ఈనాటి విద్యావిధానం పిల్లల తెలివితేటలని పూర్తిగా తుడిచివేస్తోంది అని, ఈనాటి పరిస్థితి ఎలా తయారయ్యిందంటే తెలివిగలవారే ప్రపంచానికి ఎక్కువ హాని కలిగిస్తున్నారని సద్గురు చెబుతున్నారు.

ఈ రోజున ప్రపంచంలోని విద్యాశాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఒక పిల్లవాడు 20 ఏళ్ల పాటూ ఇప్పటి విద్యావిధానంలో చదువుకుంటే, అతని మేధస్సులోని 70% తిరిగి బాగుచెయ్యలేనంతగా పాడైపోతోందని. అంటే, మీరు ఒక తెలివైన మూర్ఖుడిగా బయటికి వస్తున్నారన్నమాట. ఇది మానవత్వానికి విద్యావిధానం కలిగించే హాని. ఎందుకంటే, ఈ ప్రపంచం భవిష్యత్తు పిల్లల తెలివితేటల మీదే ఉంది.

తాము ఎంతో తెలివిగలవాళ్ళం అని అనుకున్నావారే ఈ భూమి మీద ఎంతో హింసని సృష్టించారు.

మీరు అందమైన వస్తువులు తయారు చెయ్యాలన్నా.. లేదా ఎంతో వినాశనకరమైన బాంబులు లాంటివి తయారు చెయ్యాలన్నా లేక మరేదైనా సరే, ఇవన్నీ కూడా ఒక మనిషి మేధస్సు, అతని భావావేశాలు ఏవిధంగా సమతుల్యంలో అనుసంధానంతో పని చేస్తాయి - అన్నదానిమీద ఆధారపడి ఉంటుంది. ఒక మానవుడు ఎంత బాగా తన మేధస్సుని వాడగలడు అన్నది, అతను ఈ ప్రపంచంలో ఏమి సృష్టిస్తాడూ అన్నవి - ఈ రెండూ అనుసంధానంలో ఉంటాయి. తాము ఎంతో తెలివిగలవాళ్ళం అని అనుకున్నావారే ఈ భూమి మీద ఎంతో హింసని సృష్టించారు. లేదంటే, హింస అనేది ఇంత పెద్ద ఎత్తులో జరిగుండేది కాదు.

ఏ యుగంలో చూసినా ప్రజల్లో ఉన్మాదం అనేది ఎప్పుడూ ఉంది

1% మంది ప్రజలు ఎప్పుడూ ఉన్మాదం కలిగే ఉన్నారు. వాళ్ళు రాతి యుగం వారైనా, తరువాతి తరాల వారైనా, మీరు ఎవరి గురించి మాట్లాడినా సరే, అందులో 1% ప్రజలు ఎప్పుడూ ఉన్మాదంతోనే ఉన్నారు. మొట్టమొదట గుహల్లో బ్రతికే మనిషి అంటే, రాతియుగం.. అప్పుడు వాళ్ళు రాళ్ళతో చంపుకునేవారు. ఆ తరువాత ఇనుపయుగంలో వాళ్ళు ఇనుప వస్తువులతో చంపుకునేవాళ్లు. ఇప్పుడు మనది న్యూక్లియర్ యుగం. అంటే, మనం న్యూక్లియర్ బాంబులతో చంపుకుంటున్నామని అర్థం.

మేధస్సు అనేది మానవుడికి ఉన్న ఎంతో పెద్ద వరం. కానీ, ఇప్పుడు మనం దానిని ఒక శాపంలా చేసేసుకున్నాం

ఉన్మాదం స్థాయి ఈరోజు చాలా ఎక్కువ ఉంది. ప్రపంచంలో ఉన్న అద్భుతమైన మెదడులు ఇందుకు సహకరించాయి కాబట్టే, ఈ రోజున ఇంత ఎక్కువ శాతం ఉన్మాదం అన్నది జరుగుతోంది. ప్రపంచంలోని  అద్భుతమైన మెదళ్లు, మానవాళిని ఎలా చంపాలీ, అన్న విషయానికై పనిచేశాయి. అదే, తెలివిగల వాళ్ళు ఇందుకు సహకరించి ఉండకపోతే, ఎవరో ఉన్మాదంతో ఉన్న మనిషి  ఒక్కరినో.. ఇద్దరినో.. ఏదో కర్రతోనో, రాయితోనో, చంపి ఉండేవాడు. కానీ, తెలివైన ప్రజలు ఇందుకు సహకరించడం వల్ల  ఉన్మాదం ఉన్న మనిషి, లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యల్లో చంపగలుగుతున్నాడు.

తెలివితేటలు అన్నవి, మన శ్రేయస్సుకి పని చెయ్యకుండా పోయిన తరువాత ఇంక అవి తెలివితేటలు కాదు. ఇప్పుడు మానవ మేధస్సు ఇప్పుడు ఒక వరం కాదు, ఒక శాపంలా తయారైపోయింది. మేధస్సు అనేది మానవుడికి ఉన్న ఎంతో పెద్ద వరం. కానీ, ఇప్పుడు మనం దానిని ఒక శాపంలా చేసేసుకున్నాం. ఎందుకంటే మానవుడు సరైన సమతుల్యంలో ఉండడం లేదు. అతనిలో అతనికే ఒక సమతుల్యత, అనుసంధానం లేదు. ఇలాంటి మేధస్సు ఎంతో ప్రమాదకరమైనది. మీరు ఒక గాడిద అయితే.. మీరు కేవలం ఒక తన్ను తంతారు. అంతే..! మీరు ఎక్కువలో ఎక్కువ చేయగలిగింది.. మీ రెండు కాళ్లతో తన్నడం. కానీ ఇప్పుడు మానవ మేధస్సు అన్నది ఎంతో ప్రమాదకరంగా మారిపోయింది. మనకి ఏదైతే వరంలా ఉండాలో..అది ఒక పెద్ద శాపంలా తయారయ్యింది. ఇందులో..విద్యావిధానం అన్నది ఖచ్చితంగా తన పాత్ర తాను పోషిస్తూ ఉన్నది. ఒక పెద్ద పాత్రనే పోషిస్తోంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

flickr/sergesaint