కృష్ణుడి జీవితంలో స్త్రీలు - లీల # 6

 

కృష్ణుడి జీవితంలోకి వేర్వేరు విధాలుగా వచ్చి, ఆయన ప్రేమలో పడి, ఆయన భక్తులుగా మారిన ఇద్దరు స్త్రీలు – తల్లి యశోద, చంపటానికి వచ్చిన పూతన - గురించి సద్గురు మనకు వివరిస్తారు!


 యశోద:

సద్గురు: కృష్ణుడి జీవితంలో ఎందరో స్త్రీలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కృష్ణుడి ప్రేమలో తలమునకలు అయినవాళ్ళే. వాళ్ళందరి గురించి మనం మాట్లాడలేం కనుక మనం కొందరు ముఖ్యమైన స్త్రీల గురించి చెప్పుకుందాం, వాళ్ళు ఆయన భక్తులే అయినా, తాము భక్తులమని వారు అనుకోలేదు. వారు ఆయన్ను ప్రేమించిన వారు, ఆయనను పెంచిన తల్లి యశోదతో మొదలు పెట్టి అందరూ ఆయన్ని ఎంతో గాఢంగా ప్రేమించారు. కృష్ణుడు శిశుప్రాయంలో ఉన్నప్పుడు, తన దగ్గర ఉన్న ఈ అందమైన బిడ్డ గురించే ఆమె ధ్యాసంతా ఉండేది. కాని అతను చాలా త్వరగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన ఎంతో అసాధారణంగా పెరిగాడు. ఏ తల్లీ ఇలాంటి ఎదుగుదలకు తట్టుకోలేదు, ఆయనకు అయిదారేళ్ళ వయస్సు వచ్చే సరికే ఆమె మాతృత్వం మాయమైపోయింది. ఆ తరువాత ఆమె నిజంగా ఆయనకు తల్లిగా ఉండలేకపోయింది. ఆమె ప్రేమలో మునిగి పోయింది.

కృష్ణుడితో యశోద బాంధవ్యం ఎలా ఎదిగిందంటే ఆమె కూడా గోపికలలో ఒకరుగా మారిపోయింది. ఆమె కూడా రాసలీలకు వెళ్ళేది. ఆమెకు రాధ నచ్చలేదు ఎందుకంటే ఈ అమ్మాయి మరీ చాలా తెంపరితనంతో ఉండేది, దానర్ధం ఎలా అనుకున్నా సరే. ఒక సాధారణ పల్లెటూరి పిల్లలా రాధ ఉండేది కాదు. ఆమె కొద్దిగా ఎక్కువ చలాకీగానే ఉండేది. ఈ అమ్మాయి తన కొడుకుని ఎగరేసుకుపోతుందని యశోద అనుకునేది. కాని కృష్ణుడు వెళ్ళిపోయిన తరువాత కూడా రాధ నిర్వహించిన రాసలీలకు వెళ్ళకుండా ఉండగలిగేది కాదు.

కృష్ణుడు మళ్ళీ ఎప్పుడూ తిరిగి రాలేదు, కనీసం తన తల్లిని చూడటానికి కూడా రాలేదు. ఎన్నో సార్లు నది అవతలి వడ్డున మథురలో ఉన్నాడు అయినా కూడా ఎప్పుడూ బృందావనానికి తిరిగి వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు అతన్ని పూర్తిగా స్వేచ్ఛగా ఉండే ఒక గోప బాలుడిగా మాత్రమే చూసారు, ఆయన వాళ్ళ ఊహలను పాడుచేయదలచు కోలేదు. ఓ ధర్మ స్థాపనకు వచ్చినవాడిలాగా ఆయన  అక్కడికి వెళ్ళదలచుకోలేదు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ధర్మసంస్థాపన కోసం ఆయన ఒక పాత్రను పోషిస్తున్నాడు కనుక ఆయన చేసిన ఎన్నో పనులు  వారు చూసుంటే వారి మనసులు విరిగిపోయేవి. వాళ్ళు ఇప్పుడు ఉన్నవిధంగానే వారు సంతోషంగా ఉన్నారు. అందుకే యశోద కూడా రాధతో పాటు ఒక గోపికగా మారిపోయింది. ఎందుకంటే కృష్ణుడు ఇక ఆమె కొడుకుగా లేడు. ఆ నీలి మేఘ శ్యామం ఆమెను కూడా మాయచేసింది.

పూతన:

సద్గురు: కృష్ణుడు పుట్టినప్పుడు ఆ నెలలో పుట్టిన పిల్లలందరినీ హతమార్చమని కంసుడు పూతనను ఆదేశిస్తాడు, అందువల్ల ఆమె ఎంతో మంది శిశివులను నిర్దాక్షిణ్యంగా చంపుకుంటూ పోయింది. ఒకసారి ఆమె కృష్ణుడి విషయం తెలుసుకోగానే, ఆమె తన మాయాశక్తితో ఒక అందమైనన స్త్రీగా మారిపోయింది. ఆమె రాసఠీవితో ఆ ఇంట్లోకి నడిచివస్తుంటే అందరూ నిశ్చేష్టులై పోయారు. ఆమె బిడ్డను ఎత్తుకుంటానని అన్నది. ఆమె బిడ్డను తీసుకుని బయటకు వెళ్లి కూర్చుంది. ఆమె తన వక్షోజాలకు విషం పూసుకుని వచ్చి బిడ్డకు పాలిస్తున్నట్లు నటించాలని అనుకుంది. ఈ దేశంలో, ఆకాలంలో పాలివ్వగలిగిన ఏ స్త్రీ అయినా కూడా పిల్లలకు పాలు ఇవ్వవచ్చు, దానికి కన్న తల్లే కానవసరం లేదు. అది ఆ బిడ్డకు చేసే ఒక గొప్ప సేవగా ఆకాలంలో అనుకునేవాళ్ళు. అప్పుడు గర్భనిరోధక పద్ధతులు లేవు కనుక చాలా వరకు ఆడవాళ్ళు అలా పాలివ్వగల స్థితిలోనే ఉండేవాళ్ళు. ఒకరి బిడ్డకు వేరే వాళ్ళు పాలివ్వటం నిషేధం కాదు.

అలా పూతన తన విషం పూసుకున్న వక్షోజాలతో కృష్ణుడిని చంపాలనుకుంది. కాని ఆయన్ని చూసినప్పుడు ఆ నీలిమేఘశ్యాముని మాయ ఆమెను ముంచెత్తింది. ఆమె ఎంత ఆకర్షితురాలయిందంటే ఆమెలోని మాతృత్వం పెల్లుబికింది. ఇక ఆమె ఆ బిడ్డకు విషం ఇవ్వాలని అనుకోలేదు – ఆమె ఆ బిడ్డకు సర్వం సమర్పించాలనుకుంది. తన మనసులో “నేను నిన్ను చంపి కంసుడి ఆదేశాలను పూర్తి చేయాలని వచ్చాను. నా వక్షోజాలకు విషం ఉన్నా కేవలం ఈ పాలనే కాకుండా నా ప్రాణమే తీసుకుంటే బావుండనని మనసులో అనిపిస్తోంది. ఇలా నీకు పాలివ్వగలగటం నా అదృష్టం’’ అనుకుంది. అలా ఆమె అత్యంత ప్రేమతో ఆ విషం పూసిన వక్షోజాలతోనే ఆ బిడ్డకు పాలిచ్చింది. కృష్ణుడు ఆమె ప్రాణాలనే జుర్రుకున్నాడు. ముఖం మీద ఒక పెద్ద చిరునవ్వుతో ఆమె అక్కడికక్కడే పడి చనిపోయింది. ఆమె మనసులో మెదలిన చివరి ఆలోచన, “నా ప్రాణాన్ని ఆ దేవుడే తీసుకెళ్తున్నాడు. నాకింకేం కావాలి?”అని.

ప్రేమాశీస్సులతో,
సద్గురు