Story: ఒక జెన్ గురువుగారు శిష్యులతో కలసి నదిలో స్నానం చేయటానికి వెళ్ళారు. స్నానం చేసి బయటకు వచ్చాక గురువు గారు నడుస్తున్నప్పుడు ఆయన చుట్టూ శిష్యులు చేరారు.

ఒక శిష్యుడు “జ్ఞానం పొందటానికి నేను ఏమి చెయ్యాలి?” అని అడిగాడు."

దగ్గరగా ఉన్న కుక్కను చూపుతూ గురువుగారు “ఆ కుక్క దగ్గర నుండి నేర్చుకో” అన్నాడు..

శిష్యుడు నిరాశ చెందాడు, గురువుగారు తన ప్రశ్నను పట్టించుకోలేదని, అతను మళ్ళీ ‘‘కుక్క దగ్గరనుండి నేమి నేర్చుకోగలను?” అని అడిగాడు.

గురువుగారు ఏమి మాట్లాడకుండా మరి కొంతముందుకు నడిచారు.

శిష్యుడు మరింత గట్టిగా ‘‘నేను ఈ కుక్క నుండి నేర్చుకోదలచుకోలేదు. మీరే చెప్పండి” అని అడిగాడు.

పక్కవీధిలో ఆడుకుంటున్న మరో కుక్కను చూపి “అయితే ఈ కుక్క నుండి నేర్చుకో’’ అన్నారు, గురువుగారు.

“నేనంటే ఎగతాళిగా ఉంది మీకు. కుక్క నుండి నేనేం నేర్చుకోగలను. అది తింటుంది, నిద్రపోతుంది, పిల్లల్ని కంటుంది అంతేగా! నేను వాటి అన్నింటి నుండి ముక్తిపొందాలని మీ దగ్గరకు వచ్చాను’’ అన్నాడు శిష్యుడు.

“నువ్వు కూడా తిని నిద్రపో!” అంటూ తన కుటీరంలోకి వెళ్ళిపోయారు గురువు గారు.

శిష్యుడు నిర్ఘాంత పోయాడు.;

Sadhguru: సద్గురు: సగటు మనిషి ఇవాళ ఏంచేస్తున్నాడు? అతను తింటాడు, కాని దాన్ని తినడం అనలేం. అతను నిద్రిస్తాడు, కాని దాన్ని నిద్ర అనలేం. ఎందుకు? తింటున్నప్పుడు అందులో నిమగ్నం కాలేదు. ఎంత రుచికరమైన పదార్థాన్ని తింటున్నా, మొదటి ముద్దే రుచి చూస్తాడు, ఆ తర్వాత అది అతని గొంతునుండి జారి పొట్టలోకి చేరేలోపే అతని మనసు ఎక్కడికో వెళుతుంది. నా జీవితంలో జరిగిన సంఘటన ఒకటి చెబుతాను. నాకు అప్పుడు ఇరవై ఏళ్ళు ఉంటాయి. తినటానికి కూర్చున్నాను. ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాను. అంతే, నా లోపల అంతా ఏదో ప్రేలుడు జరుగుతున్నంత అనుభవం. ఇదేదో నేను తార్కికంగా గమనించినది కాదు, అది అనుభవ పూర్వకమైనది. అది ఒక ఇంద్రజాలాన్ని చూస్తున్నట్లు గాఢమైన అనుభవం. ఆ పళ్ళెంలో ఉన్నది నేనై పోవటం.

ఇది చిన్న విషయం కాదు. ప్రతి జీవిలోనూ ఈక్రియ నిరంతరాయంగా జరుగుతూనే ఉంది. ఇంతకు ముందు నీవు కానిది, నీవై పోవటం. యోగం అంటే ఇదే. నీవు కాని దానితో నీవు ఏకమై పోవటం. యోగం అంటే కలయిక, ఈ సమస్తమైన ఉనికితో కలిసిపోవటం. మనుషులందరూ ఈ ఏకత్వానుభూతి కోసమే పరితపిస్తున్నారు. కాని, మీరు ఒక ముద్ద అన్నంతో ఏకం కాలేనప్పుడు, ఈ విశ్వమంతటితో ఎలా ఏకం కాగలరు? ఈ భూమికి సంబంధించిన ఒక చిన్న భాగం, మీతో కలిసి ఏకమై పోతోంది. ఇంతకంటే గొప్ప ఇంద్రజాలం ఏముంది?

మరొక ఇంద్రజాలం నిద్ర. మీరుగాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరు ఈ ఉనికితో ఏకమై పోతారు. మీరు నిద్రపోయేటప్పుడు ఏమి జరుగుతోంది? చాలా మంది అసలు గాఢ నిద్ర ఎఱగరు. నిద్రా సమయంలో మీ మనసులో లక్ష ఆలోచనలు జరుగుతాయి. అవి కలల రూపంలో నిద్రలో మిమ్మల్ని వెంటాడుతాయి.

మీరు తినేటప్పుడు ఇంటి గూర్చి ఆలోచిస్తారు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ పని గూర్చి ఆలోచిస్తారు. మీరు పనిలో ఉన్నప్పుడు ప్రయాణం గూర్చి ఆలోచిస్తారు. మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడు నిద్రిస్తానా అని ఆలోచిస్తారు. మీరు నిద్రించేటప్పుడు మరేదో ఆలోచిస్తారు. మీ జీవితమంతా ఇలా గడచి పోతూ ఉంటుంది.

మీరు మీజీవితాన్ని సంపూర్ణంగా గ్రహించాలంటే, మీరు చేసే ప్రతి పనిని నూటికి నూరుశాతం తన్మయత్వంతో చెయ్యాలి. మిమ్మల్ని మీరు మీ పనికి పూర్తిగా అర్పించుకోవాలి. ఎందుకంటే మీరెప్పుడూ మీ ఆలోచనా ప్రక్రియలో చిక్కుబడి పోతుంటారు. మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలే మీ జీవితమై పోయాయి. మీ కోపం ఆనందం, కోపం, సఫలీకృతం కావటం ఇవన్నీ మీ మనసు ఆడే నాటకాలు. మీరు మీలోని జీవుని స్పందనలను గ్రహించటంలో విఫలమై మొద్దుబారిపోతున్నారు. మీరు చేసే పనిలో లీనమైనప్పుడు మీరు జీవితంతో స్పర్శలో ఉన్నట్లు లెక్క. మీరు తింటున్నప్పుడు ఈ విశ్వం మీలో కలిసిపోతోంది. మీరు నిద్రిస్తున్నప్పుడు విశ్వంలో మీరు కలిసి పోతున్నారు. మీరు ఈ రెంటిని నూటికి నూరుశాతం తన్మయత్వంతో చెయ్య గలిగినప్పుడు, ఉన్నత అనుభవ ద్వారాలు మీ కోసం తెరుచుకుంటాయి.

జీవితంలో ఈ క్షణమే నిజమైనది. ఇంతకు ముందువి, ఈ తరువాతవి మన అనుభవంలో లేవు. అవి కేవలం ఊహాత్మకమైనవి. మీ జీవితంలో మీరు చేసే పనులన్నింటిని నూటికి నూరుశాతం తన్మయత్వంతో చెయ్యండి. సృష్టితో కాని సృష్టి కర్తతో కాని సంపూర్ణానుభవాన్ని మీరు పొందాలనుకుంటే ఆది ఈ క్షణంలోనే సాధ్యం. కానీ మీరు ఏవేవో భ్రాంతుల్లో చిక్కుకుని ఉన్నారే! ఈ ప్రపంచమంతా ‘మిధ్య’ అని ‘‘మాయ’ అని అంటున్నారంటే దాని అర్థం, మీరు దాన్ని అలా చూస్తున్నారని. ఉనికిని ఉన్నది ఉన్నట్లుగా మీ మనసు గ్రహించటం లేదు. దాన్ని ఏదో విధంగా చెదరగొట్టి ఒక భ్రాంతిని మీకు కలుగజెయ్యాలని చూస్తోంది. ఆ క్షణంలో మీరు చూసి అనుభవిస్తున్నది అంతా ఒక భ్రాంతి, మాయ..

అందువల్ల కుక్కనుండి నేర్చుకోవటం అంటే మీరు తినేటప్పుడు నోట్లోకి వెళ్ళే ప్రతి మెతుకును సంపూర్ణంగా అనుభవిస్తూ తినండి. అది మీలో భాగంగా అయినప్పుడు ఏమౌతుందో గమనించండి. మీరు నిద్రపోయేటప్పుడు, ఈ ప్రపంచ భారాన్నంతా మీరే మోస్తున్న భావాన్ని వదలి, అన్నింటిని పక్కన పెట్టి సంపూర్ణంగా నిద్రించండి.

Signature:

ప్రేమాశీస్సులతో,

సద్గురు