జీవితం అనే గాలిబుడగను బ్రద్దలు కొట్టండి

మీరు వ్యక్తి అని పిలిచేది, కేవలం ఒక గాలి బుడగ. ఈ బుడగకు తనదైన సొంత అస్తిత్వం ఏమీ ఉండదు. ఆధ్యాత్మిక ప్రక్రియా విధానం అంతా కూడా ఈ బుడగని బ్రద్ధలుకొట్టడానికే అని సద్గురు చెబుతున్నారు.
 
 

పగటిపూట ఆకాశం కేసి చూస్తే మీకు సూర్యుడు కనిపిస్తాడు. మీ అనుభవంలో అదే ప్రగాఢంగా ఉంటుంది. అదే రాత్రి వేళ చూస్తే నక్షత్రాలు ప్రగాఢ అనుభూతిని కలుగజేస్తాయి. అయితే ఈ సూర్యుడు, నక్షత్రాలను (సూర్యుడు కూడా ఓ నక్షత్రమే) ఆకాశానికి ఉన్న విశాలత్వంతో పోలిస్తే, చాలా చిన్నవి. అయినా ఆకాశం మీ అవగాహనలో ఎప్పుడూ ఉండదు. మన అవగాహనలో లేకున్నా వాస్తవంగా ఉనికిలో ఉన్నది ఆకాశం విశాలత్వం ఒక్కటే. సూర్యుడు, నక్షత్రాలు, మీరు, నేను ఇలా అన్నీ ఆకాశంతో పోలిస్తే చాలా చిన్న అంశాలు మాత్రమే. అన్నీ నిజంగా చాలా సూక్ష్మమైన అంశాలు.

కావాలనుకుంటే ఈ భౌతిక శరీరాన్ని రెండు ముక్కలుగా చేయడం మన చేతిలో ఉంది, కాని మిగతా శరీరాలను మనం ముక్కలు చేయలేము.
సూర్యుడికి కూడా ఒక ఆయుఃపరిధి ఉందని నేటి ఆధునిక విజ్ఞానశాస్త్రం చెబుతోంది. అది కూడా తనను తాను దహించేసుకుంటున్నది. ఎలాగైతే మీరు మీ జీవితం కరిగిపోతుందో, అలాగే సూర్యుడు కూడా తన జీవితాన్ని దహింప జేసుకుంటున్నాడు. మీ శరీర సాధారణ ఉష్ణోగ్రత తొంభై ఎనిమిది పాయింట్‌ ఆరు డిగ్రీల ఫారెన్‌ హీట్‌ అయినట్లే... సూర్యుడి సాధారణ ఉష్ణోగ్రత తొంభై ఎనిమిది మిలినయన్ల డిగ్రీలు, దానికీ ఒక అయుఃపరిమితి ఉన్నది. సూర్యగ్రహం కూడా క్షణక్షణానికీ దహించుకుపోతోంది, ఏదో ఒక రోజు పూర్తిగా దహించుకుపోతుంది. అంటే మీరు ఈ భౌతికస్థితిగా చూసేదంతా ఒక చిన్న ఘటన మాత్రమే. నిజమైన ఉనికి ఈ అనంతం, శూన్యం రూపంలో అంతా పరుచుకొని ఉన్నదే, ఈ శూన్యాన్నే మనం ఆకాశం అని అంటాం. సృష్టి యథార్థస్థితి శూన్యమే. మీరు వ్యక్తి అని పిలుస్తున్నది కేవలం ఒక గాలిబుడగ లాంటిది. అసలు ఈ బుడగకు తనకంటూ ఒక అస్తిత్వం లేదు. గాలే తన చుట్టూ ఒక నీటి పొరను ఏర్పరచుకుంది, అంతే.

అది తనదైన ఒక స్వభావాన్ని ఏర్పరచుకున్నది. కొన్ని దళసరి బుడగలు ఉంటాయి, కొన్ని పలుచని బుడగలు ఉంటాయి. అలాగే బలమైనవి, బలహీనమైనవి, పెద్దవి, చిన్నవి - అచ్చం మనుషులు, మిగతా ప్రాణుల మాదిరిగా రకరకాలుగా రూపొందుతాయి. కానీ, ఒక్కసారి బుడగ బద్దలయిందంటే, బుడగలోని పదార్థం, అది ఏమైంది? దానిని వాయువు కలిపేసుకుంటుంది; వాతావరణం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. అదే విధంగా ఈ ‘బుడగ’ భౌతికశరీరం, సూక్ష్మశరీరం, ప్రాణశరీరం, మనశ్శరీరాలతో ఏర్పడింది. ఈ భౌతికశరీరాన్ని కావాలంటే ఏ క్షణంలోనైనా మనం నాశనం చేయవచ్చు. కావాలనుకుంటే ఈ భౌతిక శరీరాన్ని రెండు ముక్కలుగా చేయడం మన చేతిలో ఉంది, కాని మిగతా శరీరాలను మనం ముక్కలు చేయలేము. మీరు ఉనికి అని దేన్నైతే పిలుస్తున్నారో, అది మాత్రమే ఆ పని చేయగలదు.

తల్లి గర్భం ఇలా మళ్ళీ మళ్ళీ తయారు చేసే తిత్తే. మళ్ళీ మళ్ళీ అదే ప్రక్రియ, అందుకే మనం దానిని తప్పించాలనుకుంటున్నాము.
మీరు ఆధ్యాత్మిక విధానం అని అంటున్నది, దీనినే, క్లుప్తంగా చెప్పాలంటే అసలు ఏమీ మిగల్చకుండా పూర్తి స్థాయిలో ఆత్మహత్య చేసుకునే విధానం అన్నమాట. ఇది ఒక్క భౌతిక శరీరాన్ని మాత్రమే చంపటం కాదు. ఈ శరీరానికి కారకమైన మీలోని అసలు మూలాలను నాశనం చేసే ప్రయత్నం. మీలో శరీరాన్ని సృష్టించగలిగే సామర్థ్యం ఉన్న ‘నిర్మాణ మూలాన్ని’ నాశనం చేసే ప్రయత్నమే. సూక్ష్మశరీరం, ప్రాణశరీరం, మనశ్శరీరం రూపాలలో నిక్షిప్తమైన కర్మ వలనే ఈ భౌతికశరీరం సాధ్యం. ఆధ్యాత్మిక ప్రక్రియలో శరీరానికి కారణమైన అసలు కర్మనే నాశనం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీ -ఎఱుకతో, సాధనలతో, ప్రేమతో, భక్తితో -మీరు ఇంకో శరీరాన్ని స్వీకరించే అవకాశాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భౌతికశరీరం ఏర్పడడానికి కారకమైన పునాదులను నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరో విధంగా చెప్పాలంటే, జనన-మరణ చక్రం ద్వారా మరల మరల జన్మించే, మరణించే అవకాశాలను నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నారు. తల్లి గర్భం ఇలా మళ్ళీ మళ్ళీ తయారు చేసే తిత్తే. మళ్ళీ మళ్ళీ అదే ప్రక్రియ, అందుకే మనం దానిని తప్పించాలనుకుంటున్నాము.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1