గోవిందుడిగా మారిన గోపాలుడు....!!!
 
 

16 ఏళ్ళ వయస్సులో కృష్ణుడికి, తన జీవిత లక్ష్యం ఎలా గుర్తుచేయబడిందీ, ఇంకా గోవర్ధన పర్వతం మీద కొన్ని గంటల సేపు ఆయన గడపటం గురించీ సద్గురు మనకు చెబుతారు.

కృష్ణుడికి 16 ఏళ్ళ వయస్సు వచ్చేసరికి ఆయన ఆ  సమాజంలో స్పష్టతకు, మేధస్సుకు తార్కాణంగా నిలిచాడు. పెద్దవాళ్ళు కూడా ఆయన సలహా కోసం ఎదురు చూసేవారు. ఆయన రాధను పెళ్లి చేసుకుందామనుకునే సమయానికి , ఆ సంఘానికి నాయకుడు కాబోతున్నాడనుకునే సమయానికి, ఆయనకు తన జీవిత లక్ష్యం గుర్తుచేయబడింది.

 

బృందావనంలో ఒక చిన్న మడుగులో కాళీయడనే ఒక సర్పం ఉండేది. అదంటే అందరికీ భయం, ఎందుకంటే మొత్తం సంతానంతో సహా అది  అక్కడే ఉండేది. అక్కడికి ఎవరు వెళ్ళినా ఈ పాముల కాటుకు చనిపోయేవారు. నీళ్ళు తాగటానికి అక్కడికి వెళ్ళిన జంతువులు కూడా  ఆ పాముల కాటుకు చనిపోయేవి. ఆ మడుగు నిండా ఆ పాముల సంతతి అంత ఎక్కువగా ఉండేది.

ఒకరోజు గోపాలకులు ఆవుల్ని అక్కడికి తీసుకెళ్తే కొన్ని ఆవులు పాము కాటుకు చనిపోయాయి. కొన్ని ఆవులు చనిపోయాయి కనుక, తమకు బాగా దెబ్బలు పడతాయన్న భయంతో ఇంటికి తిరిగి వెళ్ళటానికి భయపడి ఈ గోపాలురు ఏడవటం మొదలు పెట్టారు. కృష్ణుడు ‘‘సరే, జరిగిదేదో జరిగింది. ఈ పాము సంగతి నేను చూస్తాను” అంటూనే కృష్ణుడు ఆ మడుగులోకి దూకేసాడు. అందరూ ఇక ఇదే ఆయన అంతం అనుకున్నారు. ఎందుకంటే దూకినప్పుడు వచ్చిన అలల దిశగా, వెంటనే ఆ పాము ఆయన వైపుకు వచ్చేసింది. ఆయన వెంటనే దాన్ని పట్టుకుని ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చి దాన్ని లొంగదీసుకున్నాడు. కృష్ణుడు మనుషులతో ఎలా తన మాట నెగ్గించుకునేవాడో,  జంతువులతో కూడా అలాగే ఉండేవాడని అంటారు. ఈ పెద్ద పాముని తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా వదిలేసాడు, మిగతా పాములు కూడా దాని వెంటే వెళ్ళాయి.

భారతదేశంలో పాములను వశం చేసుకునేవారు ఉన్నారు. ఒకచోట కూర్చుని కొన్ని మంత్రాలు చదివి, ఏదో చేసినంతనే వందల పాములు వారి వద్దకు చేరతాయి. వాళ్ళు  అవన్నీ పట్టుకుని ఒక సంచిలో వేసుకుని వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు ఒక్క పూటలో ఒక సంచి నిండా పాములు పట్టగలరు.

సాధారణంగా ప్రకృతి ఒడిలో జీవించేవారికి ఈ విషయాలు తెలుస్తాయి, భారతీయ సంస్కృతిలో ఇదంతా ఒక భాగమే. ఈ పాముల్ని పట్టి ఎక్కడో వదిలేసి కృష్ణుడు ఆ మడుగును పాముల నుంచి విముక్తి చేశాడు. ఇది ఆయన జీవితంలో ఒక పెద్ద సంఘటనగా మారింది. జనం దీనిని అద్భుతాల్లో కెల్లా అద్భుతంగా భావించారు ఎందుకంటే అందరూ భయంతో వణికిపోతున్న పాముల్ని ఆయన పారద్రోలాడు.

ఆయన మడుగులోనుంచి బయటకు రాగానే రాధ అరుస్తూ, పరిగెత్తుకుంటూ వెళ్లి కృషుడ్నివాటేసుకుని, మూర్ఛిల్లి పడిపోయింది. 

ఆయన ఈ పెద్ద పాముతో పోరాటం చేస్తున్నప్పుడు మిగతా గోపాలురు ఊరిలోకి పరిగెత్తుకెళ్ళి, “విషసర్పాలు ఉన్న ఆ మడుగులోకి కృష్ణుడు దూకాడు” అని అందరికీ చెప్పారు. ఊరంతా పరుగు పరుగన అక్కడికి వచ్చారు. అక్కడ జరుగుతుంది చూస్తూ అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన మడుగులోనుంచి బయటకు రాగానే రాధ అరుస్తూ, పరిగెత్తుకుంటూ వెళ్లి కృషుడ్ని వాటేసుకుని, మూర్ఛిల్లి పడిపోయింది. ఈ అమ్మాయి ఇలా అతని వెంట పడటం గ్రామ పెద్దలకు సబబు అనిపించలేదు. ఆ రోజునుంచి ఆమె కుంటుంబం, ఆమెను ఇంట్లోనే నిర్భంధించేశారు. కృష్ణుడితో నాట్యం చేయలేకపోవటం, ఆడుకోలేకపోవటం తో ఆమె తనలో తానే మదనపడిపోయింది. వేణుగానం విన్నా, రాస లీల జరుగుతున్నా తనని తాను ఆపుకోలేక ఆమె అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అందువల్ల ఇక ఆమెని మంచానికి కట్టేసారు.

ఆ తర్వాత పౌర్ణమి రాత్రి వేణుగానం విని ఇక ఆమె ఆపుకోలేకపోయింది. ఆమె తన శరీరాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళి పోదామనే పరిస్థితికి చేరుకుంది. కృష్ణుడు ఆమె కోరికను, ఆమె అనుభవిస్తున్న వేదనను అర్ధం చేసుకున్నాడు. ఆయన ఉద్ధవుడు, బలరాముడితో వచ్చి, ఇంటి కప్పు మీద పెంకులను తీసి కిందికి దిగి ఆమె కట్లు విప్పేసాడు. బలరాముడు కప్పునుంచి వేలాడుతూ ఇద్దరినీ పైకి లాగేసాడు. ఇలా వాళ్ళు తప్పించుకుని రాంత్రంతా నాట్యం చేసేవారు. మరుసటి రోజు ఉదయాన వాళ్ళ అమ్మ చూసినప్పుడు ఆమె మంచంలోనే పడుకుని కనిపించింది.

ఇది జరిగిన తర్వాత, రాధను పెళ్లి చేసుకోవాలనే కోరికను కృష్ణుడు తల్లితో చెప్పాడు. యశోద దీనికి పూర్తిగా వ్యతిరేకించింది, “ఆమె నీకు తగిన అమ్మాయి కాదు. నీకంటే అయిదు సంవత్సరాలు పెద్దది. కంసుడి సైన్యంలో ఉండే ఎవరితోనో ఆమెకు పెళ్లి నిశ్చయం అయింది. అతను ఎక్కడో యుద్ధం చేయటానికి వెళ్ళాడు. తిరిగి రాగానే అతను తన వధువును సొంతం చేసుకుంటాడు. నువ్వు ఆమెని పెళ్లి చేసుకోకూడదు, ఎలాగూ నేను వెతుకుతున్నది కూడా అటువంటి కోడలి కోసం కాదు. ఆమె తక్కువ కులానికి చెందింది. ఆమె కేవలం ఒక గోపిక మాత్రమే. నువ్వో ఒక నాయకుని కొడుకువి. మేమే నీకు తగిన పెళ్లి కూతుర్ని వెతకాలి” అన్నది. కృష్ణుడు “ఏది సరైందో, ఏది సరైంది కాదో నాకు అనవసరం. నన్ను చూసిన క్షణం నుంచీ ఆమె నన్ను ప్రేమించింది, నాలోనే జీవించింది. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను” అన్నాడు.

తల్లీ కొడుకుల మధ్య ఈ వాదన జరుగుతోంది, చివరికి యశోదకు చెప్పేది ఇంకేమి లేక ఈ వార్త తండ్రికి అందించింది. “వీడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఆమె బరి తెగించింది, ఊరిలో ఉన్న అబ్బాయిలందరితో నాట్యం చేస్తుంటుంది” అని చెప్పింది. నందుడిది మెత్తని హృదయం, కొడుకంటే ఎంతో తబ్బిబ్బు అవుతాడు. మాట్లాడే ప్రయత్నం చేశాడు కాని కృష్ణుడు పట్టు పట్టాడు. ఇక కృష్ణుడిని గర్గాచార్యుల  దగ్గరకు తీసుకెళ్ళాల్సిన సమయం వచ్చిందని నందుడు అనుకున్నాడు. వారు గర్గాచార్యుల దగ్గరకు వెళ్ళారు, అక్కడ ఆయన శిష్యుడు, కృష్ణునికి కాబోయే గురువు సాందీపాని కూడా ఉన్నాడు.

వాళ్ళు కృష్ణుడితో “ నీ జీవిత లక్ష్యం వేరే ఉంది. నువ్వు మోక్షకారకుడివని భవిష్యవాణి చెప్పింది, నువ్వు ఈ ప్రపంచంలో ధర్మ సంస్థాపకుడివి. నువ్వు ఈ గోపస్త్రీని పెళ్లి చేసుకోకూడదు. నీకు ఒక లక్ష్యం ఉంది.” అన్నారు,

కృష్ణుడు బదులుగా “ ధర్మానికి ఇదేమి లక్ష్యం? ధర్మ సంస్థాపనా ఉద్యమాన్ని అధర్మంతో మొదలు పెట్టటం సరైనదేనా? సమాజంలో ధర్మం నెలకొల్పాలని మీరంటున్నారు. ఇది ఒక తప్పుడు పనితో మొదలు పెట్టటం సబబేనా?”అన్నాడు.

గర్గాచార్య  “అధర్మం చెయ్యమని నిన్ను ఎవరు అడిగారు?” అన్నారు.

తొమ్మిది సంవత్సరాల క్రితం నన్ను ఒక రోటికి కట్టేసినప్పుడు ఈ అమ్మాయి నన్ను చూసింది, ఆ క్షణం నుంచి నేనే ఆమె జీవితాధారం,  ఆమె హృదయం నాకోసం కొట్టుకుంటుంది. ఆమె శరీరంలోని ప్రతీ కణం నాకోసం తపిస్తుంది. 

కృష్ణుడు “తొమ్మిది సంవత్సరాల క్రితం నన్ను ఒక రోటికి కట్టేసినప్పుడు ఈ అమ్మాయి నన్ను చూసింది, ఆ క్షణం నుంచి నేనే ఆమె జీవితాధారం,  ఆమె హృదయం నాకోసం కొట్టుకుంటుంది. ఆమె శరీరంలోని ప్రతీ కణం నాకోసం తపిస్తుంది. నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఆమె ఉండలేదు. నన్ను ఒక్కరోజు చూడకపోయినా ఆమె సగం చనిపోయినట్లు అవుతుంది. నేను ఇప్పుడు వెళ్ళిపోతే ఆమె ఖచ్చితంగా చనిపోతుంది. నేను ఆ పాముల మడుగులో చనిపోయుంటే నాకోసం ఎన్నో హృదయాలు బద్దలైపోయేవని నాకు తెలుసు. కాని రాధ మాత్రం అక్కడికక్కడే చనిపోయుండేది” అన్నాడు.

గర్గాచార్య కృష్ణుడితో “నువ్వు అన్నీ అతిశయోక్తిగా చెప్పట్లేదా?” అన్నాడు.

కృష్ణుడు “నేను దేన్నీ అతిశయోక్తిగా చెప్పట్లేదు. ఇదే నిజం. నాకు తెలుసు ఇదే నిజమని’’ అన్నాడు.

‘‘ఈ ప్రపంచంలో నువ్వు సాధించవలసినవి ఎన్నో ఉన్నాయి. ఈ ప్రపంచంలో నువ్వెన్నో పనులు చేయాల్సి ఉంది” అని గర్గాచార్య కృష్ణుడితో అన్నారు.

“నేనేమీ సాధించాలనుకోవట్లేదు. నాకు ఈ ఆవులు, ఎద్దులు, ఈ గోపాలురు, గోపికలు, ఈ బాల బాలికలు, ఈ పర్వతం, ఆ చెట్లు అంటేనే ఇష్టం. నేను ఎక్కడికో వెళ్లి ఏదో చేయాలని అనుకోవటం లేదు. నాకు ఈ మనుషులంటే, నా చుట్టూ ఉన్నవంటే ప్రేమ. నేను ఎవరినీ రక్షించాలని అనుకోవట్లేదు. నేను ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను.” అన్నాడు

ఇంక కృష్ణుని జన్మ రహస్యం  చెప్పాల్సిన సమయం వచ్చిందని గర్గాచార్య అనుకున్నారు. నారదుని భవిష్యవాణిని చెప్పి, ఆయన యశోదా నందుల కొడుకు కాదనే విషయం మొదటి సారిగా ఆయనకు చెప్పారు. పుట్టిన దగ్గర నుంచీ ఆయన వీళ్ళతోనే ఉన్నాడు. గర్గాచార్యలు అకస్మాత్తుగా ఆయన వాళ్ళ కొడుకు కాదని చెప్పటంతో కొద్ది సేపు అలా మౌనంగా ఉండిపోయాడు. తనలో ఎప్పుడూ, ఏదో మెదులుతూనే ఉన్నా ఆయన దాన్ని పక్కకు నెట్టి జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. కాని ఇక, ఈ మాట చెప్పగానే ఆయనలో ఏదో మేల్కొలుపు జరిగి దశ పూర్తిగా మారిపోయింది. ఇంకా వివరంగా అన్ని విషయాలూ చెప్పమని ఆయన గర్గాచార్యను అడిగాడు. గర్గాచార్య “నారదుడు నిన్ను ఖచ్చితంగా గుర్తించారు. అన్నీ సంకేతాలు నిన్నే సూచించాయి. అన్నీ సరిపోయాయి, ఎందరో మునులు చెప్పిన వ్యక్తివి నువ్వే. రోజు, సమయం, ప్రదేశం అన్నీ నిర్ణయించ బడ్డాయి, ఖచ్చితంగా నీవు వాటి ప్రకారమే ఉన్నావు. ఇది పొరబాటు అయ్యే అవకాశం లేదు” అన్నాడు.

తనలో అంతర్గతంగా ఉన్నది ఆయన అర్ధం చేసుకుంటూ, అనుభూతి చెందుతూ ఎన్నో గంటలు అలానే నుంచుని ఉండిపోయాడు. 

తన సమాజానికి కృష్ణుడు ఎంతో అంకితమైపోయాడు. చుట్టూ ఉన్నవారితో ఆయన గాఢమైన ప్రేమతో, అనుబంధంతో ఉన్నాడు.  ఇక్కడికి చెందిన వ్యక్తి కాదని, వేరేవారి కొడుకని, ఏదో చేయడానికి ఉద్దేశించబడిన వాడనీ, అన్న  విషయాలు ఎంత బలంగా ఆయనను కుదిపేశాయంటే, మౌనంగా ఆయన గోవర్ధన పర్వతం వైపు వెళ్ళాడు. అతి ఎత్తైన ప్రదేశానికి వెళ్లి, అస్తమిస్తున్న సూర్యుడ్ని చూస్తూ నుంచున్నాడు. ఏదో సాధికారతా భావన ఆయన్ని అమాంతంగా కమ్మేసింది. ఇదే ఆయన ఆత్మ జ్ఞానం పొందిన క్షణం , స్మరణకు వచ్చిన క్షణం. తనలో అంతర్గతంగా ఉన్నది ఆయన అర్ధం చేసుకుంటూ, అనుభూతి చెందుతూ ఎన్నో గంటలు అలానే నుంచుని ఉండిపోయాడు. ఆయన ఆ కొండ దిగి వస్తూనే ఒక సరికొత్త వ్యక్తిగా మారిపోయాడు. ఆకతాయి గోపాలుకుడు ఇక లేడు. ఆయనలో ఏదో ఒక ప్రశాంతత కనిపించింది. సరికొత్త హుందా, దివ్యత్వం కనిపించాయి. ఆయన దిగి వస్తున్నప్పుడు ఇన్ని రోజులగా ఆయనతో ఆటలాడి, ఆయన నాట్యాన్ని, సంగీతాన్ని ఆనందించిన వారు కూడా, వారు ఏం చేస్తున్నారో తెలియకుండానే  ఆయనకు నమస్కారం చేయటం మొదలు పెట్టారు. ఇక వదలి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైనదని ఆయనకు అర్ధం అయ్యింది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

PC: https://www.flickr.com/photos/abee5/

 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1