ప్రమాదంలో ఉన్నది భూమి కాదు, మనమే..!!

భూమి ప్రమాదంలో ఉందని చాలా మంది పర్యావరణ నిపుణులు ప్రజలకి భోదిస్తూ ఉంటారు. ప్రమాదంలో ఉన్నది ఈ గ్రహం కాదు మనమే అని సద్గురు మనకు గుర్తుచేస్తున్నారు. దీనిని ఒక బాధ్యతగా కాక మన జీవితం దీనితో ముడిపడి ఉందని చెబుతున్నారు.
 

“ఒక ఆధ్యాత్మిక గురువు, యోగి అయిన మీరు మొక్కలు నాటుతున్నా రేమిటి?” అని ప్రజలు నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు..! దురదృష్టవశాత్తూ మానవ మనస్సులు ఇలా కంపార్ట్ మెంటులుగా అయిపోయాయి. అంటే మనం ఒకదానిని విరగ్గొట్టి, మరొకదానిని సజీవంగా ఉంచగలము అనుకుంటున్నాము. చెట్లు అనేవి,  మనకి దగ్గరి బంధువులు. అవి దేనినైతే వదిలేస్తాయో మనం దానిని శ్వాసిస్తాము. మనం దేనినైతే నిశ్వాసిస్తామో, అవి దానిని శ్వాసిస్తాయి. మన జీవితాలు సజావుగా సాగేల చేస్తాయి. ఇవి మన ఊపిరితిత్తులలోని ఒక భాగం వంటివి. మీరు మీ శరీరంలో ఏ భాగాన్నీ విస్మరించలేరు కదా..? ఈ గ్రహం కూడా దాని నుంచి విభిన్నమైనదేమీ కాదు. మీరు ఎదైతే మీ  శరీరం అనుకుంటున్నారో అది ఈ గ్రహంలో ఒక చిన్న ముక్క మాత్రమే..!

మన రైతులు ఎంతో సాధారణమైన పనిముట్లతో, ఒక బిలియన్ పైగా ప్రజలకు ఆహారాన్ని సమకూరుస్తున్నారు.

మనం ఆధ్యాత్మికత అన్నప్పుడు పైకి చూడడం గురించో, క్రిందకి చూడడం గురించో మాట్లాడడం లేదు - అది అంతర్ముఖులవ్వడం గురించి. ఇందులో మౌలికమైన విషయం ఏమిటంటే, మీరు అంతర్ముఖులైనప్పుడు సహజంగానే మీ చుట్టూరా ఉన్నవన్నీ మీలో అంతర్భాగం అవుతాయి. ఈ జ్ఞానోదయం కలుగకుండా అధ్యాత్మిక ప్రక్రియ అన్నది లేదు. ఐదే అధ్యాత్మికత మూలం..! ఈ రోజున ఆధునిక శాస్త్రం, సృష్టి అంతా కూడా ఒక శక్తే అని చెబుతోంది. దీనికి కావలసిన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. మన శరీరంలోని ప్రతీ అణువూ, ఎల్లప్పుడూ ఈ బ్రహ్మాండంతో అనుసంధానంలోనే ఉంటుంది. అధ్యాత్మిక ప్రక్రియ అనేది మన అవగాహనని పెంపొందించి ఈ అనుభూతిని మన అనుభవంలోనికి తీసుకొని రావడమే.

ఈ గ్రహం మీద, 2050వ సంవత్సరానికల్లా మనం 9.6 బిలియన్ జనాభా అవుతాం - అని యునైటెడ్ నేషన్స్ అంచనా వేస్తోంది. ముఖ్యంగా, భారతదేశంలో ఇప్పుడు సాగుచేస్తున్న 52% భూమి, 1.2 బిలియన్ ప్రజలకు ఆహారాన్ని కల్పిస్తోంది. ఇది ఎంతో అద్భుతమైన విషయం. మన రైతులు ఎంతో సాధారణమైన పనిముట్లతో, ఒక బిలియన్ పైగా ప్రజలకు ఆహారాన్ని సమకూరుస్తున్నారు. కానీ ఎవరైతే ఈ ఆహారాన్ని సమకూరుస్తున్నారో, వారికి సరియైన ఆహారం దొరకడం లేదు. ఇది మనకి గర్వకారణమైన విషయం కాదు. ఎవరైతే మనందరికీ ఆహారాన్ని సమకూరుస్తున్నారో వారి పిల్లలు కడుపునిండా తినడం లేదు. ఇది, మనకి మర్యాదనిచ్చే అంశం కాదు. ఇలా, ఎందుకు జరుగుతోంది..? అంటే.. మనం,  ఈ  విషయంలో బాధ్యతని తీసుకోవడం లేదు. ఇంత భూమికి మనం ఎంత జనాభాని సమర్ధించగలం - అన్న విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. మనం, ఎరుకతో జనాభాని తగ్గించుకోవాలి. లేదంటే,  ప్రకృతి మనకెంతో బాధాకరమైన విధానంలో ఆ పనిని చేస్తుంది.

ఈ గ్రహం కేవలం మానవుల కోసం మాత్రమే సృష్టించబడినది - అన్నది ఎంతో మోటైన ఆలోచన. ఈ ఆలోచన ప్రజల మనస్సులలో ఎలా నాటబడిందంటే, ‘మీరు దేవుడికి ప్రతిరూపంగా సృష్టించబడ్డారు’ అనే  చెత్త విషయాలు చెప్పడం వల్ల..!! ఒక మనిషి భగవంతుడి రూపాన్ని ‘ఒక పెద్ద మనిషి’లా ఉంటుంది అనుకుంటే, పురుగులు కూడా అదే భగవంతుడు ఒక పెద్ద పురుగుగా ఉంటాడు అని ఆలోచిస్తూ ఉండి ఉండవచ్చు. ఇది కేవలం పర్యావరణానికి సంబంధించిన అంశాలకు మాత్రమే కాదు,  మీ మానవత్వనికి సంబంధించినది. మీరు ఒక విషయం అవగతం చేసుకోవాలి. ఈ గ్రహం మీద ఉన్న ప్రతీ ప్రాణికీ, దాని జీవితం దానికి సంపూర్ణమైనదే..! ఒక పురుగుకి దాని పూర్తి జీవనం ఉంది. దానికీ ఒక జీవితం ఉంది, ఒక భార్య, ఒక భర్త,  పిల్లలు, సమాజం.. ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. ఒకరెవరో మీ కంటికి చిన్నగా కనిపిస్తున్నారు కాబట్టి వారికి ఇక్కడ జీవించే అధికారం లేదు, మీకు మాత్రం జీవించడానికి అధికారం ఉంది అని అనడం మానవత్వంతో జీవించే విధానం కాదు. మానవత్వం లేని మానవ సమూహాలుగా ఈ రోజున మానవాళి తయారయ్యింది.

ఈ గ్రహం ఎటువంటి ప్రమాదంలోనూ లేదు. మానవ జీవితాలే ప్రమాదంలో ఉన్నాయి.

మానవత్వం పెంపొందితే గాని, ఈ పర్యావరణానికి సంబంధించిన ప్రాజెక్టులు జరుగుతాయని నేననుకొను. గవర్నమెంట్ ఎన్నో సిద్ధాంతాలను చేయవచ్చు. కానీ, వారు వీటిని ప్రజాస్వామ్య పద్ధతిలోనే అమలు పరచాలి. ఒక కేంపైన్ ద్వారాగానీ, ప్రజలలో తగిన ఎరుకను తీసుకురావడంద్వారాగానీ చేయాలి. ప్రభుత్వాలలో ఉన్న వ్యక్తులు ఈ ఆలోచనలను బయటికి తెచ్చే విధానాలను వెతకాలి. ఒక సమయంలో భారతదేశంలో కుటుంబ నియంత్రణ గురించిన ప్రచారం జరిగింది. ఇప్పుడటువంటి ప్రచారం ఎక్కడా కనిపించడం లేదు. కానీ మనకేమీ పరిష్కారం దొరకలేదు కదా..! మానవ జనాభాని అదుపులో పెట్టుకోకుండా, పర్యావరణం, భూమి, నీరు – వీటన్నిటి గురించి మాట్లాడటం అన్నది కేవలం శాస్త్ర పరిజ్ఞానం వల్ల ప్రజలు హైపర్-ఏక్టివ్ అవ్వడం వల్ల జరిగింది మాత్రమే..! మీరు మానవ కార్యకలాపాలను నియంత్రించలేరు, మీరు మానవ జనాభాను మాత్రమే నియంత్రించగలరు. మానవాళి చేసే కార్యకలాపాలను మనం ఆపలేము ఎందుకంటే ఇది వారి ఆశయాలను నియంత్రించడం అవుతుంది. ఈ రోజుల్లో మన ఆశయాలు ఏమిటంటే, ప్రతీవారూ కూడా అక్షరాస్యులు అవ్వాలనీ, వారికి ఎంతో పెద్ద కలలూ, లక్ష్యాలూ ఉండాలనీ..! ఇప్పుడు ఉన్న జనాభా స్థాయితో.. వీటిని సాధించడం అన్నది ఎంతో కష్టం. మనం ఎరుకతో దీనిని నియంత్రించాలి. మనం ఎరుకతో దీనిని ఎక్కడ ఆపాలనుకుంటున్నామో నిర్ధారించుకోవాలి. ఇది చెయ్యడం అసాధ్యం అని నేను అనుకోను.

మనకి ఎటువంటి వనరులైతే ఉన్నాయో వాటికి సరిపోయే విధంగా మనం జనాభాను సమతుల్యం చేసుకోవాలి. మనం చేయగలిగినది ఇదే..!! అన్నిటికంటే సులువైన పని ఇదే..! ఇది ప్రతి మానవుడూ కూడా చేయగలదు. వారికి అవసరమైన విద్య, ఎరుక జీవితంలోకి తీసుకుని వస్తే ఇది జరుగుతుంది. అప్పుడు, మనం చెట్లని నాటక్కర్లేదు. మనం ఈ భూమి నుంచి దూరంగా ఉంటే, చెట్లు వాటికవే పెరుగుతాయి. మీరు వాటిని ఆపలేరు. ఈ భూమి ప్రమాదంలో చిక్కుకొని లేదు. మానవ జీవితాలే ప్రమాదంలో ఉన్నాయి. ఇది ప్రతీ మానవుడూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. భూమి ప్రమాదంలో ఉందని ప్రజలు అంచనాలు వేస్తున్నారు. ఈ గ్రహం ఎటువంటి ప్రమాదంలోనూ లేదు. మానవ జీవితాలే ప్రమాదంలో ఉన్నాయి. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకొని, దీనికి, ఏది అవసరమో అది చెయ్యాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1