ఆధ్యాత్మిక ప్రక్రియ ఇప్పుడు ఎంతో ఆవశ్యకంగా మారింది..!!

 

మునుపెన్నడూ లేని విధంగా రోజులు ఇప్పుడు మారిపోయాయని, ప్రతి మనిషి జీవితంలో యోగా అనేది ఎంతో ముఖ్యమయ్యిందని సద్గురు చెబుతున్నారు..

చాలా ఏళ్ల క్రిందట నేను స్వయంగా వ్యవసాయం చేసే రోజుల్లో స్థానికంగా ఉన్న ఒక గ్రామీణుణ్ణి పనుల్లోకి పెట్టుకున్నాను. అతని పేరు చిక్కెగౌడ. అతనికి బ్రహ్మచెవుడు. అందుకని గ్రామంలో అందరూ అతన్ని ఆటపట్టిస్తూ ఉండేవాళ్లు. నాకు ఎక్కువగా మాటాడడం ఇష్టం లేకపోవడంతో, అతను నాకు మంచి సహచరుడిగా కనిపించేవాడు.

ఒక రోజు తెల్లవారు ఝామున 4 గంటలకి అతను అరక కట్టడం ప్రారంభించడాన్ని గమనించాను. "ఏం చేస్తున్నావు నువ్వు?" అని అడిగాను. "ఈ రోజు వర్షం పడబొతోంది. అందుకని నేల దున్నడానికి సిద్ధం అవుతున్నాను," అన్నాడు. నేను ఆకాశం వంక చూశాను. ఒక్క మబ్బు తునక కూడా లేదు. "ఇది తెలివితక్కువ పని. ఎక్కడా మబ్బు జాడైనా లేదు వర్షం ఎక్కడినుండి పడుతుంది?" అని నేనన్నాను

"లేదు! ఈ రోజు వర్షం పడబోతోంద” ని అతనన్నాడు. అతనన్నట్టుగానే ఆ రోజు వర్షం కురిసింది.

మన శరీరంలో అంతర్భాగాలైన భూమీ, నీరూ, అగ్నీ, వాయువూ, ఆహారం వంటి పంచభూతాలనీ మనం ప్రత్యేక పదార్థాలుగా చూస్తాము తప్ప, మన జీవ ప్రక్రియలో అంతర్భాగంగా చూడం.

అది జరిగిన తర్వాత చాలా రోజుల వరకు రాత్రీ పగలూ మేలుకుని ఆలోచించాను. ఆ వ్యక్తికి తెలిసిన విషయం నాకెందుకు తెలియలేదు? నా చెయ్యి అనేక దిక్కుల్లో చాచి తేమ తగుల్తుందేమోననీ, వేడి తెలుస్తుందేమోననీ ప్రయత్నించి చూసాను. ఆకాశాన్ని చూసి ఏవైనా సంకేతాలు దొరుకుతాయేమోనని ప్రయత్నించాను. నేను వాతావరణ శాస్త్రం మీద చాలా పుస్తకాలు చదివాను. కానీ, ఏమీ ప్రయోజనం కనిపించలేదు. చివరకి, నా శరీరాన్నీ, నా పరిసరాల్నీ జాగ్రత్తగా గమనించి, మనందరం చేసే అతి ప్రాథమికమైన పొరపాటుని గుర్తించాను. ఆ పొరపాటు ఏమిటంటే – మన శరీరంలో అంతర్భాగాలైన భూమీ, నీరూ, అగ్నీ, వాయువూ, ఆహారం వంటి పంచభూతాలనీ మనం ప్రత్యేక పదార్థాలుగా చూస్తాము తప్ప, మన జీవ ప్రక్రియలో అంతర్భాగంగా చూడం.

ఇది చాలా చిన్న సమస్యలా కనిపిస్తుంది కానీ, మానవ జీవితంలో ఉన్న విషాదం అదే. ముంచుకు వస్తున్న పర్యావరణ విపత్తూ, నీటి కటకటా, ఈ రోజు మన దేశాన్ని వేధిస్తున్న నీటి ఎద్దడి పరిస్థితులూ - ఇవన్నీ మనం వీటిని అనుభవించ దగ్గ వనరులుగా, ముక్కముక్కలుగా విడదీసి చూడడంతో ముడిపడి ఉన్నాయి. సంప్రదాయంగా వస్తున్న విజ్ఞానాన్ని త్రోసిపుచ్చి, మన శరీరం సువిశాలమైన భూమి అనే సజీవ గోళంలో ఒక అంతర్భాగమనీ, అది అంతకంటే మహత్తరమైన సౌరవ్యవస్థలో అంతర్భాగమనీ, అది మళ్ళీఈ విశ్వమనే జీవపదార్థంతో సంధింపబడిందన్న విషయం మరిచిపోయాము. మనం వీటన్నిటినీ విడివిడిగా చూసినపుడు, మనం వీటన్నిటి మధ్యా ఉన్న విడదీయరాని ఏకత్వానికి గంటు పెడుతున్నాము. పర్యవసానంగా, మనల్ని మనం అంచెలంచెలుగా ఆత్మహత్య చేసుకుంటున్నాము.

మనం మన నదులకీ, అడవులకి ఏది చేస్తున్నామో, అదే మనకి మనం చేసుకుంటున్నట్టే.

ఇప్పుడు మనం నిర్ణయాత్మకంగా ప్రవర్తించకపోతే, జీవనదులు కొన్ని ఋతువులకే పరిమితమై, మరికొన్ని నదులు పూర్తిగా అంతరించిపోతాయి. (ఇప్పటికే కొన్ని అంతరించిపోయాయి కూడా). 70 సంవత్సరాల వ్యవధిలో సగటున మనిషికి ఉపలబ్దమైన నీరు 60 శాతానికి పైగా తగ్గిపోయింది. తమిళనాడులో ఒక నానుడి ఉంది: తాటిచెట్లు ఎండిపోతే, మీరు క్షామాన్ని ఎదుర్కోవలసి వస్తుందని. గత పదేళ్లలో ఈ ప్రాంతంలో, ఇక్కడ జరిగిన పర్యావరణ హాని చెప్పనలవికానిది. భూగర్భజలాలు అడుగంటిపోయాయి. ఋతుపవనాల రాకపోకలు ఎవ్వరూ ముందుగా గుర్తించలేకున్నారు. వృక్ష సంపద తరిగిపోతున్నప్పుడు జరిగేది అదే. దేశంలోని మిగిలిన ప్రదేశాలలోకూడా పరిస్థితి ఇంత ప్రమాద స్థాయిలోనే ఉంది.

మనం చేయవలసింది చాలా ఉంది. వర్షపునీటిని నిల్వచెయ్యడం, అడవుల్ని పెంచడం, చిన్న చిన్న చెట్లని పెంచడం, జనాభాని యుద్ధ ప్రాతిపదిక మీద అదుపు చెయ్యడం మొదలైనవి. అయితే, వీటిలో ఏవీ కేవలం ప్రభుత్వాలు చొరవ తీసుకున్నంత మాత్రం చేత సాధ్యపడే విషయాలు కావు. పర్యావరణ సమస్య ప్రజల ఉద్యమం కవాలి. అందులో స్పృహకలిగి, చైతన్యవంతులైన నాగరికులు పాల్గొని, ఈ భూమి మీద అందరి సమిష్ఠి, అస్తిత్వాలకి విఘాతం రాకుండా పరిష్కారం కనుగొనే దిశలో సాగాలి.

అయితే, పౌరశాస్త్రంలో అత్యవసరంగా కొన్ని ముఖ్యమైన మెళకువలు తెలుసుకోవడం ద్వారా ఇది సాధ్యపడదు. ఆధ్యాత్మిక ప్రక్రియ ఈ రోజు ఎందుకంత ముఖ్యమైన విషయం అయిందంటే, మనిషి కేవలం తనకు తానే ఓ ప్రత్యేకమైన మనుగడ కాదన్నా విషయాన్ని అతనికి అందించగలిగిన ప్రక్రియ ఇదే. ఈ మేల్కొలుపు సిద్ధాంతపరమైనది కాదు. అది మనిషి అస్తిత్వానికి సంబంధించినది. మనం పదే పదే మరిచిపోతున్న సత్యం - మనం; మనం జీవిస్తున్న ఈ ప్రపంచం రెండూ భిన్నం కాదు. ఈ ప్రపంచంలో మనం అంతర్భాగం. మనం మన నదులకీ, అడవులకి ఏది చేస్తున్నామో, అదే మనకి మనం చేసుకుంటున్నట్టే. ఈ విషయాన్ని మనకు గుర్తుచేసేందుకు యోగా ఒక మేలుకొలుపు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1