సృష్టి ఎంతో అందమైనది. ఒక రకంగా మీ శ్వాస ద్వారా అందరితో మీరు మమేకమై ఉన్నారు. అదే సమయంలో మీకంటూ వ్యక్తిత్వం అనేది ఒకటుంది. మన అసలు ఉద్దేశం జీవితాన్ని తెలుసుకోవడమే అని, ఎక్కువమంది జీవించట్లేదని కేవలం జీవితం గురించి ఆలోచిస్తున్నారని సద్గురు చెబుతున్నారు.

ఒక కుటుంబంలో నలుగురైదుగురు ఉన్నారనుకోండి, వీరందరూ కూడా ఒకే స్థాయి ఎరుకలో ఒకే రకమైన అనుభవంలో ఉండరు. ఒకరికి ఆ కుటుంబం ఎంతో పారవశ్యంగా ఉంటుంది. ఒకరికి అది ఘోరమైన కుటుంబంలా అనిపిస్తుంది. మీ ఎరుక స్థాయిని బట్టి మీరు ఎక్కడో ఒక చోట పెట్టబడ్డారు. దీనిని, మీరు ఏదో కాకతాళీయంగా అయినా జరగనివ్వవచ్చు లేదా కొంత ఎరుకతో అయినా దీనిని సృజించుకోవచ్చు. ఈ ఎంపిక మీ ముందర ఉంది. అది మీ లోపల అయినా సరే, మీ కుటుంబంలో అయినా సరే, మీ సమాజంలో అయినా సరే, బయటి శక్తులు ఎటువైపు తోసినా సరే, మీరు కనుక - మీకు ఏది కావాలో మీరు సృజించడం మొదలుపెడితే.. ఆ విధంగా మీ సామర్థ్యం ముందుకి వెళ్తుంది. అప్పుడు ఆ సామర్థ్యం వస్తుంది.

జీవితం అన్నది ఎప్పుడూ అన్నింటినీ కలుపుకొనే ఉంది. మీ మనస్సులో మాత్రమే వ్యక్తిగతం అనేది ఉంది.

వాస్తవ స్వభావం ఇప్పుడు ఎలా ఉందంటే నాకు ఇతనంటే ఇష్టం లేదు, ఇతని గుడ్లు పీకేయాలనిపిస్తోంది - అనుకుంటున్నారు. కానీ, మీకు తెలియకుండానే అతను ఏ శ్వాసనైతే వదిలేస్తున్నాడో దానిని మీరు పీలుస్తున్నారు. ఏది మీరు వదిలేస్తున్నారో దానిని అతడు పీలుస్తున్నాడు. ఇందులో ఏమీ సమస్య లేదు. మీరు మీ అత్తగారు వదిలేసిన శ్వాస, మీ శత్రువు వదిలేసిన శ్వాస, మీ బాస్ వదిలేసిన శ్వాస, ఇవి మీకు నచ్చినా నచ్చకపోయినా శ్వాసిస్తున్నారు కదూ..?  అవునా..? ఒక పాకిస్తానీ శ్వాసను వదిలేస్తున్నాడనుకోండి దానిని మీరు శ్వాసగా తీసుకుంటున్నారు.  అలాగే, మీరు వదిలేసే శ్వాస వాళ్ళూ లోపలికి తీసుకుంటున్నారు. ఇది గాలి ఎటువైపు వీస్తోంది అనే దానిని బట్టి ఆధారపడి ఉంటుంది. అవునా..?  కాదా..?

లేదు, కుదరదు. పాకీస్తానీ వదిలేసిన శ్వాస మేము తీసుకోము అంటే - కుదురుతుందా..? జీవితం అన్నది ఎప్పుడూ అన్నింటినీ కలుపుకొనే ఉంది. మీ మనస్సులో మాత్రమే వ్యక్తిగతం అనేది ఉంది. మనస్సు అనేది ఇలా ఎందుకు ఉందీ అంటే మనసులోని ఈ భాగం తార్కికమైనది. అది, మీ మనుగడకి అవసరమైన పనులు మాత్రమే చెయ్యగలదు. మీ మనుగడకి మీరు ఒక్క వ్యక్తిగా, వ్యక్తిగతంగా ఉండడం అన్నది - అవసరం. ఇది,  మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను భోజనం చెయ్యాలనుకోండి, ఆహారాన్ని నోటిలోనే పెట్టుకోవాలి. లేకపోతే చుట్టూ చల్లుకుంటాను. అందుకని,  మనుగడ అనేది వ్యక్తిత్వం లేకుండా జరగదు.

కానీ సృష్టి ఎంతో అందంగా తయారు చెయ్యబడింది. కొన్ని అంశాల్లో మీరు అందరితో మమేకం అయి ఉన్నారు. కొన్నింటిలో మీరు ఎంతో వ్యక్తిగతంగా ఉన్నారు. ఇక్కడ ప్రశ్న మీరు మీ జీవితాన్ని పున:సృష్టించు కోవడం గురించి కాదు..! ప్రశ్న ఏమిటంటే, మీ జీవితాన్ని మీరు తెలుసుకోవడం గురించి..!! మీరు దేనినైనా తెలుసుకోవాలి అనుకుంటే కనీసం మీరు దానిపట్ల కొంత శ్రద్ధ వహించాలి. మీరు, జీవితానికి ఎటువంటి శ్రద్ధ వహించడం లేదు. మీరు మీ ప్రపంచంలో, మీ మనస్సులో ఉన్నారు. మీరసలు జీవించడమే లేదు.  చాలావరకు మీరు, కేవలం మీ జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు