యాత్మికంగా పురోగమించడానికి, ఉన్నత శిఖరాలకు చేరడానికి ప్రకృతి మనకు సహకరిస్తుంది. దానిని ఉపయోగించుకొని ప్రయోజనం పొందాటానికి మన సాంప్రదాయంలో ఈ పండుగను ఏర్పాటు చేసారు. ఇది రాత్రంతా జరుపుకునే పండుగ. మనం ఈ రాత్రంతా మేల్కొని, వెన్నెముక నిటారుగా ఉంచి స్థిరంగా కూర్చోవాలి. దానితో పాటు ఈరోజు ఉప్పోంగే శక్తులను మరింతగా ఉపయోగించుకోడానికి యోగాలో ఒక సాధన ఉన్నది. అదే మంత్రసాధన.

ఈ మహా శివరాత్రి నాడు మనం ఒక మంత్రాన్ని ఉచ్ఛరిస్తాము.మనం మంత్రం అన్నప్పుడు మంత్రార్ధం కంటే మంత్ర మూలాన్నితెలుసుకోవాలి. మంత్ర మూలం శబ్ధం. శబ్ధం అంటే ‘ప్రకంపనలు’. ఆ ప్రకంపనలే మనకు ముక్తిని కలిగిస్తాయి. ఈ ప్రకంపనలే మనల్ని మన ప్రస్తుత శారీరక, మానసిక స్థితుల నుండి ఉన్నతశిఖరాలకు తీసుకవెళుతాయి. ఈ ప్రకంపనలే పంచేంద్రియాలకు అతీతమైన వాటిని మనం గ్రహించేలా చేస్తాయి. ఆ విధంగా అవి మనల్నిమోక్ష స్థానానికి తీసుకెళ్తాయి. ఈ మంత్రాలను కేవలం నోటితో ఉచ్ఛరిస్తే, సరిపోదు. మన శరీరంలోని ప్రతి అణువూ ఈ మంత్రంతో నిండిపోవాలి. అపుడే మనకు దాని శక్తి ఏమిటో తెలుస్తుంది. నోటితో మాత్రమే మంత్రాన్ని ఉచ్ఛరిస్తే, కొంత ఆరోగ్యం, ఆనందం కలగవచ్చు. కాని మంత్రమహిమ నిజంగా తెలియాలంటే, మన శరీరంలోని అణువణువూ ఈమంత్ర ప్రకంపనలతో నిండిపోవాలి. ఆ శక్తి మనలో ప్రతిధ్వనించాలి.

పళనిస్వామి అనే యోగి జీవితంలోజరిగిన సంఘటన ఇందుకు ఒక చక్కని ఉదాహరణ. ఆయన తన జీవితమంతా ‘శంభో’ అనే మంత్రసాధనతో గడిపేవాడు. అన్నివేళలా, కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు కూడా ‘శంభో’ అనే మంత్రోచ్ఛారణ చేయడం గమనించిన ఒకరు గ్రామపెద్దలకు తెలియజేశారు. ఇది విని ఎంతో కోపగ్రస్తులైన గ్రామపెద్దలు వెంటనే పళనిస్వామిని గ్రామసభకు పిలిచి ఇకపై ఆయన ‘శంభో’ అనే మంత్రాన్ని ఎక్కడా, ఎప్పుడూ ఉచ్ఛరించరాదని శాసించారు. ఆ మంత్రోచ్ఛారణకు ఆయన అనర్హుడని తీర్మానించారు. పళనిస్వామి ‘శంభో’ మంత్రోచ్ఛారణ మానివేశాడు. అయినా ‘శంభో’ శబ్ధం ఆగిపోలేదు. ఆ ప్రదేశమంతా‘శంభో’ శబ్ధంతో మారుమోగిపోయింది. అప్పుడు వారు గమనించగా పళనిస్వామి దేహంలోని అణుఅణువు నుండి బిగ్గరగా ‘శంభో’ మంత్రోచ్ఛారణ రాసాగింది. అపుడు వారు పళనిస్వామి పాదాలపై పడి, "ఇలాంటి నియమాలు సామాన్యులకే గానీ, మానవాతీతులైన మీకు కాదు. మీ ఇష్టం వచ్చినప్పుడు మంత్రోచ్ఛారణ చేసుకోండి" అని చెప్పారు. ఈ ఉదాహరణ వలన మన శరీరంలోని అణువణువూ మంత్రోచ్ఛారణతో నిండిపోతే, దాని శక్తి ఎలా ఉంటుందో తెలుస్తుంది.

ఈ మహా శివరాత్రి కేవలం మెళుకువతో ఉండే జాగరణ రాత్రే కాకుండా, మిమ్మల్ని జాగృతం చేసే రాత్రి కావాలని, ప్రకృతి ఈ రోజు మనకు ఇచ్చే ఈ మహత్తర అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మీరందరూ ఈ రాత్రి మంత్ర సాధన చేసి, ఉప్పొంగే శక్తుల సహాయంతో 'శివ'అన్న శబ్దంలోని పారవశ్యాన్నీ, రమణీయతనూ తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

ఈశా ఫౌండేషన్ వారు ప్రతీ సంవత్సరం బ్రహ్మాండంగా నిర్వహించే మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొనాలనుకుంటే http://mahashivarathri.org/ ని సందర్శించండి!