శివుని రూపాలు అనేకం, అందులో ముఖ్యమైన మూడింటి గురించి తెలుసుకుందాం. పంచాభూతాలపై నియంత్రణ కలుగజేసే భూతేశ్వరుడిని, మనలోని పశు ప్రవృత్తిని నశింపజేసే పశుపతినాధుడిని అలాగే సంసార చక్రం నుండి బయటకి లాగి ముక్తిని ప్రసాదించే మహాకాళుని గురించి సద్గురు ఎం చెబుతున్నారో చూడండి.

పంచ భూతాల మీద నియంత్రణనిచ్చే భూతేశ్వరుడు

ఈ భౌతిక సృష్టి అంతా కూడా మనం దృష్టి, శ్రవణం, రుచి, వాసన, స్పర్శ వలనే గ్రహించగలుగుతున్నాము. ఈ శరీరం, ఈ గ్రహం, ఈ విశ్వం, ఈ సృష్టి అంతా కూడా ఈ పంచభూతాల విన్యాసమే. కేవలం ఐదు పదార్థాలతో ఎంత గొప్ప సృష్టి. కేవలం ఐదు పదార్థాలతో. మీరు వీటిని మీ చేతి మీద లెక్కబెట్టవచ్చు కూడా, వీటితో ఎన్ని విషయాలు సృష్టించబడ్డాయి. ఈ సృష్టి ఇంతకంటే ఎక్కువ కారుణ్యం చూపించలేదేమో. ఒకవేళ  ఐదు కోట్ల పదార్థాలంటే మీకు ఏం చేయాలో తెలీదు. కానీ కేవలం ఐదు పదార్థాలు.

ఈ పంచ భూతాలు. వీటిమీద మీరు నియంత్రణ పొందగలిగితే, మీ ఆరోగ్యం, మీ శ్రేయస్సు, మీరు ఈ ప్రపంచంలో ఉండే స్థానం, మీకేమి కావాలో అది సృష్టించుకోగలిగే సామర్థ్యం – ఇవన్నీ కూడా మీ నియంత్రణలో ఉంటాయి. తెలిసో తెలియాకో, ఎరుకతోనో ఎరుక లేకుండానో ప్రజలకి వీటిమీద కొంత వరకు నియంత్రణ ఉంటుంది. ఎవరికి ఎంతవరకు వీటిమీద నియంత్రణ ఉంది అన్నదాన్ని బట్టి వారి శరీర తత్వంగాని, వారి మానసిక తత్వంగాని, వారు చేసే పనులతత్వం గాని, వారు ఈ ప్రపంచంలో ఎంత సఫలత పొందుతారు, వారికి ఎంత దూర దృష్టి ఉంటుంది – ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి.

ఈ పంచభూతాల మీద నియంత్రణ కలిగి, ఈ జీవన గమ్యాన్ని నిర్ణయించేది భూతేశ్వరుడు.

పశు ప్రవృత్తిని అధిగమింప చేసే పశుపతినాధుడు

మానవుడు “పశుపత” అంటే జీవరాశులన్నిటిలోకి ఉన్నతమైనవాడు. అంటే జీవరాశుల్లో ఉన్నవన్నీ కూడా మనిషిలో ఉంటాయి. కోతిలోని కుతూహలం, పాములోని విషం, పందిలోని కామం – ఈ గుణాలన్నీ కూడా మనిషి తత్వంలో ఉన్నాయి కదా ? మీరు కానిది ఏదైనా ఉందా? అన్నీ మీ ద్వారా విన్యాసం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రకృతి మిమ్మల్ని ఒక కణంగా ఉన్న జంతువు దగ్గరి నుంచి ఇంత సంక్లిష్టమైన యంత్రంగా పరిణామం చెందించింది. ఇప్పుడు మీ చైతన్యాన్నికనుక మీరు వృద్ధి చేసుకోకపోతే, ప్రకృతి పడ్డ ఈ శ్రమ అంతా వృధాయే కదా? మీరు మానవ రూపంలో ఉండి కూడా మరో పంది లానొ, కోతిలానో, తాబేలులానో మరెలా అయినా ప్రవర్తిస్తారు. మీరు మీ చైతన్యంతో ఈ పశు ప్రవృత్తిని అధిగమించకపోతే మీరు అలానే ప్రవర్తిస్తారు.

శివుడు ఈ ప్రవృత్తిని అధిగమించాడు కాబట్టి “పశుపత” నుంచి “పశుపతి” అయ్యాడు. పతి అంటే “ప్రభువు”. ఈయన ఈ పశు ప్రవృత్తిని జయించి దానినుంచి విముక్తి చెంది ఇక్కడ యోగిగా కూర్చున్నారు. ఆయన అప్పటి వరకు తనలో ఉన్న వాటన్నిటిని అధిగమించారు. అందుకనే ఆయన “పశుపతి” అయ్యారు.

ముక్తిని ప్రసాదించే మహాకాలుడు

‘కాల’ అంటే , సమయం…అంధకారం… శూన్యం. ఈ మూడిటినీ ఒక్క పదంలోనే కుదించి ఇలా చెప్పారు. ప్రస్తుతం మీ అనుభవం, సమయానికున్న భౌతిక స్థాయికి మాత్రమే పరిమితమైనది . భౌతిక స్థాయిలో ఇది వృత్తాల్లో తిరుగుతూ కనిపిస్తుంది. ఒక పరమాణువు మొదలుకుని మహా విశ్వం వరకూ, అన్నీ వృత్తాల్లానే తిరుగుతూ ఉంటాయి. ఈ భూమండలం చేసే ఒక పరిభ్రమణాన్ని మనం ఒక ‘రోజు’ అని అంటాం. చంద్రుడు భూమి చుట్టూ చేసే ఒక్క ప్రదక్షణాన్ని ఒక ‘నెల’ అని అంటాం. అదే, భూమి సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు ఒక ‘సంవత్సరం’ అని అంటాం. అలాగే నిద్రాహారాలూ, మెలకువగా ఉన్న సమయాలూ, మీ జీర్ణ వ్యవస్థ ఇంకా ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఈ వృత్తాల్ని అనుసరిస్తూ ఉంటాయి.

ఈ వృత్తాలే లేకపోతే, భౌతికత అనేది ఉండదు..అప్పుడు మీరు సమయాన్ని అనుభూతి చెందలేరు. విశ్వంలో 90% పైగా ఉన్నది శూన్యమే. పరిమితమైన ‘ఇసుక రేణువుల’ లాంటి సృష్టి తునకలలో మునిగి తేలుతున్న మీరు సమయాన్ని ఓ వలయంగానే అనుభూతి చెందుతారు. దీన్నే ‘సంసారం’ అని అంటాము. ఈ సంసారాన్ని అధిగమిస్తే మీరు ‘వైరాగ్యు’లౌతారు. అంటే మీరు స్ఫటికంలా పారదర్శకమౌతారు. మీ నిబంధనల నుండీ, ఈ జీవన వలయం నుండీ విముక్తులౌతారు. ఈ జీవన వలయాల నుండి విముక్తులైనప్పుడు ‘ముక్తి’ని పొందుతారు.. ఇదే పరమోన్నతమైన ముక్తి . ఈ మహాకాళుని తత్వం ఎటువంటిదంటే, ఆయన సన్నిధిలో సర్వం లయమైపోతుంది.

ఎవరైతే ముక్తిని కోరుకుంటున్నారో అటువంటివారికి ‘మహాకాళ’ తత్త్వం అత్యంత ప్రాముఖ్యమైనది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు