ఈ వ్యాసంలో సద్గురు మనకు అతి పవిత్ర స్థలాలైన గుప్త కాశీ ఇంకా ఉత్తర కాశీ విశిష్టత గురించి చెబుతున్నారు. అలాగే మన సంప్రదాయంలో కాశీ గురించి ఎందుకు ఎక్కువగా ప్రస్తావన వస్తుందో కూడా తెలియజేస్తున్నారు.

Sadhguruగుప్తకాశీ - ఇది ఎంతో మనోహరమైన ప్రదేశం. ఇక్కడ లింగాన్ని ఎంతో అద్భుతంగా ప్రతిష్ఠించారు. ఇది అగస్త్యముని సంచరించిన ప్రదేశం. బహుశా ఆయన ఈ దేవాలయానికి విచ్చేసి ఉంటారు. ఆయన లేదా ఆయన పరంపరలో వేరెవరైనాగానీ ఈ లింగాన్ని ప్రతిష్టించి ఉండి ఉండవచ్చు. అందుకే సద్గురు (సద్గురు శ్రీ బ్రహ్మ) ఈ ఆలయానికి రావాలని సంకల్పించారు. వారు కేదార్ లో కొన్ని పనులు చేయాలని సంకల్పించుకుని, వాతావరణ కారణాల వల్ల అవి చెయ్యలేకపోయినప్పుడు, వారు ఎంచుకున్న మరొక ప్రదేశం గుప్తకాశీ. ఎందుకంటే ఇది అగస్త్యుని విధానంలో ఉంది. అంటే, అది పూర్తిగా క్రియామార్గం. నూటికి నూరు శాతం శక్తికి సంబంధించినది. ఇక్కడ మరేమీ లేవు -మంత్రాలుగానీ, తంత్రాలుగానీ ఏదీ లేదు. నూటికి నూరు శాతం శక్తికి సంబంధించినదే..! నేను కూడా ఇదే విధంగా ఉంటాను. నాకు తెలిసినది కూడా ఇది ఒకటే. నేను జీవాన్ని ఒక పార్శ్వం నుంచి మరో పార్శ్వానికి కేవలం శక్తి మూలంగా పరిణమింపజేయగలను. నాకు ఎటువంటి మంత్రాలు గానీ, ఎటువంటి క్రతువులుగానీ మారేవి తెలియవు. ఎటువంటి క్రతువులు లేకుండా కేవలం శక్తిని ఒక పార్శ్వం నుంచి మరొక పార్శ్వం వైపుగా పరిణమింపజేయగలను.  అందుకే సద్గురు గుప్తకాశీని ఎంచుకున్నారు.

కాశీ - ఎందరో ఆత్మజ్ఞానుల నివాసం

మీకు గుప్తకాశీ అంటే అర్థం తెలుసా..? గుప్తం అంటే రహస్యమైనది. కాశీ అంటే, మీకు వారణాసి గురించి తెలిసినదే కదా..? కాశీ -  అతి పవిత్రమైన నగరం. ఒక పురాతనమైన జ్ఞాన నగరం. ఇక్కడ కొన్ని వందలమంది ఆత్మజ్ఞానులు జీవించేవారు. మీరు అలా వీధిలో నడుచుకుంటూ వెళితే, ఖచ్చితంగా ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి తారస పడతారు. అందుకని, మన సాంప్రదాయంలో “మరణించాలి అంటే కాశీ లోనే మరణించాలి“ -  అన్న నానుడి వచ్చేసింది.  మీరు కనుక,  కాశీలో మరణించినట్లైతే, మీకు ముక్తి తప్పనిసరి అన్నది నమ్మకం. ఎందుకంటే, అక్కడ ఎంతోమంది ఆత్మజ్ఞానులు ఉన్నారు. ప్రతిరోజూ వారు గంగా నదిలో స్నానం చెయ్యడానికి వస్తారు. మీరు చెయ్యవలసినదల్లా అటువంటివారి దర్శనం చేసుకోవడమే. అటువంటివారి దర్శనం చేసుకోగలిగితే చాలు. మీకు సమయం ఆసన్నమైనప్పుడు, ఖచ్చితంగా వారు మీ సహకారానికి వచ్చి, మీకు ముక్తిని కలిగిస్తారు.

ఎందుకంటే ప్రతీ తరంలోనూ ఎన్నో వందల మంది ఆత్మజ్ఞానులు కాశీలో నివసిస్తూ ఉండేవారు. ఇది జ్ఞానానికి మూలమైనది.

ఈనాటికి కూడా ఇదే నమ్మకం కొనసాగుతూ ఉంది. వృద్ధాప్యం వచ్చిన తరువాత ప్రజలు కాశీ చేరుకుని అక్కడ మరణించాలనుకుంటారు. ఇక్కడ నది ఒడ్డున గుంపుగా దహన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మీరు, కాశీకి వెళ్ళి,  మణికర్ణిక ఘాట్ చూసినట్లైతే, అక్కడ ఒక డజను శవాలు లైనులో దహనమవుతూ ఉంటాయి. మరో డజను దేహాలు దహన కార్యక్రమానికి ఎదురు చూస్తూ ఉంటాయి. ఇది వినడానికి  మీకెంతో ఘోరంగా అనిపిస్తుంది కదూ..? చాలామంది, కాశీలోనే మరణించాలని వచ్చి, అక్కడ జీవిస్తుంటారు. కొంతమందిని వారు చనిపోయిన తరువాత కూడా - వారి బంధువులు వారిని ఎక్కడినుంచో కాశీకి తీసుకువస్తారు. ఇదేలాంటిదంటే ఇప్పుడు మీకు ఎంతో దగ్గరవారు చనిపోయారనుకోండి, మీకు తెలిసినప్పటికీ, మీరు వారిని ఒకసారి హాస్పిటల్ కి తీసుకు వెళతారు కదా..? ఒకవేళ ఏదైనా అవకాశం ఉందేమో అని. ఇది కూడా అలాంటిదే. ఇలా భావావేశాలు ఉన్న ప్రజలు, ఈ రకమైన పనులు చేస్తూ ఉంటారు. వారు మృతదేహాలని తీసుకువచ్చి కాశీలో దహనం చేస్తారు. ఏదో ఒకటి జరగవచ్చునేమో అన్న ఆశతో. ఈ సాంప్రదాయం ఇలా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ప్రతీ తరంలోనూ ఎన్నో వందల మంది ఆత్మజ్ఞానులు కాశీలో నివసిస్తూ ఉండేవారు. ఇది జ్ఞానానికి మూలమైనది.

ఉత్తరకాశీ అంటే కాశీకి ఉత్తర దిక్కున ఉంది. ఈ కాశీలు అన్నీ కూడా ఎంతో శక్తివంతమైన జ్యోతిర్లింగాలు. ఇవన్నీ కూడా స్వయంభువులు. మరెవరో వీటిని సృష్టించలేదు. అవి, భూమిలో నుంచి స్వయంభూ లింగాలుగా ఉద్భవించాయి.  ప్రజలు వీటిని గుర్తించి, వాటిని మలచుకున్నారు. ఇది గుప్తకాశీ. ఇది అగస్త్యుని విధానంలో ఉన్నది. అందుకే, సద్గురు ఈ ఆలయంలో ఉండి సాధన చెయ్యడానికి నిశ్చయించుకున్నారు. నేను మీకు ఆ కథ ఇంతకు ముందు చెప్పినట్లు ఉన్నాను. అందుకనే, మన మెడిటేటర్స్ కు అంటే ఈశా విధానంలో ఎవరైతే ఉపదేశం పొందారో, అటువంటి వారికి గుప్తకాశీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే, నేను నా గుడ్లను ఇక్కడ పెట్టాను. ఎన్నో, ఎన్నిటినో. అందుకని,   ఈ ప్రదేశం మన ప్రజలకు మరింత సానుకూలంగా ఉంటుంది. ఎవరైతే, ఈశా విధానంలో ఉపదేశం పొందారో, వారు ఇక్కడ ఎక్కువగా గ్రాహ్యస్థితిలో ఉండగలరు. ఉత్తరకాశీ మరో విధంగా ఉంటుంది. అది మరొక ప్రపంచం. ఇక్కడ ఎవరో , ఉత్తరకాశీ నాలాగానే అనిపించింది అని చెప్పారు. అది నిజమే. కానీ, మీరు ఇంకా నాలో ఆ కోణాన్ని చూడలేదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు