ప్రశ్న: సద్గురూ, ఇతరుల ధర్మంతో సంఘర్షణ లేకుండానే తమ ధర్మాన్ని ఆచరంచే స్వేచ్ఛ జీవితంలో అందరికీ ఉంటుందని మీరన్నారు. కానీ ఈ కాలంలో అందుకు విరుద్ధంగా, మనం వ్యక్తిగతమైన ధర్మపాలన ద్వారా నిత్యం పక్కవారితో తలపడటం లేదా?

సద్గురు: అందుకే ఇది ఎంతో ఉన్నతమైన భావమని నేనన్నాను. మన సాధారణ అవసరాలకు అనుగుణంగా మన ధర్మం ఉంటే అది పక్కవారితో నిత్యం తలపడుతూ ఉంటుంది. తమ పరమోన్నత ఆశయాన్ని సాధించేందుకు ఏర్పరచుకున్న ధర్మాన్ని ఇతరుల ధర్మంతో తలపడకుండా ఉండేటట్లు చూసుకున్నారు, కాని సాంఘికంగా అందరూ పాటించవలసిన మరొక సామాన్య ధర్మం ఉన్నది. రోడ్డు మీద ప్రయాణం చేస్తూ మనందరం ఒకే ధర్మాన్ని పాటించాలి. మీ సొంత ధర్మం ఇక్కడ పనికిరాదు. మీ స్వధర్మం మిమ్మల్ని మీ అంతిమ ఆశయానికి చేర్చేందుకు. ఇది మీ ఆంతరంగికమైనది కనుక అది వేరొకరి ధర్మంతో కలహించే తావు లేదు. కానీ దానికి విరుద్ధంగా, బాహ్య ప్రపంచంలో ఉన్న నిబంధనలు(రూల్స్) అందరికీ సంబంధించినవి కనుక వాటిని అనుసరించకపోతే కలహం తప్పదు.

ధర్మం వివిధ రకాలుగా ఉంటుంది. సంసారిక జీవితంలో ఒక రకమైన ధర్మం, సన్యాసిగా నివసిస్తే ఒక రకమైన ధర్మం, రాజుగా జీవించడానికి ఒక రకమైన ధర్మం, వ్యాపారిగా జీవించడానికి మరొకరకమైన ధర్మం. జీవిగా ప్రతి ఒక్కరికీ వారి వారి ధర్మాన్ని ఎంచుకోవడానికీ దానికి కట్టుబడి ఉండటానికీ స్వతంత్రం ఉంది. ఏదో ఫలానా పని చేస్తే విముక్తి కలుగుతుందని కాదు, దేనినైనా తడబడకుండా, స్థిరంగా చేయడంవల్లనే కలుగుతుంది. ‘నిశ్చలతత్వం జీవన్ముక్తి’ అన్నారు కదా. ప్రతిరోజూ మీరు దిశను మార్చుకుంటూ ఉంటే, ఉన్నదగ్గరే గుండ్రంగా తిరుగుతూ ఉంటారు.

ప్రశ్న: సద్గురు, మీరు పరమోత్తమ స్వభావం గురించీ, ధర్మము గురించీ మాట్లాడుతున్నప్పుడు ధర్మం కొన్ని నియమాలన్నట్లు నాకర్ధమయింది. జీవితాన్ని కొన్ని నియమాలతో కాక, ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్టు మనం మన జీవితాన్ని జీవించకూడదా?

సద్గురు: జీవితం దానంతటదే జరగదు. అది అనునిత్యం ప్రకటితమవుతూనే ఉంటుంది. దానిని మీరు నిన్న సృష్టించి ఈరోజు అనుభవించుతూ ఉండవచ్చు లేక ఈరోజు సృష్టించుకుంటూ ఉండవచ్చు. ఏదీ దానంతటదే జరగదు. దీనిలో రెండు విషయాలు ఉన్నాయి – ధర్మం, కర్మం. సరైన కర్మ చేయడానికి నిశ్చితమైన ధర్మం ఉండాలి. అలా లేకపోతే ప్రతిరోజు, ప్రతిక్షణం మీ పనులు గందరగోళంగా మారగలవు. మీకు కావలసిన దిశలో మీ జీవితాన్ని తీసుకు వెళ్ళగలిగేటట్లు ధర్మం మీ కర్మానుసారంగా ఏర్పడుతుంది. మీ జీవితాన్ని మీకనుగుణంగా నడుపుకోవడం అంటే మీకు తగ్గ కారుని, ఇంటినీ, భాగస్వామిని ఎంచుకోవడం కాదు. ఇవి అప్రధానం. ప్రధానమైనది మీరు మీ అంతరంగంలో ఎలా ఉన్నారన్నది. ఇది మీరున్న పరిస్ధితిని, ఇహపరాలలో మీ జీవిత లక్షణాన్ని నిర్ణయిస్తుంది. ఎవరితో ఉన్నారు, మీ చుట్టూ ఉన్న వస్తువులు, మీ నివాసము, మీరు తింటున్నది భోజనమా బంగారమా అన్నది దీనికి సంబంధం లేదు. మీరు బంగారం తింటుంటే తొందరగా చనిపోతారు అంతే.

నియమాలన్నీ నా నియమాలు

అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మీకు జీవితం గురించి తెలియక, అనవసరమైన తలుపులను తడుతున్నారు, ఏవిధంగానూ ఇది మీకు పనిచేయదు. దారితప్పకుండా మీ ప్రాధమిక జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు చేసే కర్మతో ముందుగా మీ ధర్మాన్ని నిర్ణయించుకోవడం అవసరం. మీకు నిత్యం మీ ధర్మం గుర్తుకు వస్తూ మిమ్మల్ని దానికి చేరువ చేస్తుండాలి. మీరు ఈశా యోగకు వచ్చినప్పుడు మీ ధర్మాన్ని మూడు పార్శ్వాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి మీరు మీ అంతర్గతంలో ఏ విధంగా ఉన్నారన్నది, రెండవది మీరు ప్రపంచంతో ఏ విధంగా ఉన్నారన్నది, చివరిగా మీరు లేనప్పుడు మీరు ఏ విధంగా ఉంటారన్నది. మీరు మర్చిపోయి ఉండవచ్చు లేక మీకు అర్ధం కాకపోయి ఉండవచ్చు, ఇది మీకు అర్ధం కాకపోయినా ఆచరిస్తే పనిచేస్తుంది. “నియమాలన్నీ నా నియమాలు” అని మీకు చెప్పాము. మీరు మీ ఇంట్లో తిరుగుతూ ఈ ఇంటి నియమాలన్నీ నావి అనుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? ఆ ఇంట్లో మిమ్మల్ని వాడుకుంటున్నట్టుగా వేధించినట్టుగా అనిపించక మీరు సహజంగా ఆ ఇంటి యొక్క శక్తిగా నిలబడతారు. మీరు గట్టిగా చాటుకోనక్కరలేకుండానే, ఎవరినీ అడగకముందే మీరు ఇంటికి శక్తిగా మారడం గమనిస్తారు. అధికారం లేని వారికి మాత్రమే అధికారమును కోరవలసివస్తుంది.

నేను శక్తివంతుడనని చాటుకోవలసిన వ్యక్తి సహజంగా శక్తివంతుడు కాదని తెలుస్తుంది

మీ దగ్గర లేనిదే మీరు కోరుకోవలసివస్తుంది. కొన్నేళ్ళ క్రితం ఒక పాఠశాలలో మాట్లాడుతుండగా అక్కడి టీచరు 13 – 14 సంవత్సరాల పిల్లలతో “ దేవుడు మీకు ఒక వరం ఇస్తే ఏమి కోరుకుంటార” ని అడిగితే ఒక పిల్లవాడు లేచి “సార్ నాకు మారుతి కారు” కావాలని , మరొకపిల్లవాడు లేచి “సార్ ఖుష్బూ” (హీరోయిన్)అనీ,  మరొకపిల్లవాడు “ఐదు లక్షలు కావాలని” అడిగితే టీచరు “ వీటినన్నిటినీ ఎందుకు కోరుతున్నారు, ఇవి పనికిరావు, తెలివి కావాలని అడగండి” అని మందలిస్తే అంతలో ఒక పిల్లవాడు చివరి వరుసనుండి “సార్ ఎవరిదగ్గర లేనిది వారడుగుతారు” అంటూ గట్టిగా చెప్పాడట.

నేను శక్తివంతుడనని చాటుకోవలసిన వ్యక్తి సహజంగా శక్తివంతుడు కాదని తెలుస్తుంది. హోదా, ప్రేమ, సంతోషం మా దగ్గర ఉన్నాయని అనుకోవడం, అవి మీరు ఒక నిర్దిష్టమైన తరహలో ఉండటంవల్ల మాత్రమే ఉంటాయని గుర్తించండి. అందువల్ల మీ ధర్మాన్ని విశదీకరించదలిచాము. మీ ఇంటిలో మీరు చిక్కుకున్నట్లుంటే దానిని వదిలివేయండి. ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుంటే ఆ ఇంటి నియమాలన్నీ మీ సొంత నియమాలే. రోడ్డుమీద ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంటే ఆ రోడ్డు నియమాలే మీ సొంత నియమాలు. ఈ విశ్వంలో భాగం కావాలంటే ఈ విశ్వంయొక్క నియమాలే మీ నియమాలు. ఇలాకాని పరిస్ధితిలో మీరు మీ ఇంట్లో, మీ వీధిలో, మీ దేశంలో, మీ ప్రపంచంలో, విశ్వానికి దూరమై మీరు వేరుగా నిలబడతారు.

మీరు ఉద్దేశపూర్వకంగా జగన్నియమాలను పాటిస్తే మీరు అసాధారణంగా పనిచేస్తారు.

నేను మీకు మీ విధులను విశదీకరించడంలేదు, ఇది విశ్వ ధర్మం. దీనిని మీరు అంగీకరించితే విశ్వం ఉనికితో ఏకమవుతారు. ఇది విశ్వం యొక్క చట్టాలకు, ధర్మానికి సంబంధించినది, ఎందుకంటే మీరు చేసే ప్రతి చర్య, మీ హృదయ స్పందన, మీరు శ్వాస తీసుకునే పధ్ధతి, మీ వ్యవస్ధ పనిచేసే తీరు, పూర్తిగా విశ్వానికి అనుబంధంగా ఉంటుంది. మీరు ఉద్దేశపూర్వకంగా జగన్నియమాలను పాటిస్తే మీరు అసాధారణంగా పనిచేస్తారు. మీకు తెలియకుండానే మీరు విశ్వం యొక్క మూల నియమాలను విస్మరిస్తున్నారు కనుక ప్రస్తుతం మీకు శరీరపరంగానో, మనస్సులోనో అసంతృప్తిగా ఉండవచ్చు. మీకు తెలియక చేసినా తెలిసి చేసినా దానికి తేడాలేదు. జీవన నియమాలు మారవు. మీరు పైకప్పు మీదినుండీ తెలిసి పడినా తెలియక పడినా దెబ్బ తగలక మానదు. మీకు తెలిసి పడుతుంటే మీరు కాళ్ళ మీద పడాలని జాగ్రత్త పడగలరు లేకపోతే తలమీద పడగలరు; కానీ దెబ్బ, నెప్పి మాత్రం తప్పవు. మీరు పొరబాటున తెలియక పట్టాలు తప్పినా దారి తప్పటమే అవుతుంది.

ముందు ధర్మం, ఆ తరువాత కర్మ

మీరు మనోభావాలున్న మనుషులున్నవారు కనుక, మీకు మరొకటి చెప్పడం జరిగింది – “విశ్వానికి తల్లి” గా మెలగమని చెప్పాం. ఈ పని చేశారా? ఎన్ని సార్లు, ఎంత సేపు మీ చుట్టుప్రక్కల జీవులని మీవిగా భావించారు. బహుశా, కొన్ని సార్లు మాత్రమే. మీకు పిల్లలున్నారు కాబట్టి, విశ్వానికి తల్లిగా మెలగటమంటే ఏమిటో మీకు అర్ధమయిందని భావించకండి. ఇది ఆ విధంగా పనిచేయదు. తనకి ధర్మం అర్ధమయిందనుకున్నవారికి, అది పనిచేయదు, దానిని ఆచరణలో పెట్టేవారికే, తామే అదిగా అయిన వారికే, అది అర్ధమౌతుంది.

భీష్ముడు “నా ధర్మం కఠినమైనది, నేను దానిని స్వీకరించాను, నేను దానిగా మారాను’’ అన్నాడు. నా జీవితం త్యాగం చేయవలసి వచ్చినా, నేను నా ధర్మమే అయిపోయాను కాబట్టి, నేను దానిని వదలలేను. మీ ధర్మాన్ని మీరు ఈ విధంగా ఏర్పరచుకుంటే, మీ జీవిత విధానాన్ని కూడా మీరు నిర్ణయించుకుంటారు. ‘యోగస్ధ కురు కర్మాణి’ అంటే ముందు మీ జీవన బాటను నిర్ణయించుని ఆ తరువాత అమలు పరచండి అని. మొదట ధర్మం - తరువాత చేయవలసిన కర్మ. మీ ధర్మాన్ని నిర్ణయించుకోకుండా కర్మ చేయడమే ఇప్పటి సమస్య. మీరు ప్రపంచంలో చేసే పనులు మాత్రమే కర్మ కాదు, మీకు వచ్చే అనేక రకమైన పిచ్చి ఆలోచనలు కూడా మీ కర్మలో భాగమే. కర్మ అంటే చర్య. కర్మలు నాలుగు రకాలు – శారీరక కర్మ, మానసిక కర్మ, మనోభావంతో చేసే కర్మ, ఇంకా శక్తిపరమైన కర్మ. మీ జీవితంలోని ప్రతి క్షణం మీరు ఈ నాలుగు విధాలైన కర్మలనూ చేస్తూనే ఉంటారు. మీరు తింటున్నప్పుడు కర్మ చేస్తున్నారు, మీరు నడుస్తున్నప్పుడు కర్మ చేస్తున్నారు, మీరు నిద్రపోతున్నప్పుడు కూడా కర్మ చేస్తున్నారు, జీవితంలోని  ప్రతి క్షణం మీరు ఈ నాలుగు రకాలైన కర్మలనూ చేస్తూనే ఉన్నారు.

మీ ధర్మాన్ని నిర్ణయించుకోకుండా కర్మ చేయడమే ఇప్పటి సమస్య.

ఈ రకమైన కర్మ మిమ్మల్ని మీ సంక్షేమానికి దూరం చేయకుండా ఉండడానికి, మీరు మీ ధర్మాన్ని నిర్ణయించుకోవాలి.  మీరు ఎక్కువగా అనాలోచితంగానే చేస్తుంటారు కాబట్టి, మీ ధర్మాన్ని నిర్ణయించుకోకుండా చేసే అనాలోచిత కర్మ మిమ్మల్ని మీ సంక్షేమానికి దూరం చేస్తుంది. మీరు మీ ధర్మాన్ని నిర్ణయించుకున్న రోజు, మీ కర్మ మీకు సహజంగానే ఒక దిశ, లక్ష్యం, సంతృప్తి ఇస్తుంది. మీ ధర్మాన్ని నిర్ణయించుకోనప్పుడు మీ కర్మ అన్ని వైపులకూ పరిగెడుతుంది. మీ మనస్సు, మనోభావం, మీ శరీరాలు, చూసినదంతా కావాలని అన్ని వైపులకూ పరిగెడుతూ మిమ్మల్ని ఒక గందరగోళంగా తయారు చేస్తుంది.

మీ జీవం ఈ శరీరాన్ని వదిలినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియక తికమక పడుతుంది. నేను గందరగోళ మనస్సు గురుంచి చెప్పడంలేదు, అది మీకు తెలుసు, గందరగోళ జీవి గురంచి చెప్తున్నాను. ధర్మాన్ని నిర్ణయించుకోనప్పుడు జీవి తికమక పడి మరణం తరువాత దిక్కుతెలియకపోవటం ఎంతో బాధాకరం. ఇది ఒక మానవుడికి జరగ గలిగే అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి, కానీ దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఎంతో ఎక్కువగా ఇదే జరుగుతోంది. ఇందుకు కారణం మనుష్యులు తమ ధర్మాన్ని నిశ్చయించుకోకపోవడమే స్వతంత్రమని భావించడం.

మీ ధర్మాన్ని మీరు నిర్ణయించుకోవడమే ఆధ్యాత్మికం

స్వతంత్రమనుకుంటూ ప్రతి ఒక్కరూ రోడ్డు మీద రూల్సన్నీ వదిలివేస్తే ఎవరూ ఎక్కడికీ వెళ్ళలేరు. స్వతంత్రం రూల్సు వదిలివేస్తే వచ్చేది కాదు, నిశ్చితమైన దారిలో ముందుకు వెళ్ళడంలో స్వతంత్రం వ్యక్తమవుతుంది. అందుకే, మీ జీవితంలో జరుగుతున్న విషయాలు వాటంతటవే జరుగుతున్నాయని, అవి జరుగుతున్నప్పుడు వాటికి మీరు మీకు నచ్చినట్టు స్పందించవచ్చని అనుకోకండి. దీనిని స్వేచ్చ అనరు, నిర్భంధం అంటారు. ఏదైనా అప్పటికప్పుడు  చేయాలన్నా దానికి కొంత ఆధారం అవసరం. ఆధారం లేనిచోట ఒట్టి నిర్భంధత మిగులుతుంది, ఎందుకంటే మీ శరీర స్వభావాన్ని కూడా మీరు నిర్దేశించలేరు. మీ శరీరం కృష్ణుడున్న ద్వాపర యుగంలోని మీ తాతల శరీరంలాగే ఉంది. మధ్యలో మనుషులు కలిసినప్పటికీ అప్పటి వారసత్వం ఇంకా మీతో ఆటలు ఆడుతూనే ఉంది.

మీ ధర్మం నిర్ణయించుకోవడమంటే చనిపోయినవారిని చనిపోనిచ్చి మీ సొంత బాటన నడవటం.

లక్షల సంవత్సరాల ముందు జీవించిన మనుష్యుల వంశ వారసత్వ లక్షణాలు కూడా ఈనాడు మీతో ఆటలు ఆడుకుంటున్నాయి. అంతరంగంలో ఉన్న నిర్బంధతలను వదులుకుని సొంత ధర్మం నిర్ణయించుకోవడం తేలిక కాదు. ఇది నా ధర్మమని ప్రకటించడమంటే మీ తాత ముత్తాతలను, ఇంకెదరినో ఎదిరించడమే. మీ వారసత్వాన్ని వదిలి మీ సొంత బాటలోకి అడుగుపెడుతున్నారు. భీష్ముడు తన తండ్రికి కొన్ని నిర్బంధతలున్నాయని, అతడు తేలికగా ప్రేమలో పడతాడని గుర్తించాడు. ఎప్పుడూ అతడు ప్రేమలో పడుతున్నా అది భీష్ముని కర్మాకాదు, ధర్మమూకాదు. తన వంశానుగతంగా వచ్చిన లక్షణాలను కాదని, ‘నా జీవితం రాజ్యానికి అంకితం చేసాను, అదే నా జీవితం’ అని నిర్ణయించుకుని తన సొంత దారిన నడిచాడు.

ఆధ్యాత్మిక సాధనంటే ఇదే. మీ ధర్మాన్ని మీరే నిర్ణయించుకుని మీ వారసత్వ పరిధులలో నుండి బయటకు రావటం. మీకు తెలుసా ఎవరో జీసస్ తో ‘నా తండ్రి చనిపోయారు,ఆయనను పాతిపెట్టి వస్తానని’ అంటే, జీసస్ ‘మరణించిన వారిని మరణించిన వారికే వదిలివేయండ’ ని జవాబు చెప్పాడు. ఎవరైనా తండ్రి చనిపోయారని చెప్పినప్పుడు ఇలా మాట్లాడటం ఎంతో క్రూరంగా, ఏమాత్రం దయ లేనట్టు అనిపించవచ్చు. కానీ ఇదే ఆయన చెప్పినది, తండ్రినొక్కడినే కాదు, చనిపోయి మీ అంతరంగంలో నాట్యం చేస్తున్న మిగతా పూర్వీకులను కూడా వదిలివేయమని చెప్పాడు. అలా వదిలివేయక పోతే మీకు మీ ధర్మమే కాక మీ సొంత జీవితం కూడా లేకుండా పోతుంది. ఇంకెవరో మీ ద్వారా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు.

మీ ధర్మం నిర్ణయించుకోవడమంటే చనిపోయినవారిని చనిపోనిచ్చి మీ సొంత బాటన నడవటం. ఇదే స్వతంత్రం.

 ప్రేమాశీస్సులతో,
సద్గురు