మనిషి బుర్రలోనున్న సమాచార జ్ఞానం నుండి విశ్వంలో నున్న అనంత జ్ఞానాన్ని తెలుసుకోనే విధంగా ఎదగడమే యోగ సాధన  లక్ష్యం అని మనకి చెబుతున్నారు..

మీరెప్పుడైనా తేనె పట్టును నిశితంగా పరీక్షించారా? మీరు ఇంజనీరింగులో ఎంత అత్యంత ఆధునిక సాంకేతిక విషయాలు చదువుకున్నప్పటికీ, తేనెపట్టు నుండి తెలుసుకోవడానికి  ఎంతో కొంత మిగిలే ఉంటుంది. అది ఎంత అద్భుతమైన సాంకేతిక నిర్మాణం...! దీనికంటే అద్భుతంగా ప్రణాళిక రచన చేసి, నిర్మించబడినదీ, ఎపటికప్పుడు సమయానుకూలంగా మార్చుకోదగిన అవకాశం ఉన్న మెరుగైన వసతి నిర్మాణం మీకెక్కడా కనిపించదు. ఎటువంటి వాతావరణంలోనూ, తేనెపట్టు చెట్టు నుండి రాలిపోవడం మీరు చూసి ఉండరు. ఎప్పుడైనా చూశారా? అది అంత అద్భుతమైన వినిర్మాణమైనప్పటికీ, తేనెటీగలు వాటి బుర్రలో వాస్తుపరిజ్ఞానం కలిగి ఉన్నాయా? లేదు. ఈ ప్రణాళికలు వాటి శరీరంలో ఉన్నాయి. వాటి వ్యవస్థలో ఒక నమూనా ఉండడం వల్ల వాటికి సరిగ్గా ఏది ఎలా చెయ్యాలో తెలుసు.

మీలో అంతర్గతంగా ఒక అద్భుతమైన మేధస్సు ఉంది: అది ఒక రొట్టె ముక్కను మీ శరీరంగా మలచగలిగినది.

ఆధ్యాత్మిక జ్ఞానం, లేదా "నిజమైన ఎరుక" కూడా సరిగ్గా ఇలాగే అందించబడుతుంది- ఆలోచన ద్వారా కాదు, మాటల ద్వారా కాదు, తరతరాలుగా తేనెపట్టుని ఎలా నిర్మించాలో  తేనెటీగలు ఆ పరిజ్ఞానాన్ని అందించిన రీతిలో. ఒకసారి ఈ పరిజ్ఞానం మీకు అందిన తర్వాత, లేదా మీరు డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత, మీరు తెలుసుకోవలసినదంతా మీలోనే ఉంటుంది. మీరు మీ కంప్యూటరులోకి ఒక రకమైన సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ చేసుకున్నాక, అదెలా పనిచేస్తుందో మీరు తెలుసుకోవలసిన అవసరం లేదు. ఆ సాఫ్ట్ వేర్ ప్రోగ్రాంలో రాసిన ప్రతి మాటా మీరు చదవవలసిన పనిలేదు. మీరు ఒక కీ నొక్కుతారు. అది మీకు కావలసిన ఫలితాన్ని అందిస్తుంది. మరొక కీ నొక్కితే మరో ఫలితం వస్తుంది. ఒక్కసారిగా మీముందొక అద్భుతం జరుగుతూ ఉంటుంది.

ఇక్కడ నేను జ్ఞానానికీ, మేధోపరంగా తెలుసుకోవడానికీ మధ్యనున్న తేడాని విశదీకరిస్తాను. మేధోపరంగా తెలుసుకోవడం అన్నది సాధారణంగా అనేక ఆధారాల నుండి మనం సముపార్జించుకున్న విషయ పరిజ్ఞానం. ఏ సమాచారమైనా మన భౌతిక అస్తిత్వానికి సంభందించినదై ఉంటుంది. ఇందుకు భిన్నంగా, జ్ఞానం అన్నది సజీవ మేధస్సు. మీరున్నా లేకపోయినా అది ఉంటుంది. అయితే "మీరు దానిలో ఉంటారు లేకపోతే లేదు". మీరు ఎంచుకోగలిగింది అదొక్కటే. ఇంతకు ముందు మనం చూసినట్లుగా, మీలో అంతర్గతంగా ఒక అద్భుతమైన మేధస్సు ఉంది: అది ఒక రొట్టె ముక్కను మీ శరీరంగా మలచగలిగినది. అత్యంత ఆధునిక యంత్ర వినిర్మాణమైన మెదడు కూడా ఈ అంతర్గత మేధస్సు ద్వారానే నిర్మించబడింది.

ఈ సృష్టిలో అనుచితమైనది ఏదీ లేదు. ఒక్క మానవ సమాజాల్లోనే అనుచితమైన వస్తువులు ఉన్నాయి.

ఇప్పుడు మీరు మీ మెదడుకున్న అతి కొద్దిపాటి భాగాన్ని మాత్రమే ఉపయోగించుకుని దానినే తెలివితేటలనుకుంటున్నారు. కాదు...! మీ మెదడుని, దానికున్న అత్యంత సంక్లిష్ట రచనా వినిర్మాణం, సమర్థతలతో పాటు సృష్టించగల అంతర్గతమైనది ఏదో మీలో ఉంది. అది  పూర్తిగా విభిన్నంగా పనిచేస్తుంది. ఉదాహరణకి నేను నా మెదడుతో కాకుండా, నా శరీరంలోని ప్రతి జీవకణంతోనూ ఆలోచిస్తాను. ఇది నా ఆలోచనని ఒక క్రమమైన, నిరాటంకమైన, సమీకృత ప్రక్రియగా రూపుదిద్దుతుంది. అందులో ఒక విధమైన సమగ్రత ఉండడానికి కారణం నా శరీరంలో ప్రతి అణువూ అందులో భాగస్వామి అయి ఉంది. నేను ఆలోచించాలనుకుంటే తప్ప నా మెదడులో ఆలోచనే   ఉండదు.

ఈ సృష్టిలో అనుచితమైనది ఏదీ లేదు. ఒక్క మానవ సమాజాల్లోనే అనుచితమైన వస్తువులు ఉన్నాయి. ఈ ప్రాణికీ ఆ ప్రాణికీ మధ్య సరిపోలికలున్నాయి. కానీ ఈ ప్రాణిని సృష్టిస్తున్న మేధస్సుకి అటువంటి పోలికలుగాని, సందర్భంగాని లేవు. దానికి "రెండవది" అంటూ లేదు. అన్నీ ఒకటే. అది ఇప్పుడు ఇక్కడ ఉందా అని అడగనక్కర లేదు, అదెప్పుడూ ఇక్కడ ఉంటూనే ఉంటుంది. దానికి వేరే మార్గం లేదు.

యోగ సాధన లక్ష్యం కూడా ఇదే: తల నిండా కొంత సమాచారం నింపుకున్న స్థితి నుండి విశ్వజ్ఞానాన్ని నింపుకోవడం వరకు ఎదగడం. అనంతమైన ఈ విశ్వజ్ఞానాన్ని విడిచిపెట్టి, మనుషులు పరిమితమైన తమ మెదడు సంపాదించే పరిజ్ఞానానికి పరిగెత్తడం ఎంత విషాదకరమైన ఎంపిక!

ప్రేమాశీస్సులతో,
సద్గురు